ప్రజాదర్బార్ లో పోలీసులతో కొలికపూడి వాగ్వాదం

నిత్యం వివాదాలతో సహవాసం చేస్తుంటారా అనిపించేలా వ్యవహరించే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. శనివారం ప్రజాదర్బార్ లో సైతం అదే తీరున వ్యవహరించారు. శనివారం (నవంబర్ 8) తిరువూరులో జరిగిన ప్రజాదర్బార్ కు హాజరైన కొలికపూడి.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తిరువూరులో జరిగిన ప్రజాదర్బార్ రసాబాసగా మారింది.

ఇంతకే విషయమేంటంటే.. ఇటీవల మంత్రి లోకేష్ ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో జరిగే ప్రజాదర్బార్ లో పాల్గొని తీరాల్సిందే అని ఆదేశించిన నేపథ్యంలో శనివారం తిరువూరులో జరిగిన ప్రజాదర్బార్ కు శ్రీనివాసరావు హాజరయ్యారు. అయితే ప్రజా దర్బార్ కు తిరువూరు సీఐ హాజరు కాకపోవడంపై తీవ్ర అసహనానికి గురైన ఆయన ఎస్ఐను సీఐ గైర్హాజరుకు కారణమేంటంటూ నిలదీశారు. నూజివీడు కోర్టుకు వెళ్లాల్సి ఉన్నందున సీఐ ప్రజాదర్బార్ కు రాలేకపోయారని ఎస్ ఐ ఇచ్చిన జవాబుతో సంతృప్తి చెందని కొలికపూడి.. ప్రజాదర్బార్ కంటే కోర్టుకు హాజరు కావడం ముఖ్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా సీఐ కోర్టుకు వెళ్లారనడానికి ఆధారాలేమైనా ఉన్నాయా? ఉంటే చూపించాలి అంటూ ఎస్ఐని అడిగారు.

ఆ దశలో ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. కొద్ది సేపు ప్రజాదర్బార్ ను నిలిపివేశారు. ఆయన తీరు పట్ల ప్రజా దర్బార్ కువచ్చిన వారు  విస్తుపోయారు. ప్రజార్బార్ కు వచ్చి పోలీసులతో పంచాయతీ ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం మీద తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలి మరో సారి వివాదాస్పదంగా మారింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu