హైదరాబాద్‌లో ఆందోళన కలిగిస్తున్న కుక్క కాటు కేసులు

 

హైదరాబాద్‌లో కుక్కకాటు ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రేబిస్ వ్యాధి ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసు కోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రేబిస్ వ్యాధి ప్రాణాంతకరమైనదని, కుక్కకాటు జరిగిన వెంటనే గాయం శుభ్రం చేయడమే కాకుండా ప్రి–ఎక్స్‌పోజర్ మరియు పోస్ట్–ఎక్స్‌పోజర్ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో కుక్కకాటు కేసులకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరిండెంట్ డా. రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది ఇప్పటివరకు కుక్క కాటు కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు వెల్లడించారు. 2023లో 27,172 కుక్కకాటు కేసులు నమోదు కాగా, రేబిస్ కారణంగా 13 మంది మరణించారు. 2024లో కేసులు 29,054కు పెరిగి, రేబిస్‌తో 26 మరణాలు చోటుచేసుకున్నాయి.
2025లో (నవంబర్ వరకు) 31,488 కుక్కకాటు కేసులు నమోదు కాగా, రేబిస్ కారణంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు.

కుక్కకాటు కేసుల్లో ప్రతి ఏడాది పెరుగుదల ఉండడం ఆందోళన కలిగిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. రేబిస్ వ్యాధి ఒకసారి సోకితే ప్రాణాంతకమని, అందువల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ప్రజలు చేయగల ముఖ్యమైన చర్య అని ఆయన వివరించారు. కుక్కకాటు జరిగిన వెంటనే కనీస నిర్లక్ష్యమూ ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగరంలో పెరుగుతున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలలో వీధి కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. ఒంటరిగా కనిపించే చిన్నపిల్లలు, మహిళలపై వీధి కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఇలా నగరంలో వాళ్ళు కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజేంద్రప్రసాద్ కుక్క కాటు కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నయని.... అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పలు సూచనలు చేశారు...
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu