స్పెషల్ ఫ్లైట్‌ లో షికార్లు..కారులో కవాతులు

  పవన్ కళ్యాణ్ చేసింది ఏ వ్యాఖ్య అయినా దానికి ప్రతి విమర్శ చేస్తూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు టీడీపీ మహిళా నేత సాధినేని యామినీ.అంతకుముందు కవాతు సందర్బంగా పవన్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన యామినీ ఆయన పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.తాజాగా ‘తితలీ’ తుఫానుతో అతలాకుతలమైన సిక్కోలులో పర్యటిస్తున్న పవన్ ట్విట్టర్ వేదికగా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కరెంట్ సౌకర్యం లేదని.. దయచేసి ఈ విషయాన్ని కాస్త పట్టించుకోండి సీఎం గారు అని కోరారు. ఇందుకు స్పందించిన టీడీపీ మహిళా నాయకురాలు యామినేని సాధినేని ఇప్పటివరకు కరెంటు ఎందుకు ఇవ్వలేదంటూ పవన్ దిగజారుడు ట్వీట్... దానికి ఆధారాలతో సహా సమాధానం ఇదే అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు.     "శ్రీకాకుళం తుఫానుపై రాజకీయ దాడి మొదలైంది. తుఫాను కొట్టిన నాలుగు గంటల్లోనే చంద్రబాబు తన క్యాబినెట్ మొత్తాన్ని పలాసకు మార్చి.. అక్కడ నుంచే పరిపాలన చేస్తున్నారు. ఇప్పటికి 7రోజులు అయ్యింది. చంద్రబాబు అంతకు ముందు రోజు నుంచే.. తుఫాను ప్రభావం అంచనా వేస్తూ, తగు ఆదేశాలు ఇస్తూ, తుఫాను వచ్చే ముందు రోజు రాత్రి నిద్ర కూడా పోకుండా అప్రమత్తంగా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా శ్రీకాకుళంలోనే పని చేస్తూ పరిస్థితులు చక్కదిద్దుతున్నారు. ప్రభుత్వమే ఇంత ఇదిగా పని చేస్తే.. ఇక ప్రతిపక్షం ఇరగబడి పని చెయ్యాలి. కానీ మన ఖర్మకు ఒక నాయకుడు హైదరాబాద్ పోయాడు. ఇంకొకరు స్పెషల్ ఫ్లైట్‌లలో తిరుగుతూ కారులో కవాతులు చేసుకుంటూ తీరిగ్గా ఆరు రోజుల తరువాత వచ్చాడు. సరే వచ్చాడు. ఆయనకు చేతనైన సహాయం చెయ్యాలి.. లేకపోతే లోపాలు ఉంటే ప్రభుత్వానికి నివేదించాలి. ఎక్కడ ప్రజలకు ఉన్న ఇబ్బంది ఉందో చెప్పాలి. నిన్న ఒక రెండు గంటలు తిరిగాడు. పేపర్‌లో ఏదో రాసుకుని ఈ రోజు మరో రెండు గంటలు తిరిగాడు. ఇక ట్విట్టర్ వేదికగా రాజకీయ దాడి మొదలు పెట్టాడు. ముందుగా తెలుగుదేశం పార్టీని నేనే గెలిపించా అని ట్వీట్ మొదలు పెట్టి.. మీ అంతు చూస్తా అని అన్నాడు. తరువాత కరెంటు విషయంలో ఇప్పటికీ ఆరు రోజులు అయ్యింది.. కరెంటు ఎందుకు రాలేదు అంటూ చంద్రబాబుని ప్రశ్నిస్తూ ట్వీట్ చేసాడు పవన్. నిజానికి పవన్ కళ్యాణ్ ఇక్కడ అవమానించేది చంద్రబాబుని కాదు.. గ్రౌండ్‌లో పని చేసే కొన్ని వేల మంది స్టాఫ్‌ని.. పవన్ చౌకబారు ఆరోపణకుఆధారాలతో సహా సమాధానం ఇది" అని పవన్‌కు యామినీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.   "ఇరవై-ముఫై సంవత్సరాల నుండి వేసుకున్న విద్యుత్ వ్యవస్థ మొత్తం తిత్లీ దెబ్బకు కకావికలం అయిపోయింది. 30 వేల కరెంటు స్థంబాలు పడిపోయాయి. మీరోచ్చి ఆరు రోజులైనా పునరుద్ధరించలేదని ఆరోపణలు చేస్తున్నారు. 7వేల మంది సిబ్బంది రాత్రనకా, పగలనకా దసరా లాంటి పెద్ద పండగలను, పెళ్ళాంబిడ్డలనొదిలేసి కష్టపడి పనిచేస్తున్నారు. మీరు తీరిగ్గా కవాతులు, బలప్రదర్శనలు పూర్తి చేసుకోని వచ్చి ఒకపూట, ఒక మూల తిరిగి నోటికొచ్చినట్లుగా మాట్లాడతారా? ఇంటికి కరెంట్ రావాలంటే ముందు 33కేవీ లైన్లు, తర్వాత 11కేవీ లైన్లు సరిచెయ్యాలి. ట్రాన్స్‌ఫార్మర్ పోల్స్ కూడా పడిపోయే.. అవి నిలబెట్టాలి. అప్పుడు ఎల్టీ లైన్లు సరి అవుతాయి. అవి అన్నీ సరి చెయ్యాలంటే ఏదో ఒకటి రెండు రోజుల్లో మీరు సినిమాలో వేసిన సెట్‌లా అయిపోదు. ఇప్పటికే దాదాపుగా 85 శాతం కరెంటు ఇస్తున్నారు. మిగిలిన చోట్ల పనులు జరుగుతున్నాయి. అవి కూడా మరో, నాలుగు అయిదు రోజులలో పూర్తవుతాయి. మీ రాజకీయ ప్రచారం కోసం కష్టపడి పని చేసే వారిని, తక్కువ చేసి మాట్లాడకండి. చేతనైతే సహాయం చెయ్యండి. లేకపోతే కవాతులు చేసుకోండి" అని యామినీ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

పావలాకు కూడా చెల్లని పవన్ కల్యాణ్

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధవళేశ్వరం బ్యారేజ్ పై కవాతు నిర్వహించిన సంగతి తెలిసిందే.అనంతరం కవాతు సందర్భంగా ఏర్పాటు చేసిన భహిరంగ సభలో టీడీపీ టీడీపీ, బీజేపీ, వైసీపీలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాదు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డిలపై తీవ్ర స్థాయిలో పవన్ ధ్వజమెత్తారు.పవన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు నేతలు విమర్శలు గుప్పించారు.కానీ తాజాగా టీడీపీ మహిళా నేత సాధినేని యామినీ పవన్ పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.వారసత్వం గురించి మాట్లాడే హక్కు పవన్‌కు లేదని, పావలాకు కూడా చెల్లని పవన్ కల్యాణ్  రెండువేల రూపాయిల నోటువంటి లోకేశ్‌బాబు గురించి మాట్లాడటం నిజంగా హాస్యాస్పదమని యామినీ విమర్శించారు.అంతేకాకుండా గాంధేయవాదిని అని చెప్పుకునే పవన్ తాట తీస్తా,తోలు తీస్తా అంటున్నారు,మీరు ఎవరి తాట తీయగలరు? కూర్చొని మల్లెపూల పూలని మాత్రమే నలపగలరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.యామిని వ్యాఖ్యలపై టాలీవుడ్ నటి, బీజేపీ నాయకురాలు, పవన్ వీరాభిమానిగా చెప్పుకునే మాధవీ లత ఫేస్‌బుక్ వేదికగా స్పందించారు.     " ఇన్నాళ్లు పోనీలే అని ఊరుకున్నా.. ఇప్పుడు నాకు కాలింది.  మల్లెపూల విషయం ఏంటో దగ్గర్నుంచి యామిని సాధినేని చూశారేమో..? చూసినప్పుడు అడగాలి కదా ఇప్పుడెందుకు అడగటం..? వారసత్వం గురించి మాట్లాడే హక్కు లేదా..? నిజమే ఎందుకంటే ఆయన వారసత్వంతో రాలేదు కదా తెలియదులేమ్మా..! కవాతు దేనికోసమా....? ఏం చేశాడనా....? ఏం చేయలేదు అమ్మా ఏదో మీరు చేయలేనివి ఆయన చేసేద్దామనే తపన అంతే. ప్రజలకోసం వద్దు.. ఆయన పర్సనల్ లైఫ్ మీద పడి ఏడవటమే ఎందుకంటే మీకు పీకడానికి, చెప్పడానికి వేరే కంప్లైంట్స్ లేవు కదా....? మొన్నటి దాకా బీజేపీ డబ్బులు తీసుకున్నాడు.. నిన్నేమో ఎవడో డబ్బులు ఖర్చుపెట్టాడు.. మీ అయ్యలు ఇచ్చారా..? మీ తాతలు ఇచ్చారా..? ఇవ్వలేదుగా ఇంక మళ్లీ నొప్పెందుకు..? పైసల్ ఇవ్వకుండా ఇంతమంది జనం ఎందుకు వచ్చారనా....? ఉంటదిలే కడుపులో మంట. ‘ఈఎన్ఓ’ అని ఎప్పుట్నుంచో ఉంది అది తాగితే తగ్గుద్దేమో మరి. పనిచేయకపోతే అపోజిషన్ అనేది ప్రశ్నించాలి కానీ అసలు మొదలెట్టకుండా ఆపడం కాదు.. ఇకనైనా నేర్చుకొండి" అని ఫేస్‌బుక్‌లో యామినీకి మాధవీ లత స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు.మరి ఈ వ్యాఖ్యల దూమారం ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాల్సిందే..!!  

సీఎం కేసీఆర్‌కు 24 గంటలు తాగుడే విజన్

  జగ్గా రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి నుంచి రుద్రారం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ విజన్‌ ఉందని, తెలంగాణ ఆపద్దర్మ సీఎం కేసీఆర్‌కు 24 గంటలు తాగుడే ఆయన విజన్ అని విమర్శించారు. చంద్రబాబుతో టీఆర్‌ఎస్‌ కలిస్తే తప్పు లేదు గానీ, కాంగ్రెస్‌ కలిస్తే తప్పా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబును కేసీఆర్‌ శని అంటున్నారని.. శని అంటే దేవుడు అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఓట్ల కోసం ఆంధ్రులను పొగిడిన కేసీఆర్ ఇప్పుడు తిడుతున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ప్రకటించిన మేనిపెస్టోపై జగ్గారెడ్డి స్పందించారు. అది కేవలం మేనిపెస్టో మాత్రమేనని... అమలయ్యేది కాదని అన్నారు. గత ఎన్నికల్లో ప్రకటించిన మైనారిటీ, గిరిజనులకు రిజర్వేషన్లు, లక్ష రుణమాపీ, లక్ష ఎకరాలకు సాగు నీరు ఏమయ్యాయని ప్రశ్నించారు.ఈ నాలుగేళ్లు తెలంగాణలో టీఆర్ఎస్ పరిపాలన మహాభారతంలో కౌరవ పాలన మాదిరిగా సాగిందని విమర్శించారు. కేసీఆర్ మరో దృతరాష్ట్రుడు, తెలంగాణ శిశుపాలుడు అంటూ జగ్గారెడ్డి ఎద్దేవా చేశాడు.  సోనియా గాంధీని బొమ్మ అని విమర్శించిన టీఆర్ఎస్ నేత కేటీఆర్‌ సంగతి ప్రజలే చూస్తారని, తగిన విధంగా బుద్ది చెబుతారని అన్నారు. సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ తీసుకురాలేని దద్దమ్మఅని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పై మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ తీసుకొస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. తాను గెలిచిన ఆరు నెలల్లోగా నియోజకవర్గంలో 40 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని, నియోజకవర్గంలోని ప్రతి డ్వాక్రా గ్రూప్‌కు భవనాలు కట్టిస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు.

వేధింపుల ఆరోపణలతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా

  దేశంలో మీ టూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న వేళ  కేంద్ర మంత్రి పై వచ్చిన లైంగిక ఆరోపణలు సంచలనం రేపింది విదితమే.అయితే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఎంజే అక్బర్‌ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు, మహిళా సంఘాల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో ఆయన తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఏసియన్‌ ఏజ్‌లో ఎడిటర్‌గా పని చేసిన సమయంలో అక్బర్‌ తమను లైంగికంగా వేధింపులకు గురి చేశారంటూ పలువురు మహిళా పాత్రికేయులు ఆయనపై ఆరోపణలు చేశారు. మీటూ ఉద్యమంలో భాగంగా పాత్రికేయురాలు ప్రియా రమణి తొలిసారిగా అక్బర్‌పై ఆరోపణలు చేశారు. ఆమె తర్వాత దాదాపు 15 మంది మహిళలు ఇదే విధంగా అక్బర్‌పై ఆరోపణలు గుప్పించారు. అక్బర్‌ మాత్రం తనపై వస్తున్నా ఆరోపణలను ఖండించారు.ఇవన్నీ నిరాధారమైనవని, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కావాలనే తనపై ఇటువంటి ఆరోపణలు చేస్తున్నట్లు ఆయన తోసిపుచ్చారు.తనపై ఆరోపణలు చేసిన ప్రియా రమణిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్నిఆశ్రయించారు.ఆమెపై పటియాలా న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేశారు.తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయపరంగా పోరాడేందుకే ఆయన పదవికి రాజీనామా చేసినట్టు మంత్రిత్వశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.

ఎంపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం..!!

  రాజకీయ నాయకులు ఎవరు ఎప్పుడు ఏ పార్టీ లో ఉంటారో తెలియని పరిస్థితి.ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే పార్టీ మారే వారు కొందరు,టికెట్ రాలేదని అసంతృప్తితో పార్టీ మారేవారు కొందరు,ఒక పార్టీ టికెట్ పై గెలిచి మరో పార్టీ కి జంప్ అయ్యే వారు కొందరు.ఎలా అయితేనేం తమకు అనుకూలంగా ఉన్న స్థానం కోసం పార్టీలు మారుతూనే ఉంటారు.ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం త్రిముఖ పోరు నడుస్తున్నదనే చెప్పుకోవాలి.నిన్న మొన్నటి వరకు టీడీపీ, వైసీపీ మధ్య నాయకుల మార్పులు జరిగాయి.కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ దూకుడు పెంచటంతో ఈ రెండు పార్టీల్లో టికెట్ రాదు అని భావించిన కొందరు జనసేన వైపు అడుగులు వేస్తున్నారు.ఇప్పటికే పలువురు నేతలు ఈ పార్టీల నుంచి జనసేనలో చేరగా తాజాగా వైసీపీ నేత చలమలశెట్టి సునీల్ జనసేనలో చేరనున్నట్లు సమాచారం. గతంలో సునీల్ కాకినాడ పార్లమెంట్ స్థానానికి  వైసీపీ తరుపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.కొంత కాలంగా సునీల్ టీడీపీ లో చేరతారంటూ వార్తలు వచ్చాయి.ఒకవేళ సునీల్ టీడీపీ లో చేరితే కాకినాడ పార్లమెంట్ స్థానం కేటాయించాలని పార్టీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.అయితే కొన్ని రోజుల క్రితం జనసేన అధినేతని కలిసిన ఫోటోలు వైరల్ అవ్వటంతో సునీల్ ఆ పార్టీలో చేరుతున్నట్టు భావించారు.కానీ సునీల్‌ కాకినాడ పార్లమెంటు టిక్కెట్టుతో పాటు తన బంధువు ఒకరికి జగ్గంపేట జనసేన టిక్కెట్టు ఇవ్వాలని షరతు పెట్టినట్టు తెలుస్తోంది.సునీల్‌ షరతుపై జనసేన నుంచి ఏ విధమైన హామీ రాకపోవడంతో చేరికను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సునీల్‌ టీడీపీలో చేరకపోతే కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి రాజప్ప పేరు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.డిప్యూటీ సీఎంగా, హోంమంత్రిగా జిల్లాలో పార్టీ కేడర్‌ని కలుపుకునిపోవడంలో చంద్రబాబు మన్ననలు పొందారు. రాజప్ప అయితే కాకినాడ పార్లమెంటు స్థానాన్ని గెలుపొందడం సునాయాసం అవుతున్నది పార్టీ అధిష్ఠానం యోచనగా కనిపిస్తోంది. స్థానికేతరుడైన రాజప్ప పెద్దాపురం అసెంబ్లీ నుంచి 2014లో పోటీచేసి హోంమంత్రి అయ్యారు. ఈ దఫా పెద్దాపురం నుంచి అదే సామాజికవర్గానికి చెందిన స్థానికులకు అవకాశం ఇవ్వాలన్న డిమాండు వస్తోంది.రాజప్ప కూడా దీనిని సమర్థిస్తున్నారు. ’నేను ఎంపీగా వెళ్తే... పార్టీ మారకుండా ముందు నుంచీ నమ్మకంగా ఉన్నవారికే టిక్కెట్టు ఇప్పిస్తాను’ అని ఇప్పటికే రాజప్ప కొందరికి భరోసా కూడా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

టికెట్ రాలేదా?..పార్టీ పదవి ఖాయం!!

  తెరాస పార్టీని గద్దె దింపాలని మహాకూటమిగా ఏర్పడ్డాయి ప్రతిపక్ష పార్టీలు.ఉమ్మడి ఎన్నికల ముసాయిదా కూడా సిద్ధం చేసాయి.కానీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ మాత్రం పూర్తి కాలేదు.అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు ప్రారంభించింది.తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ కుంతియా,పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ లో పార్టీ సీనియర్‌ నేతలు గులాంనబీ ఆజాద్‌, ఏకే ఆంటోనీలను కలిశారు.మహాకూటమి, సీట్ల సర్దుబాటు అంశాలపై చర్చించారు. తెదేపా, సీపీఐ, తెజస నేతలతో చర్చించిన అంశాలను కోర్‌కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. కుంతియా భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు.మహాకూటమిపై చర్చల్లో పురోగతి బాగుందని,చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని,త్వరలోనే సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వస్తుందన్నారు.తెజస, కాంగ్రెస్‌సీట్ల సర్దుబాటు విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని పార్టీ శ్రేణులను కోరారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై కోదండరాంతో మూడు సార్లు చర్చించినట్లు వివరించారు. ఈ నెల చివరిలోగా సీట్ల సర్దుబాటు పూర్తవుతుందని కుంతియా పేర్కొన్నారు. ఈ నెల 20న రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటిస్తారని, త్వరలో సోనియాగాంధీ కూడా పర్యటించనున్నారని తెలిపారు.కొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, ముగ్గురు బలమైన అభ్యర్థులున్నారని,టికెట్‌ రాని వారు నిరాశ చెందొద్దని,పార్టీ అధికారంలోకి వచ్చాక,ప్రభుత్వంలో పదవులు ఇచ్చి వారికి న్యాయం చేస్తామని అన్నారు.

దొరకని కేసీఆర్ అపాయింట్మెంట్..కాంగ్రెస్ వైపు అడుగులు

  తెలంగాణ రాజకీయాల్లో కాకా గా గుర్తింపు పొందిన నేత జి.వెంకటస్వామి.కాంగ్రెస్‌లో దశాబ్దాల పాటు ఉండి.. ఆ కాంగ్రెస్‌ నేతగానే చనిపోయిన దిగ్గజం. అలాంటి కాకా కుమారులు ఇద్దరూ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య అటూ ఇటూ జంపింగ్ చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో వినోద్, వివేక్ 2013 జూన్ 2వ తేదీన కాంగ్రెసును వీడి టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందిన తర్వాత 2014 ఏప్రిల్ ఎన్నికలకు పక్షం రోజుల ముందు తిరిగి కాంగ్రెస్ లో చేరారు.వినోద్ చెన్నూరు శాసనసభ నియోజకవర్గానికి, వివేక్ పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2016లో టిఆర్ఎస్ లో చేరారు. ఈ నేపథ్యంలో వివేక్ కు ప్రభుత్వ సలహాదారు పదవి లభించింది.  రానున్నఎన్నికల్లో వినోద్‌కు చెన్నూరు అసెంబ్లీ టికెట్, వివేక్‌కు పెద్దపల్లి లోక్‌సభ టికెట్ ఇవ్వడం లాంఛనమే అని అంతా భావించారు. కానీ చెన్నూరు టికెట్ పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కేటాయించారు.దీనిపై కేసీఆర్ ని కలవటానికి ప్రయత్నిస్తున్న ఈ సోదరులకు అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదని తెలుస్తుంది.మరోవైపు అసంతృప్త నాయకులను బుజ్జగిస్తున్న కేటీఆర్ ను కలిసి మంతనాలు జరిపారు.తన సోదరునికి చెన్నూరు టికెట్ ఇస్తే తాను పెద్దపల్లి లోక్ సభ స్థానం వదులుకోవడానికి అయినా సిద్ధమని కేటీఆర్ కి వివేక్ తెలిపారట.కానీ కేటీఆర్ మాత్రం అభ్యర్థులను మార్చటం కుదరదు అని తేల్చిచెప్పేశారని తెలుస్తుంది.దీంతో అసహనానికి గురైన సోదరులు పార్టీ మారే యోచనలో ఉన్నారని,మారితే తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే చేరతాని సమాచారం.ఒకవేళ ఇద్దరు పార్టీ మారితే టీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలినట్లే

ముందస్తు ఎన్నికలపై మావోల బహిరంగ లేఖ

  తెలంగాణలో 9 నెలల ముందే కేసీఆర్‌ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నది తెలిసిందే.అలాగే ఆజన్మ శత్రువులుగా ఉన్న టీడీపీ,కాంగ్రెస్ పార్టీలు తెరాస ని గద్దె దింపాలనే లక్ష్యంతో పొత్తులో భాగంగా మహాకూటమిగా ఏర్పడినది కూడా విదితమే.మహాకూటమిలోని పార్టీలు , తెరాస పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.అధికార,ప్రతిపక్ష పార్టీలు కాబట్టి విమర్శలు చేసుకోటంలో కొత్త ఏం లేదు.కానీ అనూహ్యంగా మావోయిస్టులు ముందస్తు ఎన్నికలు,పొత్తుపై బహిరంగ లేఖ విడుదలచేసి సంచలనం రేపారు. బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్‌ పేరుతో లేఖ విడుదలైంది.కేసీఆర్‌ సర్కార్‌ దోపిడీ, అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో హామీలు నెరవేర్చలేదని, తెలంగాణ జన సమితి చేస్తున్న అవకాశవాద రాజకీయాలను నిరసించాలని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన రాజకీయపార్టీలతో కాంగ్రెస్‌ పొత్తా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తామని లేఖలో హరిభూషణ్ స్పష్టం చేశారు.కుల వివక్ష, పరువు హత్యలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ధర్నాచౌక్ ను పునరుద్ధరించి ప్రజల ప్రాథమిక హక్కులను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రాఫెల్‌ రచ్చ.. మరో మచ్చ

  బీజేపీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి కాంగ్రెస్ కి దొరికిన అస్త్రం రాఫెల్ డీల్. కాంగ్రెస్ పార్టీ అవకాశం దొరికినప్పుడల్లా రాఫెల్ స్కాం అంటూ బీజేపీ మీద విమర్శలు చేస్తోంది. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే ఈమధ్య కాలంలో రాఫెల్ అనే పదం లేకుండా స్పీచ్ ఇచ్చిన సందర్భాలు లేవనే చెప్పాలి. కాంగ్రెస్ రాఫెల్ తో బీజేపీని అంతలా టార్గెట్ చేసింది మరి. దానికి తగ్గట్టే రాఫెల్‌ యుద్ధవిమానాల స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. రాఫెల్స్‌ను తయారుచేసే సంస్థ డసో ఏవియేషన్‌ తన ఉద్యోగ సంఘాలతో జరిపిన అంతర్గత సమావేశ వివరాలను వెల్లడించే మరో రెండు పత్రాలు తాజాగా లీకయ్యాయి. పోర్టెయిల్‌ ఏవియేషన్‌ అనే ఫ్రెంచి వెబ్‌సైట్‌ వీటిని బయటపెట్టింది. అనిల్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌ను ఎందుకు తాము భాగస్వామిగా ఎంచుకోవాల్సి వచ్చిందో డసో ఏవియేషన్‌ డిప్యూటీ సీఈవో లోయిక్‌ సెగాలెన్‌ ఇచ్చిన వివరణ ఈ పత్రాల్లో ఉంది. సీఎఫ్‌డీటీ, సీజీటీ అనే రెండు ట్రేడ్‌ యూనియన్లతో సెగాలెన్‌ 2017 మే 11న జరిపిన సమావేశపు మినిట్స్‌ను పోర్టెయిల్‌ ఏవియేషన్‌ ప్రచురించింది. 'డసో రిలయన్స్‌ ఏరోస్పేస్‌ పేరుతో నాగ్‌పుర్‌లో ఒక సంస్థను ఏర్పాటు చేయడాన్ని వివరిస్తూ.. భారత్‌కు రాఫెల్ యుద్ధవిమానాల ఎగుమతి కాంట్రాక్టును పొందడం కోసం ఈ పరిహారాన్ని డసో ఏవియేషన్‌ ఆమోదించడం తప్పనిసరైంది’ అని పేర్కొంది. భారత్‌లో తయారీని ప్రస్తావిస్తూ.. ఒప్పందంలో భాగంగా ఇది భారత్‌ విధించిన తప్పనిసరి పరిణామం అని పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని అందుకోవడం కోసం రిలయన్స్‌తో భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

దొంగలనుకొని పోలీసులను బంధించిన గ్రామస్తులు

  నేరస్తులను పట్టుకోడానికి పోలీసులు మఫ్టీలో తిరుగుతుంటారు.కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు. మఫ్టీలో ఓ నిందితుడిని పట్టుకొనేందుకు తమిళనాడుకు వెళ్లిన ఆంధ్ర పోలీసులను దొంగలుగా భావించిన అక్కడి గ్రామస్తులు వారిని పట్టుకుని ఇంట్లో పెట్టి తాళాలు వేసారు. సత్తువాచేరి మేలకుప్పం కొండ ప్రాంతంలోని ఇలవన్‌తోపుకు చెందిన రామకృష్ణన్‌ పై  ఆంధ్ర రాష్ట్రం అనంతపురం జిల్లా ధర్మవరం పోలీస్‌స్టేషన్‌లో 40కి పైగా దోపిడీ కేసులున్నాయి. అతడి కోసం గాలిస్తున్న పోలీసులకు ఇలవన్‌తోపులో రామకృష్ణ తల దాచుకున్నట్లు సమాచారం అందింది. దీంతో ధర్మవరం ఎస్‌ఐ సిరిహర్ష నేతృత్వంలో ఐదుగురు పోలీసులు రాత్రి వేళలో మఫ్టీలో ఇళవన్‌తోపుకు చేరుకుని రామకృష్ణన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇంతలో, అక్కడకు చేరుకున్న గ్రామస్తులు మఫ్టీలో వచ్చిన ఆంధ్ర పోలీసులను దొంగలుగా భావించి ఓ ఇంట్లో తాళం వేశారు. సమాచారం అందుకున్న రత్నగిరి పోలీసులు అక్కడకు వెళ్లి వారు ఆంధ్ర పోలీసులని నిర్ధారించారు. ఇంతలో రామకృష్ణన్‌ పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం అక్కడే రామకృష్ణన్‌ ని  అరెస్ట్‌ చేసిన ఆంధ్ర పోలీసులు అతడిని చిత్తూరుకు తీసుకెళ్లారు.

తెరాస ఎమ్మెల్యే అభ్యర్ధికి చేదు అనుభవం

  కేసీఆర్ ఓ పక్క గెలుపై ధీమా వ్యక్తం చేస్తుంటే మరో పక్క ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మాత్రం ప్రచారంలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.నాలుగేళ్లలో ఏం చేసారని ఓట్లు అడగటానికి వచ్చారని ప్రజలు నిలదీస్తున్నారు.తాజాగా మునుగోడు నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది.పంతంగి గ్రామంలో ప్రభాకర్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎస్సీ కాలనీ వద్దకు రాగానే, దళిత సంఘాలు, కాంగ్రెస్‌, సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. ఎస్సీ కమ్యూనిటీహాల్‌కు శంకుస్థాపనచేసి నాలుగేళ్లు కావస్తున్నా నేటికీ పూర్తిచేయలేదని, అసంపూర్తి భవనాన్ని పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. ఇదే సమయంలో గ్రామంలోని పలు సమస్యలపై నిలదీశారు. ప్రభుత్వ సబ్సిడీ ట్రాక్టర్లు అమ్ముకున్నారని, గ్రామాభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఆందోళనకారులను కూసుకుంట్ల సముదాయించే ప్రయత్నం చేస్తుండగా, అనుచరులు ఆందోళనకారులతో వాగ్వాదానికి దిగారు. కోపోద్రిక్తులైన టీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళనకారులపై విరుచుకపడ్డారు. ఇరువర్గాలు ఒకరినొకరు దూషించుకున్నారు. చొక్కాలు పట్టుకొని తోసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామకూడలివద్ద ప్రభాకర్‌రెడ్డి ప్రసంగిస్తుండగా, యువకులు, మహిళలు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మహిళలకు మంత్రివర్గంలో ఎందుకు స్థానం కల్పించలేదని, లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆందోళనకారుల నిరసనల మధ్య ప్రభాకర్‌రెడ్డి ప్రసంగాన్ని కొనసాగించారు.

కాంగ్రెస్‌ మేనిఫెస్టోని తెరాస కాపీ కొట్టింది

  తెలంగాణలో ఎన్నికల వేడి మొదలవడంతో పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేసి ప్రజలను ఆకట్టుకొనే పనిలో పడిపోయాయి. తాజాగా కేసీఆర్ కూడా తెరాస పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మేనిఫెస్టోపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడిన ఉత్తమ్.. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను మక్కీకి మక్కీ కాపీ కొట్టిన సీఎంది సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. నాలుగున్నర ఏళ్లు పదవిలో ఉండి పలు వాగ్దానాలు అమలుచేయని కేసీఆర్‌..రాష్ట్రంలోని రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు అందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గత కొన్నాళ్లుగా కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు సాధ్యం కాదని, దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్లన్నిటిని కలిపినా సరిపోవని హేళన చేసిన తండ్రీ కొడుకులు ఇప్పుడేం సమాధానం చెప్తారని కేసీఆర్‌, కేటీఆర్‌ లను ఉత్తమ్‌ ప్రశ్నించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం నాలుగున్నర ఏళ్ల పాలనలో ఎందుకు అమలు చేయలేదో చెప్పాలన్నారు. అబద్దపు మాటలతో మరోసారి మోసం చేయడానికి సీఎం ప్రయత్నిస్తున్నారన్న విషయాన్ని తెలంగాణ సమాజం గ్రహించాలని కోరారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఏం అమలు చేశారు? ఏం చేయలేదో? అనే వాటి గురించి చెప్పకుండా కాంగ్రెస్‌ వాగ్దానాలను కాపీ కొట్టడం కన్నా దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నపుడు ఏకకాలంలో రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నన్నాళ్లు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదు? పైగా కాంగ్రెస్‌ ఇచ్చిన హామీనే ఏ ప్రాతిపదికన చేస్తారని మండిపడ్డారు. అంతమంది నిరుద్యోగులు ఎక్కడ ఉన్నారు? అంతమందికి డబ్బులు ఎలా ఇస్తారని మాట్లాడిన కేసీఆర్‌ ఇప్పుడు.. తెలంగాణలో 12, 13 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అంగీకరించారని తెలిపారు. ఇన్నాళ్లు మోసం చేసినందుకు నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. వివిధ రకాల పింఛన్లను పెంచుతామని కాంగ్రెస్‌ ఎప్పటి నుంచో చెబుతుంటే ఇన్నాళ్లు నిద్రపోయి ఇప్పుడు తామూ పెంచుతామంటూ కేసీఆర్‌ ప్రకటించారని దీనికి గాను ఆయా వర్గాలకు కూడా క్షమాపణలు చెప్పాలన్నారు. హైదరాబాద్‌లో లక్ష, ఇతర అన్ని జిల్లాల్లో కలిపి 1.60 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని మాట తప్పిన కేసీఆర్‌..ఇప్పుడు మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. రూ.5లక్షలతో సొంత స్థలంలోనే లబ్ధిదారులకు రెండు పడకల ఇళ్లు కట్టిస్తామని కాంగ్రెస్‌ ఇచ్చిన హామీని కూడా కేసీఆర్‌ కాపీ కొట్టారని ఆరోపించారు. తెరాస పాలనలో 4500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఒక్క బాధిత కుటుంబాన్నీ కేసీఆర్‌ పరామర్శించలేదని విమర్శించారు. ఏకకాలంలో రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసి.. ఇప్పుడు మరోసారి అదే హామీతో దగా చేసేందుకు కేసీఆర్‌ సిద్ధమయ్యారని మండిపడ్డారు. మొత్తానికి ఉత్తమ్ కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోని అంశాలతో తెరాస పాక్షిక మేనిఫెస్టోను పోల్చుతూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబు యూటర్న్‌

  ఐసీయూలో ఉన్న కాంగ్రెస్‌ను చంద్రబాబు బతికించాలని చూస్తున్నారని కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. గుంటూరు ఇన్నర్‌ రింగ్‌రోడ్డు వద్ద భాజపా రాష్ట్ర కార్యాలయ భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర పునర్విభజన చట్టం అమలుకు సిద్ధంగా ఉన్నామని,విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మరింత కృషిచేస్తున్నట్టు చెప్పారు.రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదా పేరుతో యూటర్న్‌ తీసుకున్నారని విమర్శించారు. విజయవాడ అభివృద్ధికి రూ.1000 కోట్లు, అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లు ఇచ్చామని రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలను రాజ్‌నాథ్‌ చెప్పుకొచ్చారు. పోలవరం నిర్మాణానికి నూటికి నూరు శాతం నిధులు ఇస్తున్నట్టు స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎనిమిది బెటాలియన్లు మంజూరు చేశామని, అదీ రాష్ట్ర అభివృద్ధి పట్ల తమ నిబద్ధత అన్నారు.ఏపీకి ప్రత్యేక ప్యాకేజీనే కాదు స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నాం అని అన్నారు.

పవన్‌కు ఒక్క సీటూ కూడా రాదు: జలీల్‌ఖాన్‌

  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాటన్‌ బ్యారేజ్‌పై కవాతు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన టీడీపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. అయితే పవన్ ధీటుగా పలువురు టీడీపీ నేతలు ఇప్పటికే ఆయనకి కౌంటర్ ఇచ్చారు. తాజాగా మరోనేత టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ కూడా తనదైన పవన్ కి కౌంటర్ ఇస్తూ విమర్శలను తిప్పికొట్టారు. కవాతు పేరుతో పిచ్చి ప్రేలాపనలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టాలకు ఎదురీదుతూ రాజకీయ అనుభవంతో రాష్ట్రాన్ని నెట్టుకొస్తున్న సీఎం చంద్రబాబును విమర్శించే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని.. నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. విశాఖ జిల్లాలోని గిరిజన ప్రాంతంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యకు గురైతే ఇంతవరకు పరామర్శించే తీరిక పవన్‌కు లేదని, దీన్ని బట్టి చూస్తే గిరిజనులపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందని విమర్శించారు. రాజకీయ కుటుంబంలో వారసుడు రాజకీయ నాయకుడు ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. పవన్‌, అతని కుటుంబసభ్యులు సినీ హీరోలు ఎలా అయ్యారని అన్నారు. పేదపార్టీ అని చెప్పుకునే పవన్‌కు.. ఆకాశం నుంచి పూలు చల్లించుకునేందుకు డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు. రాజకీయాల్లో హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు వచ్చాయని, వచ్చే ఎన్నికల్లో పవన్‌కు ఒక్క సీటు కూడా రాదన్నారు. బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్‌లను పవన్‌ చదువుతారని విమర్శించారు. గత ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు సానుభూతి వల్ల 67 సీట్లు వచ్చాయని, ఈసారి 30 సీట్లు కూడా కష్టమేనని జోస్యం చెప్పారు. ప్రజాసమస్యల కంటే ప్రభుత్వంపై విమర్శలకే జగన్‌ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని జలీల్‌ఖాన్‌ ఆరోపించారు.

కుటుంబ రాజకీయాలకి చెల్లు చీటీ

  రాజకీయాల్లో కుటుంబ రాజకీయాలకు కొదవే లేదు.తమ తర్వాత తమ కుటుంబానికి చెందిన వారే ఆ స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటారు రాజకీయ నాయకులు.కానీ ఇందుకు భిన్నంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ కుటుంబ రాజకీయాలకు చెల్లుచీటి పాడారు.నితీశ్‌ కుమార్ ఇటీవల జేడీయూ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ ని జేడీయూ ఉపాధ్యక్షుడిగా నియమించారు.ఇకనుంచి ఆయనది పార్టీలో రెండో స్థానం అని ఇతర నాయకులు, కార్యకర్తలకు సూచించారు.సీఎం నితీశ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను అధికారంలోకి తీసుకొచ్చిన వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్‌ గుర్తింపు పొందారు.గత నెలలో జేడీయూలో ప్రశాంత్ కిశోర్‌ చేరినప్పుడే 'ఆయనే ఇకనుంచి పార్టీని నడిపిస్తాడని పార్టీ సభ్యులకు' నితీశ్‌ వెల్లడించారు.తన తరవాత స్థానం కిశోర్‌దేనని సూచన ప్రాయంగా వెల్లడించారు. ప్రజారోగ్య నిపుణుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన కిశోర్‌ ఐరాస ఆధ్వర్యంలో నడిచిన అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించారు.అనంతరం భాజాపాకు దూరంగా జరిగిన ఆయన బిహార్‌లో 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ను ఒక్కతాటి మీదకు తీసుకువచ్చి విజయాన్నికట్టబెట్టారు. ఈ సమయంలోనే నితీశ్‌, ప్రశాంత్ మధ్య సమన్వయం కుదిరిందని సమాచారం.డీఎంకే, సమాజ్‌వాదీపార్టీ లాంటి తదితర ప్రాంతీయ పార్టీలు తమ సంతానాన్నే రాజకీయ వారసులుగా ప్రకటించగా నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయం రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలికారు.అయితే ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరకముందే అనగా రెండు నెలల క్రితమే 'పార్టీ భవిష్యత్ కార్యాచరణను కిశోర్‌ నిర్ణయిస్తారని' నితీశ్‌ చెప్పినట్లు సమాచారం.

