చెప్పాలనుకున్నదే లేఖలో రాశా..నిందితునికి రిమాండ్

  విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే.ఈ కేసులో నిందితున్ని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.జగన్‌పై దాడి కేసులో పురోగతిని విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ చంద్ర లడ్డా సమీక్షిస్తున్నారు.నిందితుడు 9 సెల్‌ఫోన్లు మార్చినట్లు గుర్తించారు. మరో చిన్న కత్తిని కూడా శ్రీనివాసరావు నుంచి స్వాధీనం చేసుకున్నారు. కత్తి దాడి చేసిన శ్రీనివాసరావు ను ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు విశాఖ నగర పోలీస్ కమిషనర్ ప్రశ్నించారు.11 పేజీలు లేఖపై పూర్తి దర్యాప్తు సాగింది. లేఖలోని 9 పేజీలను నిందితుడి బంధువు విజయలక్ష్మీతో రాయించగా, ఒక పేజీని సహచర ఉద్యోగి శ్రీకాకుళం జిల్లా రంగులీపుట్టికి చెందిన రేవతిపతితో రాయించినట్టు దర్యాప్తులో తేలింది. రేవతిపతి గత నాలుగు నెలలుగా విమానాశ్రయంలోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడని, అతడు పదో తరగతి చదివాడని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి నుంచి మూడు సెంటీమీటర్ల కత్తితో పాటు మరో చిన్న కత్తి స్వాధీనం చేసుకున్నారు. దాడి ఘటనలో నిందితుడు శ్రీనివాస్‌కు కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోలీసులు నిందితుడిని అదనపు జూనియర్‌ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్‌ విధించారు.కోర్టు నుంచి రిమాండ్ కు తీసుకెళ్తుండగా నిందితుడిని మీడియా ప్రతినిధులు ఘటనపై పలు ప్రశ్నలు అడిగారు. దీంతో తాను చెప్పాలనుకున్నదే లేఖలో రాశానని పేర్కొన్నాడు. అందులోనే చూసుకోండి.. అంటూ తెలిపాడు.మరోవైపు తూర్పుగోదావరి జిల్లా ఠాణేలంకలో శ్రీనివాస్‌ కుటుంబీకులను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. శ్రీనివాస్‌ స్నేహితులు, బంధువులను సిట్‌ ఆరా తీసింది. నిందితుడు శ్రీనివాస్‌ సంక్రాంతికి కట్టిన ఫ్లెక్సీని సేకరించింది. లేఖ రాసిన శ్రీనివాస్‌ సోదరిని విచారణ నిమిత్తం పోలీసులు విశాఖకు తరలించారు.

ఢిల్లీ సాక్షిగా కేంద్రాన్ని రచ్చకీడుస్తున్న చంద్రబాబు

  రాష్ట్రంపై కేంద్రం కుట్రలను ఢిల్లీ వేదికగా విన్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు.కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొండిచేయి చూపడం, విభజన చట్టం పెండింగ్ అంశాలు,తిత్లీ తుఫానుపై కేంద్రం స్పందన లేకపోవటంపై ఢిల్లీ వేదికగా కేంద్రాన్ని నిలదీయనున్నారు.ఓవైపు రాష్ట్రంలో తిత్లీ తుఫానుతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే.తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయమని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు.కానీ కేంద్రం తుఫాను పై స్పందించలేదు.మరోవైపు ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగిన సంగతి కూడా తెలిసిందే.దీనిపై గవర్నర్ నరసింహన్ ఏపీ డీజీపీని నివేదిక సమర్పించమని ఆదేశించారు.దీనిపై కూడా చంద్రబాబు ఘాటుగా స్పందించారు.గవర్నర్ వ్యవస్థను కేంద్రం వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ అంశాలపై కేంద్రాన్ని రచ్చకీడ్చి దేశ ప్రజలకు కేంద్ర వైఫల్యాన్ని చాటిచెప్పేందుకు ఢిల్లీని వేదికగా ఎంచుకున్నారు.

