హిల్ట్ పాలసీపై గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు
posted on Dec 1, 2025 2:16PM

హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్-హెచ్ఐఎల్‌టీ పాలసీపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచందర్ రావు నేతృత్వంలో గవర్నర్‌కు వినతి పత్రం అందించారు. హిల్ట్ పేరిట ప్రభుత్వం భూదందాకు పాల్పడుతోందని ఆరోపించారు. 9,292.53 ఎకరాల భూమిని మల్టీపర్పస్‌కు వినియోగించేలా తక్కువ ధరకు అప్పగిస్తోందని దీని వెనుక రూ.5 లక్షల కోట్ల స్కామ్ ఉందని ఆరోపించింది.
గవర్నర్ వెంటనే జోక్యం చేసుకొని భూములను పరిరక్షించాలని హిల్ట్ రద్దు చేసి రిటైర్డ్ జడ్జితో విచారించాలని రామచందర్ గవర్నర్‌ను కోరారు.రేవంత్ సర్కార్ ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 7న ఇందిరాపార్కు వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీల విలీనం ద్వారా జీహెచ్ఎంసీని విస్తరించాలనుకుంటోందని, ఇందులోనూ ఎన్నో కుట్రలు దాగి ఉన్నాయని బీజేపీ చీఫ్ తెలిపారు.
భూముల ధరలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత పలుకుతున్నాయి, గతంలో ఎంత ఉన్నాయో పరిశీలిస్తే అక్రమాలు చేస్తున్నట్లు అర్థమవుతోందని అన్నారు. ఇప్పటికే కోకాపేటలో భూములు ఎన్ని కోట్లు పలికాయో చూశామని అన్నారు.హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతాల్లోని భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీని అమలులోకి తెచ్చింది. గవర్నర్‌ను కలిసిన వారిలో రామచందర్ రావుతో పాటు బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు ఉన్నారు.