పవన్ క్షమాపణ చెప్పకపోతే సినిమాలు ఆడనివ్వం : కోమటిరెడ్డి
posted on Dec 2, 2025 3:22PM
.webp)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా..పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే అతని సినిమాలు తెలంగాణలో ఆడవు అని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు, తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకోమని హెచ్చరించారు.
పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్తే తెలంగాణలో ఆయన సినిమాలు కనీసం ఒకటి రెండు రోజులైన ఆడుతాయి.. లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వమని మంత్రి తెలిపారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించాయి. తెలంగాణ ప్రజల దిష్టి వల్ల కాదు, గత ఆంధ్ర పాలకుల వల్లే ఇక్కడి ప్రజలు ఫ్లోరైడ్ నీళ్లు తాగారు.
ఈ విషయం తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. పవన్ సోదరుడు చిరంజీవి సూపర్ మ్యాన్‌గా అభివర్ణించిన ఆయన చాలా మంచి వ్యక్తి. కానీ, పవన్ కల్యాణ్‌కు రాజకీయ అనుభవం లేనట్లుంది. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు" అని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ ఆదాయాన్ని విశాఖ పట్నం, తిరుపతికే వాడుకున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.
అసలు పవన్ ఏమన్నారంటే?
ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... గోదావరి జిల్లాల పచ్చదనం వల్లే ఆంధ్రప్రదేశ్ విడిపోయిందని అన్నారు. తెలంగాణ నేతల దిష్టి తగలడం వల్లే గోదావరి జిల్లాల్లో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని ఆయన అన్నారు. ఈ కామెంట్స్‌పై తెలంగాణ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.