తెరాస అభ్యర్థికి అవమానం.. అమ్ముడుపోయావంటూ నిలదీశారు

  తెరాస అధినేత కేసీఆర్ తమ పార్టీకి 100 కి పైగా సీట్లు ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.కానీ ప్రచారానికి వెళ్లిన పార్టీ అభ్యర్థులకు అవమానాలే మిగులుతున్నాయి.ఇప్పటికే పలువురు అభ్యర్థులకు నిరసన గళం వినిపించగా తాజాగా అశ్వారావుపేట తాజా మాజీ ఎమ్మెల్యే  తాటి వెంకటేశ్వర్లుకు ఘోర అవమానం జరిగింది.పార్టీ మారి అమ్ముడుపోయావంటూ నిలదీశారు. తాటి వెంకటేశ్వర్లు ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లాయిగూడెం వెళ్లారు.గ్రామంలో తమకే ఓట్లు వేయాలని ప్రచారం చేస్తున్న తాటి వెంకటేశ్వర్లును గ్రామానికి చెందిన స్థానికులు, వామపక్ష పార్టీకి చెందిన కార్యకర్తలు ‘తమకు పోడు భూములకు పట్టాలివ్వలేదని, వైఎస్సాఆర్‌సీపీ నుంచి పోటీ చేసి గెలిచి అమ్ముడుపోయి పార్టీ మారావని, నీవు మాకేమి చేశావంటూ’ నిలదీశారు. వీరిలో మహిళలు సైతం ఉన్నారు. అయితే... తాటి వెంకటేశ్వర్లు ఓపిగ్గా సమాధానం చెప్పబోయినప్పటికీ ఆయన మాట వినకుండా నిగ్గదీశారు. ఈ సందర్భంగా తెరాస కార్యకర్తలు, గ్రామానికి చెందిన వామపక్ష కార్యకర్తల మద్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.

రక్తమోడిన జగన్..కత్తికేది రక్తం

  విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జగన్ పై అతని అభిమానే కత్తితో దాడి చేసిన సంఘటన తెలిసిందే.దాడిలో జగన్‌ ఎడమ భుజానికి గాయం అవ్వగా ప్రధమ చికిత్స అందించారు. ఎయిర్ పోర్ట్ లోని అపోలో వైద్యులు.'0.5 సెంటీమీటరు పొడవు, 0.5 సెం.మీ లోతుతో గాయమైంది.ఆయింట్‌మెంట్‌ పూసి రక్తం కారకుండా డ్రసింగ్‌ చేశాం.. నొప్పి తగ్గడానికి యాంటి బయోటిక్స్‌ వాడమని సలహా ఇచ్చాం’ అని విమానాశ్రయంలో చికిత్స  చేసిన అపోలో డాక్టరు లలితకుమారి రిపోర్టు ఇచ్చారు.అయితే... హైదరాబాద్‌లో జగన్‌కు చికిత్స చేసిన సిటీ న్యూరో సెంటర్‌ వైద్యులేమో దాదాపు 3.5 సెంటీమీటర్ల మేర కండరం లోపలికి కత్తి దిగిందని వెల్లడించారు.ఆపరేషన్‌ చేసి తొమ్మిది వరకు కుట్లు వేశామని చెప్పారు.దీంతో విశాఖలో అర సెంటీమీటరు ఉన్న గాయపు లోతు... హైదరాబాద్‌ చేరుకునే సరికి మూడు సెంటీమీటర్లు ఎలా అయ్యిందంటూ చర్చ మొదలైంది.అయితే... కత్తికి విష రసాయనాలు పూశారేమో అని నిర్ధారణ చేసుకునేందుకు వీలుగా శాంపిల్స్‌ను లోతు నుంచి సేకరించాల్సి వచ్చిందని, అందుకే గాయం పెద్దదైందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.     ‘విమానాశ్రయంలో కేంద్ర ప్రభుత్వ బలగాల భద్రత ఉంటుంది.. దాడి జరిగిన వెంటనే వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి.. ఇక్కడ మాత్రం సాయంత్రం 4.30 గంటలకు ఫిర్యాదు ఇచ్చారు.. అప్పటికీ దాడికి ఉపయోగించిన చిన్న కత్తిని స్వాధీనం చేయలేదు. కొంత సమయం దగ్గర పెట్టుకుని తర్వాత తెచ్చి ఇచ్చారు. దీనికి ఫొరెన్సిక్‌ పరీక్ష ఎలా సాధ్యమవుతుంది?’ అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ‘జరిగిన దాడి మెడికో లీగల్‌ కేసు. కేసున్నా, లేకున్నా సంఘటన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలి. జగన్‌ మాత్రం బాధ్యతా రాహిత్యంగా విమానంలో హైదరాబాద్‌కు వెళ్లిపోయారు’ అని చంద్రబాబు తెలిపారు.ఈ నాటకీయ పరిణామాలు చూస్తుంటే అసలు ఏం జరుగుతుందో అర్ధం కానీ పరిస్థితి.పోలీసులకు పిర్యాదులో కనపడుతున్న జాప్యం,కత్తిని స్వాధీనం చేయటంలో నిర్లక్ష్యం అంతేకాకుండా కత్తితో దాడి చేశాడు సరే.. మరి కత్తికి రక్తమెక్కడ అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.వీరి అనుమానానికి తగ్గట్టుగానే కత్తి అయితే పదునుగానే ఉంది కానీ కత్తికి మాత్రం రక్తమెక్కడా కనపడట్లేదు.మీరు కూడా ఈ కత్తిని గమనిస్తే మీకూ అలాంటి సందేహమే కలగొచ్చు.  

