మహా మాయలేడి లెండి..
posted on Oct 11, 2025 2:25PM
.webp)
బిస్కెట్లతో బుట్టలో పడేస్తుంది జాగ్రత్త!
వైసీపీ లీడర్లు తాము చేసిన మోసాలు చాలవన్నట్టు వారి ఇన్ స్పిరేషన్ తో కొందరు మోసగాళ్లు, మోసగత్తెలు తయారయ్యారంటే అతిశయోక్తి కాదేమో. మొన్నటి వరకూ నెల్లూరు అరుణ ఈ కోణంలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చిన విషయం మరువక ముందే మరో కిలేడీ లేడీ తెరపైకి వచ్చింది. ఆమె పేరు విద్య. విద్య ఎంతటి ఘటికురాలంటే ప్రస్తుతం మద్యం కుంభకోణంలో పీకలోతు కూరుకుపోయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే పేరు అడ్డంగా వాడేసుకుని.. ఏకంగా 18 కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని వింటే ఆశ్చర్యపోతారు ఎవరైనా.
తక్కువ ధరకు బంగారం వస్తోందని.. మీరిచ్చిన డబ్బుకు రెట్టింపు ఇస్తానని అమ్మలక్కల మధ్య ఒక ప్రచారం లేవనెత్తింది. ఆ నోటా ఈనోటా విన్న పలువురు మహిళలు ఇదంతా నిజమేనని ఆమె చెప్పిన బురిడీ కథలన్నీ నమ్మేశారు. కంటైనర్ వస్తుంది డబ్బు కావాలంటూ వారి నుంచి డబ్బు అడ్డంగా దోచేసింది. అంతే కాదు.. ఆమె చూపించిన బంగారు బిస్కెట్ల వ్యవహారం నిజమేనని భావించి ఆమె బుట్టలో పడిపోయారు వీరంతా. ఇలా ఆయా మహిళలు జీవితాంతం దాచుకున్న సొమ్ము మొత్తం తీసుకెళ్లి ఇదిగో ఈ మాయలేడి విద్యకు ధారబోసారు. ఇలా ఒకటీ రెండు కాదు ఏకంగా 18 కోట్ల రూపాయల మేర వీరు విద్యకు సమర్పించుకున్నారు.
మేమిచ్చిన డబ్బు ఏదని అడిగితే ఇదిగో అదిగో, రేపూ మాపంటూ తిప్పించుకునేది. ఇలాక్కాదని అందరూ కలసి ఆమెను కలసి నిలదీయగా.. తన భర్త చేత బాధిత మహిళలను చితకబాదించిందీ మాయలేడి. దీంతో చేసేది లేక వీరంతా కలసి పోలీసులకు మొరపెట్టుకున్నారు. ఇలాంటి వారిని నమ్మి డబ్బులివ్వడం కరెక్టుకాదని చెబుతున్నా సరే, జనం పట్టించుకోవడం లేదని.. ఎవ్వరూ కూడా ఎక్కువ డబ్బులిస్తామంటే నమ్మొద్దని తాము గత కొన్నేళ్లుగా చెబుతూనే వస్తున్నామంటున్న పోలీసులు కేసు టేకప్ చేసి విచారణ చేస్తున్నారు. మరి నిందితురాలు విద్య ఈ మొత్తం డబ్బు.. ఎక్కడ దాచింది? ఆ వివరాలేంటి? బాధితులకు న్యాయం జరిగే దారేది? తేలాల్సి ఉంది.