అవినీతి కేసులను మూసేయించుకునేందుకు చంద్రబాబు ప్లాన్ : బొత్స
posted on Dec 2, 2025 8:26PM

తనపై ఉన్న అవినీతి కేసులను మూసివేయించడానికి సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరించి కేసులు మూసివేయిస్తున్నారంటూ మండిపడ్డారు.
ఆ ఆరోపణలపై నిష్పక్షపాతంగా వ్యహరించాల్సిన దర్యాప్తు అధికారులు కూడా పూర్తిగా కేసుల మూసివేతకు సహకరిస్తున్నారని బొత్స పేర్కొన్నారు . తనపై ఉన్న కేసులను ఎదుర్కొనే ధైర్యం లేక ముఖ్యమంత్రి అడ్డదారులు తొక్కుతున్నారు. తద్వారా వ్యవస్థలను కలుషితం చేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు.
దేశంలో ఇంత బరితెగింపునకు దిగిన రాజకీయనాయకుడ్ని ఎక్కడ చూడం. తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కూడా చట్టం నుంచి ఈ రకంగా తప్పించుకోవడం చంద్రబాబుకి అలవాటేని ఆరోపించారు. అదే ఒరవడి ఈసారి కూడా కొనసాగుతోంది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుపై గవర్నర్ తక్షణం చర్యలు తీసుకోవాలని. అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి. దర్యాప్తు సంస్థల స్వతంత్రతను కాపాడాలని బొత్స డిమాండ్ చేశారు.