మంగళగిరి ఎయిమ్స్ కి చెవిరెడ్డి
posted on Nov 25, 2025 2:27PM

వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని విజయవాడ జిల్లా జైలు అధికారులు మంగళగిరిలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే గత రెండు రోజులుగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనకు ఆరోగ్యం బాగాలేదని జైలు అధికారులకు చెబుతుండటంతో వారు ఆయనను సోమవారం (నవంబర్ 24) విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అక్కడ చెవిరెడ్డిని పరీక్షించిన వైద్యులు ఆయన వెరికో వెయిన్స్ తో బాధపడుతున్నారని నిర్ధారించారు.
మెరుగైన వైద్యం కోసం మంగళగిరి ఎయిమ్స్ కు రిఫర్ చేశారు. దీంతో జైలు అధికారులు చెవిరెడ్డి భాస్కరరెడ్డిని మంగళవారం (నవంబర్ 25) మంగళగిరిలోని ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు.