పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర..!!

  పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, ఉంగుటూరు నియోజకర్గం గణపవరం కూడలిలో పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్ర బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘కొంతమంది వేలకోట్లు ఉంటే రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. అలాగైతే గత ఎన్నికల్లోనే జగన్‌ సీఎం అయ్యి ఉండాలి. ముఖేష్‌ అంబానీ ప్రధాని అవ్వాలి. లేదా టాటానో, బిర్లానో అయ్యి ఉండాలి. గెలవాలంటే ప్రజాబలం కావాలి.. అది నాకుంది’ అని అన్నారు. అదే విధంగా ‘కొందరు నన్ను వచ్చే ఎన్నికల్లో చంపేద్దామనే ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇదే అంశంపై ఎవరో ముగ్గురు మాట్లాడుకున్న ఆడియోలు నా వద్దకు వచ్చాయి. నన్ను చంపేస్తే.. అందుకు కారకులు ప్రతిపక్షమని, అధికార పక్షమని ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటారని, ఆపై జనమూ మరిచిపోతారని వాళ్లనుకున్నారు. వాళ్లెవరో తెలుసు. ఇలాంటివన్నీ తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చానా? అలాంటి వాటికి భయపడను’ అని పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

శబరిమల.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!!

  మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. మహిళలకేం తక్కువ. మహిళలకు పురుషులకు సమాన హక్కులు ఉంటాయి. మహిళలను పురుషులతో సమానంగా చూడాలి. ఇలా పలు సందర్భాల్లో మహిళలు తక్కువ కాదని చెప్తుంటారు. కానీ ఇంకా ఎక్కడో వెలితి. కొన్ని సందర్భాల్లో వివక్ష చూపిస్తుంటారు. అయితే ఆ వివక్ష దేవుడి దగ్గర కూడా కనిపిస్తోంది. అలాంటి వాటిల్లో ఒకటే శబరిమల. శబరిమలలో స్త్రీలకు ప్రవేశం లేదు. దీంతో స్త్రీలకు ప్రవేశం కల్పించాలని ఎప్పటినుండో డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఆలయ ప్రవేశం గురించి సంచలన తీర్పు ఇచ్చింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఆలయాల్లో లింగ వివక్షకు తావులేదని స్పష్టం చేసింది. పురుషులకంటే మహిళలు ఏం తక్కువ కాదు.. ఓ వైపు దేవతలని పూజిస్తూ.. మరోవైపు మహిళలకు పరిమితులు విధించడం సరికాదని తెలిపింది.

ఇదే చివరి ప్రసంగం కావొచ్చు.. జైలులో ఉన్నా నామినేషన్ వేస్తా.!!

  మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గిలో కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి ఉద్వేగంతో ప్రసంగించారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఇదే తన చివరి ప్రసంగం కావొచ్చని తెలిపారు. జైలులో ఉన్నా.. ఎక్కడ ఉన్నా కొడంగల్‌లో నామినేషన్‌ వేస్తానని స్పష్టంచేశారు. 50 వేల ఓట్ల మెజార్టీతో తనను గెలిపించాలని కార్యకర్తలను కోరుకుంటున్నానన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా తన పోరాటం కొనసాగిస్తానని స్పష్టంచేశారు. ప్రధాని మోదీ, కేసీఆర్‌ కలిసి అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టాలనుకుంటున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ఈ రోజు తన నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారన్నారు. ఎవరు ఎన్నికుట్రలు చేసినా తన విజయాన్ని అడ్డుకోలేరన్నారు.

బాలయ్య ఓటు.. హైదరాబాద్ టు హిందూపురం షిఫ్ట్

  హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ గురువారం అనంతపురం జిల్లా హిందూపురంలో ఓటు నమోదు చేసుకున్నారు. కొద్ది నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఓటరు నమోదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనిలో తాజాగా బాలకృష్ణ ఓటు నమోదు చేసుకున్నారు. గతంలో బాలకృష్ణకి హైదరాబాద్ లో ఓటు ఉండేది. దీనిని సాకుగా చేసుకొని ప్రతిపక్షాలు చాలా సార్లు బాలకృష్ణ పై విమర్శలు చేశాయి. హిందూపురంలో ఓటు కూడా లేకుండా ఇక్కడ పోటీ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఇలాంటి ఛాన్స్ మరోసారి ఇవ్వకూడదని భావించిన బాలయ్య.. హిందూపురంలో ఓటు నమోదు చేసుకున్నట్లు సమాచారం.

అయోధ్య కేసు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

  అయోధ్య కేసులో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేసును విచారిస్తుందని.. అలాగే అయోధ్య భూయాజమాన్య హక్కులపై అక్టోబర్ 29న విచారణ చేపడతామని తెలిపింది. ప్రార్థనా స్థలాలకు ఆయా మతాల్లో ప్రత్యేక స్థానముంటుందని.. అన్ని మతాలు సమానమేనని వ్యాఖ్యానించింది. మసీదులు ఇస్లాంలో అంతర్భాగమా కాదా అనే అంశంపై కూడా సుప్రీం కోర్టు విచారణ చేస్తుందని తెలిపింది.

ఖమ్మం జిల్లాలో బాలకృష్ణ పర్యటన

  సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్న ఆయన.. పలు గ్రామాల్లో ఎన్టీఆర్‌ విగ్రహాలను ఆవిష్కరించడంతో పాటు.. సత్తుపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యకు మద్దతుగా జరిగే ప్రచార సభలో పాల్గొననున్నారు. 1వ తేదీన ఉదయం 9గంటలకు కృష్ణాజిల్లా నందిగామ మీదుగా మధిర మండలం రాయపట్నం చేరుకొని.. అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి మోటార్‌ సైకిల్‌ ర్యాలీగా దెందుకూరు గ్రామానికి చేరుకుని ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం మధిర అంబేద్కర్‌ సర్కిల్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం, రైల్వే గేట్‌ సెంటర్‌, జిలుగుమాడులోని ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేస్తారు. జిలుగుమాడులో కార్యకర్తలతో సమావేశమై.. అక్కడనుంచి బోనకల్‌ మండలం ఆళ్లపాడు గ్రామానికి పయనమవుతారు. ఆళ్లపాడు, నారాయణపురం గ్రామాలలో ఎన్టీఆర్‌ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అనంతరం వైరా మీదుగా తల్లాడ చేరుకుని.. భోజనం చేసి.. ఆతర్వాత సత్తుపల్లి నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ సండ్ర వెంకటవీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించే ప్రచార బహిరంగసభకు హాజరవుతారు. ఓవైపు ముందస్తు వేడి.. మరోవైపు మహాకూటమి హడావిడి.. ఇలాంటి సమయంలో బాలకృష్ణ పర్యటన ఉండటంతో.. జిల్లా టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం మొదలైంది.

వివాహేతర సంబంధం నేరం కాదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు.!!

వివాహేతర సంబంధాలు క్రిమినల్‌ నేరం కాదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించింది. ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ సమ్మతమైనది కాదని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. మహిళలకు సమానహక్కులు కల్పించాలన్న స్ఫూర్తికి సెక్షన్‌ 497తో తూట్లు పడుతున్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. మహిళల సమానత్వానికి అడ్డుపడే ఏ నిబంధన అయినా రాజ్యాంగపరమైనది కాదని వ్యాఖ్యానించింది. వివాహమైతే పురుషులు భార్యలను తమ ఆస్తిగా భావిస్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే వివాహేతర సంబంధాల కారణంతో విడాకులు తీసుకోవచ్చని, దాన్ని నేరంగా పరిగణించలేమని కోర్టు స్పష్టంచేసింది. వివాహేతర సంబంధాల చట్టంలోని పలు నిబంధనలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే కేంద్రం చట్టాన్ని సమర్థిస్తూ వాదనలు వినిపించింది. వివాహేతర సంబంధం నేరంగా పరిగణిస్తేనే వివాహ పవిత్రతకు రక్షణ ఉంటుందని వాదించింది. అయితే కోర్టు ఆ వాదనతో అంగీకరించలేదు. ఇష్టపూర్వక శృంగారం నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంచేసింది. సెక్షన్‌ 497 పురాతన చట్టమని తెలిపింది. చాలా దేశాలు ఈ తరహా చట్టాలను తొలగించాయని కోర్టు ఈ సందర్భంగా తెలియజేసింది. సెక్షన్ 497 ప్రకారం వివాహేతర సంబంధం నేరం. కానీ వ్యభిచార నేర చట్టం ప్రకారం కేవలం మగవారిని మాత్రమే దోషిగా పరిగణిస్తారు. ఆ శిక్ష ప్రకారం మహిళలు కేవలం బాధితులు మాత్రమే. దీంతో ఈ సెక్షన్ పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వివాహం తర్వాత మగవారు వ్యభిచారం చేస్తే అందుకు మగవారిని మాత్రమే బాధ్యులుగా చేస్తున్నారని.. మహిళలను మాత్రం వదిలేస్తున్నారని ఇలాంటి వ్యవస్థ వద్దని చెబుతూ రద్దు చేయాలని పిటిషన్‌లు దాఖలయ్యాయి. అయితే ఆ సమయంలో పిటిషన్ విన్న సుప్రీంకోర్టు మహిళలను శిక్షించేలా కొత్త సవరణ అయితే చట్టంలో చేర్చలేమని స్పష్టం చేసింది.

ఓ పక్క సోదాలు.. మరోపక్క ప్రచారం.!!

  కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేసారు. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సెన్‌కు కోట్ల రూపాయలు డీల్‌ కుదిర్చారని రేవంత్‌రెడ్డిపై గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి రూ.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయితే మిగిలిన మొత్తం బదిలీ అయిందా లేదా అనే విషయాన్ని ఏసీబీ గుర్తించలేదు. కొద్దిరోజుల క్రితం ఈ కేసును ఏసీబీ అధికారులు ఈడీకి అప్పగించారు. ఇందులో భాగంగా ఈడీ అధికారులు రేవంత్‌రెడ్డి ఇళ్లతో పాటు కార్యాలయాలపై సోదాలు చేపట్టారు. రేవంత్‌రెడ్డితో పాటు అతడి సోదరుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. మొత్తం మూడు చోట్ల ఈడీ సోదాలు చేసింది. హైదరాబాద్‌తో పాటు కొడంగల్ ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. అయితే ఇదంతా ఏమీ పట్టని రేవంత్‌రెడ్డి.. తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం మదన్ పల్లి నుంచి ఆయన ప్రచారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు. ఒకవైపు ఐటీ దాడులు కొనసాగుతున్నా.. ఆ ఆందోళన ఏమాత్రం కనిపించకుండా తన ప్రచారాన్ని కొనసాగించడం విశేషం.

పవన్‌కు చింతమనేని సవాల్.. నాపై పోటీ చేయి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వర్సెస్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రాజకీయం వేడెక్కుతోంది. రీసెంట్ గా దెందులూరులో పర్యటించిన పవన్ కళ్యాణ్.. చింతమనేనిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చింతమనేనిపై చాలా కేసులున్నా.. రాష్ట్ర ప్రభుత్వ పట్టించుకోవడం లేదని పవన్ ఆరోపించారు. చింతమనేని ఒక రౌడీలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన చింతమనేని, పవన్ కి సవాల్ విసిరారు. తనపట్ల వచ్చిన ఆరోపణలపై మీకు ఇష్టమొచ్చిన కమిటీ వేసుకోండని ఆయన సవాల్ చేశారు. ఆరోపణలపై వాస్తవాలు తెలుసుకోకుండా.. తనను హత్య చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులతో కలిసి పని చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర పార్టీ నాయకుడి నుంచి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ స్థాయికి పడిపోయారన్నారు. 'నీ టీవీలో నన్ను అసెంబ్లీ రౌడీ అని ప్రచారం చేస్తున్నారు. నా కుమారుడు అది చూసి నన్ను.. నాన్న నువ్వు అసెంబ్లీ రౌడీవా? అని ప్రశ్నించాడు. అవును నేను అసెంబ్లీ రౌడీనే. అసెంబ్లీ రౌడీ సినిమాలో శివాజీ ఎలా గెలిచాడో.. నేను కూడా అలాగే గెలిచి వస్తా. రాష్ట్రంలో నన్ను ఒక్కడినే టార్గెట్ చేస్తున్నావు. జగన్, వైసీపీ నేతలపై కేసులు ఉన్నాయి. పులివెందులలో కూడా ఇలా ప్రశ్నించగలవా?’ అన్నారు. 'నువ్వు నాపై పోటీ చేయి. చావో రేవో దెందులూరులోనే తేల్చుకుందాం. నువ్వు గెలిస్తే.. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిపై పోటీ చేసి ఓడిపోయానని అనుకుంటా. నీ విజయోత్సవంలో పాల్గొంటా. నేను గెలిస్తే షేక్ హ్యాండ్ ఇవ్వు చాలు అంతే' అని చింతమనేని అన్నారు.

సైనా నెహ్వాల్ పెళ్లి.. వరుడు ఎవరో తెలిస్తే షాక్.!!

  ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. సైనా నెహ్వాల్ గత కొన్నేళ్లుగా ఒక వ్యక్తితో ప్రేమలో ఉంది.. ఇప్పుడు ఆ ప్రేమ బంధం పెళ్లిగా మారుతోంది. ఇంతకీ సైనా నెహ్వాల్ ప్రేమించి, చేసుకోబోతున్న వ్యక్తి ఎవరో కాదు.. తోటి బ్యాడ్మింటన్‌ స్టార్‌ పారుపల్లి కశ్యప్‌. 2005లో పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో వీరద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించి పెళ్లికి పచ్చజెండా ఊపారు. ఈ ఏడాది డిసెంబర్ 16వ తేదీన వీరి వివాహ వేడుక జరుగనున్నట్లు సమాచారం.  

చంద్రబాబుపై కేసులు.. కోర్టులకు సమయం చాలదు.!!

  ఏపీ సీఎం చంద్రబాబుపై బీజేపీ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అవినీతిలో కూరుకుపోయారని.. చంద్రబాబుపై కేసులు వేస్తే కోర్టులకు సమయం చాలదని విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ సీఎం చంద్రబాబు అవినీతిమయం చేశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,500 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవన్నారు. అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు నెంబర్ వన్ అని విమర్శించారు. ప్రకృతి వ్యవసాయాన్ని గోవా సీఎం మనోహర్ పార్రికర్ ప్రవేశపెట్టారని.. దాన్ని ఐరాసలో తన ఘనతగా చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.

వైసీపీలోకి సీనియర్ డైరెక్టర్..!!

  సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి త్వరలో వైసీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది.  అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఆయన వైసీపీ తరుపున ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వార్తలొస్తున్నాయి.  విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర  చేస్తున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి కలిశారు. ఆయనతో పాటు నిర్మాత అచ్చిరెడ్డి కూడా ఉన్నారు. వీరిద్దరూ జగన్‌తో పాటు కొద్దిదూరం నడిచారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కృష్ణారెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీలో యమలీల, శుభలగ్నం లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చారు. ప్రస్తుతం సినిమా డైరెక్షన్ కి దూరంగా ఉంటున్న ఆయన.. తన మనసును రాజకీయాలవైపు డైవర్ట్ చేసినట్టున్నారు. మరి కృష్ణారెడ్డి త్వరలో వైసీపీలో చేరి చక్రం తిప్పుతారేమో చూద్దాం.

