ఖమ్మం జిల్లాలో బాలకృష్ణ పర్యటన
posted on Sep 28, 2018 @ 10:08AM
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్న ఆయన.. పలు గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించడంతో పాటు.. సత్తుపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యకు మద్దతుగా జరిగే ప్రచార సభలో పాల్గొననున్నారు. 1వ తేదీన ఉదయం 9గంటలకు కృష్ణాజిల్లా నందిగామ మీదుగా మధిర మండలం రాయపట్నం చేరుకొని.. అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి మోటార్ సైకిల్ ర్యాలీగా దెందుకూరు గ్రామానికి చేరుకుని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం మధిర అంబేద్కర్ సర్కిల్‌లోని ఎన్టీఆర్ విగ్రహం, రైల్వే గేట్ సెంటర్, జిలుగుమాడులోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేస్తారు. జిలుగుమాడులో కార్యకర్తలతో సమావేశమై.. అక్కడనుంచి బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామానికి పయనమవుతారు. ఆళ్లపాడు, నారాయణపురం గ్రామాలలో ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అనంతరం వైరా మీదుగా తల్లాడ చేరుకుని.. భోజనం చేసి.. ఆతర్వాత సత్తుపల్లి నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ సండ్ర వెంకటవీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించే ప్రచార బహిరంగసభకు హాజరవుతారు. ఓవైపు ముందస్తు వేడి.. మరోవైపు మహాకూటమి హడావిడి.. ఇలాంటి సమయంలో బాలకృష్ణ పర్యటన ఉండటంతో.. జిల్లా టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం మొదలైంది.