గవర్నర్ ను కలవనున్న పవన్

  తిత్లీ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయింది.ముందుగా అప్రమత్తం అవ్వటంతో పెద్దగా ప్రాణ నష్టం అయితే జరగలేదుగాని ఆయా ప్రాంతాల్లోని వారు సర్వం కోల్పోయి నిర్వాసితులయ్యారు.తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటించి భాదితులను పరామర్శించారు.పర్యటన సందర్బంగా ప్రభుత్వం భాదితులను ఆదుకోవడంలో విఫలం అయిందని విమర్శలు గుప్పించింది తెలిసిందే.తాజాగా పవన్ కళ్యాణ్ తిత్లీ ప్రభావంపై విన్నవించేందుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్ నరసింహన్‌తో పవన్ భేటీ కానున్నారు.తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో నెలకొన్న పరిస్థితులు ,భాదితుల కష్టాలను గవర్నర్ కు వివరించనున్నారు.వీలైనంత త్వరగా బాధితులను ఆదుకోవాలని గవర్నర్‌ను కోరనున్నారు.ఇదిలా ఉంటే ప్రభుత్వం చేప్పట్టిన చర్యలను గవర్నర్ ప్రశంసించారు.ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతని సంతరించుకుంది.  

ఎన్నికల వేళ బీజేపీ కార్యాలయం కళకళ

  ఎన్నికల వస్తున్నాయంటే ఆశావహులు పార్టీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటారు.తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని కార్యాలయం,బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి దత్తాత్రేయ నివాసం కూడా ఆశావహుల హడావుడితో కళకళలాడుతూ కనిపిస్తున్నాయి.బీజేపీ తెలంగాణలో 119 చోట్ల పోటీ చేస్తున్న నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల నుంచి టికెట్ల కోసం చాలామంది పోటీ పడుతున్నారు.దీంతో రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ ఆశావహులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ ను కలిసేందుకు ముషీరాబాద్‌లోని క్యాంపు కార్యాలయానికి వస్తుండటంతో హడావిడి నెలకొంది.లక్ష్మణ్‌ను కలిసి తమ బయోడేను అందచేసి,ఫలానా నియోజకవర్గం నుంచి టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. తర్వలో ప్రకటించే రెండో జాబితాలో తమ పేరు ఉండేలా చూడాలని కోరుతున్నారు.టికెట్లు ఆశిస్తున్న వారు వివిధ పార్టీల నేతలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలో పార్టీలో చేర్చేందుకు తీసుకొస్తున్నారు.పెద్ద ఎత్తున నాయకులు రావటం,పార్టీలో చేరుతుండటంతో వీరందరి కోసం కార్యాలయం ఆవరణలో ప్రత్యేక షెడ్డును సైతం ఏర్పాటు చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు మంత్రి దత్తాత్రేయ నివాసం కూడా నేతలు, కార్యకర్తలతో కిలకిటలాడుతోంది.పార్టీ కోసం తాము చేపట్టిన కార్యక్రమాల వివరాలతో పాటు బయోడేలాలను సమర్పించి వెళ్తున్నారు.జంటనగరాలతోపాటు వివిధ జిల్లాల నుంచి టికెట్‌ ఆశిస్తున్న నేతలు వచ్చి కలుస్తున్నారు.బీజేపీ ఓబీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు కాటం నర్సింహులు యాదవ్‌ ఆధ్వర్యంలో పలువురు బీసీ సభ్యుల బృందం దత్తాత్రేయను కలిసి బీసీలకు జనాభాకు అనుగుణంగా 50 సీట్లు కేటాయించాలని కోరారు. ఓబీసీ సెల్‌ తరుపున అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకు అవకాశం కల్పించాలని 10మంది పేర్లతో కూడిన జాబితాను సమర్పించారు.

