డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన అయ్యప్పలు
posted on Nov 27, 2025 2:31PM

అయ్యప్ప స్వాములు తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. అయ్యప్ప మాల వేసుకున్న పోలీసుల యూనిఫారంపై ఆంక్షలు ఎందుకంటూ నిరసన వ్యక్తం చేస్తూ అయ్యప్ప స్వాములు గురువారం (నవంబర్ 27) డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు.
వీరికి బీజీవైఎసం కార్యకర్తలు తోడయ్యారు. అయ్యప్పట ముట్టడి కార్యక్రమంతో డీజీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయ్యప్ప దీక్షలో ఉన్న కంచన్‌బాగ్ ఎస్సై ఎస్. కృష్ణకాంత్ కు విధుల్లో ఉండగా యూనిఫాం వేసుకోకపోవడంపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ అయ్యప్పలు ఈ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు.
విధుల్లో ఉండగా మతపరమైన దీక్షలు అంటూ యూనిఫారం వేసుకోకపోవడం పోలీసు నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఎస్ ఐ కృష్ణకాంత్ కు అడిషనల్ డీసీసీ మెమో జారీ చేయడం పట్ల అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముట్టడి సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పాటు ట్రాఫిక్ కు భారీగా అంతరాయం కలగడంతో పోలీసులు అయ్యప్ప స్వాములను అరెస్టు చేశారు.