అవినీతిపై చర్చకు నేను సిద్ధం..కాంగ్రెస్‌ నేతలు సిద్ధమా?

ఏఐసీసీ అధికార ప్రతినిధి, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి  గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో తెరాస పాలనలో పట్టపగలే రాష్ట్ర సంపద దోపిడీకి గురవుతోందని, ఇదంతా కేసీఆర్‌ కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపించారు.తెలంగాణలో గుత్తేదారులు లేనట్లు..ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంపెనీలకు రూ.వేల కోట్ల పనులు కట్టబెట్టడం నిజం కాదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులకు సంబంధించి ఏకంగా రూ.77 వేల కోట్ల పనులను ఆ కంపెనీలకే అప్పగించారని, ఉద్దేశ పూర్వకంగా ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని మూడింతలు పెంచారని విమర్శించారు. ఈ తరహాలో పనులను అప్పగించడం దేశంలో ఎక్కడా చూడలేదని, భవిష్యత్తులోనూ చూడబోమని వ్యాఖ్యానించారు. ‘‘ప్రాజెక్టుల వాస్తవ వ్యయం కంటే దాదాపు 30 శాతం అంచనాలు పెంచి ఖర్చు చేశారు. అందులో కేసీఆర్‌ 6 శాతం కమీషన్‌ తీసుకోవడంతోపాటు..మంత్రులకు, తన కుటుంబ సభ్యులకు, భజనపరులకు ఎంత శాతం కమీషన్‌ ఇవ్వాలో కూడా ఆయనే నిర్ణయించారు’’ అని ఆరోపించారు. రూ.వేల కోట్లు ఖర్చయినా గ్రామాలకు పైపులు వచ్చాయి తప్ప నీళ్లు రాలేదని, ఎకరా భూమికి సాగునీరు పారలేదన్నారు. ‘‘కేసీఆర్‌ ఏ పని చేసినా ధైర్యంగా చేస్తాడు. ఆయన నిజాయితీ పరుడయితే  నేను చెప్పిన లెక్కలు తప్పని నిరూపించాలి’’ అని సవాల్‌ విసిరారు.     తెలంగాణ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన జైపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అవినీతికి అలవాటు పడిన కాంగ్రెస్‌ నేతలకు అందరూ అవినీతిపరులుగానే కనిపిస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు.‘కేంద్రమంత్రిగా ఉండి జైపాల్‌రెడ్డి పాలమూరు జిల్లాకు చేసింది శూన్యం. ఆయన తెలంగాణ ఉద్యమాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతి గురించి కాంగ్రెస్‌ పార్టీ మాట్లాడితే ప్రజలు నవ్వుతారు.కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన జలయజ్ఞం.. ధనయజ్ఞంగా మారిందని చంద్రబాబునాయుడు సహా అందరూ విమర్శించినోళ్లే. మిషన్‌ భగీరథ పథకం కింద రాష్ట్రంలో 15వేల గ్రామాల ప్రజలకు నీరందిస్తున్నాం. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు తెలుసుకోవాలి. ఆంధ్రా కంపెనీలను పెంచి పోషించింది కాంగ్రెస్‌ నేతలు కాదా?. జైపాల్‌రెడ్డి పుట్టి పెరిగిన కల్వకుర్తి నియోజకవర్గానికి తెరాస ప్రభుత్వం వచ్చాకే నీరందించాం. మేం అధికారంలోకి వచ్చాక 25లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం. ముఖ్యమంత్రి రేసులో తాను కూడా ఉన్నాను అని చెప్పుకునేందుకే జైపాల్‌రెడ్డి.. తెరాస ప్రభుత్వం, కేసీఆర్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అవినీతికి ఆస్కారం ఉన్న ఈపీఎస్‌ విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్‌ పార్టీయే. ప్రాజెక్టుల్లో అవినీతి గురించి కాంగ్రెస్‌ పార్టీ మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. ప్రాజెక్టుల్లో అవినీతిపై చర్చించేందుకు నేను సిద్ధం.. కాంగ్రెస్‌ నేతలు సిద్ధమా?’ అని హరీశ్‌రావు సవాల్‌ విసిరారు.

చిరంజీవి సినిమా అందరివాడు,కానీ ప్రజా జీవితంలో కొందరివాడు

పవన్ కళ్యాణ్ జనసేన కవాతు అనంతరం నిర్వహించిన భహిరంగ సభలో  ఒక సీఎం కొడుకే సీఎం కావాలా? ఒక సీఎం మనవడే సీఎం కావాలా? కానిస్టేబుల్ కొడుకు సీఎం కాకూడదా? అని ధ్వజమెత్తారు.దీనిపై ఏపీ ఆర్ధిక మంత్రి యనమల మాట్లాడుతూ ‘‘రాష్ట్రానికి ఎవరైనా సీఎం కావొచ్చు. అయితే ఆ వ్యక్తి ‘అందరివాడు’ కావాలి. మీ అన్నయ్య ‘అందరివాడు’ సినిమా తీశారు. కానీ ప్రజా జీవితంలో కొందరివాడిగానే మిగిలారు’’ అంటూ పవన్‌కల్యాణ్‌ ను ఎద్దేవా చేశారు.ప్రజారాజ్యం తరఫున పవన్‌‌ ప్రచారం చేసినా పాలకొల్లులో చిరంజీవి ఓడిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.2009లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయానికి దోహదపడ్డారని.. ఇప్పుడు జనసేన ఎవరిని గెలిపించడానికి ఎన్నికల్లో పోటీ చేస్తోందని ప్రశ్నించారు యనమల. ఎన్నికల తర్వాత జనసేన ఎవరితో కలిసిపోతుందో కూడా చెప్పాలన్నారు. అందరివాడు కాబట్టే చంద్రబాబు సుమారు 14 ఏళ్లుగా సీఎంగా కొనసాగుతున్నారన్నారు.     రాజమహేంద్రవరం కవాతు సందర్భంగా పవన్‌ చేసిన ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబును విమర్శించడమే లక్ష్యంగా పవన్‌ ప్రసంగం కొనసాగిందని యనమల ధ్వజమెత్తారు.దేశమంతా రాఫెల్ స్కామ్‌పై గగ్గోలు పెడుతుంటే పవన్ మాత్రం‌ ఎందుకు ప్రశ్నించటం లేదని యనమల నిలదీశారు. అవినీతిపై పోరాటం చేయాలనుకుంటే వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వైకాపా అధ్యక్షుడు జగన్‌పై చేయాలని సూచించారు. రాఫెల్ సూత్రధారి మోదీ, అవినీతి పరుడు జగన్‌లను వదిలేసి చంద్రబాబుపై ఆరోపణలు చేయడమేమిటని మండిపడ్డారు. భాజపా, వైకాపాలతో పవన్‌ లాలూచీ పడ్డారనేదానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని దుయ్యబట్టారు. రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన జగన్‌ను పవన్‌ వెనకేసుకు వస్తున్నారని ఆరోపించారు.దేశంలో అవినీతి రహిత రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని, ఆ విషయం కూడా తెలియని పవన్‌.. రాష్ట్రంలో అవినీతి జరుతోందనడం ఆయన అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ ఆఫ్‌ ఇండియా సర్వే ఏపీలో అవినీతి అతి తక్కువని వెల్లడించిన విషయం పవన్‌కు తెలియకపోవటం విడ్డూరంగా ఉందన్నారు.

