పంట రుణాల మాఫీపై వైకాపాకు ఆరాటం దేనికి?
posted on Oct 4, 2014 @ 10:24AM
ఆంధ్రప్రదేశ్ రైతుల పంట రుణాలను మాఫీ చేయడమే కాదు వారిని పూర్తిగా రుణ విముక్తులను చేయడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా పంట రుణాలను మొత్తం ఒకేసారి మాఫీ చేయడం సాధ్యపడదు కనుక ఐదు దశలలో రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధం అవుతోంది. ముందుగా ఈనెల మొదటివారం నుండి మొదటి దశ పంట రుణాలను మాఫీ కార్యక్రమం మొదలుపెడదామని భావించినప్పటికీ, కేవలం పంట రుణాలే కాక, రైతులకు సంబంధించిన అనేక సమస్యలను శాశ్విత ప్రాతిపదికన పరిష్కరించాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం ‘రైతు సాధికారిక సంస్థ’ను ఏర్పాటు చేసి దాని ద్వారానే ఈ మొదటి దశ పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందువలన ఈ నెల మొదటి వారం నుండి మొదలవుతాయనుకొన్న పంట రుణాల మాఫీ కార్యక్రమం మరో మూడు వారాల ఆలశ్యంగా అంటే దీపావళి నుండి మొదలుపెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ఈ పంట రుణాల మాఫీ అంశాన్ని అందిపుచ్చుకొని రాజకీయ లబ్ది పొందుదామని తపిస్తున్న వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీ, దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిద్దామని ఉవ్విళ్ళూరుతున్నప్పటికీ, తీరాచేసి తాము ఉద్యమం మొదలుపెట్టిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలను మాఫీ కార్యక్రమం మొదలుపెడితే ప్రజలలో అభాసు పాలవుతామనే భయంతో వెనుకంజ వేస్తోంది. అందువలన ఈ అంశంపై ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ రోజులు నెట్టుకొస్తోంది.
ఆ పార్టీకి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు పంట రుణాలను మాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెపుతూ కాలక్షేపం చేయకుండా ఇకనయినా ఎప్పుడు మాఫీ చేస్తుందో ప్రకటించాలని, ఈ రుణాల మాఫీ అంశంపై ప్రభుత్వం బ్యాంకర్లతో కలిసి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు. ‘రామాయణం అంతా విన్నాక రాముడికి సీత ఏమవుతుందని’ అడిగినట్లుంది ఆయన తీరు. పంట రుణాల మాఫీపై రాష్ట్ర ప్రభుత్వం ఇంత స్పష్టంగా తన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించినా ఇంకా ఇటువంటి డిమాండ్లు చేయడం కేవలం రైతులను ఆకట్టుకోనేందుకేనని అర్ధమవుతూనే ఉంది.
రైతుల సంక్షేమం పట్ల తమకే చాలా నిబద్దత ఉన్నట్లు వారికోసం పోరాడుతున్నట్లు వైకాపా నటిస్తోంది. కానీ నిజానికి వైకాపా ఉద్దేశ్యం రైతుల సంక్షేమం కోసం పోరాడటం కాదు. కేవలం ఆ అంశాన్ని వాడుకొని తన రాజకీయ ప్రత్యర్ధి అయిన అధికార తెదేపాపై బురద జల్లుతూ తను రాజకీయ లబ్ది పొందడానికే. ఒకవేళ వైకాపాకు నిజంగా రైతుల సంక్షేమం గురించి అంత తపన ఉంటే తెలంగాణాలో రైతుల గురించి కూడా మాట్లాడి ఉండేది. కానీ అక్కడ రైతుల సంక్షేమం కంటే తెరాసతో ఉన్న సత్సంబంధాలను నిలుపుకోవడానికే ప్రాధాన్యతనిస్తోంది. కనుక ఈ విషయంలో తెలంగాణా ప్రభుత్వాన్ని పలెత్తు మాటనదు. కానీ ఆంద్ర ప్రజలను, ప్రభుత్వాన్ని, పాలకులను దొంగలు దోపిడీదారులని విమర్శిస్తున్న తెరాసను ఎన్నడూ పలెత్తు మాటనకపోయినా, ఆంద్ర ప్రభుత్వాన్ని కించపరిచేందుకు మాత్రం వైకాపా ఏ అవకాశాన్ని వదులుకోకపోవడం గమనిస్తే పంట రుణాలను మాఫీపై ఆపార్టీ నిబద్దత ఏపాటిదో అర్ధమవుతోంది. నిబద్దత లేని సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసినందుకు వైకాపాకు ప్రజలు ఎన్నికలలో గుణపాటం నేర్పారు. మళ్ళీ ఇప్పుడు సున్నితమయిన ఈ అంశంపై కూడా రాజకీయాలు చేస్తే ప్రజల చేతిలో భంగపాటు తప్పకపోవచ్చును.