అమెరికాలో లోకేష్ ను పోలీసులు అడ్డుకున్నారు.. ఎందుకో తెలుసా?
posted on Dec 8, 2025 5:27AM

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అమెరికాలో పోలీసులు అడ్డుకున్నారు. డల్లాస్ లో ఎయిర్ పోర్టు నుంచి ఆయన బటయకువస్తుండగా ఈ ఘటన జరిగింది. నాలుగేళ్ల పాటు అమెరికాలో చదవి, రెండేళ్లు వాషింగ్టన్ డీసీ లో ప్రపంచ బ్యాంకులో కొలువు చేసిన లోకేష్ కు అప్పట్లో ఎప్పుడూ ఇటువంటి సంఘటన ఎదురు కాలేదు. అయితే ఇప్పుడు మాత్రం విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..
మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన డల్లాస్ తెలుగు డయాస్సోరా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం వద్దకు పెద్ద సంఖ్యలో అమెరికాలోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలే కాకుండా తెలుగువారు కూడా వచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు విమానాశ్రయంలో లోకేష్ ను అడ్డుకున్నారు.
సాధారణంగా దేశాధినేతలు, ప్రపంచ కప్, ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచి వచ్చే క్రీడాకారులకు విమానాశ్రయం వద్ద స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. అటువంటి సమయాలలో పోలీసులు ఆయా సెలబ్రిటీలను విమానాశ్రయం నుంచి వేరే మార్గం గుండా బయటకు తీసుకు వెడతారు. అశేష అభిమాన జనం రావడంతో ఇబ్బందులు తలెత్తకుండా వారిని భద్రంగా పంపేందుకు ఇలా చేస్తారు.
ఇప్పుడు లోకేష్ ను అమెరికాలో పోలీసులు అలాగే అడ్డుకుని ఆయన వేరే మార్గం గుండా విమానాశ్రయం నుంచి బయటకు తీసుకు వెళ్లారు. ఇది అమెరికాలో కూడా లోకేష్ కు అభిమానులు ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నారో తెలియజేస్తున్నది. పోలీసులు తనను అడ్డుకుని వేరే మార్గం ద్వారా విమానాశ్రయం నుంచి బయటకు తీసుకువచ్చిన విషయాన్ని తెలుగు డయాస్పోర సమావేశంలో లోకేష్ స్వయంగా చెప్పారు. డల్లాస్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి ఈ కార్యక్రమం వరకు తనకు ఘన స్వాగతం పలికారని, ఈ అభిమానం అపూర్వమనీ, మరువలేననీ లోకేష్ అన్నారు.