విశాఖ మన్యంలో మావోల కదలికలు
అరకు ఎమ్మెల్యే కిడారి,మాజీ ఎమ్మెల్యే సోమలను మావోలు హత్య చేసిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే.అయితే ఆ హత్యలపై స్పందించిన మావోలు "మన్యంలో బాక్సైట్ తవ్వకాలు ఆగిపోయాయని, కానీ ఎమ్మెల్యే కిడారి లేటరైట్, గ్రానైట్, రంగురాళ్ల క్వారీలను నిర్వహించారు. ఆ క్వారీలను నిలిపివేయాలంటూ ఆయనకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు.ఈ సమస్యపై పోరాడుతున్న స్థానికులు, సంఘాలపై ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడింది. ఈ అణచివేతకు ప్రతిఘటనగానే ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలపై చర్య తీసుకొన్నాం’’ అని ప్రకటన విడుదల చేశారు.మరోమారు విశాఖ మన్యంలో మావోల పేరిట కరపత్రాలు, బ్యానర్లు కలకలం సృష్టిస్తున్నాయి.గూడెం కొత్తవీధి మండలం ఆర్‌వీ నగర్ వద్ద తెల్లవారుజామున వీటిని పడేసినట్లు సమాచారం.కాఫీ తోటలపై పూర్తి హక్కు గిరిజనులదే అని, కాఫీ బోర్డును తరిమికొట్టాలని,చట్టాల ప్రకారం అడవిపై హక్కు ఆదివాసీలదే అయినప్పటికీ అంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ది సంస్థ(ఏపీఎఫ్‌డీసీ) శ్రమ దోపిడీకి పాల్పడుతోందని మావోయిస్టులు ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాలు చేపట్టి గిరిజనుల బతుకులను నాశనం చేయడానికి పూనుకున్న అధికార తెదేపా, భాజపా నాయకులను మన్యం నుంచి తరిమి కొట్టాలని మావోలు ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు.ఈ ఘటనతో మన్యంలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది.