గ్లోబల్ సమ్మిట్‌కు హైదరాబాద్‌లో భారీ బందోబస్తు
posted on Dec 5, 2025 4:12PM

హైదరాబాద్‌లో జరగనున్న రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్‌ను దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో నగరంలో మొత్తం 6,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. సమ్మిట్ ప్రధాన వేదిక పరిసరాల్లో భద్రతను కఠినం చేస్తూ, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి వేదిక వరకు ప్రత్యేక బందోబస్తు అమలు చేస్తున్నారు.
ఇప్పటికే ప్రధాన వేదికను పోలీసు ఆధీనంలోకి తీసుకుని, ప్రతి మూలా మూలా పై నిఘా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. సమ్మిట్‌కు దేశ–విదేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు పోలీసులు తెలిపారు.
వేదికకు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి మాత్రమే అనుమతిస్తామని సీపీ స్పష్టం చేశారు. సమ్మిట్ రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్ నుంచి శ్రీశైలం హైవే వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. రెండు రోజులపాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక బృందాలు పనిచేయను న్నాయి. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారుల రవాణా సౌకర్యం కోసం ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు.ప్రధాన వేదికతో పాటు పరిసర ప్రాంతాలన్నింటిని ఒకే చోట నుండి పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.