కేసీఆర్‌ రాజకీయాల నుంచి విరమించుకుంటే మంచిది

  టీడీపీ సీనియర్‌ నేత దేవేందర్‌గౌడ్‌ తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘాటు లేఖ రాశారు.కేసీఆర్‌ అమూల్యమైన నాలుగున్నరేళ్ల కాలాన్ని పరిపాలన చేతకాక వృథా చేశారని దేవేందర్‌గౌడ్‌ ధ్వజమెత్తారు.పరిశ్రమలకు అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు, సమర్థమైన యువత అందుబాటులో ఉన్నా పెట్టుబడులు ఆహ్వానించటంలో విఫలం అయ్యారని విమర్శించారు.బంగారు తెలంగాణ పేరుతో అనైతిక పనులకు పాల్పడ్డారని ఆరోపించారు.సాగునీటి ప్రాజెక్ట్‌ల రీడిజైనింగ్‌ పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టారని మండిపడ్డారు. మనం ప్రజస్వామ్యంలో ఉన్నామా?, రాచరికంలో ఉన్నామా? అర్థం కానీ పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందన్నారు.కనీసం మంత్రులకు సైతం కేసీఆర్‌ దర్శన భాగ్యం దొరకడంలేదని విమర్శించారు.కేసీఆర్ భాష, ప్రవర్తనతో తెలంగాణకు మాయని మచ్చ తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు.ప్రజాస్వామిక మౌలిక సూత్రాలకు విరుద్ధంగా కులాల పేరుతో విభజించు- పాలించు సూత్రాన్ని అమలు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.ఇప్పటికైనా రాజకీయాల నుంచి విరమించుకుంటే మంచిదని కేసీఆర్‌కు హితవు పలికారు. తెలంగాణలో మరో ఉద్యమం రాకుండా నివారించినవారవుతారని స్పష్టం చేశారు. మిత్రమా మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు దేవేందర్‌గౌడ్‌ లేఖలో పేర్కొన్నారు.

టీడీపీతో కాంగ్రెస్ పొత్తు.. రాష్ట్ర నేతలకు చెప్పారా?

  భాజపాయేతర కూటమి ఏర్పాటు దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమైన చంద్రబాబు ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం పట్ల ఆ పార్టీలోని కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తును వ్యతిరేకిస్తూ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేయగా, ఆ బాటలోనే మరో సీనియర్ నేత సి.రామచంద్రయ్య నడుస్తున్నారు. చంద్రబాబుతో పొత్తును వ్యతిరేకిస్తూ సి.రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీతో పొత్తుపై రాష్ట్ర నేతలతో అధిష్టానం చర్చించలేదని ఆయన అన్నారు.  చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిపై ఎంత చెప్పినా తక్కువే అని, ఈ పాపాలను తమెలా మోయాలని రామచంద్రయ్య ప్రశ్నించారు.ఉన్నపళంగా చంద్రబాబు పవిత్రుడని ఎలా చెప్పాలని నిలదీశారు.పొత్తుపై రాహుల్‌ తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమన్నారు.పొత్తుతో రాజకీయంగా ఫలితం ఉంటుందో లేదో తెలియదని...కానీ తాము నైతికంగా పతనమయ్యామన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుతో పొత్తా అని ప్రశ్నించారు. 

చంద్రబాబు ఊసరవెల్లిని మించిపోయారు

  కాంగ్రెస్, టీడీపీ దోస్తీ గురించి ఇతర పార్టీ నేతలు చంద్రబాబు మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియా సమావేశంలో.. గతంలో ఎన్టీఆర్ తనకు చంద్రబాబు ద్రోహం చేశారంటూ వ్యాఖ్యానించిన వీడియోలను ప్రదర్శించారు. అంతేగాక, చంద్రబాబు గతంలో కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని విమర్శించిన వీడియోలను కూడా చూపించారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు చివరకు కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకుని ఊసరవెల్లిని మించిపోయారని విమర్శించారు. స్టాచూ ఆఫ్ యూనిటీకి సర్దార్ పటేల్ నిదర్శనమైతే.. స్టాచూ ఆఫ్ ఆపర్చునిటీ, అవినీతికి నిదర్శనం చంద్రబాబేనని అన్నారు. చంద్రబాబుకు రోజుకో మాట మాట్లాడటం అలవాటని విమర్శించారు. ఆయన అపరిచితుడని, మానసిక వ్యాధితో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దోచేసిన సొమ్మును లాక్కుంటారని భయంతోనే చంద్రబాబు దేశం మొత్తం తిరుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కలిస్తే ఉరివేసుకుంటానని ఓ మంత్రి, ప్రజలు బట్టలూడదీసి కొడతారని మరో మంత్రి గతంలో అన్నారని ఇప్పుడు వారేమంటారని ప్రశ్నించారు. ఆత్మగౌరవం ఉంటే వెంటనే టీడీపీ నుంచి బయటికి రావాలని మీడియా ద్వారా తమ్ముళ్లను కోరుతున్నానని కన్నా తెలిపారు. రాజకీయ వ్యభిచారం చేసే వ్యక్తితో మీరుంటారా? అని ప్రశ్నించారు. బయటికి వచ్చి ఆత్మగౌరవంతో తలెత్తుకుని నిలబడండని కన్నా పిలుపునిచ్చారు.

