బతికున్న భార్యకు డెత్ సర్టిఫికెట్!

భార్య బతికి ఉండగానే, ఆమె డెత్ సర్టిఫికెట్ తీసుకుని దానికి ఆమెకే నేరుగా కొరియర్ ద్వారా పంపించిన భర్త ఉదంతమిది. కడప జిల్లా  కలిసపాడు  మండలం  దూలవారిపల్లె గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే మహిళకు ఆమె భర్త డెత్ సర్టిఫికెట్ పంపించాడు. భర్త వేధింపులను భరించలేక ఆదిలక్ష్మి ఇటీవల తన స్వగ్రామమైన దూలవారి పల్లెకు వచ్చేసి పుట్టింట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో ముద్దనూరులో ఉండే ఆమె భర్త మారుతీరాజు ఏకంగా ఆదిలక్ష్మి డెత్ సర్టిఫికెట్ పుట్టించి దానిని ఆమెకే కొరియర్ ద్వారా పంపించారు. తన డెత్ సర్టిఫికెట్ చూసి విస్మయానికి గురైన ఆదిలక్ష్మి తాను బతికుండగానే డెత్ సర్ఫిఫికెట్ ఎలా మంజూరు చేశారని ప్రశ్నిస్తున్నది. బతికున్న వ్యక్తిని డెత్ సర్టిఫికెట్  మంజూరు చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.  

వివరాల్లోకి వెడితే కడప జిల్లా ముద్దనూరుకు చెందిన మారుతిరాజుతో  అదే జిల్లా కలసపాడు మండలం దూలంవారిపల్లెకు చెందిన ఆదిలక్ష్మికి 14ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వివాహమైన కొన్నేళ్ల తరువాత నుంచీ దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. తరచూ గొడవపడుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆదిలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది.

దీంతో కక్షగట్టిన మారుతీ రాజు తన భార్య చచ్చిపోయిందంటూ ఆమె డెత్ సర్టిఫికెట్  ను నేరుగా ఆమెకే పంపించాడు. దీంతో తాను బతికుండగానే డెత్ సర్టిఫికేట్ పంపించడంపై ఆదిలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసుల విచారణలో మారుతీరాజు తన తల్లి డెత్ సర్టిఫికెట్ లో మార్పు చేసి భార్య పేరు రాసి పంపినట్టు తేలింది.  ఈ విషయాన్ని మారుతీరాజు పోలీసుల ఎదుట అంగీకరించాడు.  బతికుండగానే భార్యకు డెత్ సర్టిఫికెట్ పంపిన వార్త స్థానికంగా సంచలనం సృష్టించింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu