మిరపచెట్టుకు వంకాయలు?!
posted on Nov 8, 2025 12:31PM

బ్రహ్మం తాత తన కాలజ్ణానంలో చెప్పారో లేదో.. కానీ మిరప చెట్టుకు వంకాయలు, టమాటాలూ కాసిన వింత ఒకటి కలకలం రేపుతోంది. ఓ రైతు తన పొలంలో మిరపతోట వేస్తే.. ఆ తోటలో ఓ మిరపచెట్టుకు మిరపకాయలకు బదులు వంకాయలు, టమాటాలూ విరగకాశాయి. ఈ వింత చూడడానికి ఆ గ్రామస్తులే కాక చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం తండోపతండాలుగా వచ్చారు. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తకెళ్ల పాడులో జరిగింది. గ్రామానికి చెందన ముత్యాల రజిత రమేశ్ తన పొలంలో మిరపతోట వేశారు.
అయితే ఆ మిరపతోటలోని ఓ మిరపచెట్టుకు మిరపకాయలకు బదులుగా టమాటా, వంకాయలు కాసాయి. ఈ వింత చూసిన జనం దైవలీల అంటూ ఆశ్చర్యపోవడం కనిపించింది. కొందరు హేతువాదులు మాత్రం దీని వెనుక ఏదో శాస్త్రీయకారణం ఉందంటున్నారు. సరే విషయం ఏంటో తేల్చడానికి వ్యవసాయ అధికారలు రంగంలోకి దిగారు. మిరపచెట్టుకు వంకాయలు, టమాటాలు కాయడంపై వారు పరిశించి, పరిశోధించి కారణమేంటో తేల్చడానికి రెడీ అయిపోయారు.