ఒకే రోజు పాతిక బ్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన.. అమరావతి వేగం అనూహ్యం కదా!
posted on Nov 24, 2025 11:55AM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి వేగం వాయువేగాన్ని మించి సాగుతోంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా మలచేందుకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రాజధాని కేంద్రంగా పెట్టుబడులు ఆకర్షించేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కేంద్రం నుంచి అందుతున్న సహకారం కారణంగా భారీగా ఆర్థిక వనరులు సమకూరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమరావతిలో ఆర్థిక కార్యకలాపాల వేగం పెరిగేందుకు తీసుకున్న చర్యలలో భాగంగా ఆర్బీఐ రీజనల్ బ్యాంక్ సహా పాతిక ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు అమరావతిలో ఏర్పాటు కానున్నాయి. ఆయా బ్యాంకులకు ఇప్పటికే స్థలాలు కేటాయించడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ దిశగా మరో కీలక ముందడుగు పడనుంది. ఆర్బీఐ సహా పాతిక, ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాల నిర్మాణానికి ఒకే రోజు శంకుస్థాపన జరగనుంది.
ఈ నెల 28న జగరగున్న ఈ బ్యాంకుల భవనాల నిర్మాణానికి జరగనున్న శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. రాజధానిలోని సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం వద్ద అన్ని బ్యాంకులకు ఒకేసారి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తారు.
ఇప్పటికే పలు బ్యాంకులు తమ స్థలాలను సిద్ధం చేసుకుని నిర్మాణాలకు రెడీ అయ్యాయి.ఈ బ్యాంకుల ఏర్పాటుతో అమరావతి రాష్ట్ర ఆర్థిక కేంద్రంగా ఎదుగుతుందనడంలో సందేహం లేదు. బ్యాంకుల ఏర్పాటుతో అమరావతికి పెట్టుబడులు వెల్లువెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.