దేశంలోనే మోస్ట్ వాంటెడ్ గా తెలంగాణ వాసి

  జాతీయ పరిశోధన సంస్థ -ఎన్‌ఐఏ తాజాగా 258 మందితో కూడిన మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాను ప్రకటించింది.ఈ జాబితాలో తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా సారంగాపూర్‌కు చెందిన గణపతి అలియాస్‌ ముప్పాళ్ల లక్ష్మణరావును  దేశంలోనే మోస్ట్‌ వాంటెడ్‌ వ్యక్తిగా పేర్కొన్న ఎన్‌ఐఏ ఆయనను పట్టిచ్చిన వారికి 15 లక్షల రూపాయల బహుమతిని ప్రకటించింది.గణపతి ఒకప్పటి పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ నుంచి నక్సల్‌ కార్యకలాపాల్లో క్రియాశీల పాత్ర పోషించినవారు.15 రాష్ట్రాల్లో విస్తరించిన నక్సల్స్‌ దళాలకు అధినేత.2017లో గణపతి బిహార్‌లోని గయ ప్రాంతంలో సంచరించినట్లు ఇంటెలిజెన్స్‌ నివేదికలు పేర్కొన్నాయి.కానీ సరైన ఆచూకీని కనిపెట్టలేకపోయాయి.గణపతి తరువాత మావోయిస్టు నాయకత్వ శ్రేణిలో రెండోస్థానంలో ఉన్న నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజ్‌పై కూడా ఎన్‌ఐఏ 10 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది.భారీ విస్ఫోటకాల తయారీలోనూ, సాయుధ మిలటరీ వ్యూహరచనలోనూ కేశవరావును సుప్రసిద్ధుడిగా చెబుతారు.     ఎన్‌ఐఏ ప్రకటించిన జాబితాలో 15 మంది మహిళలు కూడా ఉన్నారు.మరో 15 మంది పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఉన్నారు.వీరిలో లష్కరే తయీబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌, హిజ్బుల్‌ అగ్రనేత సలాహుద్దీన్‌, ముంబై దాడుల సూత్రధారి జకీర్‌ రెహ్మాన్‌ లఖ్వి, అమెరికన్‌ జైల్లో ఉన్న డేవిడ్‌ హెడ్లీ, జునైద్‌ అక్రమ్‌ మాలిక్‌, సాజిద్‌ మజిద్‌ ప్రధములు.ఈ జాబితాలో ఉన్న వారిలో 98పై రెడ్‌కార్నర్‌ నోటీసుంది. ‘‘వీరిని అరెస్టు చేయడానికి మీ సాయం కావాలి. పట్టిచ్చినా ఆచూకీ చెప్పినా బహుమతి. మీ వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది’’ అని ఎన్‌ఐఏ తన ట్విటర్‌లో పేర్కొంది.

జగ్గారెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసు

  సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహించిన సంగతి తెల్సిందే.ఈ సందర్బంగా మాట్లాడిన జగ్గారెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో పాటు,నిబంధనలకు విరుద్ధంగా పలు వాగ్దానాలు చేశారు.జగ్గారెడ్డి వ్యాఖ్యలను కొందరు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఫిర్యాదును పరిశీలించిన నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి.. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని జగ్గారెడ్డికి నోటీసులు జారీ చేశారు. ‘నాకు ఊచ లు చూపించిన కేసీఆర్‌.. నీకు చుక్క లు చూపిస్తా’అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించినట్లు ఫిర్యాదులో పేర్కొ న్నారు. నియోజకవర్గంలో 40 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానని, కార్యకర్తలకు ఆర్థిక సాయం చేసేందుకు ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేస్తానని జగ్గారెడ్డి వాగ్దానం చేయడం నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల నుంచి అందిన ఫిర్యాదును పరిశీలించిన తర్వాత నోటీసు జారీ చేసినట్లు నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి వెల్లడించారు.జగ్గారెడ్డి ఇచ్చే సమాధానాన్ని బట్టి ఎన్నికల సంఘం నియమాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు.

రామ్ చరణ్ సాయం..పవన్ కి మనోజ్ ధన్యవాదాలు

  తిత్లీ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే.భాదితులకు పలువురు సినీ ప్రముఖులు బాసటగా నిలిచారు.తాజాగా రామ్ చరణ్ తుపాను ప్రభావంతో నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని వెల్లడించిన సంగతి తెలిసిందే.తన బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ ఇచ్చిన సలహా మేరకు ఆనందంగా ఈ పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ నేపథ్యంలో కథానాయకుడు మంచు మనోజ్‌ ట్వీట్‌ చేశారు. ‘మన నుంచే ఇది ప్రారంభం కావాలి.. నీ సోదరుడిగా ఎప్పుడూ గర్వపడుతూనే ఉన్నాను. గ్రామాన్ని దత్తత తీసుకోవడం నిజంగా ఓ గొప్ప పని. అవసరాల్లో ఉన్న ప్రజలకు మంచి చేయాలని తెలుపుతూ రామ్‌చరణ్‌కు స్ఫూర్తి కల్గించిన పవన్‌కల్యాణ్‌ గారికి ధన్యవాదాలు’ అని మనోజ్‌ పోస్ట్‌ చేశారు. దీంతోపాటు పవన్‌, చరణ్‌ కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేశారు.   హీరో నిఖిల్ కూడా ప్రభావిత ప్రాంతాలకు స్వయంగా వెళ్లి సాయం చేసిన సంగతి తెలిసిందే.నిఖిల్ కూడా టాలీవుడ్ అందిస్తున్నసాయంపై ట్వీట్ చేశారు.‘‘తిత్లీ’ బాధితుల కోసం పెద్ద మనసుతో 750 నిత్యావసర సరకుల కిట్లు పంపిన రానాను, సరకులు పంపిన మంచు మనోజ్‌ను,విరాళాలు అందించిన అల్లు అర్జున్‌,ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్,విజయ్ దేవరకొండ,వరుణ్ తేజ్,సంపూర్ణేష్ ను, గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పిన రామ్‌చరణ్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది. శ్రీకాకుళం బాధితులకు సహాయం చేసిన మిగిలిన వారందికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అని నిఖిల్‌ ట్వీట్‌ చేశారు.  

బీజేపీ నాయకుల దొంగ దీక్ష

  గత కొద్దిరోజులుగా అగ్రిగోల్డ్ విషయంపై టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ నేతలు ఈ వ్యవహారంపై దీక్షకు దిగడంతో మరోసారి ఏపీలో అగ్రిగోల్డ్ హాట్ టాపిక్ అయ్యింది. ఈ దీక్ష సందర్భంగా బీజేపీ నేతలు చంద్రబాబు మీద, టీడీపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే దీనికి బదులుగా టీడీపీ నేతలు కూడా బీజేపీకి అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. తాజాగా మంత్రి లోకేష్ కూడా బీజేపీ నేతల విమర్శలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్టు బీజేపీ నేతలు దీక్ష చేసారు. నోట్ల రద్దు నుండి రాఫెల్ కుంభకోణం వరకూ దేశాన్ని దోచేసి.. దొంగలను దేశ సరిహద్దులు దాటిస్తున్న బీజేపీ నాయకులు అగ్రిగోల్డ్ పేరుతో దొంగ దీక్ష చెయ్యడం హాస్యాస్పదంగా ఉంది' అని అన్నారు. 'ప్రత్యేక హోదా నుండి తిత్లీ తుఫాను సహాయం వరకూ ఏపీ దేశంలోభాగం కాదు అన్నట్టు వ్యవహరిస్తున్న బీజేపీ.. అగ్రిగోల్డ్ అంటూ కొత్త కుట్రకి తెరలేపింది. కోర్టు పరిధిలో ఉన్న అగ్రిగోల్డ్ అంశంలో బాధితులకు న్యాయం చెయ్యాలి అని సీఎం చంద్రబాబు గారు కృషి చేస్తున్నారు' అని తెలిపారు. 'కోర్టులను కించపరుస్తూ బీజేపీ నేతలు ఆరోపణలు చెయ్యడం మాని, ఆధారాలు ఉంటే బయట పెట్టాలి. చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు బెయిల్ ఔట్ ప్యాకేజీ ప్రకటించాలి' అని లోకేశ్ ట్వీట్స్ చేసారు. మరి లోకేష్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.  

ప్రధాని సన్నిహితుడు లంచం కేసులో పట్టుబడ్డాడు

  ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ వదులుకోవడం లేదు.తాజాగా సీబీఐలో చోటుచేసుకున్న అంతర్గత కుమ్ములాటలపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాజకీయ ప్రతీకారం తీర్చుకునే ఓ ఆయుధంలా సీబీఐ తయారైందని రాహుల్‌ గాంధీ విమర్శించారు.తాజాగా ఓ అవినీతి కేసులో సీబీఐ తమ సొంత శాఖ డైరెక్టర్ రాకేశ్‌ అస్తానాపై కేసు నమోదు చేసింది.మాంసం ఎగుమతి చేసే వ్యాపారవేత్త మోయిన్‌ ఖురేషిపై మనీలాండరింగ్‌, అవినీతి, అక్రమాస్తుల ఆరోపణలు రాగా ఆయనపై సీబీఐ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ కేసులో రాకేష్‌ అస్తానా ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది.అయితే, ఖురేషి నుంచి ఆయన లంచం డిమాండ్‌ చేసి తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసులో అస్తానాను నంబర్‌.2 గా పేర్కొంటూ సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్ అస్థానాపై స్వయంగా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు వచ్చిన వార్తలపై రాహుల్ ఇవాళ ట్విటర్లో స్పందించారు. ‘‘ప్రధానమంత్రి సన్నిహితుడు, గోద్రా సిట్ ఫేమ్, గుజరాత్ కేడర్ అధికారి, సీబీఐలోకి నెంబర్ 2గా చొరబడిన వ్యక్తి, ఇప్పుడు ఓ లంచం కేసులో పట్టుబడ్డాడు...మోదీ ప్రభుత్వ పాలనలో రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకునే ఆయుధంలా సీబీఐ తయారైందన్నారు.ఎంతో ఔన్నత్యమున్న విచారణ సంస్థ ఇప్పుడు క్షీణ దశకు చేరుకుందనీ..  వాళ్లలో వాళ్లే కొట్టుకునే పరిస్థితి వచ్చిందని’’ రాహుల్ వ్యాఖ్యానించారు.  

అడ్డుకున్నదీ మీరే..దీక్షలు చేస్తున్నదీ మీరే..

  బీజేపీ నేతలపై ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు.ఏపీలోకి రాకుండా బీజేపీ నేతలను తరిమికొడతామని హెచ్చరించారు.బీజేపీ రాష్ట్ర ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు అంటే బీజేపీకి భయమని ఎద్దేవాచేశారు. అగ్రిగోల్డ్‌ స్కాం టీడీపీ హయాంలో జరగలేదని, అయినా బాధితులను ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ విజయవాడలో బీజేపీ ధర్మపోరాట దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ చంద్రబాబుని, టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.దీనిపై స్పందించిన నాని అగ్రిగోల్డ్‌ బాధితులకు భాజపా నేతలు న్యాయం చేస్తాననటం విడ్డూరంగా ఉందన్నారు. జీవీఎల్‌ నరసింహరావు, కన్నా లక్ష్మీనారాయణకు చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలు అమలయ్యేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు.విభజన హామీల విషయంలో ఆంధ్రులకు ఏం న్యాయం చేశారో, 18 విభజన హామీలను ఎందుకు పరిష్కరించలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తిత్లీ తుపానుతో శ్రీకాకుళం జిల్లా ప్రజలు అల్లాడుతుంటే కనీసం భాజపా నేతలు ఆ వైపు కూడా చూడలేదని విమర్శించారు. తుపాను సాయంపై ప్రభుత్వం లేఖలు రాస్తే కనీసం స్పందన లేదని మండిపడ్డారు.ఇప్పుడు అగ్రిగోల్డ్‌ బాధితులపై మాట్లాడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టంచేశారు.ఎస్సెల్ గ్రూప్ ను ఢిల్లీకి పిలిపించుకుని అగ్రిగోల్డ్‌ను కొనడానికి వీల్లేదని బెదిరించి వెనక్కి పంపింది అమిత్ షా కాదా? అని ప్రశ్నించారు. నీతి, నిజాయితీ గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదని, అవినీతిలో టాప్‌లో గుజరాత్‌ ఉంటే.. చివర్లో ఏపీ ఉందన్నారు.విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీని దేశం దాటించింది భాజపా కాదా? అని నిలదీశారు. అవినీతిపరులతో భాజపా చేతులు కలుపుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్‌తో చేతులు కలిపి రాబోయే ప్రభుత్వం తమదేనన్న భ్రమలో భాజపా ఉందన్నారు.బీజేపీతోనే తాము అధికారంలోకి రాలేదని,పొత్తు వల్ల టీడీపీకి నష్టం జరిగిందన్ననాని పొత్తు లేకపోతే 130 అసెంబ్లీ స్థానాలు, 21 ఎంపీ సీట్లు వచ్చేవన్నారు.

కేసీఆర్ పరిపాలన భేష్..!!

  తెలంగాణ ప్రభుత్వ పథకాలను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రసంశించారు.కేసీఆర్‌ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రైతుబంధు, రైతు బీమా, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలు ప్రజలకు ఎంతో ప్రయోజనకరమైనవని లక్ష్మీనారాయణ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని మందలపల్లిలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీకృష్ణదేవరాయలు, కాకతీయుల కాలంలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో అప్పట్లోనే గొలుసుకట్టు చెరువులను నిర్మించి పంటలకు సాగునీరందించేందుకు కృషి చేశారని తెలిపారు. అలాంటి చెరువులను అభివృద్ధి చేసి.. నీటి నిల్వలను పెంచేలా మిషన్‌ కాకతీయ పథకం చేపట్టడం గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు. వ్యవసాయానికి ప్రాధాన్యమివ్వడం అభివృద్ధికి కీలకమని, సాగు రంగం అభ్యున్నతి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. వ్యవసాయ రంగం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో పనిచేసేందుకు తనకు అవకాశం కల్పించనందువల్లే ఏడేళ్ల ముందుగానే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశానని తెలిపారు. తన రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారమంతా అసత్యమని స్పష్టం చేశారు.అవసరమైన సమయంలో తన వంతు పాత్ర పోషిస్తానన్నారు.

అమ‌రావ‌తి శంకుస్థాపన జరిగి నేటికి మూడేళ్లు

  రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు మహానగరం హైదరాబాద్ రాజధానిగా ఉంది. మరి ఏపీ పరిస్థితి ఏంటి అంటూ ఏపీ ప్రజలు ఆందోళన చెందారు. అందుకే 2014 ఎన్నికల్లో అనుభవం, ముందుచూపు ఉన్న చంద్రబాబుకు పట్టం కట్టారు. చంద్రబాబు కూడా ఏపీని, ఏపీ రాజధానిని ప్రపంచస్థాయిలో నిలబెట్టాలని అమరావతిని రాజధానిగా ఎంపిక చేసారు. ప్రపంచస్థాయి నిపుణులతో అమరావతి డిజైన్స్ వేయించి.. ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ గొప్ప రాజధాని దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ అడుగులు మొదలై మూడేళ్లు పూర్తయింది. 2015 అక్టోబర్‌ 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన ఎంత ఘనంగా జరిగిందో రాజధాని కూడా అంతే ఘనంగా ఉండేలా నిర్మాణం జరుగుతుంది. రాజధాని నిర్మాణాన్ని చేపట్టిన ఏపీ ప్రభుత్వం ఏడు నెలల్లోనే తాత్కాలిక సచివాలయం పూర్తి చేసింది. మౌలిక వసతులు, భవనాల నిర్మాణాలకు రూ.48,116 కోట్లు అంచనా వ్యయం కాగా.. ప్రస్తుతం రూ.14,630 కోట్ల విలువైన పనులు చేపట్టింది. టెండరు దశలో రూ.4వేల కోట్ల పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో 320 కిలోమీటర్ల పొడవైన 34 ప్రధాన రహదారుల నిర్మాణం జరుగుతుంది. రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ వనరుల ద్వారా నిధులు సమీకరిస్తోంది.