కత్తి పోటుకు మూడు కుట్లు.. క్షేమమే కానీ విశ్రాంతి అవసరం

  విశాఖ విమానాశ్రయంలో వైకాపా అధినేత జగన్‌పై దాడి తీవ్ర కలకలం రేపింది. విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో ఉండగా.. ఆయనతో సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చిన ఓ యువకుడు కత్తితో దాడి చేయడంతో జగన్‌ భుజానికి గాయమైంది. దీంతో తొలుత విశాఖలోనే ప్రథమ చికిత్స చేయించుకున్నజగన్‌ అనంతరం హైదరాబాద్‌ చేరుకున్నారు.ప్రస్తుతం జగన్ కు సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.ఆయన ఎడమ భుజానికి వైద్యులు మూడు కుట్లు వేశారు. 24 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాలని జగన్‌కు వైద్యులు సూచించారు. జగన్‌ వెంట ఆయన సతీమణి భారతి, బంధువులు ఉన్నారు. ఆస్పత్రి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.తన ఆరోగ్య సమాచారంపై జగన్ ట్వీట్‌ చేశారు."తాను దేవుడి దయవల్ల క్షేమంగానే ఉన్నానని, ప్రజల ఆశీర్వాదమే తనను రక్షిస్తోందన్నారు. ఇలాంటి చర్యలను తనను భయపెట్టలేవని, రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు మరింత శక్తిమంతుడిని చేస్తాయంటూ" ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.  

జగన్ కి కత్తి దింపిన అభిమాని.. సాక్ష్యం ఇదే

  వైజాగ్ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ వద్దకు శ్రీనివాస్ అనే వ్యక్తి.. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి కోడిపందాలలో ఉపయోగించే కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో జగన్ భుజానికి స్వల్ప గాయమైంది. ఈ దాడికి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమని కొందరు.. ఈ దాడి వెనుక కుట్ర ఉందని మరి కొందరు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరో కాదు.. జగన్ వీరాభిమాని అని తెలుస్తోంది. ఈ విషయాన్ని నిందితుడి సోదరుడే స్వయంగా మీడియాతో చెప్పారు. నిందితుడు శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు మీడియాతో మాట్లాడుతూ.. తన తమ్ముడు శ్రీనివాస్ చాలా మంచివాడని.. అతను జగన్ కి వీరాభిమాని అని అన్నారు. అంతేకాదు ఈ విషయం ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు అన్నారు. తన తమ్ముడు ఎలాంటి గొడవలకు వెళ్ళడు.. అలాంటిది తను అభిమానించే జగన్ పై దాడి చేసాడంటే నమ్మలేకపోతున్నామని చెప్పారు. అసలు ఈ విషయంపై ఎలా స్పదించాలో అర్ధంకావట్లేదు అంటూ నిందితుడి సోదరుడు ఆవేదన వ్యక్తం చేసారు. అంతేకాకుండా గతంలో నిందితుడు  2018 న్యూ ఇయర్ మరియు పొంగల్ శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఫోటోని కూడా చూపించారు. ఈ ఫొటోలో ఒకవైపు నిందితుడి ఫోటో.. మరోవైపు జగన్ ఫోటో ఉన్నాయి. దీంతో జగన్ అభిమాని జగన్ పై దాడి చేయడానికి కారణం ఏంటంటూ అందరూ ఆలోచనలో పడ్డారు.  

