రక్తమోడిన జగన్..కత్తికేది రక్తం
posted on Oct 26, 2018 @ 10:19AM
విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జగన్ పై అతని అభిమానే కత్తితో దాడి చేసిన సంఘటన తెలిసిందే.దాడిలో జగన్ ఎడమ భుజానికి గాయం అవ్వగా ప్రధమ చికిత్స అందించారు. ఎయిర్ పోర్ట్ లోని అపోలో వైద్యులు.'0.5 సెంటీమీటరు పొడవు, 0.5 సెం.మీ లోతుతో గాయమైంది.ఆయింట్‌మెంట్ పూసి రక్తం కారకుండా డ్రసింగ్ చేశాం.. నొప్పి తగ్గడానికి యాంటి బయోటిక్స్ వాడమని సలహా ఇచ్చాం’ అని విమానాశ్రయంలో చికిత్స చేసిన అపోలో డాక్టరు లలితకుమారి రిపోర్టు ఇచ్చారు.అయితే... హైదరాబాద్‌లో జగన్‌కు చికిత్స చేసిన సిటీ న్యూరో సెంటర్ వైద్యులేమో దాదాపు 3.5 సెంటీమీటర్ల మేర కండరం లోపలికి కత్తి దిగిందని వెల్లడించారు.ఆపరేషన్ చేసి తొమ్మిది వరకు కుట్లు వేశామని చెప్పారు.దీంతో విశాఖలో అర సెంటీమీటరు ఉన్న గాయపు లోతు... హైదరాబాద్ చేరుకునే సరికి మూడు సెంటీమీటర్లు ఎలా అయ్యిందంటూ చర్చ మొదలైంది.అయితే... కత్తికి విష రసాయనాలు పూశారేమో అని నిర్ధారణ చేసుకునేందుకు వీలుగా శాంపిల్స్‌ను లోతు నుంచి సేకరించాల్సి వచ్చిందని, అందుకే గాయం పెద్దదైందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
‘విమానాశ్రయంలో కేంద్ర ప్రభుత్వ బలగాల భద్రత ఉంటుంది.. దాడి జరిగిన వెంటనే వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి.. ఇక్కడ మాత్రం సాయంత్రం 4.30 గంటలకు ఫిర్యాదు ఇచ్చారు.. అప్పటికీ దాడికి ఉపయోగించిన చిన్న కత్తిని స్వాధీనం చేయలేదు. కొంత సమయం దగ్గర పెట్టుకుని తర్వాత తెచ్చి ఇచ్చారు. దీనికి ఫొరెన్సిక్ పరీక్ష ఎలా సాధ్యమవుతుంది?’ అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ‘జరిగిన దాడి మెడికో లీగల్ కేసు. కేసున్నా, లేకున్నా సంఘటన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలి. జగన్ మాత్రం బాధ్యతా రాహిత్యంగా విమానంలో హైదరాబాద్‌కు వెళ్లిపోయారు’ అని చంద్రబాబు తెలిపారు.ఈ నాటకీయ పరిణామాలు చూస్తుంటే అసలు ఏం జరుగుతుందో అర్ధం కానీ పరిస్థితి.పోలీసులకు పిర్యాదులో కనపడుతున్న జాప్యం,కత్తిని స్వాధీనం చేయటంలో నిర్లక్ష్యం అంతేకాకుండా కత్తితో దాడి చేశాడు సరే.. మరి కత్తికి రక్తమెక్కడ అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.వీరి అనుమానానికి తగ్గట్టుగానే కత్తి అయితే పదునుగానే ఉంది కానీ కత్తికి మాత్రం రక్తమెక్కడా కనపడట్లేదు.మీరు కూడా ఈ కత్తిని గమనిస్తే మీకూ అలాంటి సందేహమే కలగొచ్చు.