మహాకూటమి:హోం, నీటి పారుదలశాఖ తెదేపాకే

  కొడంగల్ నియోజకవర్గం నుంచి వివిధ పార్టీల నాయకులు హరీశ్‌ రావు సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్బంగా మాట్లాడిన హరీష్ రావు కొడంగల్‌లో గులాబీ జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు.అలాగే మహాకూటమిపై కూడా హరీష్ రావు విమర్శలు గుప్పించారు.జరగబోయే ఎన్నికల్లో మహాకూటమి గెలిచే ప్రసక్తే లేదని, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు.తెదేపాను ఆంధ్రా పార్టీ అని పొలిమేరల వరకు తరిమేస్తే కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని మళ్ళీ తెలంగాణలోకి తీసుకొస్తోందని హరీశ్‌ రావు మండిపడ్డారు.తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ వలసవాదుల పల్లకీలే మోస్తుంటారని ఆయన‌ ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తే కాంగ్రెస్‌ నేతలు వత్తాసు పలికారని,ఇప్పుడు చంద్రబాబును మోస్తున్నారని మండిపడ్డారు.మహాకూటమి గెలిస్తే హోం, నీటి పారుదలశాఖలను తెదేపాకు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారని ఆయన ఆరోపించారు.తెలంగాణను ఎండబెట్టేందుకు నీటిపారుదలశాఖ,ఓటుకు నోటు కేసు నుంచి బయట పడేందుకు హోంశాఖపై తెదేపా కన్నేసిందని హరీశ్‌ దుయ్యబట్టారు.

మహాకూటమి నేతల అరెస్ట్

  తెరాసని గద్దె దింపటమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతృత్వంలో టీడీపీ,సీపీఐ,టీజేఎస్ మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.తాజాగా బీజేపీ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా సీబీఐ కార్యాలయాల వద్ద నిరసన చెప్పట్టాలని పిలుపునిచ్చారు.రాహుల్ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్‌కు మద్దతుగా తెదేపా, సీసీఐ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సీబీఐ ప్రతిష్ఠ దెబ్బతీశారంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేశారు. సీబీఐ డైరెక్టర్ ఆలోక్‌ వర్మను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌. రమణ, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ కుంతియా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీబీఐ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు మహాకూటమి నేతలను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా విజయవాడలో కూడా కాంగ్రెస్‌ నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మహాత్మాగాంధీ రోడ్డులోని ఆదాయపన్ను శాఖ కార్యాలయంలోకి ప్రదర్శనగా వెళ్తున్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, తదితరులను పోలీసులు ఆంధ్ర రత్న భవనం వద్దే నిలువరించారు. నిరసనకు అనుమతి లేదంటూ వారిని ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర రత్న భవన్‌ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రఘువీరారెడ్డితో సహా పలువురు కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేసి భవానీపురం పోలీసుస్టేషన్‌కు తరలించారు.  

వాంగ్మూలం ఇవ్వను.. ఏపీ పోలీసులపై నమ్మకం లేదు: జగన్‌

  విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ అధినేత జగన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి ఘటనకు సంబంధించి వాంగ్మూలం ఇచ్చేందుకు జగన్‌ నిరాకరించారు. జగన్‌ వాంగ్మూలం తీసుకునేందుకు ఏపీ పోలీసుల బృందం ఈ రోజు హైదరాబాద్‌కు చేరుకుంది. సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్న జగన్‌ కలుసుకుని వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు. అయితే తనకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న జగన్‌.. వారికి వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించారు. ఏదైనా ఏజెన్సీ వారితో కలిసి వస్తే వాంగ్మూలం ఇస్తానని చెప్పారు. దీంతో పోలీసుల బృందం అక్కడి నుంచి వెనుదిరిగింది. కాగా సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగన్ తాజాగా డిశ్చార్జ్ అయ్యారు.

జగన్నాటకం: వైకాపా కోడి కత్తి డ్రామా!

  విశాఖ విమానాశ్రయంలో వైకాపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై గురువారం ఓ యువకుడు కత్తితో దాడికి దిగిన సంగతి తెలిసిందే.తాజాగా జగన్‌పై దాడి గురించి ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. జగన్‌ పదవి కోసం అడ్డదారులు తొక్కుతున్నారని పేర్కొన్నారు. ‘వైకాపా కోడి కత్తి డ్రామా! అధికారం కోసం అడ్డదారులు తొక్కడం ‘జగన్ మోదీ రెడ్డి’కి కొత్త కాదు. మరోసారి ఓటమి తప్పదు అనే భయంతో కోడి కత్తి డ్రామాకి తెరలేపారు. దాడి వెనుక ఉన్న వైకాపా కుట్ర ప్రజలకు అర్థం అయ్యింది. ఇంకా ప్రజలను మభ్య పెట్టాలని వైకాపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు. తండ్రి చితికి నిప్పు పెట్టకముందే ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన వ్యక్తి ఇలాంటి కత్తి డ్రామా చెయ్యడంలో ఆశ్చర్యం లేదు. ఎన్ని కుయుక్తులు పన్నినా ఆఖరిగా ప్రజల ముందు గెలిచేది నిజం మాత్రమే’ అంటూ #Jagannatakam అనే హ్యాష్‌ట్యాగ్‌ను లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. జగన్‌పై కత్తితో దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.జగన్‌ సీఎం అయ్యేందుకు అవకాశాలు మెరుగు పడతాయని, ఆయనకు సానుభూతి వస్తుందని, జగన్‌కు అది ఉపయోగపడుతుందనే తాను దాడి చేసినట్టు నిందితుడు పోలీసుల విచారణలో తెలిపాడు.ఈ నేపథ్యంలోనే లోకేష్ ట్వీట్ చేశారు.  

