తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి తధ్యం
posted on Oct 5, 2014 @ 11:00AM
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న మూడేళ్ళలో రాష్ట్రంలో విద్యుత్ కష్టాలను తీరుస్తానని ప్రజలకు గట్టిగా భరోసా ఇస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే తెలంగాణాలో మొత్తం 6,000 మెగావాట్స్ సామర్ధ్యంగల మూడు థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు తెలంగాణ జెన్ కో సి.యం.డి. డి. ప్రభాకర్ రావు మరియు బీ.హెచ్.ఈ.యల్. సంస్థ సి.యం.డి. బి. ప్రసాదరావు నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో సచివాలయంలో ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేసారు. మొత్తం రూ.30, 000 కోట్లు ఖర్చుతో ఈ మూడు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను మూడేళ్ళలోనే నిర్మించబోతున్నారు.
వాటిలో ఒకటి రామగుండం(1200 మెగావాట్స్), ఇంకొకటి కొత్తగూడెం(800 మెగావాట్స్), మరొకటి ఇందూరు-మణుగూరు మధ్య (4,000 మెగావాట్స్) వద్ద నెలకొల్పుతారు. కొత్తగూడెం వద్ద నెలకొల్పబోయే విద్యుత్ ప్లాంటు కోసం ఇప్పటికే జెన్ కొ స్థల సేకరణ పూర్తిచేసింది. రామగుండంలో ప్రస్తుతం నడుస్తున్న యన్.టీ.పీ.సి. ప్లాంటు ఆవరణలోనే ఈ కొత్త విద్యుత్ ఉత్పత్తి సంస్థను నిర్మిస్తారు. కనుక ముందుగా ఈ రెండు ప్రాంతాలలో నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇందూరు-మణుగూరు మధ్య ఇంకా స్థల సేకరణ జరుగవలసి ఉంది. త్వరలోనే ఆ కార్యక్రమం పూర్తవగానే అక్కడ కూడా నిర్మాణపనులు ఆరంభమవుతాయి.
ప్రస్తుతం తెలంగాణాలో వారానికి ఒకరోజు పవర్ హాలిడేను అమలు చేస్తుండటంతో పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను ఆకర్షించడం చాలా కష్టమవుతుంది. కనుక వీలయినంత త్వరగా ఈ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పూర్తిచేయాలని బీ.హెచ్.ఈ.యల్. సంస్థ సి.యం.డి. బి. ప్రసాదరావును కేసీఆర్ కోరారు. తెలంగాణాలో రైతులు వ్యవసాయం కోసం ప్రధానంగా బోరు బావుల మీద ఆధారపడుతుంటారు. కనుక ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విద్యుత్ కొరత సమస్యను అధిగమించేందుకు గట్టిగా కృషిచేస్తూనే, మరోవైపు తెలంగాణాలో రైతాంగానికి ఈ విద్యుత్ సమస్యల నుండి విముక్తి చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు సిద్దం చేస్తున్నారు.
ఆ ప్రయత్నంలోనే భాగంగానే రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురయున్న గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునరుద్దరించి, వాటి ద్వారా వ్యవసాయానికి నీళ్ళు అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేసారు. చిరకాలంగా ఫ్లోరో సిస్ సమస్యతో బాధపడుతున్న నల్గొండ జిల్లా నుండే ఈ గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ పునరుద్ధరణ కార్యక్రమం మొదలుపెట్టేందుకు కేసీఆర్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. త్వరలోనే ఈ కార్యక్రమం మొదలవవచ్చును.
వచ్చే మూడేళ్ళలో అదనపు విద్యుత్ ఉత్పత్తి మొదలయితే రాష్ట్రంలో గృహ, పారిశ్రామిక అవసరాలు తీరుతాయి. అదే సమయంలో ఈ గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ద్వారా వ్యవసాయానికి తగినంత నీళ్ళు అందజేయగలిగితే క్రమంగా విద్యుత్ భారం కూడా తగ్గు ముఖం పడుతుంది. రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు కుదురుకొన్నట్లయితే ఇక తెలంగాణా రాష్ట్ర ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోతుంది. తెలంగాణాలో ఇప్పుడు రాజకీయ సుస్థిరత నెలకొని ఉంది కనుక బహుశః రానున్న ఐదేళ్ళలోనే ఈ మార్పు స్పష్టంగా కనబడవచ్చును.