మస్క్ మస్త్ చెప్పారుగా!
posted on Dec 1, 2025 2:12PM
.webp)
ఎలాన్ మస్క్ మన భారతీయ మేథ, ప్రతిభకు మంచి సర్టిఫికేట్లే ఇచ్చారు. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ తన పాడ్కాస్ట్- పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్ లో పాల్గొన్న మస్క్ పలు విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగా ఆయన చేసిన కీలకమైన కామెంట్ భారతీయ మేథతో అమెరికా లాభపడిందనీ, అది నూటికి నూరుపాళ్లూ వాస్తవమేననీ తెల్చి చెప్పారు. ఇదే విషయాన్ని ట్రంప్ కూడా కోట్ చేసిన సంగతి తెలిసిందే. అమెరికాలో ప్రతిభ తక్కువ. ప్రతిభ ఉన్నా కూడా దానికి శ్రమ జోడించడంలో అమెరికన్లకు బద్దకం కాస్త ఎక్కువేనని ఏకంగా అగ్రదేశాధినేతే అంగీకరించేసినప్పుడు.. మస్క్ చెప్పడంలో గొప్పేంటి అన్న ప్రశ్నను పక్కన పెడితే.. అసలిప్పుడు విషయం ఏంటంటే ప్రతిభావంతులను నియమించుకునేందుకు తీస్కొచ్చిన హెచ్1 బీ వీసా దుర్వినియోగం ఇటీవల బాగా పెరుగుతోంది. దీంతో వలస వ్యతిరేక భావనకు ఆస్కారమేర్పడిందనింటారు మస్క్. గత ప్రభుత్వ తప్పిదాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
గత పాలకుడు బైడన్ పాలనలో.. సరిహద్దుల్లో ఎలాంటి నియంత్రణ ఉండేది కాదనీ.. దీంతో అక్రమ వలసలు పెరిగాయన్నది మస్క్ మాటల వెనుక అర్ధం. అక్రమంగా వలస వచ్చిన వారికి.. ప్రభుత్వ ప్రయోజనాలు అందకుండా చూడాలన్నది మస్క్ సూచన. వలసల కట్టడికి సరిహద్దుల వద్ద నియంత్రణ కచ్చితంగా పాటించ కుంటే.. పలు సమస్యలు ఉత్పన్నమౌతాయని హెచ్చరిస్తున్నారు కూడా.
టాలెంటెడ్స్ కొరత ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉంటుందని చెప్పే ఈ ట్రిలియనీర్ మస్క్.. చాలా కంపెనీలు టాలెంటెడ్స్ ను కాకుండా.. ఒక అమెరికన్ ఎంప్లాయికి చెల్లించాల్సిన జీతంతో పోలిస్తే, విదేశీ ఉద్యోగికి సగం ఇచ్చినా చాలన్న కోణంలో ఆలోచించి విదేశీయులను రిక్రూట్ చేసుకుంటున్నారనీ.. ఇదే వలస వ్యతిరేకతకు బలం చేకూర్చిందనీ చెబుతున్నారు.
తన కంపెనీలైన టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ సంస్థలు ప్రతిభామంతులను తీసుకుంటాయనీ, వారికి సగటు కంటే ఎక్కువ జీతాలు ఇస్తాయనీ చెబుతున్నారు. అయితే ఔట్ సోర్సింగ్ కంపెనీలు హెచ్ 1 బి వీసాల వ్యవస్థను దుర్వినియోగం చేసి దెబ్బ తీశాయన్న మస్క్.. ఈ దుర్వినియోగాన్ని అరికట్టాలే కానీ, మొత్తంగా ఈ వ్యవస్థనే రద్దు చేయాలనడం సమంజసం కాదన్నారు. అదే సమయంలో ఆయన హెచ్ వన్ బీ వీసాల కోసం ఎదురు చూస్తోన్న భారతీయ యువతకు తీసుకుంటున్న వేతనం కంటే సమాజానికి ఎక్కువగా ఉపయోగపడాలని సూచించారు. అలా ఉపయోగపడే వారినే తాను గౌరవిస్తానన్నరు. తానే కాదు ఏ యజమానైనా అలాగే ఆలోచిస్తాడని మస్త్ ముక్తాయించారు. ఫైనల్ గా మస్క్ చెప్పిందేమిటంటే.. దోచుకోవడానికి అమెరికా వస్తున్నామన్న భావన సరికాదనీ, వెయ్యి డాలర్ల జీతం తీసుకునే ఉద్యోగి కంపెనీకి లక్ష డాలర్ల లాభాన్ని చేకూర్చేలా ఉండాలని. అదీ సంగతి.