కాంగ్రెస్ లోకి కొండా దంపతులు

  కొండా దంపతులు సొంతగూటికి చేరారు. ఇటీవల కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అదేరోజు ఆయన 105 మంది పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించారు. అయితే ఆ జాబితాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన కొండా సురేఖ పేరు లేదు. దీంతో పార్టీ అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేసి.. రెండ్రోజుల్లో తనకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. అయినప్పటికీ తెరాస నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రీసెంట్ గా ఆమె మీడియా సమావేశం ఏర్పాటుచేసి తెరాసపై విరుచుకుపడ్డారు. దీంతో కొండా దంపతులు కాంగ్రెస్ గూటికి తిరిగి చేరతారంటూ వార్తలొచ్చాయి. ఊహించినట్టుగానే కొండా దంపతులు తెరాసను వీడి రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. తాము బేషరతుగానే కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు చెప్పారు. తెరాస తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే తమపై అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వరంగల్‌ జిల్లాలో కనీసం ఐదారు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తామని రాహుల్‌తో చెప్పినట్లు ఆమె తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత రాహుల్‌గాంధీ మళ్లీ కలుస్తామన్నారు. మరోవైపు కొండా దంపతుల చేరికతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ బలపడుతుందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఆధార్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!!

  సామాన్యుడి హక్కు అంటూ మొదలైన ఆధార్ కార్డుని.. తరువాత తరువాత అన్నింటికీ ఆధారే దిక్కు అనేంతలా మార్చేసింది ప్రభుత్వం. అయితే ఆధార్ వల్ల భద్రత లేదు, వ్యక్తిగత డేటాకి ముప్పని కొందరంటే.. అసలు అన్నింటికీ ఆధార్ అవసరమా? అంటూ మరికొందరు.. ఇలాంటి సమయంలో ఆధార్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆధార్‌తో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. ఆధార్ డేటా భద్రతపై అనుమానాలు అవసరంలేదనీ.. ఇది పూర్తి సురక్షితమని, విశిష్టమైనదని వ్యాఖ్యానించింది. ఆధార్‌ వల్ల వ్యక్తిగత గోప్యత, హ్యాకింగ్‌ జరుగుతున్నాయని ప్రధానంగా పిటిషన్‌దారులు వాదిస్తున్నారని, అయితే ఆధార్‌ డేటా హ్యాకింగ్‌ చేశారనే వార్తలు అవాస్తవమని ప్రభుత్వం స్పష్టంచేసిందని కోర్టు వెల్లడించింది. అయితే రాష్ట్రాలు సహా ప్రైవేట్‌ కంపెనీలు, మొబైల్‌ కంపెనీలు ఆధార్‌ డేటాను కోరడానికి వీల్లేదని కోర్టు స్పష్టంచేసింది. కోర్టు అనుమతి లేకుండా బయోమెట్రిక్‌ సమాచారాన్ని ఏ ఏజెన్సీలకు ఇవ్వడానికి వీల్లేదని తెలిపింది. అదేవిధంగా మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతాలకు ఆధార్‌‌ అనుసంధానం తప్పనిసరి కాదని పేర్కొంది. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ నంబర్‌లు తీసుకునేందుకు ఆధార్  కోసం బలవంతం చేయరాదని.. స్కూళ్లు, ప్రైవేట్ కంపెనీలు ఆధార్‌పై ఒత్తిడి చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. యూజీసీ, నీట్, సీబీఎస్‌ఈ పరీక్షలకు కూడా ఆధార్ గుర్తింపు సంఖ్య తప్పనిసరి కాదని పేర్కొంది. అయితే పాన్, ఐటీ రిటర్నులకు ఆధార్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు పేర్కొంది.

పోలీసులు చూస్తుండగానే హత్య...