సీబీఐ వద్ద ఉద్రిక్తత.. రాహుల్ అరెస్ట్

  సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మను సెలవుపై పంపిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నేడు దేశవ్యాప్తంగా నిరసనకు దిగింది. దేశంలోని అన్ని సీబీఐ కార్యాలయాల ఎదటు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.ఢిల్లీలో రాహుల్ గాంధీ నేతృత్వంలో దయాళ్‌సింగ్‌ కళాశాల నుంచి సీబీఐ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం సీబీఐ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.రాహుల్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్‌,ఆనంద్‌ శర్మ, వీరప్ప మొయిలీ, సీపీఐ నాయకులు డి. రాజా, శరద్‌ యాదవ్‌ తదితరులు ఈ నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు.రాహుల్‌గాంధీ నిరసన కార్యక్రమానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా మద్దతు తెలిపింది.కాగా ఆందోళనల నేపథ్యంలో సీబీఐ కార్యాయలం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.దీంతో భారీగా మోహరించిన కేంద్ర బలగాలు, పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు.ఆందోళన చేపట్టిన రాహుల్‌ ని పోలీసులు అరెస్టు చేశారు.రాహుల్‌తో పాటు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, ఇతర రాజకీయ పార్టీల నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

సీబీఐ రచ్చ.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

  సీబీఐ అధికారుల మధ్య మొదలైన వర్గ పోరు ఇటీవల తీవ్రరూపం దాల్చి రచ్చకెక్కిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్‌ అస్థానాను సెలవుపై పంపుతూ మంగళవారం అర్ధరాత్రి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తాత్కాలిక డైరెక్టర్‌ బాధ్యతలను జాయింట్‌ డైరెక్టర్‌ నాగేశ్వరరావుకు అప్పగించింది. అర్ధరాత్రి వేళ తన అధికారాలను తొలగించి, సెలవుపై పంపడాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. ఆలోక్‌ వర్మపై వస్తున్న ఆరోపణలపై రెండు వారాల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)ను  ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే పట్నాయక్‌ ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తారని తెలిపింది. అంతేగాక.. ఈ కేసులో తదుపరి విచారణ చేపట్టేంత వరకు తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్న మన్నెం నాగేశ్వరరావు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలను తీసుకోరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అక్టోబరు 23 నుంచి ఇప్పటివరకు నాగేశ్వరరావు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయరాదని తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణను నవంబరు 12కు వాయిదా వేసింది.

జగన్ కు గాయం.. ఏది నిజం

  విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై  శ్రీనివాసరావు అనే యువకుడు కోడి పందాలలో ఉపయోగించే కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో జగన్ భుజానికి స్వల్ప గాయమైంది. అయితే అసలు ఆ గాయం లోతు ఎంత? ఆ లోతులో నిజమెంత? అంటూ చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌కు చికిత్స చేసిన అపోలో ఆస్పత్రి విడుదల చేసిన ప్రకటనలో.. జగన్‌ ఎడమ చేతికి అర సెంటీమీటరు లోతున భుజానికి గాయమైందని డాక్టర్‌ స్పష్టం చేశారు. గాయాన్ని శుభ్రం చేసి, కట్టుకట్టామని.. యాంటీ బయాటిక్స్‌, పెయిన్‌ కిల్లర్‌ వాడాలని చెప్పారు. అయితే హైదరాబాద్‌లో జగన్‌కు చికిత్స చేసిన సిటీ న్యూరో సెంటర్‌ డాక్టర్లు మాత్రం జగన్‌కు మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల లోతున గాయమైందని, ఆపరేషన్‌ చేసి తొమ్మిది వరకు కుట్లు వేశామని చెప్పారు. దీంతో విశాఖలో అర సెంటీమీటరు ఉన్న గాయపు లోతు.. హైదరాబాద్‌ చేరుకునే సరికి నాలుగు సెంటీమీటర్లు ఎలా అయ్యిందంటూ చర్చ మొదలైంది. అయితే కత్తికి విష రసాయనాలు పూశారేమో అని నిర్ధారణ చేసుకునేందుకు వీలుగా శాంపిల్స్‌ను లోతు నుంచి సేకరించాల్సి వచ్చిందని, అందుకే గాయం పెద్దదైందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

