జగన్‌పై ఎంపీ వేమిరెడ్డి ఫైర్
posted on Dec 7, 2025 4:41PM

అప్పన్న ఫ్యామిలీకి సేవాభావంతో రూ.50 వేల చెక్కు అందించినట్టు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. తనపై మాజీ సీఎం జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వేమిరెడ్డి మాట్లాడారు.
‘‘వైఎస్ జగన్ నాపై అనవసర వ్యాఖ్యలు చేశారు. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎవరి సూచనతో నేను సాయం చేశానో నాకు స్పష్టంగా తెలుసు. వైవీ సుబ్బారెడ్డి వద్ద పనిచేసిన అప్పన్నకు మానవతా దృక్పథంతో సాయం చేశాను. నేను చేసిన సహాయం నిజమా కాదా అనేది దేవుడే సాక్షి.
సాయం కోసం ఎవరైనా వస్తే ఇప్పటికీ నాకు తోచినంతగా ఆదుకుంటున్నాను. ప్రతి నెలా నేను సహాయం చేసే వారి జాబితాలో చాలామంది ఉంటారు. ఈ విషయం ఆయనకూ తెలుసు. నేను సేవా భావంతోనే సాయం చేస్తుంటాను. అయితే సేవ చేసినా నిందలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మనం చేసిన మంచిని, చేసిన సేవను దేవుడికే తెలుసు. జగన్ కామెంట్స్ తనను బాధించాయనే కారణంగా ఇప్పుడు ఈ విషయాలు వెల్లడిస్తున్నాను’’ అని వేమిరెడ్డి తెలిపారు.