జగన్ త్వరగా కోలుకోవాలని కోరుకున్న కేటీఆర్, ఉత్తమ్

  వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైయస్ జగన్‌‌పై జరిగిన దాడిని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.‘ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధ్యులను కఠినంగా శిక్షించాలి. జగన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.     టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కూడా దాడిపై విచారం వ్యక్తం చేశారు. ‘వైజాగ్‌ ఎయిర్‌పోర్టులో జగన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై తక్షణమే దర్యాప్తు జరగాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసాత్మక ఘటనలకు చోటు లేదు. జగన్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని ఉత్తమ్‌ ట్వీట్‌ చేశారు.  

జగన్‌పై దాడిని ఖండించిన కేంద్ర,రాష్ట్ర మంత్రులు

  వైజాగ్ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్‌పై కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ అనే ఎయిర్ పోర్టు క్యాంటీన్ సిబ్బంది జగన్‌పై కోడిపందాలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ ఎడమ భుజానికి స్వల్ప గాయమైంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు.కాగా జగన్ పై దాడిని ఏపీ మంత్రి నారా లోకేష్‌,కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు ఖండించారు.ట్విట్టర్ వేదిక తమ స్పందన తెలియజేసారు.      ‘జగన్‌పై దాడి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో లోతుగా దర్యాప్తు చేపట్టాలని సీఐఎస్‌ఎఫ్‌ సహా అన్ని దర్యాప్తు సంస్థలను ఆదేశించాం. ఇలాంటి పిరికిపంద దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. నిందితులకు శిక్ష పడుతుంది’ అని సురేశ్‌ ప్రభు ట్వీట్‌ చేశారు.  ‘ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆధునిక ప్రపంచంలో ఇలాంటి పిరికిపంద చర్యలకు స్థానం ఉండదు’ అని లోకేష్‌ ట్వీట్‌ చేశారు.  

జగన్ పై ఎటాక్.. పవన్ కళ్యాణ్ రియాక్షన్

  వైజాగ్ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ వద్దకు శ్రీనివాసరావు అనే వ్యక్తి.. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి కోడిపందాలలో ఉపయోగించే కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో జగన్ భుజానికి స్వల్ప గాయమైంది. అయితే ఈ ఘటనపై ఇప్పటికే పలువురు నేతలు స్పందించారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. జ‌గ‌న్‌ పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం అమానుష‌మ‌ని ప‌వ‌న్ అన్నారు. ప్ర‌జాస్వామ్యంలో ఇటువంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌రాద‌ని జ‌న‌సేన బ‌లంగా విశ్వ‌సిస్తుంద‌న్నారు. ఈ హ‌త్యాయ‌త్నాన్ని ప్ర‌జాస్వామ్య వాదులంద‌రూ ముక్త కంఠంతో ఖ‌డించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌పై జ‌రిగిన ఈ దాడిని తీవ్ర‌మైనదిగా జ‌న‌సేన భావిస్తోంది. మ‌రోసారి ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిన బాధ్య‌త కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఉంద‌ని అన్నారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ చేసి కుట్ర‌దారుల‌ను శిక్షించాల‌ని కోరారు. గాయం నుంచి జ‌గ‌న్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని పవన్ ఆకాంక్షించారు.

జగన్‌పై దాడి పబ్లిసిటీ కోసమే

  విశాఖ విమానాశ్రయంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి జరగగా భుజానికి గాయమైంది.ఈ దాడిని పలువురు రాజకీయ ప్రముఖులు ఖండించారు.కానీ వైసీపీ పార్టీ మాత్రం జగన్ కు భద్రత కల్పించటంలో ప్రభుత్వం విఫలం అయిందని ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతుంది.అయితే ఏపీ ప్రభుత్వం వైసీపీ వాదనను తీవ్రంగా ఖండించింది. జగన్‌పై దాడిని ఖండిస్తున్నామని, ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని పేర్కొంది.కానీ ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ పబ్లిసిటీ కోసమే అతడు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించారు.దాడిపై మంగళగిరిలో డీజీపీ మీడియాతో మాట్లాడుతూ... నిందితుడు దాడికి ఉపయోగించిన కత్తి విమానాశ్రయం లోపలికి ఎలా వచ్చిందనే విషయంపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయంలో భద్రత మొత్తం సీఐఎస్‌ఎఫ్‌ పర్యవేక్షణలోనే ఉంటుందని,నిందితుడు శ్రీనివాసరావు ఏడాదిగా విమానాశ్రయంలోని  రెస్టారెంట్‌లో పనిచేస్తున్నట్లు తెలిసిందని వివరించారు.నిందితుడి వద్ద 10 పేజీల లేఖ ఉందని, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఆ లేఖను రాష్ట్ర పోలీసులకు అందించారని చెప్పారు.ఆ లేఖపై విచారణ జరిపి వివరాలను త్వరలోనే మీడియాకు వెల్లడిస్తామని ఆర్పీ ఠాకూర్‌ తెలిపారు.

జగన్‌పై దాడి..డీజీపీకి గవర్నర్ ఫోన్

  ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే.ఈ ఘటనపై గవర్నర్‌ నరసింహన్‌ ఆరా తీశారు.ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కు ఫోన్‌ చేసిన గవర్నర్‌ జగన్ పై జరిగిన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఘటనకు సంబంధించి వెంటనే తనకు పూర్తిస్థాయి నివేదిక పంపించాలని గవర్నర్ ఆదేశించారు.కాగా ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, యార్లగడ్డ వెంకట్రావులు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి బయలుదేరారు. డీజీపీని కలిసి జగన్‌పై దాడి చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేయనున్నారు.

జగన్‌పై కత్తితో దాడి.. ఖండించిన ఏపీ హోం మంత్రి

  వైజాగ్ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై శ్రీనివాసరావు అనే వ్యక్తి.. సెల్ఫీ తీసుకుంటానంటూ జగన్ వద్దకు వచ్చి కోడిపందాలలో ఉపయోగించే కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ హోం మంత్రి చినరాజప్ప అన్నారు. ఎయిర్ పోర్టులో వెయిటర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు అనే వ్యక్తి సెల్ఫీ తీసుకుంటానంటూ జగన్‌ వద్దకు వచ్చి దాడికి పాల్పడ్డాడని, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని ఆయన వివరించారు. అసలు కత్తి ఎయిర్ పోర్టులోకి ఎలా వచ్చిందనే విషయంపై విచారణ జరుగుతోందని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని తెలిపారు. నిందితుడిని తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని చెప్పారు. కొద్దిసేపట్లో ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని చినరాజప్ప తెలిపారు.

జగన్‌పై కత్తితో దాడి.. కత్తికి విషం పూశారంట్టున్న రోజా

  వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగింది. 294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్‌ జగన్‌ గురువారం హైదరాబాద్‌ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వీఐపీ లాంజ్‌లో ఉండగా.. శ్రీనివాస్‌ అనే వెయిటర్‌.. సెల్ఫీ తీసుకుంటానంటూ వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చారు. అతను వస్తూనే.. వైఎస్‌ జగన్‌పై కోళ్ల పందెలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు.ఈ ఘటనలో జగన్‌ ఎడమ భుజానికి స్వల్ప గాయమైంది. విమానాశ్రయ భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.ఈ ఘటన జరిగిన వెంటనే విమానాశ్రయంలోని ప్రవేశించే మార్గాన్ని పోలీసులు మూసివేశారు.     జగన్‌కి గాయం కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌ బయలుదేరారు. జగన్‌పై జరిగిన దాడి గురించి ఆ పార్టీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజా హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... జగన్ ప్రాణాలకు ప్రాణహానీ ఉందన్నారు. అంతే కాకుండా దాడికి ఉపయోగించిన కత్తికి విషం పూశారేమోనని రోజా అభిప్రాయపడ్డారు. వైఎస్‌ జగన్‌కి ఏం జరిగినా ఊరుకోబోమని రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబును తీవ్రంగా హెచ్చరిస్తున్నామన్నారు. దాడి చేసిన వ్యక్తి వెనక ఎవరున్నారో విచారణ చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలన్నారు. లేకపోతే చాలా తీవ్ర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.    

వైఎస్ జగన్‌పై కత్తితో దాడి..భుజానికి గాయం

  అక్రమాస్తుల కేసులో నాంపల్లి కోర్టు లో ప్రతి శుక్రవారం ప్రతి పక్ష నేత వైఎస్ జగన్‌ విచారణకు హాజరవుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపధ్యంలో రేపు కోర్టుకు హాజరవాల్సి ఉండగా విజయనగరంలో పాదయాత్ర ముగించుకొని హైదరాబాద్‌ వచ్చేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన జగన్‌పై దాడి జరిగింది.విమానం బయలుదేరేందుకు సమయం ఉన్నందున వీఐపీ లాంజ్‌లో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వెయిటర్‌ సెల్ఫీ తీసుకుంటానంటూ జగన్ వద్దకు వచ్చి కోడి పందేలలో ఉపయోగించే కత్తితో దాడి చేశాడు.ఈ ఘటనతో విమానాశ్రయ సిబ్బంది షాక్‌కు గురయ్యారు. అయితే వెంటనే తేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించి నిందితుడిని వారికి అప్పగించారు.ఈ దాడిలో జగన్‌ భుజానికి గాయమైంది.ప్రాథమిక చికిత్స అనంతరం జగన్‌ హైదరాబాద్‌ బయల్దేరి వెళ్లారు.ఈ ఘటన నేపథ్యంలో స్థానిక ఏసీపీ హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకుని సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన నిందితుడి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

పాపం వారిద్దరి పరిస్థితి ఏంటి కేసీఆర్?

  కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే తొలివిడతగా ఒకేసారి 105 అభ్యర్థులను ప్రకటించారు. తరువాత మరో ఇద్దరు అభ్యర్థులను కూడా ప్రకటించారు. కానీ ఇద్దరు సీనియర్ నేతల విషయంలో మాత్రం కేసీఆర్ వైఖరి ఏంటో ఎవరికీ అర్థంకావడంలేదు. ఆ ఇద్దరు సీనియర్ నేతలు ఎవరో కాదు.. ఒకరు కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి.. మరొకరు ఇటీవలే కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్‌. ఈ ఇద్దరు నేతలకి టిక్కెట్ విషయంలో ఇంతవరకు స్పష్టత రాలేదు. అసలు వీరికి ఏ నియోజకవర్గాల టిక్కెట్ దక్కుతాయి అంటూ అనుచరులు ఆందోళన చెందుతున్నారు. నాయిని నర్సింహారెడ్డి తెరాస అధిష్టానం ముందు రెండు ఆప్షన్లు పెట్టారు. ముషీరాబాద్‌ నుంచి తన అల్లుడు, కార్పొరేటర్‌ శ్రీనివా‌స్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వాలని.. అది వీలు కాకపోతే తనకు టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే, అధిష్ఠానం ఈ సీటు విషయంలో ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో నాయినితో పాటు ఆయన అనుచరులు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అని ఎదురు చూస్తున్నారు. ఇక దానం నాగేందర్‌ విషయానికొస్తే.. మొదట్లో తనకు ఖైరాతాబాద్‌ టిక్కెట్ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తర్వాత అధిష్ఠానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు. కానీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయం ఇప్పటి వరకు తేలలేదు. ఖైరతాబాద్‌ నుంచి ముగ్గురు టిక్కెట్ రేసులో ఉన్న నేపథ్యంలోనే ఇక్కడి అభ్యర్థిని ప్రకటించకుండా తెరాస అధిష్టానం పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు దానంను గోషామహల్‌ నుంచి బరిలోకి దింపుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ విషయంలోనూ స్పష్టత లేదు. ఒకప్పుడు హైదరాబాద్ నగర రాజకీయాల్లో చక్రం తిప్పిన దానం ఇప్పుడు పార్టీ అధినేత ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు అంటూ దానం మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు. పాపం ఈ ఇద్దరు సీనియర్ నేతలకు కేసీఆర్ ఎప్పుడు స్పష్టత ఇస్తారో ఏంటో.

