జనవరి 1 నుంచి ఆయుధాలు వదిలేస్తాం.. మావోల ప్రకటన
posted on Nov 28, 2025 9:05AM
.webp)
ఆపరేషన్ కగార్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు ఆయుధాలు విసర్జించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ఎంఎంసీ (మద్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ ) జోన్ ప్రతినిథి అనంత్ శుక్రవారం (నవంబర్ 28) ఓ ప్రకటనే విడుదల చేశారు. ఆ ప్రకటనలో ఆయుధ విసర్జనకు ఓ తేదీని ప్రకటించారు. మావోయిస్టు పార్టీ జనవరి 1వ తేదీ నుంచి ఆయుధ విరమణ అమలు చేస్తుందని పేర్కొన్నారు. పరస్పర సమన్వయం , కమ్యూనికేషన్ కోసం నక్సల్ ప్రతినిధి ఓపెన్ ఫ్రీక్వెన్సీ నంబర్‌ను కూడా విడుదల చేసినట్లు తెలిపారు. ఆయుధాలు వదులుకోవడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదని పేర్కొన్న అనంత్ తమకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వంతోనే చర్చలు ఉంటాయన్నారు.
హిడ్మా ఎన్ కౌంటర్ తో మావోయిస్టు పార్టీ బాగా బలహీనపడిందని ఆ ప్రకటనలో అనంత్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మావోలు లొంగిపోవాలన్న కేంద్రం పిలుపునకు అంగీకరిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటికే జనజీవన స్రవంతిలో కలిసేందుకు తమకు కొంత సమయం కావాలని మావోయిస్టులు కోరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాము జనజీవన స్రవంతిలో కలిసేందుకు పోలీసుల ఎదుట లొంగిపోవడానికి మావోయిస్టు పార్టీ ఏకంగా ఒక తేదీని ఖరారు చేసి ప్రకటన విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.