బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి కోసం వారసుల సిగపట్లు
posted on Dec 8, 2025 1:31PM

కడప జిల్లాలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం బ్రహ్మంగారి మఠం. ఇప్పుడు ఆ ఆలయ మఠ పీఠాధిపతి వ్యవహారం.. వివాదాలు, ఆరోపణలు-ప్రత్యారోపణలతో ఉత్కంఠ రేపుతోంది. పీఠాధిపతి స్థానం నాకంటే-నాకే అంటూ పూర్వ పీఠాధిపతి మొదటి భార్య, రెండవ భార్య కుమా రుల మధ్య నెలకొన్న పోటీ.. నిత్యం వివాదాల చుట్టూ తిరుగుతోంది. ఇప్పడు ఈ పరిణామాలు భక్తుల మనోభావాలపై ప్రభావం చూపుతున్నాయి.
కడప జిల్లా కందిమల్లాయపల్లె గ్రామంలో జీవ సమాధి అయ్యారు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని మఠంగా భావించి, దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి వీరబ్రహ్మంగారి కుటుంబం నుంచి ఒకరు పీఠాధిపతిగా ఉంటున్నారు. ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఇప్పటివరకు ఇలా ఏడు తరాల వారు బ్రహ్మంగారి మఠానికి పీఠాధిపతి అయ్యారు. 2021 వరకు బ్రహ్మంగారి పీఠాధిపతిగా వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి ఉండేవారు. అయితే ఆయన మరణించడంతో పీఠాధిపతి పదవి ఖాళీ అయింది. ఇప్పుడా పదవి ఎవరికీ ఇవ్వాలన్నదే పీటముడిగా మారింది. ఇప్పుడు బ్రహ్మంగారి మఠంలో ఆధ్యాత్మికతకంటే కుటుంబ వివాదాలే భక్తులు, ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాయట. నాటి పీఠాథిపతి వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి మొదటి భార్య చంద్రావతి.. తన కుమారుడు వెంకటాద్రినే తదుపరి పీఠాధిపతిగా కొనసాగించాలని కోరుతుంటే.. రెండో భార్య మారుతి మహాలక్ష్మి తన కుమారుడు గోవిందస్వామినే పీఠాధిపతి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాలుగేళ్లుగా నానిన ఈ వివాదం కాస్తా కోర్టు వరకూ చేరింది. అయినా ఫలితం మాత్రం రాలేదు. సీన్ కట్ చేస్తే ధార్మిక సంఘాలు ఎంట్రీ కావడంతో సమస్య మరింత జటిలంగా మారింది.
నాటి పీఠాధిపతి వెంకటేశ్వరస్వామికి మారుతి మహాలక్ష్మి భార్య కాదని.. మొదటి భార్య కుమారులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. దీంతో ఓ మహిళపై అమానవీయంగా, అసభ్యకరంగా పోస్టులు పెట్టి చిత్రీకరించడం ఏంటని రెండోభార్య మారుతిమహాలక్ష్మి నిలదీస్తున్నారు. ఇదే సమ యంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం కంటే చావే మేలంటున్నారు. అందుకే తనను రాళ్లతో కొట్టి చంపేందుకు అనుమతి ఇవ్వాలని ఏకంగా పోలీసులను కోరడం చర్చనీయాంశంగా మారింది. అటు మఠాన్ని అభివృద్ధి చేయాల్సి న బ్రహ్మంగారి వారసులు పీఠాధిపతి పదవి కోసం ఇలాంటి పనులు చేయడమేంటని భక్తులు ఆశ్చర్యపోతున్నారు.
ఏదీ ఏమైనా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి కావాలంటే కొన్ని అర్హతలుండాలి. వేదాంత శాస్త్రంలో ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. ధార్మిక గ్రంథాలలో, మఠానికి సంబంధించిన సంప్రదాయ పరిజ్ఞానం తెలిసి ఉండాలి. మఠం శిష్యగణానికి జ్ఞానబోధ నేర్పించే సమర్థత ఉండాలంటున్నారు భక్తులు.