అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులెప్పుడంటే?
posted on Nov 18, 2025 9:24AM

అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిథుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఇందు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. బుధవారం (నవంబర్ 19)న అర్హులైన రైతులందరి ఖాతాల్లోకీ నేరుగా అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను జమ చేయనుంది.ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడతలో 46 లక్షల 85 వేల 838 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు రాష్ట్రప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద అందించనున్న ఐదే వేల రూపాయలు కలిపి అర్హులైన రైతుల ఖాతాలలో మొత్తం ఏడు వేల రూపాయలు జమకానున్నాయి. ఈ పథకం కింద ఈ ఏడాది ఆగస్టులో తొలి విడత కింద రైతుల ఖాతాలలోకి సొమ్ము జమచేసిన ప్రభుత్వం.. ఇప్పుడు బుధవారం (నవంబర్ 19) రెండో విడత నిథులను జమ చేయనుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 వేలకు పైగా రైతు సేవా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు స్థానికంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.