పరువు హత్యలు,ప్రతీకార హత్యలతో ఎక్కడ చూసిన ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.పగలు,రేయి తేడాలేకుండా ప్రజలు సంచరిస్తూన్నారనే భయంలేకుండా తెగించి హత్యలకు పాల్పడుతున్నారు.తాజాగా హైదరాబాద్‌ నగర శివారు రాజేంద్రనగర్‌ పరిధి అత్తాపూర్‌లో అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా నరికి చంపారు.సిద్ధిఅంబర్‌ బజార్‌కు చెందిన రమేశ్‌ (35) అనే వ్యక్తి ఓ హత్య కేసులో ఉప్పరపల్లి కోర్టుకు బుధవారం హాజరయ్యాడు. అతను తిరిగి ఇంటికి ఆటోలో వెళ్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అడ్డగించి దాడికి పాల్పడ్డారు.తన భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడన్న కక్షతో రమేశ్‌ ఆరు నెలల క్రితం మహేశ్‌ అనే యువకుడిని శంషాబాద్‌లో హత్య చేశాడు.‌ ఆ కేసులో అరెస్టయి అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ కేసు విచారణలో భాగంగానే రమేశ్‌ ఈరోజు ఉప్పర్‌పల్లి న్యాయస్థానంలో హాజరయ్యాడు.అతను తిరిగి ఇంటికి ఆటోలో వెళ్తున్న సమయంలో అత్తాపూర్‌ 143 పిల్లర్‌ వద్ద దాదాపు 100 మీటర్ల దూరం వరకు వెంటాడి వేటాడి అతికిరాతకంగా హత్య చేసారు మహేశ్‌ తండ్రి, బంధువు.ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు అక్కడే ఉన్నా.. పోలీసు వాహనం ముందే ఈ దారుణం జరగడం విచారకరం. తనను రక్షించాలంటూ ఆ యువకుడు ఆర్తనాదాలు పెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగలేదు.అతను చనిపోయేంత వరకూ గొడ్డలితో దాడి చేస్తూనే ఉన్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హరీష్ రావు వర్గానికి టిక్కెట్లు లేవు..

  వరంగల్ జిల్లాలో కొండా దంపతులకు మంచి పట్టుంది.సమైఖ్య రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కొండా సురేఖ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తదనంతర పరిస్థితుల దృష్ట్యా తెరాసలో చేరారు. ఇటీవల కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆదేరోజు ఆయన 105 మంది పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించారు. అయితే ఆ జాబితాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన కొండా సురేఖ పేరు లేదు. దీంతో పార్టీ అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేసి రెండ్రోజుల్లో తనకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. మంత్రి హరీశ్‌రావుకు అనుకూలంగా ఉన్న నాయకులపై వ్యతిరేకత ఉందని ప్రచారం చేశారని, అక్కడ కేటీఆర్‌ అనుచరులకు టికెట్లు ఇచ్చారని కొండా సురేఖ ఆరోపించారు. టీఆర్‌ఎ్‌సలో తమది మంత్రి హరీశ్‌రావు వర్గమని, ఆయన వర్గంలో ఇంకా ఎందరున్నారో తర్వాత తెలుస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారికి నామినేటెడ్‌ పదవులు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు.దీంతో తాను, తన భర్త ఎమ్మెల్సీ కొండా మురళి తెరాసకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.అనంతరం కాంగ్రెస్‌ నేతలతో సంప్రదింపులు జరిపిన వారిద్దరూ నిన్న రాత్రే దిల్లీకి చేరుకున్నారు.ఈరోజు ఉదయం 11.30 గంటల సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. కొండా దంపతులు తమకు మూడు స్థానాలు కేటాయించాలని కోరుతున్నా.. మహాకూటమి సర్దుబాటు దృష్ట్యా అన్ని సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. కొండా సురేఖకు సీటు ఖాయమని పార్టీ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఐదు స్థానాలను ప్రభావితం చేయగల కొండా దంపతులు తిరిగి సొంత గూటికి చేరడంతో కాంగ్రెస్‌ పార్టీలో ఉత్సాహం నెలకొంది.

మావోల హిట్ లిస్ట్ లో పలువురు ప్రముఖులు..

