మావోయిస్టుల సాయుధ పోరాటం ఒక విఫల ప్రయోగం.. మల్లోజుల
posted on Dec 5, 2025 3:52PM
.webp)
మావోయిస్టుల సాయుధ పోరాటాన్ని ఒక విఫల ప్రయోగంగా అభివర్ణించారు ఇటీవల పోలీసులకు సరెండర్ అయిన మావోయిస్టు పార్టీ సిద్ధాంత కర్త, పార్టీ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు. తాజాగా ఒక జాతీయ వార్తా సంస్ధకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మల్లోజుల సంచలన విషయాలు వెల్లడించారు. గత అర్ధ శతాబ్దంలో పార్టీ చేసిన తప్పుల వల్లే ఉద్యమం నీరుగారిపోయిందనీ, మావోయిస్టు సాయుధ పోరాట పంధా ఒక విఫల ప్రయోగంగా మిగిలిపోయిందనీ చెప్పారు. ఇక ఇప్పుడు ఇంకా ఉద్యమంలో ఉన్న మావోయిస్టలకు మిగిలిన ఏకైక మార్గం ఆయుధాలు వీడి, లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవడమేనని మల్లోజుల అన్నారు.
గత మేలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చారన్న మల్లోజుల, ఆ నిర్ణయాన్ని అమలు చేసే ప్రక్రియలోనే ఆయన ఎన్ కౌంటర్ లో హతమయ్యారని చెప్పారు. ఆ తరువాత తాము సామూహికంగా లొంగుబాటు నిర్ణయం తీసుకున్నామన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాన్ని, ఆచరణను మార్చుకోవడంలో మావోయిస్టు పార్టీ విఫలమైందన్నారు.
ఇప్పటికైనా మావోయిస్టులు తప్పుడు విధానాలు పక్కన పెట్టి ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకు రావాలని అన్నారు. తన అర్ధశతాబ్దపు అజ్ఞాత జీవితాన్ని స్వర్ణ అధ్యాయంగా అభివర్ణించిన మల్లోజుల.. అడవి బిడ్డలతో మమేకమై వారి హక్కుల కోసం పోరాడటం సంతృప్తినిచ్చిందన్నారు. తనను ఉద్యమ ద్రోహిగా అభివర్ణిస్తూ విమర్శలు చేస్తున్న వారిని తాను పట్టించుకోనన్నారు.