తెలంగాణాపైకి జగనన్నబాణం దూసుకు రాబోతోందా?
posted on Sep 27, 2014 9:26AM
వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా నుండి ఎందుకు బయటకు వచ్చిందో అందరికీ తెలుసు. అప్పుడు వద్దనుకొన్న తెలంగాణాకే మళ్ళీ తిరిగివెళ్ళి అక్కడ పార్టీని బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర విభజన తరువాత కూడా తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ బలమయిన రాజకీయ శక్తిగా నిలబడటం చూసి బహుశః ఆయనకు జ్ఞానోదయం అయిఉండవచ్చును. కానీ ఆ కారణంగానే తిరిగి తెలంగాణలోకి ప్రవేశించాలని భావిస్తే మాత్రం అది పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లవుతుంది. ఎందుకంటే తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్నప్పుడు, రాష్ట్ర విభజనకు ముందు ఆ తరువాత నేటికీ కూడా తెదేపా తెలంగాణాలో దృడంగా నిలబడి ఉంది. కానీ, తెలంగాణా ప్రజల సెంటిమెంటును గౌరవిస్తామని చెపుతూ వచ్చిన వైకాపా రాష్ట్ర విభజన జరుగుతోందని పసిగట్టగానే రాత్రికి రాత్రి తెలంగాణా నుండి బయటపడి సమైక్యరాగం అందుకొంది.
ఇక తెదేపాకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణాలో మిత్రపక్షంగా ఉంది కనుక అక్కడ ఆ పార్టీ మద్దతు ఉంది. కానీ వైకాపాకు ఇటు ఆంధ్రాలో కానీ అటు తెలంగాణాలో గానీ ఎన్నికల మిత్రులే తప్ప శాశ్విత మిత్రులు ఎవరూ లేరు. ఒకవేళ ఇప్పుడు తెలంగాణాలో పునః ప్రవేశం చేసినట్లయితే తెదేపాతో పాటు కాంగ్రెస్, తెరాస, బీజేపీలను డ్డీ కొనవలసి ఉంటుంది.
వైకాపా తెలంగాణాను విడిచిపెడుతున్నప్పుడు, తనను నమ్ముకొన్న తెలంగాణా నేతలను, కార్యకర్తలను నిర్దాక్షిణ్యంగా నడిరోడ్డున వదిలేసిపోవడంతో, వారిలో చాలా మంది తెరాసను, ఇతర పార్టీలను ఆశ్రయించక తప్పలేదు. అందువలన తెలంగాణాలో వైకాపా దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని చెప్పవచ్చును. మళ్ళీ ఇప్పుడు తెలంగాణాలో పార్టీని పునర్నిర్మించుకోవాలంటే అందుకు చాలా ప్రయాసపడవలసి ఉంటుంది. అంతకంటే ముందు తెలంగాణా ప్రజల విశ్వాసాన్ని పొందవలసి ఉంటుంది. కానీ ఆ రెండు సాధ్యం కావని చెప్పవచ్చును. ఎందువలన అంటే వైకాపా తెలంగాణా ను వదిలిపెట్టి బయటకు వెళ్లిపోయినప్పుడే అది ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఇక తెలంగాణాలో పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకోవాలంటే స్వయంగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణా లో పర్యటించి పార్టీని నిర్మించుకోవలసి ఉంటుంది. కానీ ఆయన తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేఖంగా ఆయన చేసిన సమైక్య ఉద్యమాల కారణంగా ఆయన ఇప్పుడు తెలంగాణాలో అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడి ఉనప్పుడు స్వయంగా తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదు.
బహుశః అందుకే మళ్ళీ తన అమ్ముల పొదిలో నుండి తనకు బాగా అచ్చి వచ్చిన, తను జైల్లో ఉన్నప్పుడు పార్టీని కాపాడిన ‘షర్మిల’ అనే బాణాన్ని మళ్ళీ బయటకు తీస్తున్నారు. కానీ శంఖంలో పోస్తే కానీ నీళ్ళు తీర్ధం కావన్నట్లుగా మొన్న హైదరాబాదులో ఆయన నివాసంలో జరిగిన తెలంగాణా నేతల సమావేశంలో ఖమ్మం యంపీ పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి ద్వారా తెలివిగా ఆ ప్రతిపాదన చేయించారు. ‘తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను షర్మిలకు కట్టబెట్టాలనే’ ఆయన ప్రతిపాదనను జగన్మోహన్ రెడ్డి దానిని కాదనకుండా పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. కనుక తెలంగాణపైకి ఆయన సందిస్తున్న బాణం ఎప్పుడయినా రివ్వున దూసుకు రావచ్చును.
అయితే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి చంచల్ గూడా జైల్లో ఉన్నారు కనుక అప్పుడు షర్మిల, విజయమ్మలు పార్టీని కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమించ వలసి వచ్చింది. కానీ ఆయన ఇప్పుడు బయటనే ఉన్నప్పుడు ఆయనే స్వయంగా తెలంగాణాలో పర్యటించి పార్టీని బలోపేతం చేసుకోవచ్చు కదా? తెరాస నుండి తెలంగాణా ప్రజల నుండి ఎదురయ్యే వ్యతిరేఖతను ఎదుర్కోకుండానే తెలంగాణాలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకోవాలనుకోవడం సాధ్యమేనా? అనే ధర్మ సందేహం చాలా మందికి కలగవచ్చును. సాధ్యం కాదని ఆయనకు తెలుసు. అందుకే ముందుగా తన నమ్మకమయిన బాణాన్ని తెలంగాణా మీదకు వదిలిపెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నారని చెప్పవచ్చును. ఒకవేళ ఆ బాణం ఇదివరకులాగే ఎటువంటి అడ్డంకులు లేకుండా రివ్వున తెలంగాణాలో దూసుకుపోతే, ఆ వెనుకే జగన్మోహన్ రెడ్డి తన ‘ఓదార్పు రధం’ అధిరోహించి తెలంగాణా పునః ప్రవేశం చేయవచ్చును.
కానీ తనకు ఎంతో బలముందని చెప్పుకొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆయన ఓదార్పు రధం ఎన్నికల కురుక్షేత్రంలో క్రుంగిపోయి ఓటమి పాలయినప్పుడు, తనకు అసలు బలం లేని చోట తోడుగా ప్రజాసైన్యం కానీ, స్వంత సైన్యం గానీ లేకుండా చాలా బలంగా ఉన్న శత్రుసేనలను ఏవిధంగా జయించేద్దామని బయలుదేరుతున్నారో ఆయనకే తెలియాలి.