నిరోద్యుగులకు శుభవార్త.. డీఎస్సీ షెడ్యూల్ విడుదల

  ఏపీలోని నిరోద్యుగులకు శుభవార్త. డీఎస్సీ షెడ్యూల్‌‌ను తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. డీఎస్సీ కొంచెం ఆలస్యమైన విషయం వాస్తవమే అని అన్నారు. అయితే ఎక్కువమందికి ప్రయోజనం కలిగేలా డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. రేపు (అక్టోబరు 26న) డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. టెట్ కమ్ టీఆర్‌టీ పరీక్షతో ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ చేపడుతున్నామని స్పష్టం చేశారు.  నవంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడించారు. అలాగే డీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థుల వయో పరిమితి రెండేళ్లకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల వయో పరిమితి 49 ఏళ్లకు, జనరల్‌ కేటగిరీలో 42 నుంచి 44 ఏళ్లకు పొడిగించారు. మొత్తం 7,676 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలకానుంది. డీఎస్సీ షెడ్యూల్ వివరాలు: అక్టోబరు 26న నోటిఫికేషన్‌ విడుదల నవంబరు 1 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ నవంబరు 17న నుంచి ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్ట్‌లు నవంబరు 29 నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు డిసెంబర్‌ 6, 10 తేదీల్లో స్కూలు అసిస్టెంట్‌(నాన్‌ లాంగ్వేజెస్‌) రాత పరీక్ష డిసెంబర్‌ 11 న స్కూలు అసిస్టెంట్‌(లాంగ్వేజెస్‌) రాత పరీక్ష డిసెంబర్‌ 12, 13న పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ రాత పరీక్ష డిసెంబర్‌ 14, 26న టీచర్స్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌, ప్రిన్సిపల్స్‌ రాత పరీక్ష డిసెంబర్‌ 17 పీఈటీ, మ్యూజిట్‌, క్రాప్ట్‌ అండ్‌ ఆర్ట్స్‌, డ్రాయింగ్ రాత పరీక్ష డిసెంబర్‌ 27న లాంగ్వేజ్‌ పండిట్స్‌ రాతపరీక్ష డిసెంబర్‌ 28 నుంచి 2019 జనవరి 2 వరకు సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ రాతపరీక్ష

పళనిస్వామి గెలుపు దినకరన్ కు చేదు వార్త

  దివంగత సీఎం జయలలిత మరణం తరువాత తమిళనాడు రాజకీయాలు ఊహించని రీతిలో మలుపు తిరిగాయి.పళనిస్వామి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాగా ఆ పార్టీ నేత,శశికళ అనుచరుడు టీటీవీ దినకరన్ నేతృత్వంలో 18 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే పార్టీ నుంచి బయటకు వచ్చారు.పళనిస్వామికి ఇచ్చిన మద్దతును వెనక్కు తీసుకుంటున్నట్టు గవర్నర్‌కు లేఖలు సమర్పించారు.దీంతో స్పీకర్ పార్టీ విప్‌కు వ్యతిరేకంగా వ్యవహరించారంటూ వారిపై అన్వర్షత వేటు వేశారు.దీంతో వారు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.ఈ అంశంపై జూన్‌ 14న ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విభిన్న తీర్పులు వెలువరించింది. దీంతో దీనిపై తుది తీర్పును మూడో న్యాయమూర్తికి అప్పగించారు. జులై 21 నుంచి కేసు విచారణ జరిపిన మూడో న్యాయమూర్తి సత్యనారాయణ ఆగస్టు 31వ తేదీన తీర్పును వాయిదా వేశారు. అప్పటి నుంచి తీర్పుపై పలు రకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు సరైనదేనని న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించారు. గతంలో పళని ప్రభుత్వానికి మద్దతుగా కూవత్తూర్‌లోని రిసార్ట్స్‌లో చిన్నమ్మ మద్దతు ఎమ్మెల్యేలు బసచేసిన తరహాలనే ప్రస్తుతం తిరునెల్వేలి జిల్లా కుట్రాలంలోని రిసార్ట్స్‌లో అనర్హత ఎమ్మెల్యేలు బస చేశారు.తీర్పు అనుకూలంగా వస్తే ప్రభుత్వాన్ని కూలదోసేందుకు దినకరన్‌ వర్గం ప్రయత్నించనున్నట్లు జరిగిన ప్రచారంతో ప్రభుత్వమూ అప్రమత్తమైంది.తాజాగా హైకోర్టు తీర్పుతో పళనిస్వామి సర్కారు ఊపిరి పీల్చుకుంది.వచ్చే ఆరు నెలల్లో ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పుపై దినకరన్ స్పందించారు.ఉన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగలలేదని... దీన్నొక అనుభవంగా పరిగణిస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేయనున్నట్టు తెలిపారు. తీర్పు అనుకూలంగా వస్తుందన్న నమ్మకంతోనే రిసార్ట్స్ లో ఉంచినట్టు చెప్పారు. 18 మంది ఎమ్మెల్యేలతో భేటీ కానున్నట్టు చెప్పారు.

ఫోన్ టాపింగ్ ఆరోపణలపై కేటీఆర్‌ సీరియస్

  రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షలు మధ్య మాటల యుద్ధం కొత్తేమి కాదు.ఇక ఎన్నికలు సమీపిస్తున్నాయి అంటే ఆ మాటల తూటాలు తారాస్థాయికి చేరుతాయి.తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి కేటీఆర్‌ పరస్పర విమర్శలు, వ్యంగస్త్రాలు సంధించుకున్నారు.ఉత్తమ్ కుమార్ గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల వేళ.. మంత్రి కేటీఆర్‌ బంధువు ప్రభాకర్‌, ఆయన కింది ఉద్యోగులు తనతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని ఆరోపించారు. మరో బంధువు రాధాకృష్ణారావుకు ప్రతిపక్ష నేతల వాహనాలు తనిఖీ చేసే పని అప్పగించారని అన్నారు.ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలన్న నిబంధనలను అధికారులు ఉల్లంఘిస్తున్నారని, ఆ ఇద్దరు అధికారులపై ఎన్నికల కమిషన్‌ కి ఫిర్యాదు చేస్తామన్నారు. ఉత్తమ్ కుమార్ చేసిన ఫోన్ టాపింగ్ ఆరోపణలపై కేటీఆర్‌ సీరియస్ అయ్యారు.ట్విట్టర్ వేదిక ఉత్తమ్ కుమార్ కు కౌంటర్ ఇచ్చారు.ఉత్తమ్‌కుమార్‌ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నేతలు రూ.3కోట్ల నగదు కారులో తరలిస్తూ పట్టుబడ్డారని,ఉత్తమ్ అందుకే ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారని అన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ పోలీసులు శాంతిభద్రతలను పరిరక్షిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని... ఇలాంటి అంశాలను రాజకీయం చేసి అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని కేటీఆర్ ట్వీట్ చేశారు.  

ఉత్తమ్‌ దంపతులకు నిరాశ తప్పదా?

