అభినవ కృష్ణదేవరాయులు పవన్ కల్యాణ్
posted on Dec 8, 2025 9:02AM

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు ఉడుపిలో అభివన కృష్ణదేవరాయ బిరుదు ప్రదానం చేశారు. కర్ణాటకలోని ఉడుపి పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఈ బిరుదును పవన్ కల్యాణ్‌కు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ తాను ఈ కార్యక్రమానికి సత్యాన్వేషిగా వచ్చానని చెప్పారు.
పాలన, సేవ, బాధ్యతలే నిజమైన నాయకత్వానికి ప్రతీకలన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర సమగ్ర శ్రేయస్సే ముఖ్యమని, ధర్మాన్ని అనుసరించే కేవలం 21 స్థానాలకే పరిమితమయ్యానని వివరిం చారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య, తీసుకునే ప్రతి నిర్ణయం, ఎదుర్కొని ప్రతి సంశయంలోనూ భగవద్గీత మనకు తోడ్పడుతుందన్న పవన్ కల్యాణ్, నేటి తరం యువత నిరంతరం సమాచార వెల్లువ, కెరీర్ ఒత్తిడి, ఐడెంటిటీ క్రైసెస్, ఫెయిల్యూర్ ఫియర్ వంటి వాటితో యుద్ధం చేస్తున్నారని చెప్పారు. ఈ యుద్ధం కురుక్షేత్ర యుద్ధానికి ఏ మాత్రం తీసిపోదనీ, ఈ యుద్ధంలో గెలవడానికి అవసరమైన మానసిక బలం, మనోస్థైర్యాన్ని అందించేది భగవద్గీత మాత్ర మేనన్నారు.
మన భారతమాత ఎన్నో దండయాత్రలను ఎదుర్కొని, తట్టుకుని నిలబడిందంటే, అది ఆయుధాలతో కాదు, సంపదతో కాదు, ధర్మాన్ని సజీవంగా ఉంచిన గ్రంథాలు, సంప్రదాయాల వల్లనేనన్నారు.
సనాతన ధర్మం మూఢనమ్మ కాదనీ, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శాస్త్రీయ రూపంలో మానవజాతికి అందించిన మార్గదర్శి అని పవన్ కల్యాణ్ అభివర్ణించారు.