జగన్ కి పిచ్చి పట్టి సందులు, గొందుల్లో తిరుగుతున్నారు

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధవళేశ్వరం బ్యారేజ్ పై కవాతు నిర్వహించిన సంగతి తెలిసిందే.బ్యారేజ్ పై కవాతు నిర్వహించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు.సాగు, తాగునీరు అందించే బ్యారేజీలపై కవాతులు, బల ప్రదర్శనలు మానుకోవాలని జనసేన పార్టీకి సూచించారు. ప్రచారాలను జాతీయ రహదారులపై పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు.పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదని విమర్శిస్తున్న పార్టీలు క్షేత్ర స్థాయికి వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. జగన్‌ పాదయాత్రలో ఉన్నా.. ప్రాజెక్టులను అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు కేంద్రం నుంచి రూ.27వేల కోట్లకు పైగా పరిహారం రావాల్సి ఉందని.. కేంద్రం ఆ సొమ్మును విడుదల చేస్తే తాము నిర్వాసితులకు ఇచ్చేస్తామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు ఖర్చును, నిర్మాణం జరుగుతున్న తీరును ఆన్‌లైన్‌లో పెడుతున్నామని ప్రపంచంలో ఎవరైనా ఆ లెక్కలు చూసుకోవచ్చని తెలిపారు.పోలవరం ప్రాజెక్టును ఇప్పటివరకు 1 లక్షా 47 వేల మంది పోలవరం ప్రాజెక్టును సందర్శించారని.. ప్రతిపక్ష నేత జగన్‌ ఒక్కసారి కూడా చూడకపోవటం శోచనీయమని మంత్రి అన్నారు. పాదయాత్రలో 108 వాహనాలపై జగన్‌ ఆడిన డ్రామాను ప్రజలంతా చూశారని.. ముఖ్యమంత్రి పదవి పిచ్చిపట్టి జగన్‌ సందులు, గొందుల్లో తిరుగుతున్నారని మండిపడ్డారు. 2019లో జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. 57 ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో ఇప్పటికే 15 ప్రాజెక్టులను ప్రారంభించామని.. మరో 16 కొత్త ప్రాజెక్టులను సైతం పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు తెలిపారు.ఓ భాజపా ఎంపీ దిల్లీలో కూర్చుని తెదేపాపై విమర్శలు చేస్తున్నారని.. ఆయన ఏ రాష్ట్రానికి చెందిన ఎంపీయో ఎవరికీ తెలియదని జీవీఎల్‌ను ఉద్దేశించి విమర్శించారు.

ఎస్టీ నియోజకవర్గం నుంచి ఎలా పోటీచేస్తావ్ పవన్?

  టీడీపీపై,చంద్రబాబుపై ఎవరైనా విమర్శలు చేస్తే అసలు సహించరు,మాటకి మాట తిప్పికొట్టటంలో ముందుంటారు.ఆయనే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.తాజాగా పవన్ కళ్యాణ్ ధవళేశ్వరం బ్యారేజ్  పై కవాతు నిర్వహించి,అనంతరం నిర్వహించిన భహిరంగ సభలో లోకేష్ పై విమర్శలు చేశారు.దీనిపై సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా లోకేష్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎలా అవుతారంటూ పవన్ అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ లెక్క ప్రకారం.. జిల్లా కలెక్టరుగా పని చేయాలంటే ముందు బిల్‌ కలెక్టరుగా పనిచేయాలేమోనని ఎద్దేవా చేశారు.ప్రజలు తనను సినిమా హీరోగా చూస్తున్నారా? లేక రాజకీయ నాయకుడిగా చూస్తున్నారా? అనేది పవన్‌కల్యాణ్‌ ఆలోచించుకోవాలని సోమిరెడ్డి సూచించారు. ఓ వైపు అహింసావాదిని అంటారని..మరోసారి దెబ్బకు దెబ్బ తీయాలంటారని విమర్శించారు. ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి అయితే...యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌‌‌ అని అన్నారు. ప్రజారాజ్యం తర్వాత పవన్‌ జనసేన పార్టీ పెట్టారన్నారు. సీఎం పదవిపై ఆశ లేదని ఓసారి చెబుతారని.. మరోసారి ముఖ్యమంత్రి కావాలంటారని మంత్రి దుయ్యబట్టారు. తితలీ తుపానుతో ప్రజలు అల్లాడుతుంటే కవాతు చేస్తున్నారని...అసలు కవాతుకు అయిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కానిస్టేబుల్‌ కుమారుడు సీఎం కాకూడదా అని పవన్‌ ప్రశ్నించారని...ఛాయ్‌వాలాగా ఉన్న మోదీ ప్రధాని అయ్యారని గుర్తుచేశారు.ఎస్టీ నియోజకవర్గం పాడేరు నుంచి పోటీ చేస్తానన్న పవన్‌కు రాజకీయ పరిజ్ఞానం ఉందా అని అన్నారు.తోలు తీస్తా.. తాట తీస్తా.. గోదాట్లో కలిపేస్తా.. ఈ తరహా భాష ఏ రాజకీయ పార్టీ ఉపయోగించదని.. ఈ భాషనే పవన్ తన మేనిఫెస్టోలో పెడతారా? అని ప్రశ్నించారు.వారసత్వ రాజకీయాలు గురించి మాట్లాడే పవన్..., తన అన్న వారసత్వం నుంచే తాను రాజకీయాల్లోకి రాలేదా అని ప్రశ్నించారు.మోడీతో జగన్-పవన్ ప్రయాణం ఖాయమైందని.. ఇది ప్రజల అభిప్రాయమని అన్నారు.