  దశాబ్ద కాలంగా మావోల ప్రాభల్యం తగ్గింది అనుకుంటున్న నేపధ్యం లో ఒక్కసారిగా అరకు ఘటనతో రాష్టం ఉలిక్కిపడింది. ప్రజాప్రతినిధుల గుండెల్లో గుబులు మొదలయ్యింది. పోలీస్ యంత్రంగం అప్రమత్తమైంది, ఒకప్పటి మావోల ప్రభావిత గ్రామాలు, అటవీ ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకునేందుకు తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక బృందాలు సైతం రంగంలోకి దిగాయి. నిరంతరం అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజాప్రతినిధులకు సూచనలిచ్చారు. మావోల షెల్టర్‌ జోన్‌గా ప్రసిద్దిగాంచిన నల్లమల దశాబ్దాలపాటు నక్సల్స్‌ బూట్ల చప్పుళ్లు, పోలీసుల కూంబింగుతో అట్టుడికింది. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మావోలతో చర్చల అనంతరం అణిచేయడంతో వారి కదలికలు తగ్గిపోయాయి. అగ్ర నాయకులు నల్లమలలోనే ఆశ్రయం పొందారనే విషయం గ్రహించిన పోలీసు శాఖ అణువణువు జల్లెడ పట్టింది. ఫలితంగా ఆంధ్రా - ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌ ప్రాంతాలకు తరలివెళ్లారు. 13 ఏళ్ల అనంతరం అరకు హత్యలతో మావోలు తమ ఉనికిని చాటుకున్నారు. ఇన్నాళ్లూ స్వేచ్ఛగా తిరిగిన రాజకీయ నాయకుల్లో అరకు ఘటన వణుకు పుట్టిస్తోంది.మావోల హిట్ లిస్ట్ లో అధికార పక్ష నేతలతో పాటు మాజీ నేతలు పలువురు తదితరులు సహా సుమారు 200 మంది జాబితాలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రజాప్రతినిధులు బయటకు వెళ్లొద్దంటూ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మావోయిస్టుల హిట్‌లి్‌స్టలో విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు, గిడ్డి ఈశ్వరికి భద్రత మరింత పెంచారు. ప్రస్తుతం ఉన్న భద్రత సిబ్బందికి అదనంగా గన్‌మెన్‌ను కేటాయించాలని నిర్ణయించారు. అలాగే... సివిల్‌ డ్రెస్‌లో ఉండి చుట్టుపక్కల పరిస్థితులను గమనించే ‘షాడో టీమ్‌’ను ఏర్పాటు చేయనున్నారు. అయ్యన్నకు ప్రభుత్వం ఇప్పటికే బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం సమకూర్చింది. వీలైనంత వరకు మారుమూల ప్రాంతాలకు వెళ్లవద్దని అయ్యన్న, ఈశ్వరికి పోలీసులు సూచించారు.వీరితోపాటు అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఆయన సోదరుడు వినాయక్‌, గిడ్డి ఈశ్వరి వ్యక్తిగత కార్యదర్శి పోలుపర్తి గోవిందరావు, బీజేపీ నాయకుడు లోకుల గాంధీ, కొయ్యూరు మండలం బూదరాళ్ల మాజీ సర్పంచ్‌ సూరిబాబు, ఇదే మండలానికి చెందిన టీడీపీ నాయకుడు ఎం.ప్రసాద్‌, పెదబయలు మండలాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీపీ జర్సింగి సూర్యనారాయణ, పెదబయలు మండలం జామిగూడ మాజీ సర్పంచ్‌ సుబ్బారావు, ఇంజిరి మాజీ సర్పంచులు సత్యారావు, కామేశ్వరరావులకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. చింతపల్లి మండలంలో 12 మందిని, జీకే వీధి మండలంలో ఎనిమిది మందిని లక్ష్యంగా చేసుకొని ఇప్పటికే అనేక పర్యాయాలు హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. ఇంకా ఏజన్సీలోని పలు మండలాలకు చెందిన 110 మంది ఈ జాబితాలో ఉన్నట్టు తెలిసింది.  

అబ్బాయిల బలహీనతే వీళ్ళ టార్గెట్..

ఓ అమ్మాయి సరదాగా మాట్లాడగానే అబ్బాయిలు ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. చాలా మంది నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అని గొప్పగా చెప్పుకోటానికి, డేటింగ్ చేయటానికి అత్యుత్సహం చూపిస్తుంటారు. ఇలాంటి వారి బలహీనతనే ఆదాయంగా మార్చుకోవాలని డేటింగ్‌ వెబ్‌సైట్ల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు పశ్చిమ బెంగాల్‌ కు చెందిన ముఠా.     కేవలం రెండేళ్ల వ్యవధిలోనే సుమారు 150 కోట్ల రూపాయలవరకు కొల్లగొట్టారంటే ఎవరైనా విస్తుపోవాల్సిందే. గూగుల్, వివిధ సైట్ల నుంచి అందమైన, ఆకర్షణీయమైన అమ్మాయిలు, సెక్సీ ఫొటోలను తీసి అమ్మాయిలను సరఫరా చేస్తామంటూ వరల్డ్‌డేటింగ్‌.కామ్‌, గెట్‌యూత్‌లేడీ.కామ్‌, మైలవ్‌18.ఇన్‌ వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేశారు. ఈ వెబ్‌సైట్లలోనే ఒక ఫామ్‌ ఉంటుంది. కస్టమర్లు తమ వివరాలను అందులో పొందుపరచాలి. అందులోనే ఎటువంటి అమ్మాయి కావాలో ఎంపిక చేసుకోవాలి. వెబ్‌సైట్లో వివరాలు నమోదు కాగానే వారికి ఓ ఫోన్‌ వస్తుంది. అవతలి నుంచి ఓ అమ్మాయి ఆకర్షించే మాటలతో కవ్విస్తుంది.వివరాలు నమోదు చేయాలాగానే ఫోన్ వస్తుంది. ఓ అమ్మాయి తన మాటలతో ఆకర్షించటం మొదలుపెడుతుంది, సరదాగా కబుర్లు చెప్తూ బుట్టలో వేసుకుంటుంది. మనం బోల్తా పడ్డామా అంతే అందినకాడికి రకరకాల సర్వీసుల పేరిట దోచేస్తారు. అమ్మాయిల కోసం ఉవ్విళ్లూరుతున్న యువత తమ వద్దకు వచ్చే అమ్మాయిని ఊహించుకుంటూ ఊహల్లో విహరిస్తారు. ఎంతకీ అమ్మాయి రాకపోవడంతో అంతకుముందు తనతో మాట్లాడిన అమ్మాయికి ఫోన్‌ చేస్తారు. అది కాస్తా స్విచ్ఛాఫ్‌ చేసి ఉంటుంది. చివరకు ఎలాంటి ఎస్కార్టు సర్వీసు ఇవ్వకుండానే బిచాణా ఎత్తేస్తారు. ఏకంగా 400 మందితో  20 కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేసారంటే వీరి చేతిలో మోసపోయిన వారెందరో?.... అమ్మాయిల మీద వ్యామోహంతో ఉన్న యువత ఒక్కొక్కరు పది నుంచి 20 లక్షల వరకూ సమర్పించుకున్నారు. భాగ్యనగరానికి చెందిన ఓ యువకుడు 15 లక్షల వరకు చెల్లించి మోసపోయానని గ్రహించి పోలీస్ లను ఆశ్రయించటంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సీపీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు డీసీపీ జానకీ షర్మిల, ఏసీపీ శ్రీనివాసకుమార్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ఎస్సై విజయ్‌వర్థన్‌ రంగంలోకి దిగారు. బాధితుడు ఇచ్చిన వెబ్‌సైట్‌, ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాల ఆధారంగా నిందితులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముఠాగా గుర్తించారు.పశ్చిమ బెంగాల్లోని హౌరాకు చెందిన దేబాశిష్‌ ముఖర్జీ,కోల్‌కతాకు చెందిన ఫెయిజుల్‌ హక్‌, సందీప్‌ మిత్రా, హౌరాకు చెందిన అనితా డే, సిలిగురికి చెందిన నీతా శంకర్‌ ప్రధాన నిందితులు.వీరిలో సందీప్‌ మిత్రా, నీతా శంకర్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి లాప్‌టాప్‌-1, మొబైల్‌ ఫోన్లు-50, ఫింగర్‌ ప్రింట్‌ అటెండెన్స్‌ మిషన్‌-2, అటెండెన్స్‌ రిజిస్టర్లు-3, కస్టమర్స్‌ స్ర్కిప్టులను స్వాధీనం చేసుకున్నారు.