రాహుల్ ప్రధాన మంత్రి అభ్యర్థి కాదు

  బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు సిద్దమయ్యి కూటమిని ఏర్పాటు చేయాలనుకున్నది విదితమే.అయితే కూటమిగా ఏర్పడితే ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎవరిని ఎన్నుకోవాలి అనేది కత్తి మీద సాము లాంటిదే.అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీని అధికారానికి దూరం చేయటమే తమ లక్ష్యంగాని రాహుల్ ప్రధాని అవ్వటం కాదని తేల్చేసింది.ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలని అనుకుంటున్నట్లు మేం ఎప్పుడూ చెప్పలేదు. కొందరు కాంగ్రెస్‌ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఏఐసీసీ జోక్యం చేసుకుని వారిని అడ్డుకుంది. భాజపాను వెళ్లగొట్టడమే మా లక్ష్యం. వ్యక్తుల స్వేచ్ఛను గౌరవించే, అభివృద్ధి కోసం పాటుపడే, మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించే, రైతులను ఆదుకునే ప్రత్నామ్నాయ ప్రభుత్వం భాజపా స్థానంలో రావాలని మేం కోరుకుంటున్నాం. భాజపాపై పోరుకు కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఎన్నికల అనంతరం భాగస్వామ్య పార్టీలతో కలిసి ప్రధానిని ఎంపిక చేయాలని యోచిస్తున్నాం’ అని చిదంబరం తెలిపారు.

తెలంగాణ, ఏపీలో అవినీతిమయం

  అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ విజయవాడలో బీజేపీ ధర్మపోరాట దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ చంద్రబాబుని, టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ మాట్లాడుతూ.. బాధితులు ఢిల్లీ వచ్చి మమ్మల్ని కలిశారని, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. అగ్రిగోల్డ్‌ కుంభకోణం వెనుక ఎవరున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయడమే తమ ఆందోళన ఉద్దేశమని చెప్పారు. ఎన్నో ఆశలతో తెలంగాణలో తెరాసకు, ఏపీలో టీడీపీకి ప్రజలు అవకాశమిస్తే ఈ రెండు ప్రభుత్వాలూ అవినీతిమయం అయ్యాయని ఆరోపించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీడీపీ నేతలు కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని, గత మూడేళ్లలో అత్యధిక నిధులు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చాయని రాంమాధవ్‌ వివరించారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. చంద్రబాబు మనుషులు అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కారణంగానే అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం జరిగిందన్నారు. 3 వేల కోట్ల విలువైన హాయ్‌ల్యాండ్‌ను లోకేష్‌ 270 కోట్లకు కాజేయాలని చూశారని ఆరోపించారు. లోకేష్‌ అడిగిన ధరకు ఇవ్వలేదని వారిని ఇబ్బంది పెడుతున్నారని కన్నా అన్నారు. అగ్రిగోల్డ్‌ యాజమాన్యం, టీడీపీ ప్రభుత్వం కుమ్మక్కై 3 లక్షల మంది బాధితులను ఇబ్బందిపెడుతున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ ఆస్తుల లెక్కలు చెప్పమంటే సంవత్సరానికి ఒక లెక్క చెబుతున్నారని, అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను కావాలనే తగ్గించారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు మీద, టీడీపీ మీద విమర్శల వర్షం కురిపించే జీవీఎల్ నర్సింహరావు మాట్లాడుతూ.. అమరావతిని ల్యాండ్ మాఫియాగా మార్చిన ఘనత చంద్రబాబుదే అని విమర్శించారు. అమరావతి భూములను టీడీపీలోని ల్యాండ్‌ మాఫియా కారు చౌకగా కొట్టేసిందన్నారు. టీడీపీ ఎంపీలే టెండర్లు వేసి వారే కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదనే అందిన కాడికి దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 1.50లక్షల కోట్లు అప్పులు తెచ్చారని.. వాటికి లెక్కలు చూపాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్‌లో లక్షల మంది దాచుకున్న డబ్బు దోచుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఏపీలో లాలూ ప్రసాద్‌ తరహా ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. బీహార్‌లో ఆర్జేడీకి వచ్చిన పరిస్థితే ఏపీలో టీడీపీకి రానుందన్నారు. 6 నెలల తర్వాత టీడీపీ ప్రభుత్వం ఉండదని అన్నింటిపై విచారణ జరిపిస్తామని జీవీఎల్ స్పష్టం చేశారు.

ముగిసిన భేటీ..పొత్తుపై క్లారిటీ..

  తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ భవన్‌లో టీటీడీపీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమై తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా కూటమిలో పొత్తులు, సీట్ల సర్దుబాటు, పార్టీ టికెట్లు ఆశించేవారిపై కీలకంగా చర్చించారు.అనంతరం రాష్ట్ర  ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో పొత్తు ముఖ్యమని.. సీట్ల విషయంలో సర్దుకుపోవాలని తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు.తెలంగాణలో ఏర్పడే కూటమి జాతీయస్థాయిలో ప్రభావం చూపుతుందని బాబు పేర్కొన్నారు.కాంగ్రెస్‌ 12 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని.. మరో 6 సీట్లు అడుగుదామన్నారు. సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్‌ పెద్దలతో మాట్లాడుతానని నేతలకు చంద్రబాబు తెలిపినట్లు తెలుస్తుంది. మహాకూటమి గెలుపునకు టీడీపీ కార్యకర్తలు కష్టపడాలని సూచించారు.  తెలంగాణలోని నాయకులకు న్యాయం జరిగేలా ఎల్. రమణ, నామ నాగేశ్వరరావు చూస్తారన్న చంద్రబాబు టికెట్ రాని వారు అసంతృప్తి చెందవద్దన్నారు.మహాకూటమి అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామన్నారు.తెలంగాణలో ప్రచారం చేయాలని టీడీపీ నేతలు కోరగా అందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో నాలుగు సభలు పెట్టాలని చంద్రబాబును నేతలు కోరినట్లు సమాచారం.ఇదిలా ఉంటే భేటీలో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి స్థానాల్లో పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం.కూకట్‌పల్లి స్థానాన్ని పెద్దిరెడ్డికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. శెరిలింగంపల్లి స్థానంపై చంద్రబాబు నేతలకు సూచనలు చేశారు. భవ్య సిమెంట్స్‌ అధినేత ఆనంద్‌ప్రసాద్‌కు ఇవ్వాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది.  

మజ్లిస్‌ కంచుకోటలో కాంగ్రెస్ వ్యూహమేంటి?

  గత ఎన్నికల వరకు మజ్లిస్‌,కాంగ్రెస్ పార్టీలకు మధ్య స్నేహపూరిత వాతావరణం ఉండేది.కానీ కొంత కాలంగా మజ్లీస్, కాంగ్రెస్ పార్టీకి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.ఈ పార్టీల మధ్య దోస్తీ తెలిగిపోయినప్పటి నుంచి వివిధ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ భారీ పరాజయం చవిచూస్తూ వచ్చింది.బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో మజ్లిస్‌ బరిలోకి దిగడంతో మైనారిటీ ఓట్లు చీలి, పట్టున్న స్ధానాల్లో సైతం కాంగ్రెస్‌ ఓటమి పాలైంది.మరోవైపు బీజేపీకి లాభం చేకూరింది.దీంతో కాంగ్రెస్‌ అధిష్టానం మజ్లిస్‌పై సీరియస్‌గా ఉంది.  తాజాగా తెలంగాణలో తమ ప్రధాన ప్రత్యర్థి టీఆర్‌ఎస్‌తో ఎంఐఎం దోస్తీ కట్టటంతో కాంగ్రెస్ పార్టీ దీన్ని జీర్ణించుకోలేకపోతోంది.ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీని దెబ్బతీసి గుణపాఠం చెప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగా పాతబస్తీపై ప్రత్యేక వ్యూహ రచన చేస్తోంది.  పాతబస్తీ మజ్లిస్‌కు కంచుకోట కావడంతో ఇతర పక్షాలు తలపడడం అంత సులభం కాదు. మైనారిటీలు గణనీయంగా ఉండడంతో ఓటర్లు మొత్తం ఒకవైపు మొగ్గు చూపుతారు.దీంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్ధాయి ముస్లిం మైనారిటీ నాయకులను రంగంలోకి దింపాలని యోచిస్తోంది.ప్రతి అసెంబ్లీ స్థానాన్ని సీరియస్‌గా తీసుకొని ఎన్నికల బరిలోకి దూకాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.ఇందులో భాగంగా బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఎన్నికల బరిలో టీఆర్‌ఎస్, బీజేపీ పక్షాలు దిగే అవకాశం ఉన్నప్పటికీ... కేవలం మజ్లిస్‌పైనే దృష్టిసారించింది.ఈసారి ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తోంది.ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చార్మినార్‌లో జరిగిన రాజీవ్‌ సద్భావన యాత్ర సభలో పాల్గొని మజ్లిస్‌ పార్టీని టార్గెట్‌ చేస్తూ నిప్పులు చెరిగారు.అంతకముందు రాష్ట్ర స్థాయి అగ్ర నేతలు పాతబస్తీలోని ముస్లిం కుటుంబాలతో భేటీ అయ్యారు.తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మైనారిటీ సెల్‌ నేత నదీమ్‌ జావిద్‌ మైనారిటీ నేతలతో సమావేశమై పాతబస్తీలోని రాజకీయ పరిస్ధితులపై చర్చించారు.

జయలలిత అంత్యక్రియలకైన ఖర్చు కోటి.!!

  'పుట్టినప్పుడు ఏం తీసుకురాము.. పోయేటప్పుడు ఏం తీసుకుపోము' అంటారు. అవును నిజమే. ఎంత డబ్బున్న కుటుంబంలో పుట్టినా.. ఎంత డబ్బు సంపాదించినా పోయేటప్పుడు ఏం తీసుకుపోము. కానీ డబ్బున్నోళ్ళు, గొప్పోళ్ళు పోయినప్పుడు మాత్రం అంత్యక్రియలకు భారీగా ఖర్చవుతుంది. అది లక్షలు, కోట్లు కూడా అవొచ్చు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత అంత్యక్రియలకు కూడా సుమారు రూ. కోటి ఖర్చయిందట. మదురై కేకే నగర్‌కు చెందిన సయ్యద్‌ తమీమ్‌ అనే సంఘ సేవకుడు జయలలిత మరణంపై పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరుతూ సీఎం ప్రత్యేక విభాగం, ప్రజా సమాచార విభాగానికి.. సమాచార హక్కుల చట్టం కింద దరఖాస్తు సమర్పించారు. అందులో జయలలిత ఎప్పుడు మరణించారు? అన్న ప్రశ్నకు 2016 డిసెంబర్‌ 5వ తేదీ అని ఉంది. అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందినందుకు రాష్ట్రప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? అన్న ప్రశ్నకు ప్రభుత్వం పైసా కూడా ఖర్చు పెట్టలేదని ఉంది. జయలలిత అంత్యక్రియల కోసం రాష్ట్రప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? అన్న ప్రశ్నకు రూ.99 లక్షల 33 వేల 586 అని ఉంది. ఇక, మాజీ శాసనసభ్యులకులాగే జయలలితకు కూడా కుటుంబ పింఛన్‌ పంపిణీ చేస్తున్నారా? అన్న ప్రశ్నకు.. పింఛన్‌కు సంబంధించిన వ్యవహారంలో నిర్ణయం తీసుకొనే అధికారం అసెంబ్లీ కార్యదర్శికి మాత్రమే ఉందని, దీనిపై ఆయనే సమాధానం చెప్పాలని అందులో వివరించారు.

తెరాస 'ఆపరేషన్ ఆకర్ష్'

  తెలంగాణాలో తెరాస అధికారంలోకి వచ్చాక 'ఆపరేషన్ ఆకర్ష్' కు తెరలేపింది.ఆపరేషన్ ఆకర్ష్ అంటే పక్క పార్టీ లో ఉన్న కీలక నేతలను తమ పార్టీలోకి లాగేసుకునే ప్రయత్నం చేసి విజయం సాధించింది.అంతేకాకుండా ఆయన మంత్రి వర్గంలో ఉన్న మంత్రులు సగానికిపైగా పక్క పార్టీల నుంచి వచ్చిన కీలక నాయకులే.ఇంతవరకు బాగానే ఉంది కానీ తెరాస అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు తెరలేపటంతో పాటు 105 మంది అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది.దీంతో కొంత మంది తమకు అన్యాయం జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేస్తూ పక్క పార్టీల వైపు చూస్తున్నారు.ఓ పక్క అసంతృప్తి వ్యక్తం చేస్తున్ననాయకులను కేటీఆర్ బుజ్జగిస్తూ వస్తుంటే మరో పక్క వలసలు మాత్రం ఆగట్లేదు. పార్టీలోని కీలకనేతలే పార్టీ  మారితే క్యాడర్ చీలిపోద్దని గెలుపుపై దాని ప్రాభవం పడే అవకాశం ఉందని తెరాస భావిస్తుంది.దీంతో నేతలు ఎలాగో పార్టీ మారారు కనీసం క్యాడర్ ని అయినా కాపాడుకోవాలనే ఆలోచనలో పడింది తెరాస.ఇందులో భాగంగానే తిరిగి  'ఆపరేషన్ ఆకర్ష్' ని తెర మీదకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.ఆ పార్టీ నేత హరీష్ రావు దీన్ని అమలు చేసే పనిలో పడ్డట్లే ఉన్నాయి తాజా పరిణామాలు.కొన్ని రోజుల క్రితం కొందరు తెరాస నాయకులు కాంగ్రెస్ కండువాలు కప్పుకోగా వాళ్ళతో భేటీ అయిన హరీష్ రావు వాళ్ళని సముదాయించటంతో మరుసటి రోజే తిరిగి తెరాసలో చేరారు.తాజాగా ఓ మాజీ ఎంపీపీ కాంగ్రెస్ కండువా కప్పుకోగా హరీష్ రావు ఆయన ఇంటికి వెళ్లి మరి తెరాస కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు.ఇవాళ ఓ పార్టీలో ఉన్న వాళ్ళు రేపు మరో పార్టీలో ప్రత్యక్షమవుతారు.ముఖ్యంగా ఎన్నికల సమయం వచ్చిందంటే ఓ పార్టీ నుంచి మరోపార్టీకి నేతలు మారడం షరామామూలే.గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న తెరాసకి ఈ వలసలు ముందరి కాళ్లకు భందం వేస్తుంటే ఆ పార్టీ వ్యూహమైన 'ఆపరేషన్ ఆకర్ష్' పార్టీని ఎంతవరకు నెట్టుకొస్తుందో వేచి చూడాల్సిందే..!!

లోకేష్ కోసం చంద్రబాబు తప్పుకుంటున్నారా?