చంద్రబాబుపై పోసాని సంచలన వ్యాఖ్యలు

  ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే పలు పార్టీల నేతలు తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.తాజాగా ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్‌ జూబ్లిహిల్స్ అభ్యర్థి మాగంటి గోపినాథ్.. ఎల్లారెడ్డి గూడలోని పోసాని నివాసానికి వచ్చారు. టీఆర్ఎస్‌కు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.ప్రత్యేక రాష్ర్టం కలలు సాకారం కావాలంటే మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని పోసాని ఆకాంక్షించారు.తాను టీఆర్ఎస్‌ పార్టీకే ఓటేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలోని ఆంధ్రులంతా టీఆర్ఎస్‌కు ఓటు వేయాలని కోరారు. తెలంగాణ వాసులను మళ్లీ మోసం చేసేందుకే చంద్రబాబు వస్తున్నారని విమర్శించారు.బాబు మాటలు నమ్మి ఓటేస్తే మరో యాభై ఏళ్లు వెనక్కి వెళ్తారని పోసాని వ్యాఖ్యానించారు. దేశంలో చంద్రబాబు లాంటి మోసగాడు మరొకరు లేరని అన్నారు. చంద్రబాబు బతికి ఉన్నంత కాలం నిజాలు చెప్పరని....నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని చంద్రబాబుకు శాపం ఉందని పోసాని తెలిపారు.చంద్రబాబు వ్యవస్థలను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు.తెజస అధినేత కోదండరాం అంటే తనకు ఎంతో గౌరవమని.. అయితే ఆధారాలతో విమర్శలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

కూకట్ పల్లి బరిలో విజయశాంతి.. ప్రచారానికి బాలయ్య

    తెలంగాణలో డిసెంబర్ 7 న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. తెరాస, మహాకూటమి అధికారం కోసం నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడుతున్నాయి. ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్ తమ పార్టీ స్టార్ క్యాంపైనర్ గా విజయశాంతిని నియమించిన విషయం తెలిసిందే. విజయశాంతి ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, ప్రచార బాధ్యతలు మాత్రమే చూసుకుంటానని అన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం విజయశాంతిని ఎన్నికల బరిలోకి దింపాలని భావిస్తోందట. విజయశాంతి దుబ్బాక నుంచి పోటీ చేస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఆమెను కూకట్ పల్లి నుంచి పోటీకి దించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సీటును వాస్తవానికి టీడీపీ ఆశించింది. టీడీపి నేత పెద్దిరెడ్డి ఈ సీటు నుంచి పోటీ చేయడానికి ఆసక్తి కనబరిచారు. అయితే ఆయనను పోటీకి దూరంగా ఉంచుతూ.. ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన పోటీ చేయాలనే ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం. ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లిలో టీడీపికి విజయం సులభం అనే అభిప్రాయం ఉంది. విజయశాంతిని కూకట్ పల్లి నుంచి పోటీకి దించితే సీటుని త్యాగం చేయడానికి టీడీపి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విజయశాంతి విజయం కోసం కూకట్ పల్లిలో నందమూరి బాలకృష్ణ కూడా ప్రచారం చేస్తారని అంటున్నారు. మరి విజయశాంతి నిజంగానే కూకట్ పల్లి బరిలో దిగి.. బాలకృష్ణ ప్రచారానికి వస్తే కూకట్ పల్లి స్థానం కూటమి ఖాతాలో ఈజీగా పడిపోయే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భాజపా పాలనకు చరమగీతం పాడేందుకే కాంగ్రెస్‌తో కలిశాం

  భాజపా వ్యతిరేక కూటమి దిశగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో సమావేశం అయ్యారు.కలిసి పనిచేద్దామని నిర్ణయించుకున్నారు.అయితే కాంగ్రెస్ టీడీపీ స్నేహ భంధంపై పలువురు భాజపా నేతలు విమర్శలు చేస్తున్నారు.ఈ విమర్శలపై ఏపీ జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు స్పందించారు.ప్రధాని నరేంద్ర మోడీ నియంతలా దుష్టపాలన సాగిస్తుంటే ప్రశ్నించని ఏపీ ప్రతిపక్షాలు తెదేపా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయని మండిపడ్డారు.భాజపా పాలనకు చరమగీతం పాడేందుకే ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్, ములాయం సింగ్ లాంటి సీనియర్ నేతలతోనూ, కాంగ్రెస్‌తోనూ కలసి పనిచేసేందుకు ప్రయత్నిస్తుంటే దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.  మోడీ పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్‌తో కలిసి నడవాలని చంద్రబాబు ఓ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడల్లా తెలుగు దేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిందని దేవినేని గుర్తుచేశారు.దేశ వ్యాప్తంగా ఈ ప్రయత్నాలకు మంచి స్పందన వస్తోందన్నారు. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపణలు చేయడం ఏంటని మంత్రి ప్రశ్నించారు.ఆర్థికంగా కష్టాలున్నా పోలవరం లాంటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. నిధులివ్వని కేంద్రాన్ని ప్రశ్నించకుండా భాజపాతో పవన్, జగన్ పార్టీలు అంటకాగుతున్నాయని ఆరోపించారు. తెదేపాను దెబ్బతీయడానికే వైకాపా, జనసేన, భాజపా ఏకమ్యయాయని విమర్శించారు. ఈ కుట్రలను తిప్పి కొడతామన్నారు. తెలుగుజాతి హక్కులను కాపాడుకునేందుకు తెదేపా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. సముద్రంలోకి వృథాగా వెళ్లాల్సిన 246 టీఎంసీల నీటిని ఒక నదీ ప్రవాహ ప్రాంతం నుంచి మరో నదీ ప్రవాహ ప్రాంతానికి తరలించిన ఘనత తెదేపా ప్రభుత్వానిదే అన్నారు.

అది సినిమా కాదు పవన్ - లోకేష్

  బీజేపీయేతర పక్షాలను ఏకం చేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్‌లో ధీటుగా స్పందించారు. బీజేపీని గద్దెదించడానికి జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటును పవన్‌కల్యాణ్‌ ఫ్లాప్ షో అనడం సరికాదంటూ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో చేస్తున్న పోరాటాన్ని సినిమాతో పోల్చడం బాధాకరమని మంత్రి లోకేష్ అన్నారు. రైలు యాత్రలో పాల్గొన్న పవన్.. టీడీపీ-కాంగ్రెస్ మైత్రి భంధంపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.ఢిల్లీలో చంద్రబాబు చూపించింది సినిమా విడుదలకు ముందు వచ్చే ట్రైలర్ లాంటిదని.. చంద్రబాబు సినిమా ప్లాప్ కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైనే లోకేష్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు.  

చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారు.. లక్ష్మీపార్వతి నిరసన

  కాంగ్రెస్, టీడీపీ పార్టీల మధ్య దోస్తీ కుదురుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో ఈ రెండు పార్టీలు మహాకూటమితో దగ్గరయ్యాయి. అంతేకాకుండా జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే పనిలో భాగంగా చంద్రబాబు, రాహుల్ గాంధీతో తాజాగా భేటీ అయిన విషయం కూడా తెలిసిందే. అయితే కాంగ్రెస్, టీడీపీల దోస్తీ గురించి ఇతర పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా లక్ష్మీపార్వతి కూడా ఈ దోస్తీని వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసన తెలిపారు. కాంగ్రెస్ తో టీడీపి పొత్తు వల్ల ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని, ఎన్టీఆర్ ను చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారని అన్నారు. సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు పార్టీని తాకట్టు పెట్టారని అన్నారు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగానే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని.. కాంగ్రెస్ తో టీడీపీ ప్రస్తుత అధ్యక్షుడు చంద్రబాబు పొత్తుకు సిద్ధపడి ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచారని లక్ష్మీపార్వతి విమర్శించారు.

కాంగ్రెస్,తెదేపా మైత్రి బంధం..చంద్రబాబు జగన్‌తోనూ కలిసే అవకాశం

  తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్,తెదేపా పార్టీలు పొత్తుతో ఒక్కటయ్యాయి.అంతేకాకుండా కేంద్రంలో బీజేపీ పాలనపై తిరుగుబాటు చేసేందుకు బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏపీ సీఎం,తెదేపా అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు.సమావేశ అనంతరం ఇద్దరు కలిసి వచ్చి మీడియాతో మాట్లాడారు.దేశ సమగ్రత కొరకే మా కలయిక అని తెలియజేసారు.గతాన్ని మరచి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామన్నారు.ఇరు పార్టీల అధ్యక్షులే గతాన్ని మరచిపోవాలి అనుకుంటుంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు గతంలో కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలను తిరగతోడుతున్నారు.దీన్ని అస్త్రంగా మార్చుకొని రాజకీయంగా లాభం పొందాలని భావిస్తున్నారు..  తాజాగా కాంగ్రెస్,తెదేపా మైత్రి భంధంపై ఆయన ఫేస్‌బుక్‌ వేదికగా విమర్శలు చేశారు.గతంలో కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీపై చంద్రబాబు చేసిన విమర్శల్ని పవన్ తన ఫేస్ బుక్‌ లో పోస్టు చేశారు. ఒకప్పుడు తిట్టుకున్న నేతలు ఇప్పుడు ఒకటవ్వడం అవకాశవాదం కాక మరేంటని ప్రశ్నించారు.చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న విషయం మరిచి తెలుగు వారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టారని ఘాటుగా విమర్శించారు. త్వరలో చంద్రబాబు జగన్‌తోనూ కలిసే అవకాశం లేకపోలేదని ఎద్దేవా చేశారు. అసంబద్ధంగా జరిగిన రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, భాజపా రెండూ కారణమేనన్నారు. హైదరాబాద్ నుంచి మనల్ని గెంటేయడంలో ఆ రెండు పార్టీలది కీలకపాత్ర అని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనుభవజ్ఞులైన నాయకులు ఈ విషయంలో సిగ్గుపడాలన్నారు.  

తెలంగాణ ఎన్నికల బరిలో టాలీవుడ్ హీరోయిన్

  సినీ రంగానికి చెందిన వారు రాజకీయాల్లో అడుగుపెట్టటం కొత్తేమి కాదు.ఇప్పటికే పలువురు నటీనటులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా తాజాగా మరో నటి రానున్న తెలంగాణ ఎన్నికల బరిలో నిలుస్తుంది.ఈరోజుల్లో సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న నటి రేష్మ రాథోడ్ ఇటీవల బీజేపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.రేష్మ ప్రస్తుతం బీజేపీ యువజన విభాగం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తుంది.తనకు అవకాశం ఇస్తే ఖమ్మం జిల్లాలోని వైరా అసెంబ్లీ లేదా మహబూబాబాద్ లోక్ సభ నుంచి పోటీ చేయాలనుకున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ వస్తుంది.ఈ నేపథ్యంలో బీజేపీ ఇటీవల విడుదల చేసిన జాబితాలో రేష్మ పేరును పొందుపరిచింది.వైరా నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించింది.తనకు సీటు కేటాయించడంపై రేష్మ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపింది.     ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో ఇప్పటికే రేష్మ ప్రజలతో కలివిడిగా ఉంటూ ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమపథకాల గురించి ప్రచారం చేస్తోంది.అంతేకాకుండా తెరాస ప్రభుత్తంపైనా విమర్శలు చేసింది."బయ్యారం ఉక్కు కార్మాగారానికి కేంద్రం ఆమోదం తెలిపింది. కానీ కేసీఆర్ ప్రభుత్వమే సహాకరించలేదు. ఫ్యాక్టరీని మెదక్ తరలించాలని చూస్తోంది. మా ప్రభుత్వం వస్తే, బయ్యారంలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి వేలాదిమందికి ఉపాధి కల్పిస్తాం. ఆయుష్మాన్ భారత్ వంటి అద్భుత పథకానికి కేంద్రం శ్రీకారం చుడితే, తెలంగాణలో మాత్రం దాన్ని అమలు చేయడానికి నిరాకరించారు. ఇది ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యమే" అని రేష్మ పేర్కొంది.ఈ నేపథ్యంలో బీజేపీ సీటు కేటాయించటంతో త్వరలోనే ఎన్నికల క్యాంపైన్ ను మొదలుపెట్టబోతున్నట్టు రేష్మ తెలిపింది.

మహాకూటమి భేటీ..నేడు ఫైనలా?సెమీఫైనలా?

  తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్,టీడీపీ,టీజేఎస్,సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.అయితే పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతుంది.రెండు రోజులుగా ఢిల్లీ చుట్టూ తిరిగిన పొత్తుల అంశం ఇప్పుడు హైదరాబాద్‌కు మారింది.హైదరాబాద్‌లో కూటమి నేతలు భేటీ కానున్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు, టీజేఎస్ అధినేత కోదండరాంలు కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీతో సమావేశం అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో నేడు జరగనున్న ఈ భేటీ కీలకం కానుంది. మహాకూటమి ప్రాధాన్యత దృష్ట్యా పొత్తుల అంశాన్ని త్వరగా తేల్చాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌ ఆదేశించినట్లు తెలిసింది.ఈ ఎన్నికల్లో పొత్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాల్సిందేనని, ఆ దిశగా సీట్ల సర్దుబాటును వేగంగా కొలిక్కి తేవాలని సూచించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే నేటి భేటీలో భాగస్వామ్య పక్షాలకు ఎన్ని సీట్లు? ఏయే స్థానాలు? అనే అంశాలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాత్రం 95 స్థానాలు,టీడీపీ కి 14 స్థానాలు,మిగిలినవి టీజేఎస్,సీపీఐల కు అని ప్రకటించింది.సీపీఐ సీట్లను రెండుకే పరిమితం చేస్తున్నారంటూ వస్తున్న ప్రచారంపై ఇప్పటికే ఆ పార్టీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. 7 స్థానాలకు జాబితాను అందజేయగా.. ఇందులో వైరా, బెల్లంపల్లి మాత్రమే ఇస్తామన్నట్లు సంకేతాలు అందడంపై ఆ పార్టీ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మండిపడుతున్నారు.టీజేఎస్ ది కూడా ఇదే పరిస్థితి. మిర్యాలగూడ స్థానాన్ని తమకు కేటాయించాలని టీజేఎస్ నేతలు పట్టుబడుతున్నారు. కానీ కాంగ్రెస్‌ ఇచ్చేలా లేదు.టీజేఎస్ సూత్రప్రాయంగా కనీసం 12 స్థానాలకు అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.టీడీపీకి 14 సీట్లు కేటాయించినా ఏయే స్థానాలు ఇస్తారనే దానిపై స్పష్టత లేదు. ఆలేరు, నకిరేకల్‌, కోదాడ స్థానాలను టీడీపీ అడుగుతోంది.కానీ ఇవి ఇస్తామని కాంగ్రెస్‌ నుంచి సానుకూలత రావడంలేదని సమాచారం. ఏయే స్థానాలను కేటాయిస్తారనే అంశంపై నేటి భేటీలో చర్చించనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.మరి నేడు జరిగే ఈ భేటీ ఫైనలా లేక ఇంకా సెమిఫైనలేనా అని వేచి చూడాల్సిందే.

కూటమి ఏర్పాటు ఆలస్యమైతే అన్ని పార్టీలకు నష్టం

  తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్,టీడీపీ,టీజేఎస్,సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.అయితే కూటమిలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో సమన్వయం కుదరట్లేదు.ఈ నేపథ్యంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కొంత అసంతృప్తితో ఉన్నారు.దీనిపై మాట్లాడేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపు మేరకు కోదండరాం ఢిల్లీ వెళ్లారు.రాహుల్ తో భేటీ అయ్యారు.భేటీ అనంతరం కోదండరాం మాట్లాడుతూ..కూటమి ఏర్పాటుపై రాహుల్‌గాంధీతో చర్చించానని, ఉమ్మడి కార్యాచరణ వేగవంతం చేయాలని ఆయన్ను కోరినట్లు చెప్పారు. కలిసి వచ్చే శక్తులతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాహుల్‌ తెలిపారన్నారు. కూటమి ఏర్పాటు ఆలస్యమైతే అన్ని పార్టీలకు నష్టం జరిగే అవకాశముందని, ఇదే విషయాన్ని ఆయన దృష్టి తీసుకెళ్లినట్లు కోదండరాం చెప్పారు. కూటమి ఏర్పాటు, సీట్ల సర్దుబాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులకు రాహుల్‌ సూచించారని కోదండరాం వివరించారు. సీట్ల గురించి కూటమిలోని పార్టీల మధ్య చర్చలు పూర్తి కావడం లేదని కోదండరాం చెప్పారు. తాము 17 సీట్లు కోరామని.. 15 స్థానాల్లో పోటీ చేయగలమనే ఆలోచనతో ఉన్నట్లు వివరించారు. కూటమి ఏర్పాటు, సీట్ల పంపకాలు వేర్వేరు అంశాలని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారం కోసం కూటమిగా ఏర్పడితే ప్రయోజనం ఉండదని, లక్ష్య సాధనకోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు.పార్టీ నిర్మాణం లేకుండా సీట్లు అడగటం లేదని, పార్టీ పరిస్థితి బాగున్న స్థానాలు కోరుతున్నట్లు కోడండరాం చెప్పారు. సుమారు 25 చోట్ల తెజస బలంగా ఉందని ఆయన తెలిపారు. కూటమి ఏర్పాటు ఆవశ్యకతను బలంగా ప్రజలకు వివరించాలని భావిస్తున్నామన్నారు.ఎన్నికల్లో ఏ స్థానం నుంచి పోటీలో ఉంటారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఆ విషయం అప్రస్తుతమని వ్యాఖ్యానించారు. తన పోటీ విషయంపై హైదరాబాద్‌ చేరుకున్నాక చెప్తానన్నారు. కూటమిలోని సీట్ల సర్దుబాటుపై తేలితే మిగతా విషయాలన్నీ నిర్ణయిస్తామన్నారు. సీట్ల కేటాయింపుపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చేసిన 95, 24 స్థానాల ప్రకటనపై తనకు తెలియదని వ్యాఖ్యానించారు. చర్చలు పరిష్కారం కాకపోతే తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

చంద్రబాబు 2014 లో కాంగ్రెస్ తో కలవాల్సింది: పవన్

  వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై దాడి జరగడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ నుంచి తుని వరకు పవన్ రైలు యాత్ర చేపట్టిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. జగన్ పై దాడిని ప్రతీ ఒక్కరూ ఖండించాలన్నారు. దాడి ఘటనపై ప్రభుత్వం వెకిలిగా మాట్లాడటం తగదని హితవు పలికారు. జగన్ పై దాడి ఘటనను లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉందన్నారు. నిందితుడు శ్రీనివాస్ దాడి కావాలని చేశాడా?.. వేరేవారెవరైనా చేయించారా?.. ఏదైనా కుట్ర దాగి ఉందా?.. అనేది పోలీసులు విచారణలో తేలాల్సి ఉందన్నారు. రాజకీయ జోక్యం లేకుండా విచారణ జరిపి వాస్తవాలు బయటకు తేవాలని డిమాండ్ చేశారు. జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలు దాడి చేయించారని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యల్ని పవన్ ఖండించారు. ఎక్కడైనా తల్లి కొడుకుపై దాడి చేయిస్తుందా అంటూ నిలదీశారు. అదేవిధంగా టీడీపీ, కాంగ్రెస్ దోస్తీ గురించి కూడా పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ, కాంగ్రెస్ ల పొత్తు చంద్రబాబు అధికార దాహానికి నిదర్శనమని విమర్శించారు. ఇరు పార్టీల కలయిక రాజకీయ ఉనికి కోసమేనని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం వల్లే సమీకరణాలు మారతాయే తప్ప పార్టీల కలయికల వల్ల కాదన్నారు. ఢిల్లీలో చంద్రబాబు చూపించింది సినిమా విడుదలకు ముందు వచ్చే ట్రైలర్ లాంటిదన్నారు. కానీ చంద్రబాబు సినిమా ప్లాప్ అవ్వడం ఖాయమన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ తో కలయిక చూస్తుంటే ఆయన ఎక్కడ మెుదలయ్యారో అక్కడికే చేరుకున్నట్లు ఉందన్నారు. చంద్రబాబు ఈ నిర్ణయం 2014లో తీసుకోవాల్సిందని.. పార్టీలతో పెట్టుకోవాల్సింది పొత్తు కాదని ప్రత్యేక హోదా కోసం బలమైన పోరాటం చెయ్యాలని సూచించారు. అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తాను 2014 లో టీడీపీకి మద్దతు ఇచ్చానని గుర్తుచేశారు. అలాంటి కాంగ్రెస్ తో టీడీపీ ఎలా కలుస్తుందని నిలదీశారు. తాను ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు యాత్రలు చేస్తున్నానే తప్ప అధికారం కోసం కాదన్నారు.

శ్రీనివాసరావు కస్టడీకి నిరాకరించిన కోర్టు

  ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సిపి అధినేత జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. గత వారం రోజులుగా అతన్ని సిట్ బృందం విచారిస్తున్న విషయం తెలిసిందే.అయితే కోర్టు విధించిన ఆరు రోజుల కస్టడీ గడువు ఇవాళ ముగియడంతో పోలీసులు భారీ భద్రత మధ్య అతడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. శ్రీనివాస్‌ కస్టడీని పొడిగించాలని సిట్‌ అధికారులు కోరగా.. అందుకు న్యాయమూర్తి నిరాకరించారు.శ్రీనివాస్‌కు రిమాండ్‌ కొనసాగించాలని ఆదేశించారు.దీనిపై విమానాశ్రయ పీఎస్‌ సీఐ శేషు మాట్లాడుతూ.. శ్రీనివాస్‌ కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరు పరిచినట్టు తెలిపారు. ఈ నెల 11 వరకు శ్రీనివాస్‌ రిమాండ్‌కు న్యాయస్థానం ఆదేశించిందని చెప్పారు. కోర్టు ఆదేశాలతో శ్రీనివాస్‌ను కేంద్ర కారాగారానికి తరలించినట్టు ఆయన వెల్లడించారు.అయితే, ఇప్పటివరకు నిందితుడి కాల్‌డేటా ఆధారంగా పోలీసు విచారణ కొనసాగింది. కేసుకు బలమైన ఫోరెన్సిక్‌ నివేదిక ఇంకా అందకపోవడంతో ఈ కేసులో ఆశించిన పురోగతి సాధించలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దీంతో నిందితుడికి కస్టడీ పొడిగించాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరగా.. అందుకు న్యాయస్థానం నిరాకరించింది.

మోదీ నిద్రలేని రాత్రులు గడుపుతారు.. నాదీ గ్యారెంటీ

  రాఫెల్‌ ఒప్పందంపై తాజాగా ఓ మీడియా సంస్థ పరిశోధనలు చేసి నివేదిక రూపొందించింది. ఈ నివేదికను ఆధారంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీని కాపాడేందుకు డసో ఏవియేషన్ సీఈవో అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. 'అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌కు భూమి ఉంది, హాల్‌కు లేదని కాంట్రాక్టు ఇవ్వలేదని డసో సీఈవో చెప్పారు. అయితే రిలయన్స్‌ డిఫెన్స్‌ వద్ద ఉన్న భూమిని డసో ఇచ్చిన డబ్బులతోనే కొనుగోలు చేశారు. అనిల్‌ అంబానీ కంపెనీలో డసో ఏవియేషన్‌ రూ.284కోట్ల పెట్టుబడులు పెట్టింది. తర్వాత ఆ డబ్బుతోనే ఆ సంస్థ భూమిని కొనుగోలు చేసింది. నష్టాల్లో ఉన్న ఓ కంపెనీలో డసో పెట్టుబడులు ఎందుకు పెట్టింది?. దీన్ని బట్టి చూస్తుంటే డసో సీఈవో అబద్ధం చెబుతున్నారు. ప్రధాని మోదీని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రాఫెల్‌ ఒప్పందంపై దర్యాప్తు జరిగితే మోదీ తప్పించుకోలేరు. ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతారు. అందుకు నాదీ గ్యారెంటీ' అని అన్నారు. డసో ఒప్పందంపై రక్షణశాఖకు సమాచారం ఇవ్వకుండానే మోదీ ఒక్కరే నిర్ణయం తీసుకున్నారు. అనిల్‌ అంబానీ కోసమే ఆయన ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు’ అని రాహుల్‌ ఆరోపించారు.

జగన్ ను పరామర్శించిన మోహన్ బాబు

  కోడికత్తి దాడి ఘటనలో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు పరామర్శించారు.లోటస్‌పాండ్‌లో జగన్‌ను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌ ఆరోగ్యం గురించి తెలుసుకున్నానని, ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.వైఎస్‌ జగన్‌ వందేళ్లు ఆరోగ్యంగా బతుకుతారని అన్నారు.ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. జగన్‌ను పరామర్శించడానికి వచ్చానని.. రాజకీయాల ప్రస్తావనకు ఇది సమయం కాదన్నారు. సమయం వచ్చినపుడు తప్పకుండా మాట్లాడతానని మోహన్‌బాబు స్పష్టం చేశారు.

క్రిమినల్ కేసులపై కోర్టులో రేవంత్ పిటిషన్

  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి అధికారులపై నమ్మకం లేదో ఏమో? ఒకవేళ అయన అడిగిన దానికి అధికారులు నిజంగానే స్పందిచట్లేదో ఏమో? కావాల్సిన దానికోసం కోర్టును ఆశ్రయిస్తున్నారు.న్యాయపరంగా పోరాడుతున్నారు.ఇటీవల భద్రత విషయంలో రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించి 4 + 4 భద్రత పొందిన సంగతి తెలిసిందే.తాజగా రేవంత్ రెడ్డి తనపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో తెలపాలని మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచేందుకు ఆర్టీఐని సమాచారం కోరగా వారి నుంచి ఎటువంటి సమాధానం లభించలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. తెలంగాణ డీజీపీ, ఆర్టీఐ కమిషనర్‌ను ప్రతివాదులుగా చేర్చారు. తనను టార్గెట్‌ చేసుకుని పోలీసులు తనపై అక్రమ కేసులు పెడుతున్నారని రేవంత్‌రెడ్డి కోర్టుకు తెలిపారు.కాగా రేవంత్‌ రెడ్డి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది.

ఎన్టీఆర్ కాంగ్రెస్ తో కలవడానికి సిద్దపడ్డారు

  బీజేపీయేతర పార్టీలను ఏకం చేయడంలో భాగంగా నిన్న ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన విషయం తెలిసిందే. కొందరు కాంగ్రెస్, టీడీపీ దోస్తీ గురించి విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా రాహుల్ వద్దకు వెళ్లారని అన్నారు. బీజేపీ తమకు ప్రధాన శత్రువని, దానిని ఎవరు వ్యతిరేకించి తమ వద్దకు వచ్చినా ఆహ్వానిస్తామని ఆయన అన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ తో జత కట్టడాన్ని కొందరు విమర్శిస్తున్నారని, ఎన్టీఆర్ ఆత్మ ఘోసిస్తుందని, ఆత్మగౌరవం దెబ్బతిందని అంటున్నారని, కాని గతంలో 1995 లో ఎన్టీఆర్ కాంగ్రెస్ తో కలవడానికి సిద్దపడ్డారని అన్నారు. ఆ విషయం తనకు ఎన్టీఆర్ చెప్పారని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వచ్చినా స్వాగతిస్తామన్నారు.

తెలంగాణ బీజేపీలో అసంతృప్తి సెగ..ఆఫీసుపై దాడి

  తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో బీజేపీ 28 మందితో రెండో విడుత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితా పార్టీలో చిచ్చు పెట్టింది.శేరిలింగంపల్లి టిక్కెట్‌ను యోగానంద్‌కు, నిజామాబాద్‌ అర్బన్‌ టిక్కెట్‌ను యెండల లక్ష్మీనారాయణకు అధిష్ఠానం కేటాయించింది. దీంతో ఈ రెండు స్థానాల్లో టిక్కెట్లు ఆశించి భంగపడిన నేతలు ఆందోళనకు దిగారు.నిజామాబాద్‌ అర్బన్‌ టిక్కెట్‌ను యెండల లక్ష్మీనారాయణకు కేటాయించటంపై సూర్యనారాయణ గుప్తా అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. భాజపా కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు.యెండలకు టిక్కెట్‌ కేటాయించటంతో సూర్యనారాయణ గుప్తా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు సమాచారం. మరోపక్క శేరిలింగంపల్లి టిక్కెట్‌ను యోగానంద్‌కు కేటాయించడంపై భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి నరేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న తనను కాదని.. మూడు రోజుల క్రితం పార్టీలో చేరిన బిల్డర్‌ యోగానంద్‌కు టిక్కెట్‌ ఎలా కేటాయిస్తారంటూ ఆయన పార్టీ పెద్దలను నిలదీశారు. దీనికి నిరసనగా హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం ఎదుట మద్దతుదారులతో కలిసి ఆయన నిరసనకు దిగారు. యోగానంద్‌కు టిక్కెట్‌ కేటాయించడానికి గల కారణాలను పార్టీ తెలపాలని డిమాండ్‌ చేశారు. శేరిలింగంపల్లి టిక్కెట్‌ను తనకే కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.