  ఒకే కుటుంబానికి చెందిన పలువురు శాసనసభ ఎన్నికల బరిలో ఉండటం సర్వసాధారణం.కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది.‘కుటుంబానికి ఒకే సీటు’ అనే కాంగ్రెస్‌ సూత్రం,మహాకూటమి ఏర్పాటు ఇప్పుడు ఉత్తమ్ దంపతులకు దడ పుట్టిస్తున్నాయి.భార్యాభర్తలుగా ఏకకాలంలో అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించిన రికార్డు మాత్రం టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పద్మావతి దంపతులది. ఉత్తమ్‌.. హుజూర్‌నగర్‌ నుంచి, ఆయన భార్య పద్మావతి.. కోదాడ నుంచి గెలిచి జంటగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.కానీ కాంగ్రెస్‌ అధిష్ఠానం కుటుంబసభ్యుల్లో ఒకరికే టికెట్‌ ఇవ్వాలనే నిబంధన విషయంలో కఠినంగా ఉండటంతో మళ్ళీ జంటగా అసెంబ్లీ మెట్లు ఎక్కే అవకాశం లేనట్లే కనిపిస్తుంది.దీనికితోడు వచ్చే ఎన్నికల్లో టీడీపీ, టీజేఎస్‌, సీపీఐలతో కలిసి కాంగ్రెస్‌ బరిలోకి దిగుతోంది.కోదాడ స్థానాన్ని తమకు ఇవ్వాల్సిందేనని టీడీపీ పట్టుబడుతోంది. 1978 నుంచి ఇక్కడ టీడీపీ 4 సార్లు గెలిచింది. 2014 ఎన్నికల్లో టీడీపీలో బలమైన నాయకుల్లో ఒకరైన బొల్లం మల్లయ్యయాదవ్‌పై పద్మావతి 13,374 ఓట్లతో విజయం సాధించారు. ఈసారి కూడా కోదాడ టికెట్‌ కావాల్సిందేనని టీడీపీ పట్టు పడుతున్నట్లు తెలుస్తుంది.దీంతో ఉత్తమ్ దంపతులకు నిరాశ తప్పదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెదేపా నేత దేవేందర్‌గౌడ్‌ బంధువుల కంపెనీలో ఐటీ దాడులు

  ఏపీలో వరుస ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.కొన్ని రోజుల క్రితం తెదేపా నేతల నివాసాలు,కార్యాలయాల్లో ఐటీ దాడులు జరిగినది తెలిసిందే.తాజాగా విశాఖలో ఐటీ దాడులు జరుగుతున్నాయి.తెదేపా సీనియర్ నేత దేవేందర్ గౌడ్ బందువులకు చెందిన కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.వివిధ రాష్ట్రాల్లో పని చేస్తున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు భారీ సంఖ్యలో విశాఖ చేరుకున్నారు.ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి దాడులు చేస్తున్నారు.అధికారులు బస కోసం హోటళ్లకి వెళ్లినపుడు గుర్తింపు కార్డులు చూపాలని సిబ్బంది అడగడంతో విషయం బయటకు వచ్చింది. విశాఖలోని ఎంవీపీ కాలనీలోని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి సుమారు 50 వాహనాల్లో అధికారులు నగరంలోని వివిధ ప్రాంతాలకు తనిఖీల నిమిత్తం బయలుదేరి వెళ్లారు. దువ్వాడ సెజ్‌లోని పలు గోదాముల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. దీంతో పాటు లాజిస్టిక్‌ రంగంలో భారీ కంపెనీగా ఉన్న టీజీఐలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. ఈ సంస్థ తెలంగాణ తెదేపా నేత దేవేందర్‌గౌడ్‌ బంధువులకు చెందినదిగా తెలుస్తోంది. ఎగుమతులకు సంబంధించి ఆదాయాల్లో అవకతవకలకు పాల్పడినట్లు సమాచారం రావడంతో ఐటీ అధికారులు ఈ సంస్థపై దృష్టి సారించినట్లు సమాచారం.ఆర్థికంగా, పారిశ్రామికంగా విస్తృత స్థాయిలో అభివృద్ధి చెందిన విశాఖ నగరంలో కొందరు పన్ను సరిగా చెల్లించడం లేదన్న అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఐటీ శాఖాధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీ దాడుల ప్రచారంతో వ్యాపార,రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల గుండెల్లో గుబులు మొదలైంది.