పాపం వారిద్దరి పరిస్థితి ఏంటి కేసీఆర్?
posted on Oct 25, 2018 @ 1:16PM
కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే తొలివిడతగా ఒకేసారి 105 అభ్యర్థులను ప్రకటించారు. తరువాత మరో ఇద్దరు అభ్యర్థులను కూడా ప్రకటించారు. కానీ ఇద్దరు సీనియర్ నేతల విషయంలో మాత్రం కేసీఆర్ వైఖరి ఏంటో ఎవరికీ అర్థంకావడంలేదు. ఆ ఇద్దరు సీనియర్ నేతలు ఎవరో కాదు.. ఒకరు కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి.. మరొకరు ఇటీవలే కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్. ఈ ఇద్దరు నేతలకి టిక్కెట్ విషయంలో ఇంతవరకు స్పష్టత రాలేదు. అసలు వీరికి ఏ నియోజకవర్గాల టిక్కెట్ దక్కుతాయి అంటూ అనుచరులు ఆందోళన చెందుతున్నారు. నాయిని నర్సింహారెడ్డి తెరాస అధిష్టానం ముందు రెండు ఆప్షన్లు పెట్టారు. ముషీరాబాద్ నుంచి తన అల్లుడు, కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని.. అది వీలు కాకపోతే తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే, అధిష్ఠానం ఈ సీటు విషయంలో ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో నాయినితో పాటు ఆయన అనుచరులు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అని ఎదురు చూస్తున్నారు.
ఇక దానం నాగేందర్ విషయానికొస్తే.. మొదట్లో తనకు ఖైరాతాబాద్ టిక్కెట్ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తర్వాత అధిష్ఠానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు. కానీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయం ఇప్పటి వరకు తేలలేదు. ఖైరతాబాద్ నుంచి ముగ్గురు టిక్కెట్ రేసులో ఉన్న నేపథ్యంలోనే ఇక్కడి అభ్యర్థిని ప్రకటించకుండా తెరాస అధిష్టానం పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు దానంను గోషామహల్ నుంచి బరిలోకి దింపుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ విషయంలోనూ స్పష్టత లేదు. ఒకప్పుడు హైదరాబాద్ నగర రాజకీయాల్లో చక్రం తిప్పిన దానం ఇప్పుడు పార్టీ అధినేత ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు అంటూ దానం మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు. పాపం ఈ ఇద్దరు సీనియర్ నేతలకు కేసీఆర్ ఎప్పుడు స్పష్టత ఇస్తారో ఏంటో.