బాలికపై అత్యాచారయత్నం నిందితుడి ఆత్మహత్య
posted on Oct 23, 2025 9:37AM

తునిలో బాలికపై అత్యాచార యత్నం చేసిన నిందితుడు నారాయణ రావు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అత్యాచారయత్నం కేసులొ నారాయణరావును అరెస్టు చేసి బుధవారం (అక్టోబర్ 22) కోర్టుకు తరలిస్తుండగా ఘటన జరిగింది. అతడి మృతదేహాన్ని తుని శివారులోని కోమటి చెరువులో గుర్తించారు.
వివరాలిలా ఉన్నాయి. మంగళవారం (అక్టోబర్ 21) ఉదయం తాటిక నారాయణరావు బాలికకు తను తాతయ్యను అవుతానంటూ పాఠశాల సిబ్బందికి పరిచయం చేసుకున్నాడు. ఆసుపత్రికి తీసుకెళ్లే నెపంతో బాలికను హాస్టల్ నుంచి బయటకు తీసుకుని వెళ్లి తినుబండారాలు కొనిపెట్టి తనంటే ఇష్టం కలిగించేలా ప్రవర్తించాడు. అలా తీసుకెళ్లిన నారాయణరావు మధ్యాహ్నం సుమారు 12 గంటలకు తొండంగి మండలం, పైడికొండ గ్రామ శివారులో గల సపోటా తోటలోకి తీసుకొని వెళ్లి అత్యాచారయత్నం చేశాడు. ఆ సమయంలో బాలిక కేకలు వేయగా అటుగా వెళుతున్న వ్యక్తి చూసి నారాయణరావుని ప్రశ్నించాడు. తాను టీడీపీకి చెందిన వ్యక్తిని అని తప్పుడు సమాచారం ఇచ్చాడు. వాళ్లు ప్రశ్నిస్తున్నా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
తోటకు సమీపంలో ఉన్న రెడ్ స్కూటీపై బాలికను ఎక్కించుకొని పారిపోయిన నారాయణరావు ఆమెను స్కూల్‌లో డ్రాప్ చేసి వెళ్లిపోయాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఊరి జనం ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రభుత్వం దృష్టికి రావడంతో కేసు నమోదుకు ఆదేశించింంది. వెంటనే తుని పోలీసులు నారాయణరావుపై కేసు నమోదు చేశారు. సాక్షులను విచారించారు. నేరం జరిగిందని నిర్దారించుకొని బుధవారం ఐదు గంటలకు జగన్నాధగిరి సమీపంలో రైల్వే అండర్ పాస్ వద్ద నారాయణరావును అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం నారాయణరావును కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెడుతుండగా, మార్గమధ్యలో మూత్ర విసర్జనకంటూ వాహనం నుంచి దిగి సమీపంలోనే ఉన్న చెరువులోకి దూకాడు. అతడి మృతదేహం కోమటి చెరువులో లభ్యమైంది.