  చంద్రబాబు 1989 నుంచి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే కుప్పం నుంచి ఆరుసార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్ సాధించిన చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో కూడా బరిలోకి ఈజీగా గెలుస్తారు. అయితే ఈసారి చంద్రబాబు మాత్రం పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నుంచి పోటీచేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనివెనుక రెండు కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకటి లోకేష్ ని కుప్పం నుంచి బరిలోకి దింపడం. రెండోది ఉంగుటూరులో చంద్రబాబు పోటీ చేస్తే జిల్లా అంతటా ప్రభావితమై.. ఓ వైపు జిల్లాలో జనసేన దూకుడికి కళ్లెం వేయొచ్చు మరోవైపు వైసీపీని మానసికంగా దెబ్బతీయొచ్చని చంద్రబాబు భావిస్తున్నారట. చంద్రబాబు ఈసారి కుప్పం నుంచి కాకుండా గుంటూరు జిల్లా లేదా పశ్చిమగోదావరి జిల్లా నుంచి పోటీ చేస్తారని గతంలోనే వార్తలొచ్చాయి. చివరకు చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. సర్వేల్లో కూడా ఇక్కడి ఓటర్లు టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నారని తేలింది. ఇక్కడ నుంచి స్వయంగా సీఎం చంద్రబాబే పోటీ చేస్తే రికార్డు మెజార్టీ రావడం ఖాయమని అక్కడి నాయకులు భావిస్తున్నారు. కుప్పం నుంచి లోకేష్‌ ను బరిలోకి దిగితే.. అక్కడ కుమారుడు సులువుగా గెలుపొందుతాడు. ఉంగుటూరులో తాను పోటీ చేస్తే ఉభయగోదావరి జిల్లాల్లో టీడీపీ హవా వీస్తుందని చంద్రబాబు భావిస్తున్నారట. మొత్తానికి చంద్రబాబు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా.. అటు కుమారుడికి రూట్ క్లియర్ చేస్తున్నారు. ఇటు ప్రతిపక్షాలను ఇరుకున పెడుతున్నారు. చూద్దాం మరి ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో.

చంద్రబాబుతో టీ.టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ

  టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న తెలుగు దేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం ప్రారంభమైంది.ఈ భేటీలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు చర్చించనున్నారు.తమ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థులను చంద్రబాబు ఎంపిక చేస్తారని పార్టీ నాయకులు భావిస్తున్నారు.అన్నిటికంటే ముఖ్యంగా మహాకూటమిలో తెలుగు దేశానికి వచ్చే సీట్లు సహా, కూటమిలో సీట్ల సర్దుబాటుపైన కూడా చర్చించే అవకాశం ఉంది.2014 ఎన్నికల్లో హైదరాబాద్‌లో కీలక స్థానాలను టీటీడీ దక్కించుకుంది. వాటితో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు, కరీంనగర్‌లో ఒకటి, పాలమూరు జిల్లాలో మూడు, ఖమ్మంలో రెండు, నల్గొండ, వరంగల్, మెదక్‌లో ఒక్కో సీటును టీడీపీ నేతలు కోరుతున్నారు. మరోవైపు ఎవరెవరు సీట్లు ఆశిస్తున్నారు, ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో కూడా చంద్రబాబు అడిగి తెలుసుకోనున్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పోటీ చేసే విషయంపైన కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పొత్తులు, సీట్ల సర్దుబాబు అంశాలను చంద్రబాబు టీ.టీడీపీ నేతలకే వదిలేశారు.కానీ ప్రచారానికి మాత్రం చంద్రబాబు రావాల్సిందిగా నేతలు కోరే అవకాశం ఉంది.అయితే చంద్రబాబు దీనిపై ఎలా స్పందిస్తారో అని నాయకులు ఉత్కంఠతతో ఉన్నట్లు తెలుస్తోంది.కానీ చంద్రబాబు మాత్రం ప్రచారానికి రావటానికి సుముఖంగా లేరని తెలుస్తుంది.బాలయ్యను ప్రచారానికి పంపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఇప్పటికే బాలయ్యను స్టార్ కాంపైనర్ గా ప్రచారానికి రావాల్సిందిగా నేతలు కోరగా సానుకూలంగా స్పందించారు.

రైతులకు కంటకప్రాయుడు..కాంట్రాక్టర్లకు ప్రియుడు

  కామారెడ్డిలో కాంగ్రెస్‌ ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.కేసీఆర్‌ కాంట్రాక్టుల పేరిట ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే ఆయనను రైతులకు కంటకప్రాయుడు.. కాంట్రాక్టర్లకు ప్రియుడు అని తాను గతంలో అన్నానని గుర్తు చేశారు.ప్రాజెక్టులన్నీ ఆంధ్రా గుత్తేదారుల చేతిలో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇద్దరు ఆంధ్రా గుత్తేదార్లకు రూ.75వేల కోట్ల పనులు అప్పగించారని తెలిపారు. రైతులకు రూ. లక్ష రుణమాఫీ చేస్తానని చెప్పి నాలుగేళ్లు చేశారు.దీంతో రుణమాఫీపై వడ్డీ పెరిగి ప్రజలపై భారంపడిందన్నారు. కాంగ్రెస్‌ ఇప్పుడు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామంటే.. కేసీఆర్‌ రూ.లక్ష మాత్రమే చేస్తామంటున్నారని తెలిపారు. సచివాలయానికి రాకుండా రాష్ట్రాన్ని పాలించిన ఏకైక వ్యక్తి కేసీఆర్‌ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ లాంటి భాష మాట్లాడేవారు రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నడూ లేరన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని తన 50ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ చూడలేదని చెప్పారు. మైనార్టీలను మోసం చేసేందుకే మోదీతో కుమ్మక్కై కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలపై తాను చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా 70ఏళ్లు దాటాయి గనక తనకు మతి తప్పిందన్నట్టుగా కేసీఆర్‌ మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్‌కు మళ్లీ అధికారం ఇస్తే దోచుకుంటారని తెలిపారు.