తెలంగాణాలో రీ-ఎంట్రీకి వైకాపా రెడీ
posted on Oct 8, 2014 @ 10:42AM
వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణా నేతలు, కార్యకర్తలతో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. తెలంగాణాలో మళ్ళీ తమ పార్టీని బలోపేతం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అయితే అసలు వైకాపా తెలంగాణాను ఎందుకు విడిచిపెట్టి బయటకు వచ్చేసిందనే ప్రశ్నకు ఇంతవరకు వైకాపా జవాబు చెప్పకపోయినా దానికి అనేక సమాధానాలు కనబడుతున్నాయి.
ఎన్నికల తరువాత కేంద్రంలో మళ్ళీ యూపీయే ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే మాటయితే దానికి మద్దతు ఇచ్చే షరతుపైనే జగన్మోహన్ రెడ్డికి బెయిలు దొరికిందనే వార్తలు నిజమనుకొంటే, తెరాసతో జత కట్టాలనుకొన్న కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే, వారి విజయానికి అవరోధం కలిగించకుండా వైకాపా తెలంగాణాను విడిచిపెట్టి ఉండవచ్చును. లేదా అటు తెలంగాణాలో తెరాస, ఇటు ఆంధ్రాలో వైకాపా మద్దతు పొందవచ్చనే కాంగ్రెస్ వ్యూహం అమలుచేసేందుకే వైకాపా తెలంగాణాను విడిచిపెట్టి ఉండవచ్చును. లేదా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కోసం తెలంగాణాలో కనీసం ప్రచారం కూడా చేయలేని పరిస్థితులో తెలంగాణాను అంటిపెట్టుకొని రెండు చోట్లా నష్టపోవడం కంటే, సమైక్యాంధ్ర సెంటిమెంటుతో ఆంధ్రప్రదేశ్ లో బలంగా నిలద్రొక్కుకోవచ్చనే అంచనాతో వైకాపా తెలంగాణా విడిచిపెట్టి ఉండవచ్చును. కానీ కాంగ్రెస్, వైకాపాల వ్యూహాలు, అంచనాలు అన్నీ తలక్రిందులయ్యి రెండు చోట్ల ఆ రెండు పార్టీలు ఓడిపోయాయి.
ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించవలసిన అవసరం వైకాపాకు లేదు. కానీ తెరాసతో అంతో ఇంతో సఖ్యత ఉంది కనుక తెలంగాణాలో మళ్ళీ అడుగుపెట్టేముందు ఆ పార్టీతో తమ సత్సంబంధాల గురించి తప్పక ఆలోచించవలసి ఉంటుంది. కానీ తెలంగాణాలో తమ పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈరోజు సమావేశం నిర్వహిస్తున్నందున, తెరాసను డ్డీకొనేందుకే ఆయన మొగ్గు చూపుతున్నారని భావించవలసి ఉంటుంది.
సార్వత్రిక ఎన్నికలు ముగిసి తెలంగాణాలో తెరాస పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పుడు, ఆ పార్టీకి ఇతర పార్టీల మద్దతు అవసరం లేదని తెలిసినప్పటికీ వైకాపా మద్దతు ఇచ్చేందుకు సిద్దమయింది. ఒక సమైక్యవాద పార్టీ, విభజనవాద పార్టీకి మద్దతు ఇవ్వడమే వింత అనుకొంటే, తెరాస నేతలు ఆంద్ర ప్రజలను, ప్రభుత్వాన్ని ఎంతగా విమర్శిస్తున్నప్పటికీ ఏనాడూ కూడా వైకాపా నోరువిప్పి మాట్లాడిన దాఖలాలు లేవు. వైకాపాతో మిత్రత్వం పాటిస్తూ వచ్చిన తెరాస నేతలు ఇంతవరకు నేరుగా దాని జోలికి పోనప్పటికీ, అడపా దడపా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.యస్సార్ మీద ఘాటు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వైకాపా తెలంగాణాలో పునః ప్రవేశించాలనుకొంటే తప్పనిసరిగా తెరాసను డ్డీ కొని, తెలంగాణా ప్రభుత్వాన్ని విమర్శించక తప్పదు. అదేవిధంగా వైకాపా తెలంగాణాలో అడుగుపెట్టేందుకు నిశ్చయించుకొన్న మరుక్షణం నుండి తెరాస కూడా ఆ పార్టీపై, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై నేరుగా విమర్శలు గుప్పించడం తధ్యం.
ఇక తెలంగాణాను అర్దాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయినా వైకాపా, ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినంత మాత్రాన్న తెలంగాణా ప్రజలు దానిని ఆదరిస్తారని ఆశించడం అవివేకమే అవుతుంది. పైగా తెరాస నేతలు స్వర్గీయ వై.యస్సార్ హయంలోనే తెలంగాణాను దోపిడీకి గురయిందని గట్టిగా చేసిన ప్రచారం వలన ప్రజలు వైకాపాను నమ్మే పరిస్థితిలో లేరు.
జగన్మోహన్ రెడ్డి సీబీఐ కేసుల కారణంగా ఇప్పటికే మసకబారిన వైకాపా ప్రతిష్ట ఈ నిర్ణయంతో మరింత మసకబారవచ్చును. ఏవిధంగా అంటే ఇంతవరకు కేవలం తెదేపా మాత్రమే వైకాపాను, దాని అధ్యక్షుడిని గట్టిగా విమర్శిస్తోంది. కానీ ఇకపై తెదేపాతో బాటు, తెరాస, టీ-కాంగ్రెస్, బీజేపీలు కూడా స్వర్గీయ వై.యస్సార్ ను, ఆయన ప్రభుత్వాన్ని, ఆయన హయాంలో జగన్ క్విడ్ ప్రో వ్యవహారాల గురించి మాట్లాడటం మొదలు పెట్టడం తధ్యం కనుక వైకాపా ప్రతిష్ట మరింత మసకబారడం కూడా తధ్యం. అందువల్ల ఇంతకు ముందు వైకాపా తెలంగాణాను విడిచిపెట్టడం ఎంత తప్పో, ఇప్పుడు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళాలనుకోవడం కూడా అంతకంటే పెద్ద తప్పవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.