గాంధీజీకి నోబెల్ ఎందుకు ఇవ్వలేదో మీకు తెలుసా!?
posted on Oct 11, 2025 2:18PM

డైనమైట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్ధం ఇచ్చే ఆరు అవార్డుల్లో నోబెల్ శాంతి పురస్కారం కూడా ఒకటి. ఏటా సాహిత్యం, భౌతిక, రసాయన, ఆర్ధిక, ఔషధ రంగాలతో పాటు శాంతి స్థాపకులకు సైతం నోబెల్ పురస్కారం ప్రదానంచేస్తుంటారు. ఎవరైతే మానవాళికి మేలు చేసేలాంటి సూత్రీకరణలు చేస్తారో వారికి నోబెల్ పురస్కారం దక్కుతుంది. ఇక ప్రపంచ శాంతి కోసం పాటు పడేవారికి నోబెల్ శాంతి పురస్కారం ప్రదానం చేస్తుంటారు. అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయమేంటంటే.. మిగిలిన ఐదు విభాగాలకు చెందిన నోబెల్ ప్రైజులు స్వీడన్ లో ఇస్తుండగా.. ఒకే ఒక్క శాంతి పురస్కారం మాత్రం నార్వేలో ఇస్తారు. కారణం ఏంటంటే గతంలో స్వీడన్ నార్వే రెండూ ఒకే దేశంగా ఉండేవి.
ఇప్పటి వరకూ నోబెల్ శాంతి శాంతి పురస్కారం పొందిన ప్రముఖులు ఎవరని చూస్తే.. ఈ జాబితాలో మార్టిన్ లూథర్ కింగ్, జూనియర్, ఎలిహూ రూట్, నెల్సన్ మండేలా, కోఫీ అన్నన్, జిమ్మీ కార్టర్, వంగారి మాతై, బరాక్ ఒబామా, లియు క్సియాబో సహా పలువురు ఉన్నారు. తాజాగా వెనెజువెలా మానవహక్కుల నేత మరియా కొరీనా మచాడో అనే శాంతి కపోతానికి ఈ పురస్కారం దక్కింది. 2014 లో భారతదేశానికి చెందిన కైలాష్ సత్యార్థి, పాకిస్తాన్ కు చెందిన మలాలా యూసఫ్‌జాయ్ సంయుక్తంగా ఈ నోబుల్ శాంతి పురస్కారం పొందారు.
1948లో నోబెల్ శాంతి బహుమతి కోసం మహాత్మాగాంధీని ఎంపిక చేశారు. అయితే ఆయన ఆ ఏడు జనవరి 30న నాథూరామ్ గాడ్సే పేల్చిన తుపాకీ గుండ్లకు బలి అయ్యారు. అప్పట్లో ఉన్న నియమం ప్రకారం.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మరణించిన వారికి నోబెల్ పురస్కారం ఇవ్వాలన్న నిబంధన ఉండేది. దానికి తోడు ఆయన ఒక సంస్థ ప్రతినిథి కాదు, ఆపై తన వీలునామా కూడా రాయలేదు. దీంతో బహుమతి ఎవరికి ఇవ్వాలో కూడా తెలియలేదు. దీంతో ఈ ప్రతిపాదన విరమించుకుంది నోబెల్ కమిటీ. అంతే కాదు అర్హులంటూ మరెవరూ లేక పోవడంతో ఆ ఏడాది శాంతి పురస్కార ప్రదానాన్నే విరమించుకుంది నోబెల్ కమిటీ.
1979లో మదర్ థెరీసాకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఆ సమయంలో ఆమె చేసిన మరో మంచి పని ఏంటంటే నోబెల్ గ్రహీతలకు మర్యాదపూర్వకంగా ఇచ్చే సంప్రదాయ విందును నిరాకరించి లక్షా 92 వేల డాలర్లను భారతదేశంలోని పేదలకు ఇవ్వవలసిందిగా కోరారు. ఈ బహుమతులు అవసరంలో ఉన్నవారికి ఉపయోగపడ్డం వల్లే ఎక్కువ విలువగా అభివర్ణించారామె.
ఇక 2025 సంవత్సరానికిగానూ వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి లభించింది. చుట్టూ చీకట్లు ముసురుకుంటున్నా ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్య జ్వాలను ఆరిపోకుండా రగిలించారు. లక్షల మందికి ఆదర్శంగా నిలిచారు.. అందుకే మచాడోను నోబెల్ శాంతి బహుమతికి అర్హురాలుగా ప్రకటిస్తూ.. ప్రశంసల్లో ముంచెత్తిందీ కమిటీ. కమ్యూనిస్టు వెనెజువెలాలో ప్రజాస్వామ్యం కోసం మరియా కొరినా మచాడో తీవ్రంగా పోరాడుతున్నారు. నికొలాస్ మదురోకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి మరీ తన పోరాటం సాగిస్తున్నారు. దీంతో ఆమెపై మదురో ప్రభుత్వం తీవ్ర నిర్బంధం విధించింది. ఇతర విపక్ష నేతలంతా అరెస్టులకు భయపడి దేశం విడిచి పారిపోయినా ఆమె మాత్రం సొంత దేశంలోనే ఉండి ప్రజాస్వామ్య వాదులకు స్ఫూర్తినిస్తున్నారు. అలా అజ్ఞాతంలో ఉండి కూడా ప్రజాస్వామ్య జ్వాల రగుల్చుతోన్న మరియా కొరీనా మచాడో ఈ పురస్కారానికి నిజంగా అర్హురాలేనంటారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాంతి కాముకులు. శాంతి విజేతా నీకు జేజేలు అంటూ అభినందనలు తెలుపుతున్నారు.