సీబీఐ డైరెక్టర్లను సెలవుపై పంపటానికి కారణం అదే

  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ డైరెక్టర్లను కేంద్రం విధుల నుంచి తొలగించింది.వీరిని సెలవులో వెళ్లాల్సిందిగా డీవోపీటీ కోరిన విషయం తెలిసిందే.దీనిపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారు.‘సీబీఐ ఒక ప్రధాన దర్యాప్తు సంస్థ. ఇప్పుడు దాని సమగ్రత, విశ్వసనీయతను కాపాడటం ఎంతో అవసరం.అందుకోసం ఇద్దరు సీబీఐ అధికారులపై ఉన్న కేసులను పారదర్శకంగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. సీబీఐ డైరెక్టర్‌ను నిందితుడిగా ప్రత్యేక డైరెక్టర్‌ చెబుతున్నారు. ప్రత్యేక డైరెక్టర్‌ను నిందితుడిగా సీబీఐ పేర్కొంది. సీబీఐలోని ఇద్దరు ఉన్నతాధికారులు ఇప్పుడు నిందితులే. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం చాలా దురదృష్టకరమైన పరిస్థితి. సీబీఐ సమగ్రతను కాపాడటం కోసం న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం.ఈ విషయంపై చర్చించేందుకు సీవీసీ నిన్న అత్యవసరంగా సమావేశమైంది. ఇద్దరు సీబీఐ అధికారులపై వస్తోన్న ఆరోపణలను ఏ ఏజెన్సీ అయినా విచారణ చేయవచ్చని సీవీసీ వెల్లడించింది.అందువల్లే అలోక్‌ వర్మ, ఆస్థానాను సెలవుపై పంపిస్తున్నాం. ఇది తాత్కాలికంగా తీసుకున్న నిర్ణయం మాత్రమే. సీవీసీ ప్రతిపాదన మేరకే ప్రభుత్వం సీబీఐ అధికారులపై ఈ చర్య తీసుకుంది.వారిద్దరిపై ఉన్న కేసులను సిట్‌ బృందం విచారిస్తోంది. ’ అని జైట్లీ పేర్కొన్నారు. రాకేశ్‌ ఆస్థానాపై నమోదైన కేసు విచారించేందుకు సరికొత్త బృందాన్ని నియమించామని తెలిపారు.ఈ విచారణ బృందంలో తరుణ్ గోబా, సతీష్‌ దాగర్‌, వి.మురుగేశన్‌ ఉన్నారు. వ్యాపం కుంభకోణం కేసు దర్యాప్తును డీఐజీ తరుణ్‌ గోబా చేశారు. ఎస్పీ సతీష్‌ దాగర్‌ గురురామ్‌ రహీం కేసును దర్యాప్తు చేశారు. బొగ్గు కుంభకోణం కేసును జీడీ వి. మురుగేశన్‌ దర్యాప్తు చేశారు. ఇప్పుడు ఈ ముగ్గురు రాకేష్‌ ఆస్థానా కేసును దర్యాప్తు చేయనున్నారు.

బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్

  అవినీతిపై దర్యాప్తు చేయాల్సిన సీబీఐ అవినీతి మరకతో తన ప్రతిష్ట తానే దిగజార్చుకుంటుంది. సీబీఐలో ఉన్నతాధికారుల లంచాల బాగోతం యావత్ దేశాన్ని షాక్‌కు గురి చేసింది. సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలను కేంద్రం సెలవులపై పంపి, అలోక్‌ వర్మ స్థానంలో సీబీఐ డైరెక్టర్ బాధ్యతలను మన్నెం నాగేశ్వరరావుకు అప్పగించడం జరిగింది. అదేవిధంగా సీబీఐ అధికారుల కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం మీద, ప్రధాని మోదీ మీద విపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఇన్నాళ్లు సీబీఐ కేంద్రం చేతిలో పావుగా మారిందనే ఆరోపణలు వినిపించేవి.. ఇప్పుడు ఆ ఆరోపణలు నిజమని తేలిందని.. అదే విధంగా సీబీఐ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నేతలు మోదీపై విమర్శల దాడి చేస్తున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సీబీఐని బీబీఐ అంటూ కొత్త పేరు పెట్టారు. తాజాగా ఆమె చేసిన ట్వీట్ సంచనం సృష్టిస్తోంది. ‘సీబీఐ ఇప్పుడు సోకాల్డ్ బీబీఐ(బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)గా మారిపోయింది. ఇది చాలా దురదృష్టకరం’ అంటూ మమతా బెనర్జీ ట్వీట్ చేసారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కూడా విమర్శలు గుప్పించారు. ‘సీబీఐ డైరెక్టర్ ని సెలవుల మీద ఎందుకు పంపారు? లోక్‌పాల్‌ చట్టం ద్వారా నియమించిన దర్యాప్తు సంస్థ అధికారిపై మోదీ ప్రభుత్వం ఏ చట్టం ప్రకారం చర్యలకు ఆదేశించింది? మోదీ ప్రభుత్వం ఏ విషయాన్ని దాచడానికి ప్రయత్నిస్తోంది?’ అని ఆయన ట్విటర్‌ ద్వారా ప్రశ్నించారు. ‘అలోక్‌ వర్మను పదవి నుంచి తప్పించడానికి రాఫెల్ ఒప్పందానికి మధ్య ఏదైనా సంబంధం ఉందా? ఆయన రాఫెల్ ఒప్పందంపై విచారణ జరిపే యోచనలో ఉన్నారా? మోదీకి ఇబ్బంది కలిగించిన విషయం ఏమిటి?’ అని కేజ్రీవాల్‌ మరో ట్వీట్‌లో నిలదీశారు.

రాబోయే ఎన్నికల్లో గెలుపు ఏకపక్షం

  రాష్ట్రాభివృద్ధే అందరి లక్ష్యం కావాలని ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నాయకులకు సూచించారు.పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం ఏ ఎన్నిక వచ్చినా గెలుపు తెలుగుదేశానిదే కావాలన్నారు.ఈనెల 31 నుంచి గ్రామాల్లో సభ్యత్వ నమోదు ముమ్మరం చేయాలని నేతలను ఆదేశించారు.ఏపీలో ప్రస్తుతం 64లక్షలు గా ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కోటికి చేరుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించారు.పార్టీలో ప్రతిఒక్కరూ వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.రాబోయే ఎన్నికల్లో గెలుపు ఏకపక్షం కావాలని, గెలిచే అభ్యర్ధులకే టికెట్లు ఇస్తామని తేల్చిచెప్పారు.ఎన్నికల్లో గెలిస్తేనే అనుకున్న అభివృద్ధి సాధించగలమన్నారు. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో అనేక సమస్యలు చుట్టుముట్టినా పట్టుదలగా అధిగమించామన్నారు.తిత్లీ తుఫాన్‌తో తీవ్ర నష్టం వాటిల్లిందని అయినప్పటికీ 11 రోజుల్లో సాధారణ పరిస్థితులు తెచ్చామని తెలిపారు. ప్రభుత్వంపై 76 శాతం సంతృప్తి ఉందని పార్టీ నాయకులతో చంద్రబాబు అన్నారు.గత 4 ఏళ్లలో దేశంలోని అన్ని వ్యవస్థలను కేంద్రం కుప్పకూల్చిందని సీఎం ఆరోపించారు. సీబీఐ సహా అన్ని సంస్థలను గందరగోళం చేసిందని మండిపడ్డారు. ఐటీ దాడులతో భయోత్పాతం సృష్టించి బీజేపీ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని విమర్శించారు.జాతీయ స్థాయిలో టీడీపీ క్రియాశీలం కావాలని చంద్రబాబు తెలిపారు.ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం ఆదేశించారు.

తెలుగు ఐపీఎస్‌ దూకుడు..సుప్రీంకోర్టుకు కేసు

  సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానా వర్గపోరుతో వార్తల్లోకి ఎక్కగా ప్రతిపక్షాల విమర్శలతో కేంద్రం వీరిని విధుల నుంచి తప్పించింది.వీరిని సెలవులో వెళ్లాల్సిందిగా డీవోపీటీ కోరిన విషయం తెలిసిందే. అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న మన్నెం నాగేశ్వరరావును సీబీఐ డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.తక్షణ విధుల్లో చేరాలని ఉత్వర్వుల్లో పేర్కొనడంతో ఈ రోజు తెల్లవారుజామున సీబీఐ డైరెక్టర్‌గా నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించి, విధులకు హాజరయ్యారు.     నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటలకే ఆయన ఆధ్వర్యంలో సీబీఐ కార్యాలయంలో సోదాలు నిర్వహించినట్లు సమాచారం.సీబీఐ ప్రధాన కార్యాలయంలోని 10,11 అంతస్తులను పూర్తిగా సీజ్‌ చేసిన అధికారులు ఈ రోజు తెల్లవారుజామున సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.రాత్రి 2 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఈ తనిఖీలు జరిగినట్లు సమాచారం.ఉదయం 9 గంటల వరకు కార్యాలయంలోకి ఇతరులెవరినీ అనుమతించలేదు.అలోక్‌ వర్మ, రాకేశ్‌ ఆస్థానాల ఆఫీసులను అధికారులు సీజ్‌ చేసి సోదాలు జరుపుతున్నట్లు సీబీఐ వర్గాల సమాచారం.     సీబీఐ కార్యాలయానికి వచ్చిన అలోక్‌ వర్మ, రాకేశ్ ఆస్థానాలను వారి ఛాంబర్లకు వెళ్లనీయకుండా అధికారులు అడ్డుకున్నారు. అంతేగాక.. వారికి డ్రైవర్లను కూడా తొలగించారు.అస్థానా ,అలోక్ వర్మకు చెందిన టీం సభ్యులను వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు.మొత్తం 13 మంది కీలక అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసినట్లు సమాచారం.మరోవైపు సీబీఐ డైరెక్టర్‌ పదవి నుంచి తప్పించడంపై అలోక్‌వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని వ్యతిరేకిస్తూ అలోక్‌ వర్మ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.అక్టోబరు 26న దీనిపై విచారణ జరుపుతామని కోర్టు వెల్లడించింది.

నారా బ్రాహ్మణి నిర్ణయానికి మనోజ్ ప్రశంసలు

  నారా బ్రాహ్మణి..బాలకృష్ణ కూతురిగా,చంద్రబాబు నాయుడు కోడలుగానే కాదు హెరిటేజ్ సంస్థ డైరెక్టర్ గా కూడా భాద్యతలు చేపట్టి గొప్ప పేరు సంపాదించారు.వ్యాపారాల్లో బిజీగా ఉండే బ్రాహ్మణి సేవాకార్యక్రమాల్లో కూడా పాల్గొని తన దాతృత్వాన్ని చాటుతున్నారు.తాజాగా తిత్లీ తుపాను కారణంగా శ్రీకాకుళం అస్తవ్యస్తమైంది.తుఫాను ప్రభావిత ప్రాంతాలలో భాదితులకు పలువురు  సినీ, రాజకీయ ప్రముఖులు  విరాళాలు అందజేశారు.నారా బ్రాహ్మణి కూడా ముందుకొచ్చి శ్రీకాకుళం జిల్లాలోని 10 గ్రామాలను దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు.దీనిపై మంచు మనోజ్ ట్విటర్ ద్వారా స్పందించాడు. లయన్ కూతురు ఎప్పటికీ లయనెస్ అవుతుందంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.  ‘‘శ్రీకాకుళం కోసం నారా బ్రాహ్మణి చేస్తున్నది చూస్తుంటే నిజంగా స్ఫూర్తి కలిగిస్తోంది. నాకు తెలిసిన స్ట్రాంగ్ మహిళల్లో ఒకరు. ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు బ్రాహ్మిణి. కష్టాల్లో ఉన్న వారి కోసం నిలబడటం చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తోంది. సింహం కూతురు ఎప్పటికీ సింహమే. జై బాలయ్య’’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు మంచు మనోజ్.  

లక్నోలో పవన్ భేటీ ఎవరికి పోటీ

  జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉత్తరప్రదేశ్ పర్యటనకు వెళ్లారు.లక్నో చేరుకున్న పవన్ వెంట పార్టీ ముఖ్యనేత నాదెళ్ల మనోహర్‌తో పాటు పలువురు జనసేన ప్రతినిధులు, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు, విద్యావేత్తలు ఉన్నారు.పర్యటనలో భాగంగా బీఎస్పీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌ ను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఈ సమావేశాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తృతీయ కూటమి కోసం చర్చలు జరిపేందుకు వెళ్లి ఉంటారని భావిస్తున్నారు.ఏపీలో క్రీయాశీల రాజకీయాల్లో ప్రత్యక్ష పోరుకు దిగుతున్న పవన్ జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ కీలకంగా మారేందుకు నేతలను కలుస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం ఆయన పశ్చిమ బెంగాల్, కర్ణాటక తదితర చోట్లకు వెళ్లి మమతా బెనర్జీ, దేవేగౌడలను కూడా కలిశారు.ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలతో  కేసీఆర్ బిజీగా ఉండటంతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై పవన్ ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తుంది.పార్టీ నిర్మాణం కాకపోవడంతో పాటు, కేసీఆర్ పట్ల పవన్ సానుకూలంగా ఉన్నందునే తెలంగాణలో వచ్చిన ఎన్నికల్లో పోటీ చేయట్లేదని సమాచారం.అంతేకాకుండా ఎస్సీల పార్టీగా ముద్రపడ్డ బీఎస్పీతో పవన్ మంతనాలు జరపనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.బీఎస్పీ నేతలను కలవటం ద్వారా రాష్ట్రంలోని ఎస్సీలను పార్టీ వైపు ఆకర్షిస్తామని జనసేన వర్గాలు చెబుతున్నాయి.థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలతో పాటు వచ్చే ఎన్నికల్లో ఏపీలో  ఆ వర్గం ఓటు బ్యాంకు తనవైపు తిప్పుకోవాలనేది పవన్ ఆలోచన అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు

కోహ్లీ వైజాగ్ టూర్ పై సీఎం చంద్రబాబు రియాక్షన్

  భారత్‌, వెస్టిండీస్‌ ల మద్య ఐదు వన్డేల సిరీస్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.సిరీస్‌ లో  రెండో వన్డే విశాఖ వేదికగా జరగనుంది.ఈ నేపథ్యంలో ఇరు జట్లు విశాఖకు చేరుకున్నాయి.ఓ హోటల్ లో బస ఏర్పాటు చేయగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హోటల్‌ నుంచి సముద్రం కనబడేలా ఫోటో తీసుకుని దాన్ని ట్వీట్‌ చేస్తూ.. అద్భుతమైన ప్రదేశం. ప్రియమైన విశాఖకు వచ్చాను’ అంటూ క్యాప్షన్‌ పెట్టాడు.విశాఖ నగరంపై విరాట్‌ కోహ్లి చేసిన ట్వీట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.కోహ్లి ట్వీట్‌కు రిప్లైగా  "విశాఖ.. దేశం, ప్రపంచం ప్రేమించే గమ్యస్థానం అవుతుంది. విశాఖ వన్డే సందర్భంగా కోహ్లి సేనకు శుభాకాంక్షలు" అంటూ ట్వీట్‌ చేశారు.  

సీబీఐలో వర్గపోరు..నూతన డైరెక్టర్‌గా తెలుగు ఐపీఎస్‌

  కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)నూతన డైరక్టర్‌గా తెలుగు ఐపీఎస్ మన్యం నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర అధికారుల పరిపాలన వ్యవహారాలు చూసే డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది.తక్షణ విధుల్లో చేరాలని ఉత్వర్వుల్లో పేర్కొనడంతో నాగేశ్వరరావు వెంటనే బాధ్యతలు చేపట్టారు.1986 బ్యాచ్‌కు చెందిన మన్నెం నాగేశ్వరరావు ఒడిశా కేడర్‌ అధికారి. ఒడిశాలో డీజీ హోదాలో పనిచేశారు. ఏడాదిన్నరగా సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ విధులు నిర్వహిస్తున్నారు.మన్నెం నాగేశ్వరరావు స్వస్థలం తెలంగాణలోని వరంగల్‌ జిల్లా మండపేట మండలం బోర్‌నర్సాపూర్‌‌. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానా మధ్య వర్గపోరుతో మొదలైన అంతర్గత కుమ్ములాటలు,ప్రధాని సీబీఐని భ్రష్టు పట్టిస్తున్నారని విపక్షాలు తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కేంద్రం దీనిపై దృష్టి సారించింది.ప్రస్తుత డైరెక్టర్‌ అలోక్‌వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానాలను కేంద్రం విధుల నుంచి తప్పించింది.వారిని సెలవుపై వెళ్లాల్సిందిగా ఉన్నత వర్గాలు ఆదేశాలు జారీచేశాయి.పీఎంవోతో పాటు కేంద్ర అధికారుల వ్యవహారాలు చూసే శాఖ నిర్ణయంతో మన్నెం నాగేశ్వరరావును సీబీఐ నూతన డైరెక్టర్‌గా నియమిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది.గతంలో సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన విజయ రామారావు తర్వాత ఆ హోదా చేపట్టిన తెలుగు అధికారి ఈయనే కావడం విశేషం.

మన్మోహన్‌ సింగ్‌ లాగానే మరో నాయకుడు వస్తాడు

  కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని పార్టీలను కలుపుకొని పోవడమే కాకుండా.. అవసరమైతే ప్రధాని పదవి విషయంలో త్యాగానికి కూడా సిద్ధమైంది. ఇప్పటికే ఈ విషయంలో కాంగ్రెస్ పలుసార్లు స్పష్టత ఇచ్చింది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం.. 'రాహుల్‌ గాంధీయే యూపీఏ తరఫున ప్రధాని అభ్యర్థి అని కాంగ్రెస్‌ ఎన్నడూ చెప్పలేదని' అన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన  నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఆయన  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. '2019 ఎన్నికల ఫలితాలు.. 2004 లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లాగే ఉంటాయి. ఆ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు ఏ పార్టీకీ మెజార్టీ రాలేదు. అయినప్పటికీ, కాంగ్రెస్‌ తన మిత్రపక్షాలతో కలిసి 10 ఏళ్లు అధికారంలో ఉండగలిగింది. 2004లో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఆయనకు ప్రత్యామ్నాయంగా నిలిచే మరొక నాయకుడు ఎవరూలేరని బీజేపీ ప్రచారం చేసింది. ఆ పార్టీకి అప్పట్లో నాయకత్వం వహించిన వాజ్‌పేయిని, ఇప్పుడు నాయకత్వం వహిస్తున్న ప్రధాని మోదీని పోల్చిచూస్తే.. ఆ పార్టీలో అప్పుడు ఉన్నంత బలమైన నాయకుడు ఇప్పుడు లేరనే చెప్పాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మోదీ వర్సెస్‌ ఎవరు? అన్న ప్రశ్నకు అంత ప్రాధాన్యం లేదని అన్నారు. ‘2004 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశ ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ ఉంటారని ఎవరు ఊహించారు? ప్రతి సందర్భం ఓ వ్యక్తిని నాయకుడిగా నిలబెడుతుంది. రాజకీయాల్లో ప్రత్యామ్నాయ నాయకుడు ఎల్లప్పుడూ ఉంటారు’ అని అన్నారు. తమ‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీయే యూపీఏ తరఫున ప్రధాని అభ్యర్థి అని కాంగ్రెస్‌ ఎన్నడూ చెప్పలేదని నిన్న ఆ పార్టీ నేత చిదంబరం చేసిన వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నానని, ప్రతిపక్షాల తరఫున ప్రధాని ఎవరన్న విషయాన్ని ఎన్నికల తరువాత నిర్ణయిస్తే బాగుంటుందని అన్నారు. ‘నేను రాహుల్‌ గాంధీతో పలుసార్లు మాట్లాడాను. నిన్న చిదంబరం చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగానే రాహుల్‌ ఉద్దేశం కూడా ఉంది’ అని శరద్‌ పవార్‌ వ్యాఖ్యానించారు.

విమర్శలు లేవు..విన్నపాలే..పవన్,గవర్నర్ భేటీ

  తిత్లీ తుఫానుతో శ్రీకాకుళం అతలాకుతలం అయింది.తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పవన్ పర్యటించారు.పవన్ పర్యటనపై టీడీపీ నేతలు విమర్శలు చేశారు.తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ ఆలస్యంగా పర్యటించారని, ఆయనది దొంగ ప్రేమ అని టీడీపీ నేతలు విమర్శలు చేశారు. ఇందుకు ధీటుగా పవన్ టీడీపీపై విమర్శలు గుప్పించారు.తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్ పునరుద్ధరణ జరగలేదని, సాయంపై అందరూ తలోమాట మాట్లాడుతున్నారని పవన్ విమర్శించారు.కానీ గవర్నర్ నరసింహన్‌ మాత్రం చంద్రబాబు ప్రభుత్వం కృషి భేష్ అంటూ కితాబిచ్చారు.ఈ నేపథ్యం లో పవన్ కల్యాణ్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని వివరించడానికి గవర్నర్‌ను అపాయింట్‌మెంట్ కోరారు.దీంతో నరసింహన్ అపాయింట్‌మెంట్ ఇవ్వగా పవన్ ఆయనతో భేటీ అయ్యారు.తాజాగా నరసింహన్ తో పవన్ భేటీ ముగిసింది.     భేటీ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు.తిత్లీ తుఫాన్ బాధితుల్ని ఆదుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేసినట్లు పవన్ చెప్పారు.తిత్లీ తుపాను నష్టంపై తమ పార్టీ రూపొందించిన నివేదికను గవర్నర్‌కు అందజేశామన్నారు.తుఫాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతం తీవ్రంగా నష్టపోయిందని.. అక్కడ గతంలో ఉన్న పరిస్థితి రావాలంటే కనీసం 15-20 ఏళ్లు పడుతుందని చెప్పారు.కేరళలో వరదలు వచ్చినప్పడు నష్టం ఏ స్థాయిలో ఉందనే విషయం బయట ప్రపంచానికి తెలిసిందని, ఉద్దానంలో నష్టం తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నా పూర్తిస్థాయిలో అది బయటకు చూపించలేదనే ఆవేదన అక్కడి ప్రజల్లో ఉందని పవన్‌ తెలిపారు. ప్రజల్లో ఉన్న స్పందననే నివేదిక రూపంలో గవర్నర్‌కు అందజేశామన్నారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే సాయం చేసేలా చూడాలని గవర్నర్‌కు వినతి పత్రం ఇచ్చామని పవన్ వెల్లడించారు.తిత్లీ తుఫాన్ నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని పవన్ డిమాండ్ చేశారు.

సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ కు ఊరట

  మాంసం ఎగుమతి చేసే వ్యాపారవేత్త మోయిన్‌ ఖురేషిపై మనీలాండరింగ్‌, అవినీతి, అక్రమాస్తుల ఆరోపణలు రాగా ఆయనపై సీబీఐ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ కేసులో సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్‌ అస్తానా ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది.అయితే, ఖురేషి నుంచి ఆయన లంచం డిమాండ్‌ చేసి తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.దీంతో ఆస్థానా, సీబీఐ డీఎస్పీ దేవందర్‌ కుమార్‌పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. తనపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆస్థానా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.కోర్టు జోక్యం చేసుకొని తనపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని, తనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.నిందితుడు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ ఆస్థానాపై అక్రమంగా ఎఫ్‌ఆఐర్‌ నమోదు చేశారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ పిటిషన్‌ విచారించిన న్యాయస్థానం ఆస్థానాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబరు 29కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అప్పటి వరకు ఆస్థానాపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, అరెస్టు చేయడం వంటివి చేయొద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసుకు సంబంధించి నిందితుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు తదితర పత్రాలను భధ్రపరచాలని సూచించింది.

ఏపీ లో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

  ఆంధ్ర ప్రదేశ్ లో 14 మంది ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.బదిలీ అయిన అధికారుల వివరాలు..  కడప ఎస్పీగా ఉన్న అట్టాడ బాబూజీని విశాఖ రూరల్‌ ఎస్పీగా, చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌ను గుంటూరు రూరల్‌ ఎస్పీగా, విశాఖ రూరల్‌ అడిషనల్‌ ఎస్పీ ఐశ్వర్య రాస్తోగిని నెల్లూరు ఎస్పీగా,  విశాఖ లా అండ్‌ ఆర్డర్‌ డీసీసీ ఫకీరప్పను కర్నూలు ఎస్పీగా,  తిరుపతి అర్బన్‌ ఎస్పీ అభిషేక్‌ మహంతిని కడప ఎస్పీగా,  పార్వతీపురం ఓఎస్డీ విక్రాంత్‌ పాటిల్‌కు చిత్తూరు ఎస్పీగా  చిత్తూరు ఓఎస్డీ అన్బురాజన్‌కు తిరుపతి అర్బన్‌ ఎస్పీగా,  విశాఖ రూరల్‌ ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మను విశాఖ టీం ఎస్పీగా ,  గుంటూరు రూరల్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడును విజయవాడ లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీగా,  నెల్లూరు ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణను సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఎస్పీగా,  కడప అడిషనల్‌ ఎస్పీ అద్మాన్‌ నయీం అస్మీకు విశాఖ లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీగా, కర్నూల్‌ ఎస్పీ గోపీనాథ్‌ జెట్టీని తితిదే సెక్యూరిటీ, విజిలెన్స్‌ ఆఫీసర్‌గా, నర్సీపట్నం ఓఎస్డీ సిద్ధార్థ కౌశల్‌కు గుంతకల్లు రైల్వే ఎస్పీగా బదిలీ చేశారు.

ఐటీ విచారణకు రేవంత్ గైర్హాజరు

  కొద్దిరోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ,అతని సన్నిహితుల నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు.ఈ నేపథ్యంలో ఈ నెల 3 న విచారణకు హాజరైన రేవంత్ రెడ్డిని  దాదాపు నాలుగున్నర గంటలపాటు అధికారులు విచారించారు.అనంతరం తదుపరి విచారణకు ఈనెల 23వ తేదీన మరోసారి హాజరు కావాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే.దీంతో నేడు విచారణకు రేవంత్ హాజరవుతారని అంతా భావించారు.రేవంత్ తో పాటు ఆయన అనుచరుడు ఉదయ్ సింహా, మామ పద్మనాభరెడ్డి, శ్రీ సాయి మౌర్యా కంపెనీ డైరెక్టర్లు ప్రవీణ్ రెడ్డి, సురేశ్ రెడ్డి, శివరామిరెడ్డి, రామచంద్రారెడ్డిలు సైతం విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలొచ్చాయి.కానీ రేవంత్ విచారణకు హాజరుకాలేదు.ఆడిటర్స్ ద్వారా డాక్యుమెంట్లను అందిస్తానని చెప్పారు.అలాగే రేవంత్‌రెడ్డి విచారణకు హాజరుకాలేదని ఐటీ అధికారులు తెలిపారు.

బీజేపీ సీఎం అభ్యర్థికి పోటీగా 'వాజ్‌పేయి' మేనకోడలు

  బీజేపీ అంటే ఇప్పుడు ముందుగా మోదీ, అమిత్ షా పేర్లు గుర్తుకొస్తాయి కానీ.. ఒకప్పుడు బీజేపీ అంటే వాజ్‌పేయి, అద్వానీ పేర్లు గుర్తుకొస్తాయి. ఇప్పుడు బీజేపీ పార్టీ ఇంతలా నిలదొక్కుకుందంటే అప్పుడు వాళ్లేసిన బలమైన పునాదులే కారణం. అద్వానీ పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డారు. వాజ్‌పేయి ప్రధానిగా మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా పార్టీకి గౌరవం తీసుకువచ్చారు. అలాంటిది ఇప్పుడు వాజ్‌పేయి మేనకోడలు.. బీజేపీ సీఎం అభ్యర్థికి పోటీగా బరిలోకి దిగుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల సమరం ఆసక్తిగా మారింది. రాజ్‌నందగావ్‌ నియోజకవర్గంలో బీజేపీ తరఫున సీఎం రమణ్‌సింగ్‌ పోటీ చేయనుండగా.. కాంగ్రెస్‌ తరపున వాజ్‌పేయి మేనకోడలు కరుణ శుక్లా బరిలోకి దిగుతున్నారు. కొన్నేళ్ల క్రితం ఆమె బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఛత్తీస్‌గఢ్‌ తొలి దశ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ 18 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. ఆ జాబితాలో కరుణ శుక్లా పేరు కూడా ఉంది. నవంబరు 12న ఛత్తీ్‌సగఢ్‌లో తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి.

మహాకూటమి గెలిస్తే నెలకొకరు సీఎం.!!

  ముందస్తుకు తెరలేవకముందు వరకు తెరాస వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధానంగా మాటలయుద్ధం సాగింది. కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకి సిద్ధమవ్వడం.. కాంగ్రెస్ టీడీపీ, టిజెఎస్, సిపిఐ పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పడడంతో.. ఈ మాటల యుద్ధం తెరాస వర్సెస్ మహాకూటమిగా మారింది. ఎన్నికల సమయం సమీపించడంతో ఈ మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్టణంలో తెరాస నేత కేటీఆర్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీల మీద విమర్శలు గుప్పించారు. మహాకూటమి జుట్టు చంద్రబాబు చేతిలో ఉందని ఆరోపించారు. ఒకవేళ మహాకూటమి అధికారంలోకి వస్తే రైతులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. 60 ఏళ్లలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణలో టీడీపీకి క్యాడర్‌ లేదని.. కాంగ్రెస్‌కు లీడర్లు లేరని ఎద్దేవా చేశారు. మహాకూటమి సీఎం అభ్యర్థి ఎవరనేది ఇంతవరకు ప్రకటించలేదని విమర్శించారు. కూటమిలో అందరూ సీఎం అభ్యర్థులేనని అన్నారు. మహాకూటమి వస్తే నెలకొకరు సీఎంగా ఉంటారని.. ఏ పదవి కావాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సిందేనని కేటీఆర్‌ విమర్శించారు. సీల్డ్‌ కవర్‌ సీఎం కావాలా.. సింహం లాంటి సీఎం కేసీఆర్‌ కావాలా? అని ప్రశ్నించారు. మహాకూటమి సీట్లు పంచుకునేలోపు మనం స్వీట్లు పంచుకుంటామని కేటీఆర్ అన్నారు.

చంద్రబాబును అభినందించిన వీహెచ్

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ నేతలతో భేటీ నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ భేటీలో చంద్రబాబు తెరాసను గద్దె దింపటమే ప్రధాన లక్ష్యమని సీట్ల విషయంలో సర్దుకుపోవాల్సిందిగా నేతలకు సూచించారు.కేసీఆర్‌ను గద్దె దించేందుకు సీట్ల త్యాగాలకు సిద్ధమని చంద్రబాబు ప్రకటించడం హర్షణీయమని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వ్యాఖ్యానించారు.సీపీఐ, టీజేఏస్‌ కూడా ఇదే తరహా ఆలోచనచేసి సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు.కేసీఆర్‌ ఎంతతిట్టినా బాబు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదని,అది ఆయన విజ్ఞతకు నిదర్శనమని కొనియాడారు. బీసీలకు సీట్ల కోటాయింపుపై ఢిల్లీలో జరుగుతున్నచర్చలపై వీహెచ్ అసహనం వ్యక్తం చేశారు.చర్చలకు తనను పిలవలేదని,రాష్ట్రంలో తనకంటే పెద్ద బీసీ నాయకుడు ఎవరున్నారని ప్రశ్నించారు.దీనిపై  స్క్రీనింగ్ కమిటీ భక్త చరణ్ దాస్ ను, పీసీసీ చీఫ్ ఉత్తమ్ ను వివరణ అడుగుతానన్నారు.బీసీ సాధికారత కమిటీ ఏ రాష్ట్రంలో లేదు.ఇక్కడ ఎందుకు పెట్టారు? ఎస్సీ, ఎస్టీ సాధికారత కమిటీ ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు.ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండు సీట్లు బీసీలకు అడుగుతున్నామన్న వీహెచ్ తాను మాత్రం ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు.

మంత్రికీ తప్పని నిరసన సెగలు

  తెరాస అభ్యర్థులకు పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారానికి వెళ్లి చేసిన అభివృద్ధి పనులను తెలియజెప్పమంటుంటే అసలు ఎక్కడ అభివృద్ధి జరిగిందంటూ ప్రచారానికి వెళ్లిన అభ్యర్థులను గ్రామస్తులు నిలదీస్తున్నారు.తాజాగా ఓ ఎమ్మెల్యే, చివరికి మంత్రికి కూడా ప్రచారానికి వెళ్లగా నిరసనలతో చేదు అనుభవాలు మిగిలాయి.మంత్రి, తెరాస ములుగు అభ్యర్థి అజ్మీరా చందూలాల్‌ కత్తిగూడెం, బ్రాహ్మణపల్లి, దోమేడ, నిమ్మగూడెం, రామచంద్రునిపేట, తిమ్మాపురం, తక్కళ్ళగూడెం, చింతకుంట, సంగెంపల్లి గ్రామాల్లో పర్యటించారు.ఆయా గ్రామాల్లో జరిగిన రోడ్‌షోలలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.అయితే కత్తిగూడెం, దోమెడ గ్రామాల్లో జరిగిన రోడ్‌షోలలో మంత్రి చందూలాల్‌ ప్రసంగాన్ని స్థానికులు అడ్డుకున్నారు.  కత్తిగూడెంలో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కూడా మంజూరు చేయలేదన్నారు.రైతుల భూములకు పూర్తిస్థాయిలో పట్టాలు రాలేదని పేర్కొన్నారు. తమ సమస్యలు తీర్చకుండా ఓట్లెలా అడుతారని మంత్రి నిలదీశారు.ప్రతిగా మంత్రి స్పందిస్తూ అంతర్గతరోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, ఎన్నికల కోడ్‌ వలన పనులు ప్రారంభంకాలేదని వివరణ ఇచ్చారు.భూములకు పట్టాల విషయంలో సంబంధిత అధికారులతో మాట్లాడుతానన్నారు.ఓ మహిళ శిథిలమైన ఇంట్లో ఉంటున్నా తనకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేయలేదని నిలదీయగా.. మళ్ళీ తెరాస నే అధికారంలోకి వస్తుందని,అప్పుడు తప్పకుండా ఇల్లు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తాజా మాజీ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ మహబూబాబాద్‌ శివారు బేతోలులో ప్రచారానికి వెళ్లగా స్థానిక ప్రజలు అడ్డుకున్నారు.శంకర్‌నాయక్‌ తెరాస శ్రేణులతో బేతోలు గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో ప్రచారం నిర్వహించేందుకు వాహనం దిగి కాలినడకన బయలుదేరాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి చుక్క నీరు ఇవ్వని ఎమ్మెల్యే మా ఊరికి రావోద్దంటూ నినాదాలు చేస్తూ కాలినడకన వెళ్తున్నశంకర్‌నాయక్‌ ను అడ్డుకున్నారు.ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.దీంతో తెరాస పార్టీ శ్రేణులు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న మహబూబాబాద్‌ టౌన్‌, రూరల్‌ ఎస్సైలు అరుణ్‌కుమార్‌, జితేందర్‌లు సిబ్బందితో బేతోలు గ్రామానికి చేరుకున్నారు.ఇరువర్గాలకు నచ్చచెప్పటంతో వివాదం సర్దుమణిగింది.అనంతరం శంకర్‌నాయక్‌ ప్రచారం నిర్వహించారు.

దీపావళికి 2 గంటలే టపాసులు కాల్చాలి.. సుప్రీంకోర్టు తీర్పు.!!

  'దీపావళి అంటే టపాసులు వల్ల వచ్చే పెద్ద పెద్ద శబ్దాలు, పొగ కాదు. దీపావళి అంటే దీపాల పండుగ' అని.. టపాసులు వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. అయినా టపాసుల మ్రోత ఆగదు. అయితే ఈ మధ్య వరుస సంచలన తీర్పులు ఇస్తున్న సుప్రీంకోర్టు.. టపాసుల విక్రయం, దీపావళి వేడుకుల గురించి కూడా సంచలన తీర్పు ఇచ్చింది. దీపావళి రోజు టపాసులు రెండు గంటలు మాత్రమే పేల్చాలని స్పష్టం చేసింది. పెద్దమొత్తంలో టపాసులు కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోందని, దేశవ్యాప్తంగా వాటిపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. టపాసుల విక్రయాలను పూర్తిగా నిషేధించడం కుదరదని, అయితే అమ్మకాలకు కొన్ని షరతులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. తక్కువ పొగ విడుదల చేసే, తక్కువ శబ్దం వచ్చే, పర్యావరణానికి హాని కలిగించని టపాసులను మాత్రమే విక్రయించాలని కోర్టు తేల్చి చెప్పింది. లైసెన్స్‌ ఉన్న దుకాణాల నుంచి మాత్రమే వీటిని అమ్మాలని ఆదేశించింది. అంతేగాక ఆన్‌లైన్‌ ద్వారా టపాసుల విక్రయాలపై న్యాయస్థానం నిషేధం విధించింది. కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి విక్రయాలు జరిపితే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఈ తీర్పు కేవలం దీపావళి పండగకు మాత్రమే కాదని, అన్ని మతాల పండగలు, శుభకార్యాలకు వర్తిస్తుందని సుప్పీంకోర్టు తెలిపింది. దీంతో పాటు టపాసులు పేల్చేందుకు సమయాన్ని కూడా నిర్దేశించింది. దీపావళి నాడు రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చేందుకు అనుమతినిచ్చింది. ఇక క్రిస్మస్‌, నూతన సంవత్సరం నాడు అర్ధరాత్రి 11.55 నుంచి 12.30 గంటల మధ్య టపాసులు కాల్చాలని స్పష్టం చేసింది.

తెలంగాణలోనే కాదు ఏపీలోను ఎన్నికలు

  నిన్న తెలంగాణకు నేడు ఆంధ్రప్రదేశ్ కు ఉమ్మడి హై కోర్ట్ షాకిచ్చింది.రెండు రాష్ట్రాల్లో పంచాయితీ సర్పంచుల పదవీ కాలం ముగిసింది.కానీ ఎన్నికలు జరపలేదు.దీంతో ఎన్నికలు ఎందుకు జరపాట్లేదని హై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.తెలంగాణలో తెరాస ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలు జరపకుండా ప్రత్యేక అధికారులను నియమించి పరిపాలన కొనసాగిస్తుంది.దీనిపై కోర్ట్ లో పిటిషన్ దాఖలు కాగా విచారణ జరిపిన కోర్ట్  ప్రత్యేక అధికారులను నియమించటం రాజ్యాంగ విరుద్ధమని 3 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించినది విదితమే.తాజాగా కోర్ట్  ఆంధ్ర ప్రదేశ్ లోను పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీల కాల పరిమితి ముగియడంతో ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించేలా జీవో 90ని తీసుకొచ్చింది.దీన్ని వ్యతిరేకిస్తూ మాజీ సర్పంచులు హై కోర్ట్ ను ఆశ్రయించారు.కాల పరిమితి ముగిసిన పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని,ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం దిగువ కేడర్ ఉద్యోగుల్ని నియమిస్తోందని,వారికి పాలనపై పట్టు ఉండటం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.దీని వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై వాదోపవాదాలు విన్న హై కోర్ట్ 3 నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.స్పెషల్‌ ఆఫీసర్ల పాలనను కొనసాగిస్తూ జారీ చేసిన జీవో నెంబర్‌ 90ను కోర్టు కొట్టివేసింది.