పళనిస్వామి గెలుపు దినకరన్ కు చేదు వార్త
posted on Oct 25, 2018 @ 12:09PM
దివంగత సీఎం జయలలిత మరణం తరువాత తమిళనాడు రాజకీయాలు ఊహించని రీతిలో మలుపు తిరిగాయి.పళనిస్వామి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాగా ఆ పార్టీ నేత,శశికళ అనుచరుడు టీటీవీ దినకరన్ నేతృత్వంలో 18 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే పార్టీ నుంచి బయటకు వచ్చారు.పళనిస్వామికి ఇచ్చిన మద్దతును వెనక్కు తీసుకుంటున్నట్టు గవర్నర్‌కు లేఖలు సమర్పించారు.దీంతో స్పీకర్ పార్టీ విప్‌కు వ్యతిరేకంగా వ్యవహరించారంటూ వారిపై అన్వర్షత వేటు వేశారు.దీంతో వారు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.ఈ అంశంపై జూన్ 14న ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విభిన్న తీర్పులు వెలువరించింది. దీంతో దీనిపై తుది తీర్పును మూడో న్యాయమూర్తికి అప్పగించారు. జులై 21 నుంచి కేసు విచారణ జరిపిన మూడో న్యాయమూర్తి సత్యనారాయణ ఆగస్టు 31వ తేదీన తీర్పును వాయిదా వేశారు. అప్పటి నుంచి తీర్పుపై పలు రకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు సరైనదేనని న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించారు.
గతంలో పళని ప్రభుత్వానికి మద్దతుగా కూవత్తూర్‌లోని రిసార్ట్స్‌లో చిన్నమ్మ మద్దతు ఎమ్మెల్యేలు బసచేసిన తరహాలనే ప్రస్తుతం తిరునెల్వేలి జిల్లా కుట్రాలంలోని రిసార్ట్స్‌లో అనర్హత ఎమ్మెల్యేలు బస చేశారు.తీర్పు అనుకూలంగా వస్తే ప్రభుత్వాన్ని కూలదోసేందుకు దినకరన్ వర్గం ప్రయత్నించనున్నట్లు జరిగిన ప్రచారంతో ప్రభుత్వమూ అప్రమత్తమైంది.తాజాగా హైకోర్టు తీర్పుతో పళనిస్వామి సర్కారు ఊపిరి పీల్చుకుంది.వచ్చే ఆరు నెలల్లో ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పుపై దినకరన్ స్పందించారు.ఉన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగలలేదని... దీన్నొక అనుభవంగా పరిగణిస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేయనున్నట్టు తెలిపారు. తీర్పు అనుకూలంగా వస్తుందన్న నమ్మకంతోనే రిసార్ట్స్ లో ఉంచినట్టు చెప్పారు. 18 మంది ఎమ్మెల్యేలతో భేటీ కానున్నట్టు చెప్పారు.