తెరాసకు షాక్.. కాంగ్రెస్ గూటికి సీనియర్ నేత.!!

  అసెంబ్లీ రద్దుతో ముందస్తు ఎన్నికల వేడి సృష్టించిన తెరాసకు అసంతృప్తి సెగ తగులుతుంది.. తెరాస ప్రకటించిన 105 స్థానాల్లో టిక్కెట్ ఆశించి దక్కని వారు.. అసంతృప్తితో నిరసన వ్యక్తం చేస్తున్నారు.. కొందరైతే పార్టీనే వీడుతున్నారు.. అలాంటి వారిలో ఒకరే రమేష్ రాథోడ్.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ రాజకీయ నేత రమేష్‌ రాథోడ్ తెరాసకు రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.. టీడీపీ పోలిట్‌బ్యూరోలో కొనసాగుతున్న సమయంలో రమేష్‌ రాఠోడ్‌ ఏడాది కిందట ఖానాపూర్‌ ఎమ్మెల్యే టిక్కెట్టే ఒప్పందంగా తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు.. చివరి నిమిషంలో తెరాస టిక్కెట్టు నిరాకరించడంతో ఈ నెల ఎనిమిదో తేదీన ఉట్నూర్‌ కేంద్రంగా భారీ ర్యాలీ నిర్వహించారు.. టిక్కెట్‌ రాకపోయినా ఖానాపూర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీచేయడం ఖాయమని స్పష్టం చేశారు.. అయితే కాంగ్రెస్‌ నేతలతో సంప్రదింపులు జరిపిన ఆయన రేపు గాంధీభవన్‌ వేదికగా ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.. ఖానాపూర్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేస్తానని ఆయన వెల్లడించారు.

మరో ప్రణయ్ కథ.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని కత్తితో దాడి

  నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్‌ హత్యఘటనను మరువక ముందే హైదరాబాద్‌ నగరంలోని ఎర్రగడ్డలో మరో దారుణం వెలుగు చూసింది.. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై యువతి తండ్రి కత్తితో దాడి చేసాడు.. ఎర్రగడ్డకు చెందిన సందీప్‌(24), బోరబడండకు చెందిన మాధవి(22) గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. వీరిద్దరి కులాలు వేరుకావడంతో యువతి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు.. పది రోజుల కిందట అల్వాల్‌లోని ఓ ఆలయంలో వీరు పెళ్లి చేసుకున్నారు.. వీరి పెళ్లి విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు ముందు వ్యతిరేకించినా తర్వాత ఒప్పుకున్నారు.. అప్పటి నుంచి మాధవి తన భర్తతో అత్తగారింట్లోనే ఉంటుంది.. ఈ నేపథ్యంలో మాధవి తండ్రి రెండు రోజులుగా తనను కలుస్తూ ఆమెతో ప్రేమగా ఉన్నట్లు నటించాడు.. బుధవారం సందీప్‌, మాధవిలకు బట్టలు కొనిస్తానని చెప్పి ఎర్రగడ్డలోని హోండా షోరూం దగ్గరకు రమ్మని పిలిచాడు.. ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం అందరూ చూస్తుండగానే వారిపై దాడికి పాల్పడ్డాడు.. ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.. వీరిని వెంటనే స్థానికంగా ఉన్న నీలిమ ఆస్పత్ర్రికి తరలించారు.. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం మాధవి పరిస్థతి విషమంగా ఉన్నట్లు యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

టీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయాలనుకున్నాం - చంద్రబాబు

  ముందస్తుతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి.. ఓ వైపు టీఆర్ఎస్‌ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల హీట్ పెంచితే.. మరోవైపు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజెఎస్ పార్టీలు మహాకూటమి దిశగా అడుగులు వేస్తున్నాయి.. అయితే ఇలాంటి సమయంలో తెలంగాణలో ఎన్నికల గురించి, పొత్తుల గురించి ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.. తెలంగాణలో టీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయాలనుకున్నామని అన్నారు.. అయితే, తెలుగు రాష్ట్రాలు కలిస్తే బలపడతాయని భావించిన బీజేపీ.. టీఆర్ఎస్‌, టీడీపీ కలవకుండా అడ్డుకుందని ఆరోపించారు.. రెండు రాష్ట్రాల మధ్య కేంద్రం తగువులు పెడుతోందని మండిపడ్డారు.. అదేవిధంగా టీడీపీని దెబ్బతీయడం, ఏపీకి అన్యాయం చేయడమే బీజేపీ ఉద్దేశం అని ఆగ్రహం వ్యక్తం చేసారు.. ఎవరెన్ని కుట్రలు చేసినా ఏపీకి ప్రత్యేక హోదా పోరాటం ఆపేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఆవులు తమిళం, సంస్కృతం మాట్లాడతాయి - నిత్యానంద

  నిత్యానంద.. పెద్దగా పరిచయం అవసరంలేని పేరు.. ప్రపంచానికి తనని తాను దేవదూతగా పరిచయం చేసుకున్నాడు.. తరువాత ఆయన చీకటి భాగోతాలు వెలుగులోకి వచ్చి, ఆయన అసలు రంగు ప్రపంచానికి పరిచయమైంది.. ఇదంతా పనికిరాని గతం.. అసలు ప్రస్తుతం విషయం ఏంటంటే.. తాజాగా ఆయన ఆవులు, ఎద్దులతో తమిళం, సంస్కృతం మాట్లాడించగలనంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.. ఆయన తయారు చేసే ఓ సాఫ్ట్‌వేర్ ద్వారా జంతువులతో మాట్లాడించడగలనని అంటున్నారు.. ప్రస్తుతం అది ప్రయోగ దశలో ఉందని, కొంత వరకు ప్రయోగాత్మకంగా విజయవంతమైనప్పటికీ, ఇంకా కొంత మేరకు కష్టపడాల్సి ఉందని అన్నారు.. తన మాటలను కొట్టిపారేయడానికి వీళ్లేదని, సరిగ్గా సంవత్సరం తర్వాత ఈ ప్రయోగం చేసి చూపించగలనని, అవసరమైతే తన వ్యాఖ్యల్ని రికార్డు చేసుకోండని అన్నారు.. కోతులతో పాటు మరికొన్ని ఇతర జంతువులకు అన్ని రకాల ఇంటర్నల్ ఆర్గాన్స్ లేవు. వాటికి సూపర్‌ కాన్సియోస్ పురోగగతిని అందించినట్లైతే వాటిల్లో ఆయా ఆర్గాన్స్ వృద్ధి చెందుతాయి. శాస్త్రీయ, వైద్య విధానంలో త్వరలోనే దీన్ని చేసి చూపిస్తాను. ఇది కనుక పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగితే ఆవులు, ఎద్దులు తమిళం, సంస్కృతం మాట్లాడతాయి అని నిత్యానంద అన్నారు.. సంవత్సరం తర్వాత చూద్దాం.. నిత్యానంద ఆవులు, ఎద్దులతో తమిళం, సంస్కృతం ఎంత బాగా మాట్లాడిస్తాడో.

తెలంగాణలో ముందస్తు వద్దు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌

  తెలంగాణలో ముందస్తు ఎన్నికలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.. ఈ మధ్య హైకోర్టులో కూడా తెలంగాణలో ముందస్తు ఎన్నికలను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.. అయితే హైకోర్టు ఆ పిటిషన్ ని కొట్టేసింది.. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టులో ముందస్తుకు సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది.. రాష్ట్రంలో గడువు కంటే ముందే ఎన్నికలు నిర్వహించడం వల్ల పౌరులకు నష్టమని పేర్కొంటూ సిద్ధిపేటకు చెందిన పోతుగంటి శశాంక్‌రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.. తెలంగాణలో సాధారణ ఎన్నికల సమయానికి దాదాపు 20లక్షల మందికి పైగా యువత ఓటుహక్కు పొందేందుకు అవకాశముంటుందని, ముందస్తు ఎన్నికల వల్ల వారంతా ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు.  తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని, పూర్తిస్థాయి మెజార్టీ ఉన్న ప్రభుత్వమే అధికారంలో ఉందని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు.. స్వయంగా ముఖ్యమంత్రే.. ఎన్నికల సంఘంతో మాట్లాడిన తర్వాతే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పడం అర్థరహితమన్నారు. ఫలానా సమయంలో ఎన్నికలు జరుగుతాయని, మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి, రాజకీయ సంక్షోభం లేకపోయినా కేవలం రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైందని తెలిపారు.. ఈ అంశాలను దృష్టిలోకి తీసుకుని తెలంగాణలో గవర్నర్‌ పాలన విధించాలని కోరారు.. సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, అప్పటివరకు గవర్నర్‌ పాలన అమల్లో ఉండటం వల్ల ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతుందని పిటిషనర్‌ పేర్కొన్నారు.. మరి ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

జనసేన గూటికి రెబల్ స్టార్..!!

  ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ జనసేన పార్టీలో చేరికలు మొదలవుతున్నాయి.. ఇప్పటి వరకు జనసేనకు పెద్ద దిక్కు పవన్ కళ్యాణ్.. పవన్ తప్ప జనసేనలో జనాలకి బాగా తెలిసిన, జనాలను ఆకర్షించగల నేత మరొకరు లేరనే చెప్పాలి.. అయితే ఇప్పుడు జనసేన ఆ లోటును పూడ్చే పనిలో పడినట్టు తెలుస్తోంది.. సీనియర్ నాయకులు, సినీ ప్రముఖులను పార్టీలో చేర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది.. ఇప్పటికే కొందరు ప్రముఖులు జనసేనలో చేరటానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.. ముఖ్యంగా 'రెబల్ స్టార్ కృష్ణంరాజు' త్వరలో జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ప్రస్తుతం కృష్ణంరాజు బీజేపీలో ఉన్నారు.. సినీ, రాజకీయ రంగాల్లో ఆయనకు మంచి పేరుంది.. ఆయన చేరిక జనసేనకు బలాన్ని చేకూరుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. అదీగాక కృష్ణంరాజు చేరితే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా పార్టీకి మద్దతిచ్చే అవకాశముంది.. మరి కృష్ణంరాజు నిజంగానే జనసేనలో చేరుతారో లేక ఈ వార్తలు వార్తలుగానే మిగిలిపోతాయో చూడాలి.

తొక్కిసలాటకు చంద్రబాబు కారణం కాదు

  గోదావరి పుష్కరాల సమయంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం.. పుష్కర ముహూర్తంపై అనవసర ప్రచారం వల్ల జనం రద్దీ పెరగడం, తదితర కారణాలతోనే దుర్ఘటన జరిగిందని కమిటీ తెలిపింది.. తొక్కిసలాట ఘటనపై నియమించిన కమిటీ ఏపీ ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించింది.. ఆ నివేదికను మంత్రి పితాని సత్యనారాయణ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు.. 2015, జులై 14న గోదావరి పుష్కరాల తొలిరోజున తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద తొక్కిసలాట జరిగింది.. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులు పుష్కరస్నానం కోసం ఒక్కసారిగా పోటెత్తడంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట చోటుచేసుకుంది.. ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.. ఈ ఘటనపై స్పందించిన ఏపీ ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సీవై సోమయాజులు నేతృత్వంలో కమిటీ ఏర్పాటుచేసింది.. ఈ కమిటీ ప్రత్యక్ష సాక్షులు, విధుల్లో ఉన్న అధికారులు, బాధితుల నుంచి వివరాలు సేకరించింది.. పుష్కరాల తొలిరోజు ఉదయం 6.26 గంటలకు స్నానం చేస్తే మంచిదంటూ విస్తృతంగా జరిగిన ప్రచారమే ఈ ఘటనకు కారణమని కమిటీ తేల్చింది.. ఈ ప్రచారంతోనే లక్షలాది మంది భక్తులు తెల్లవారుజామునే పుష్కరఘాట్‌కు చేరుకున్నారని, బారికేడ్లను తోసుకుంటా ఒక్కసారిగా నదిలో దిగేందుకు ప్రయత్నించడంతోనే తొక్కిసలాట జరిగిందని నివేదికలో పేర్కొంది.. ముహూర్త కాలంపై పత్రికలు, వార్తా ఛానెళ్లు, సోషల్‌ మీడియా, ప్రవచన కర్తలు చేసిన దుష్ప్రచారమే ఈ ఘటనకు కారణమని స్పష్టం చేసింది.. అయితే ఈ ఘటనకు సీఎం చంద్రబాబు కారణమంటూ గతంలో విపక్షాలు ఆరోపించాయి.. కమిటీ మాత్రం సీఎం వెళ్లిపోయిన తర్వాత తొక్కిసలాట జరిగిందని, ప్రమాదం జరిగిన ఘాట్‌ వెడల్పు 300మీ మాత్రమే ఉండటం, పుష్కర ముహూర్తంపై అనవసర ప్రచారం తదితర కారణాలతోనే దుర్ఘటన జరిగిందని స్పష్టం చేసింది.

తెలంగాణలో కలకలం.. మంత్రి జగదీశ్‌ రెడ్డి హత్యకు రెక్కీ.!!

  విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి హత్యకు రెక్కీ నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. సుమారు 20 రోజుల క్రితం కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ఓ వాహనంలో మంత్రి స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా నాగారం వచ్చినట్టు తెలుస్తోంది.. అంతేకాకుండా వారు డ్రోన్‌తో గ్రామ వీధులు, డొంక రోడ్లను చిత్రీకరించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.. రెక్కీ నిర్వహించినది ప్రగతి నివేదన సభ జరిగిన సెప్టెంబర్ 2న అని కొందరు, ఆగస్టు 30న అని మరికొందరు గ్రామస్థులు చెబుతున్నారు.. ఆగస్టు 30న అయితే జగదీశ్‌ రెడ్డి ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి నాగారం వెళ్లారు.. ఆయన నాగారంలో సెక్యూరిటీ లేకుండానే గ్రామస్తులతో కలిసిపోతారు.. సన్నిహితుల ఇళ్లకు, పొలం వద్దకూ వెళుతుంటారు.. ఇలాంటి సందర్భంలోనే దాడి చేయాలని పన్నాగం పన్నినట్లు సమాచారం.. రెక్కీ నిర్వహించినట్లు సమాచారం ఉందని ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు కూడా చెప్పారు.. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.. జగదీశ్‌ రెడ్డికి గతంలో కూడా ఇలాంటి సంఘటన ఎదురైంది.. ఏడాది క్రితం ఆయన సూర్యాపేటకు వస్తుండగా ఎర్రసానిగూడెం వద్ద హఠాత్తుగా ఓ వ్యాన్‌ కాన్వాయ్‌లోకి వచ్చి ప్రోటోకాల్‌ వాహనాన్ని ఢీకొట్టింది.. అనంతరం అది కనిపించకుండా పోయింది.

అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా: రాహుల్ గాంధీ

  అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేసారు.. కర్నూల్ పర్యటనలో భాగంగా బైరెడ్డి కన్వెన్షన్ సెంటర్లో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని చెప్పారు.. కేంద్రం నుంచి ఏపీకి ప్రత్యేక సాయం అందాలన్నారు.. అదే విధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.. మరోవైపు బహిరంగ సభలో కూడా రాహుల్ ప్రత్యేకహోదా గురించి మాట్లాడారు.. మోదీలా తాను అబద్దాలు చెప్పడానికి రాలేదన్నారు.. హోదా విషయంలో తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే ఏపీలో అడుగుపెట్టనని రాహుల్ ప్రకటించారు.. 2019లో అధికారంలోకి రాగానే ఏపీకి ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.. ప్రత్యేక హోదా అమలుపైనే తన తొలి సంతకం ఉంటుందన్నారు.. అయినా ప్రత్యేక హోదా అనేది కేంద్రం ఏపీకి ఇచ్చే కానుకేం కాదని, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని అన్నారు.

ప్రత్యేక హోదా కోసం మరో ప్రాణం బలైంది

  చదువుకుంటూ, తోటి పిల్లలతో సరదాగా ఆడుకుంటూ సాగిపోవాల్సిన ఆ పసి జీవితం అర్దాంతరంగా ముగిసిపోయింది.. ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ పదో తరగతి చదువుతున్న బాలుడు ప్రాణత్యాగం చేసాడు.. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గానికి చెందిన మహేంద్ర అనే బాలుడు ప్రత్యేక హోదా రావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.. మహేంద్ర రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.. దానిలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చివుంటే అన్నకు ఉద్యోగం వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశాడు.. మహేంద్ర ఆత్మహత్యపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.. అసెంబ్లీలో సంతాపం తెలిపారు.. ఇప్పటి వరకు ప్రత్యేకహోదా కోసం ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు.. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పిన చంద్రబాబు.. ప్రాణం చాలా విలువైనది.. ఎవరూ బలిదానాలు చేసుకోవద్దు.. పోరాడి సాధించుకుందామని అన్నారు.

తెరాస ఎంపీ వ్యాపార సంస్థల్లో ఐటీ సోదాలు..!!

  ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసం, వ్యాపార సంస్థల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు.. హైదరాబాద్‌లో 6 చోట్ల, ఖమ్మంలో 12 చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి.. ఖమ్మం నగరంలోని ఎంపీ నివాసంలో ఉదయం 9 గంటల నుంచి సోదాలు చేపట్టారు.. అదే విధంగా బంజారాహిల్స్‌లోని రాఘవ ఇన్‌ఫ్రా కార్యాలయంలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి.. ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం.. ఈ సోదాలపై ఎంపీ పొంగులేటి స్పందించారు.. ఇవి సాధారణ సోదాలేనని స్పష్టం చేశారు.. అయితే ఇప్పుడు ఈ సోదాలు తెలంగాణాలో హాట్ టాపిక్ గా మారాయి.. తెరాస పార్టీకి చెందిన ఎంపీ ఇంట్లో సోదాలు జరగడం ఏంటి అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.

పెట్రోల్ ధరపై ప్రశ్నించినందుకు ఆటో డ్రైవర్ని నెట్టేసిన బీజేపీ నేత

  అసలే కోపంతో రగిలిపోతుంటే ఇంకాస్త పెట్రోల్ పోసి ఆ కోపాన్ని రెట్టింపు చేస్తున్నట్లుంది బీజేపీ పరిస్థితి.. ఓ వైపు పెట్రోల్ ధరలు మండిపోతూ ప్రజలకు కోపం తెప్పిస్తుంటే.. మరోవైపు ఇవేం ధరలు అని ప్రశ్నించిన ఆటో డ్రైవర్ని నెట్టేసి ఆ కోపాన్ని రెట్టింపు చేసారు ఓ బీజేపీ నేత.. చెన్నైలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళసాయి సౌందరరాజన్‌ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆమె వెనకే ఉన్న ఓ ఆటోడ్రైవర్‌ పెట్రోల్‌ ధరలపై ప్రశ్నించారు.. దీంతో అక్కడే ఉన్న మరో బీజేపీ నేత కాళిదాస్‌ అసహనంతో ఆ ఆటోడ్రైవర్‌ను అందరూ చూస్తుండగానే నెట్టివేశారు.. ఈ దృశ్యాలు మీడియాలో ప్రసారం కావడంతో వైరల్‌గా మారాయి.. బీజేపీ నేతల తీరుపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.. ప్రశ్నించినందుకే తోసేస్తారా? అంటూ మండిపడుతున్నారు.. ఈ ఘటన అనంతరం ఆ ఆటోడ్రైవర్‌ మీడియాతో మాట్లాడుతూ.. పెరుగుతున్న పెట్రోల్‌ ధరలతో తనలాంటి ఆటోడ్రైవర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపాడు.. రోజు ఆటో కిరాయి, పెట్రోల్‌ ఖర్చులు పోను తమకు ఏమీ మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

తాళిబొట్టు తీసేయాలా?..గవర్నర్‌ ఆగ్రహం

  ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో వీఆర్వో పరీక్ష కేంద్రం వద్ద అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు.. మహిళలను దారుణంగా అవమానించారు.. వివాహితలు తాళిబొట్టు, మెట్టెలు తీస్తేనే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని ఆంక్షలు విధించారు.. దీంతో చేసేదేమీ లేక మహిళలు తాళిబొట్టు, మెట్టెలు తీసి పరీక్ష రాసేందుకు వెళ్లారు.. ఇది మహిళలను అవమానించేలా ఉందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు ఈ విషయంపై గవర్నర్‌ నరసింహన్‌ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.. ఈ ఘటనకు బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తూనే వివరణ ఇవ్వాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఆదేశించినట్టు సమాచారం.. దీంతో టీఎస్పీఎస్సీ ఒక నివేదికను రాజభవన్‌కు పంపినట్టు తెలుస్తోంది.. ఈ ఘటనకు అయా పరీక్షా కేంద్రాల నిర్వాహకులే బాధ్యులవుతారని నివేదికలో పేర్కొనట్టు తెలిసింది.. ఈ వివాదంపై టీఎస్పీఎస్సీ సెక్రటరీ ఎ.వాణీప్రసాద్‌ వివరణ ఇచ్చారు.. మహిళా అభ్యర్థులు మంగళసూత్రాలు తీసి రావాలనే నిబంధనను తాము విధించలేదని తెలిపారు.. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో మంగళసూత్రాలు తీసి రావాలని సిబ్బంది ఆదేశించినట్లు వార్తలు రాగానే స్పందించామని చెప్పారు.. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు.. ఆ పరీక్షా కేంద్రాన్ని బ్లాక్‌ లిస్టులో పెట్టాలని ఆదేశించామన్నారు.

బిల్డింగ్‌ను దత్తత తీసుకున్న సుమ, రాజీవ్..!!

  ఇటీవల వచ్చిన వరదల కారణంగా కేరళ రాష్ట్రం చిన్నాభిన్నమైన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా కేరళ గవర్నమెంట్ ఓ పిలుపునిచ్చింది.. వరదల కారణంగా బాగా దెబ్బతిన్న ప్రాంతం 'అలప్పీ'లోని ఏదైనా బిల్డింగ్‌ను ఎవరైనా దత్తత తీసుకుని దాన్ని పునరుద్ధరించి అప్పగించవచ్చు.. దీనిపై స్పందించిన సుమ, రాజీవ్ జంట తాము ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్‌ను దత్తత తీసుకుని పునరుద్ధరించనున్నట్టు తెలిపారు.. ‘కేరళ వరద బీభత్సం కారణంగా మీరంతా ముందుకు వచ్చి అక్కడి ప్రజలకు అండగా నిలిచారు.. అలప్పీ కోసం ఓ మంచి క్యాంపెయిన్‌ని అక్కడి వారు చేపట్టారు.. అలప్పీలోని ఏ బిల్డింగ్‌నైనా దత్తత తీసుకుని దాన్ని పునరుద్ధరించవచ్చు.. కాబట్టి మేము ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్‌ను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాం.. ఇది ఎంతో మంది ప్రజలకు నీడనిస్తోంది.. కాబట్టి అది త్వరగా పునరుద్ధరింపబడాలి.. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు సబ్ కలెక్టర్ కృష్ణతేజకు ధన్యవాదాలు.. ఆయనే మాకు ఈ దత్తత గురించి తెలిపారు.. ఇలా దత్తత తీసుకునేందుకు ఎవరైనా సుముఖంగా ఉంటే, వారు కూడా వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం’ అని సుమ, రాజీవ్ జంట తెలిపారు.

రేవంత్ రెడ్డిపై కుట్ర.. రెండు రోజుల్లో అరెస్ట్.!!

  తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి.. తనను జైలుకు పంపేందుకు కేసీఆర్‌, మోదీ కుట్ర చేస్తున్నారని, రెండు మూడు రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసారు.. తాజాగా గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ కమిటీల్లో తనకు పదవి ఇస్తే రాష్ట్రమంతా తిరిగి తెరాసను ఎండగడుతానని, ఆ పార్టీ ఓటమికి కారణమవుతాననే భయం కేసీఆర్‌ను వణికిస్తోందన్నారు.. పదవి రాకముందే పాత కేసులను తిరగదోడి తనను, చంద్రబాబును జైల్లో పెట్టాలని మోదీతో కలిసి కేసీఆర్‌ కుట్ర చేశారన్నారు.. బాబ్లీ కేసులో చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్‌ జారీ చేయడం కుట్రలో భాగమేనన్నారు.. ఓటుకు నోటు కేసులో తన ఇంటిపై ఈడీ, ఐటీ విభాగాలతో దాడులు చేయించి అరెస్టు చేయాలని పథకం రచించారని.. ఈనెల 12న తన, బంధువుల ఇళ్లపై కూడా దాడులకు సిద్ధపడి చివరి క్షణంలో వెనక్కి తగ్గారన్నారు.. ఒక కేసులో అరెస్టయి బెయిల్‌పై వచ్చిన వారిని తిరిగి అదే కేసులో మరోసారి అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని కొందరు అధికారులు చేసిన సూచన మేరకు పునరాలోచనలో పడ్డారన్నారు.. ఎన్నికల వేళ పార్టీశ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, క్రియాశీలకంగా వ్యవహరించే రాజకీయ నాయకులు, పౌరులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని అన్నారు.. తెలంగాణ సమాజం కేసీఆర్‌ నిరంకుశ పాలనను, చట్ట వ్యతిరేక విధానాలను గమనించాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

భార్యభర్తలు ఒకరిపై ఒకరు 67 కేసులు పెట్టుకున్నారు..!!

  భార్యభర్తలు జీవితాంతం కలిసి మెలిసి ఆనందంగా ఉండాలని కోరుకుంటారు.. కానీ ఒక జంట మాత్రం ఒకరిమీద ఒకరు ఏకంగా 67 కేసులు పెట్టుకున్నారు.. బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు 2002లో అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహమైంది.. పెళ్లి తర్వాత వీరిద్దరూ అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.. అయితే ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో సదరు భార్య అమెరికా నుంచి వచ్చి బెంగళూరులో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.. ఇక అప్పటి నుంచి వీరు విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఒకరిపై ఒకరు కేసుల మీద కేసులు పెట్టుకుంటున్నారు.. సదరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తన భార్యపై 58 కేసులు పెట్టగా, భార్య కూడా తన భర్తపై 9 కేసులు పెట్టింది.. తాజాగా వీరి కేసులు సుప్రీంకోర్టుకు చేరాయి.. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, దంపతులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. పెండింగ్‌లో ఉన్న కేసులు పూర్తయ్యేదాకా భార్యాభర్తలు గానీ, వారి కుటుంబసభ్యులు గానీ ఎలాంటి కొత్త కేసులు పెట్టకూడదని కోర్టు ఆదేశించింది.. అంతేగాక, ఆరు నెలల్లోపు పెండింగ్‌ కేసులను పరిష్కరించాలని బెంగళూరు న్యాయస్థానాలకు ఆదేశాలు జారీ చేసింది.

రాజీవ్‌ ఖేల్‌రత్నకు కోహ్లీ నామినేట్‌

  టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పేరును ఈ ఏడాది రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు సిఫార్సు చేశారు.. టీమిండియా కెప్టెన్‌, ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్‌లో నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌ అయిన కోహ్లీ పేరును 2016లో ఖేల్‌రత్న అవార్డు కోసం పరిశీలించారు.. అయితే అప్పుడు సెలక్షన్‌ కమిటీ ఆయన పేరును పక్కనబెట్టింది.. తాజాగా మరోసారి కోహ్లీ పేరును బీసీసీఐ నామినేట్‌ చేసింది.. ఈసారి సెలక్షన్‌ కమిటీ కూడా కోహ్లీని ప్రతిపాదించింది.. ఈ ప్రతిపాదనకు కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌ కూడా ఆమోదం తెలిపితే, ఈ అత్యున్నత పురస్కారం అందుకునే మూడో క్రికెటర్‌గా కోహ్లీ నిలుస్తాడు.. గతంలో సచిన్‌ తెందుల్కర్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ ఖేల్‌రత్న అందుకున్నారు.. అదే విధంగా గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 48కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను పేరును కూడా కోహ్లీ పేరుతో పాటు సెలక్షన్‌ కమిటీ సిఫార్సు చేసింది.

జగన్ పాదయాత్ర.. సీబీఎన్ ఆర్మీ ఫ్లెక్సీల మోత..!!

  నాయకుడు యాత్రలు, పాదయాత్రలు చేసేటప్పుడు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఫ్లెక్సీలు పెట్టడం కామన్.. కానీ వెరైటీగా వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర సందర్భంగా టీడీపీకి చెందిన సీబీఎన్ ఆర్మీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.. ఫ్లెక్సీ లు అంటే అవేదో వెల్కమ్ ఫ్లెక్సీలు అనుకునేరు.. జగన్ మీద వచ్చిన అవినీతి ఆరోపణల ఫ్లెక్సీలు.. ప్రస్తుతం విశాఖ జిల్లాలో కొనసాగుతున్న జగన్ పాదయాత్ర త్వరలో విజయనగరం జిల్లా చేరుకోనుంది.. ఈ నేపధ్యంలో లక్కవరపుకోటలో జగన్‌ అవినీతి, అక్రమాల క్లిప్పింగ్‌లతో పాటు విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరక ముందు వైఎస్‌ జగన్‌, దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిపై చేసిన విమర్శలకు సంబంధించిన పత్రికల క్లిప్పింగ్‌లతో రూపొందించిన భారీ ఫ్లెక్సీలను ఒక వరుసలో ఎగ్జిబిషన్ తరహాలో ఏర్పాటుచేశారు.. ఈ ఫ్లెక్సీల ఎగ్జిబిషన్ ను ఆ మార్గంలో వచ్చిపోయేవారంతా ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.. అంతేకాదు టీడీపీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీబీఎన్‌ ఆర్మీ దళం ఇక ముందు కూడా ఈ తరహా ఫ్లెక్సీల ప్రచార పోరాటం కొనసాగిస్తుందని తెలుస్తోంది.  

ఎంపీ పాదాలు కడిగి ఆ నీటిని తాగిన కార్యకర్త.!!

  అభిమానమందు వెర్రి అభిమానం వేరయ్యా అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తుంటే.. అలాంటి సంఘటనే తాజాగా ఒకటి జరిగింది.. అసలు దీన్ని అభిమానం అనాలో, పిచ్చి అనాలో, వెర్రి అనాలో అర్ధం కావట్లేదు.. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఎంపీని ప్రసన్నం చేసుకునేందుకు ఓ కార్యకర్త ఆయన పాదాలను కడిగి, అనంతరం ఆ నీటిని తాగాడు.. జార్ఖండ్‌లో భాజపా ఎంపీ నిషికాంత్‌ దూబే నిన్న గొడ్డాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.. అయితే సభలో వేదికపై అంతా చూస్తుండగానే ఓ కార్యకర్త ఎంపీ పాదాలను పళ్లెంలో కడిగి, ఏదో తీర్ధం తగినట్టుగా ఆ నీటిని తాగాడు.. అంతేకాదు తలపై కూడా చల్లుకున్నాడు.. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలు కార్యకర్త ప్రవర్తనను చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.. మరోవైపు బీజేపీలో వ్యక్తి పూజ పెరిగిపోతుందనడానికి ఈ ఘటనే నిదర్శనం అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.