రాజా రెడ్డి, వైఎస్ తరహాలోనే ప్లాన్ చేస్తాం

  విశాఖ ఎయిర్‌‌పోర్టులో జగన్‌పై జరిగిన దాడి ఘటనపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.సీఐఎస్‌ఎఫ్‌ అదుపులో ఉండే విమానాశ్రయంలోకి ఓ వ్యక్తి కత్తితో లోనికి ప్రవేశిస్తే పట్టుకోలేకపోయారా? అని ప్రశ్నించారు.జగన్ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే చిన్న ముల్లు కూడా గుచ్చుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని.. సీఐఎస్‌ఎఫ్‌ ఆధీనంలో ఉండే విమానాశ్రయంలో దాడి జరిగితే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు.దాడి విషయంలో వైసీపీ కేంద్రాన్ని ఒక్క మాట అనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.విశాఖలో కుట్లు వేసే డాక్టర్లే లేరా...దానికి హైదరాబాద్ వరకు వెళ్లాలా? అని ప్రశ్నించారు.చంద్రబాబు పిల్ల కుంకతో హత్య ప్లాన్ చేస్తాడా అని అన్నారు. తాము నిజంగా ప్లాన్ చేస్తే ఇలా గిచ్చుకోవటాలు గుచ్చుకోవటాలు ఉండవని...ప్లాన్ చేయాలనుకుంటే రాజారెడ్డి, వైఎస్ తరహాలోనే చేస్తామని వ్యాఖ్యానించారు. జగన్‌పై దాడి ఘటనకు సంబంధించి గవర్నర్‌తో విచారణ జరిపించాలని జగన్‌ బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డి కోరడాన్ని ఆయన తప్పుబట్టారు.జగన్‌కు జరిగిన అరసెంటీమీటర్ గాయానికి గవర్నర్ విచారణ చెయ్యాలా? అని మంత్రి ప్రశ్నించారు.యూపీఏ ప్రభుత్వం నియమించిన గవర్నర్ ను 12 ఏళ్లుగా ఎన్డీఏ కొనసాగిస్తోంది.ఒక గవర్నర్ 12 ఏళ్లుగా ఒకే చోట ఉన్న సందర్భం ఉందా? అని మండిపడ్డారు.గవర్నర్ నరసింహన్ పై కేంద్రానికి ఎందుకు ఇంత ప్రేమ.. అలాంటి గవర్నర్ తో విచారణ చేయించాలని జగన్ బాబాయ్ కోరుతున్నాడని విమర్శించారు.

జగన్ పై దాడి.. ఏ-1 చంద్రబాబు, ఏ-2 డీజీపీ.!!

  విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ అధినేత జగన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అసలు ఈ దాడి వెనుకున్న కోణాలేంటో ఇంకా పూర్తిగా బయటికిరాలేదు కానీ.. వైసీపీ నేతలు మాత్రం దాడికి కారణం టీడీపీనే అన్నట్టుగా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ తీసుకొని.. అదే స్థాయిలో సమాధానాలు చెప్తూ.. ప్రశ్నలు సంధిస్తూ.. విచారణ జరిపి అసలు ఈ దాడి వెనుక ఎవరి కుట్ర ఉందో బయటపెడతామని స్పష్టం చేసింది. అయినా వైసీపీ నేతలు టీడీపీ ప్రభుత్వం మీద విమర్శలు ఆపట్లేదు. తాజాగా వైసీపీ నేత మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి టీడీపీ ప్రభుత్వం మీద, వైసీపీ మీద విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ప్రమేయం లేకుండానే జగన్‌పై దాడి జరిగిందా? అని ప్రశ్నించారు. దాడికి పాల్పడ్డ శ్రీనివాసరావు టీడీపీకి చెందిన వ్యక్తి క్యాంటిన్‌లో పనిచేస్తున్నాడని.. శ్రీనివాసరావును వైసీపీ అభిమానిగా చిత్రీకరించడానికి టీడీపీ ప్రయత్నించిందని ఆరోపించారు. 11 నెలల క్రితం పెట్టిన ఫ్లెక్సీని ఇప్పుడు తెరపైకి తెచ్చారని, ఆరు నెలలుగా టీడీపీలో ఉన్నామని శ్రీనివాసరావు సోదరుడు చెప్పాడని వైవీ తెలిపారు. శ్రీనివాసరావు వద్ద ఉన్న లెటర్‌ రాత్రి 10 గంటలకు విడుదల చేయడమేంటని, ఫ్లెక్సీ మాదిరిగానే లెటర్‌ కూడా టీడీపీ వాళ్లే సృష్టించారని ఆరోపించారు. గత ఆరు నెలల్లో శ్రీనివాసరావు కుటుంబానికి రెండు లోన్లు ఇచ్చారని ఆరోపించారు. ఆపరేషన్‌ గరుడ స్క్రీన్‌ ప్లే డైరెక్షన్‌ చంద్రబాబుదేనని, ఆపరేషన్‌ గరుడపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని వైవీ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు స్పందించిన తీరును చూసి జనం అసహ్యించుకుంటున్నారని, అలిపిరి ఘటన జరిగినప్పుడు వైఎస్ ఎలా స్పందించారో అందరికీ తెలుసని వైవీ అన్నారు. ఇప్పుడు జగన్‌పై దాడి జరిగితే చంద్రబాబు ఎలా స్పందిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని, జగన్‌ మెరుగైన వైద్యం, భద్రత కోసమే విశాఖ నుంచి హైదరాబాద్‌ వచ్చారని తెలిపారు. జగన్‌పై దాడి ఘటనలో ఏ-1 చంద్రబాబు, ఏ-2 డీజీపీ అని ఆరోపణ చేశారు. సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వ విచారణపై నమ్మకం లేదని అన్నారు. థర్డ్‌ పార్టీ ఏజెన్సీతో విచారణ జరిపించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.

జగన్ పై ఎటాక్.. హైకోర్టులో పిటిషన్

  విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై  శ్రీనివాసరావు అనే యువకుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో జగన్ భుజానికి స్వల్ప గాయమైంది. ప్రస్తుతం జగన్ హైద్రాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ దాడి ఘటనపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ దాడిపై సీబీఐ విచారణ జరిపించాలని లంచ్‌ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌‌ను వైసీపీ నేతలు అనిల్ కుమార్, అమర్‌నాథ్‌రెడ్డి దాఖలు చేశారు. సీఎస్‌ఎఫ్ అధికారుల రిపోర్టు తీసుకోవాలని దాడి ఘటన మొత్తం సీబీఐ చేత విచారణ చేయించాలని పిటిషనర్లు కోరుతున్నారు. కాగా ఈ దాడి ఘటనపై లంచ్‌మోషన్‌లో హైకోర్టు విచారించనుంది. అయితే కోర్టు ఏం చెప్పబోతోందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కేసీఆర్ వేటుతో కాంగ్రెస్ లో చేరనున్న మరో తెరాస నేత

  గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి‌పై తెరాస సస్పెన్షన్ వేటు వేసింది.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ తెరాస నర్సారెడ్డి‌ని సస్పెండ్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది.తెరాస సస్పెండ్ చేయడంతో నర్సారెడ్డి తిరిగి సొంత గూటికి చేరనున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సీఎం కేసీఆర్‌‌పై పోటీ చేసి ఓడిపోయిన నర్సారెడ్డి అనంతరం తెరాసస్‌లో చేరారు. తెరాస ఆయనకు తెలంగాణ రోడ్ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ బాధ్యతలను అప్పగించింది. కాగా గత కొద్దిరోజులుగా కేసీఆర్‌పై నర్సారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తెరాసలో చేరిక సమయంలో ఎమ్మెల్సీ ఇస్తానంటూ ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోకపోవడమే నర్సారెడ్డి అసంతృప్తికి కారణంగా సమాచారం.ఈ క్రమంలో కొంత కాలంగా నర్సారెడ్డి కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. అలాగే ఉత్తమ్ తో కూడా మంతనాలు జరిపారు.దీంతో స్థానిక నాయకులు అధిష్టానానికి పిర్యాదు చేశారు.అంతేకాకుండా తెలంగాణ రోడ్ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌కు నర్సారెడ్డి లేఖను పంపటంతో ఆయన్ని పార్టీ సస్పెండ్ చేసింది.దీంతో నేడో రేపో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.నర్సారెడ్డికి మెదక్ అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

జగన్ పై దాడి.. గవర్నర్ ఫోన్.. ఇక మేమెందుకు?

  అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు రెండో రోజు ప్రారంభమైంది. ఈ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షనేత జగన్‌కు కావాలని ప్రాణహాని లేని దాడి చేసి.. రాష్ట్రమంతా అల్లర్లు సృష్టించి, ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనుకున్నారని ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల గూండాలను తీసుకొచ్చి అరాచకం సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆపరేషన్ గరుడ స్క్రిప్టులో రాసింది రాసినట్టుగా ఇప్పుడు జరుగుతోందని అన్నారు. నేరాలు చేసే వ్యక్తులు రాజకీయ ముసుగులో ఉంటే ప్రమాదమని అన్నారు. ఏదైనా నేరాలు జరిగినప్పుడు పోలీసులు ధైర్యంగా వ్యవహరించాలని.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన తిత్లీ తుపానుపై స్పందించని కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత లాంటి వారు జగన్‌పై చిన్న దాడి జరిగిన వెంటనే స్పందించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు. గవర్నర్‌ వ్యవహార శైలి కూడా సరిగా లేదని.. జగన్‌పై దాడి విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నేరుగా డీజీపీనే నివేదిక అడగడం ఏంటని ప్రశ్నించారు. గవర్నర్‌ నేరుగా అధికారులనే సంప్రదిస్తే ఇక తామెందుకుని అన్నారు. ఎన్నడూ లేని విధంగా ఐటీ సామూహిక దాడులు చేస్తోందని, ప్రత్యేక హోదా అడిగినందుకు ఇన్ని దాడులు చేస్తారా అని నిలదీశారు. సీబీఐ విషయంలో అర్ధరాత్రి డ్రామా చేశారని వ్యాఖ్యానించారు. కేంద్రం రాష్ట్రానికి చేయాల్సిన పనులను అడిగితే అణచివేసే ధోరణి అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం సాయం చేయదు.. చేయనివ్వదని విమర్శించారు. పద్ధతిగా రాజకీయాలు చేశానని, ఎవరికీ భయపడాల్సిన అవసరంలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు నిన్న కూడా స్పందిస్తూ పలు అనుమానాలు వ్యక్తం చేసారు. తనపై దాడి జరిగిన వెంటనే జగన్‌ స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకుండా, వారికి సమాచారం తెలపకుండా తన మానాన తాను హైదరాబాద్‌ ఎలా వెళ్లిపోతారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ‘దాడి సంఘటన మధ్యాహ్నం 12. 40 నిమిషాలకు జరిగింది. ఒంటి గంట విమానానికి ఆయన హైదరాబాద్‌ విమానం ఎక్కి వెళ్లి పోయారు. దాడి చేసిన నిందితుడిని సీఐఎస్ఎఫ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకొని సాయంత్రం 4.30 గంటలకు రాష్ట్ర పోలీసులకు అప్పగించారు. నిబంధనల ప్రకారం బాధితుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించాలి. ఆయన నుంచి ఫిర్యాదు తీసుకోవాలి. సంఘటన ఎలా జరిగిందో స్టేట్‌మెంట్‌ తీసుకోవాలి. జగన్‌ తనపై దాడి చేసిన నిందితుడిని క్షమిస్తే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ, నిబంధనలు పాటించరా? ఆయన విమానం ఎక్కి వెళ్లిపోతుంటే సీఐఎస్ఎఫ్‌ అధికారులు ఎలా అనుమతించారు. గాయపడిన మనిషిని విమానంలోకి సిబ్బంది ఎలా అనుమతించారు?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

హీట్ పెంచిన రాహుల్ ట్వీట్..భారీ భద్రత

  రాఫెల్ ఒప్పందంపై దర్యాప్తు ప్రారంభించినందునే సీబీఐ చీఫ్‌ అలోక్‌వర్మను కేంద్రం తొలగించిందని, తక్షణమే ఆయనను విధుల్లోకి తీసుకుని, సీబీఐ ప్రతిష్టకు గండికొట్టేందుకు ప్రయత్నించిన ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.కేంద్రం చర్యకు నిరసనగా దేశవ్యాప్తంగా సీబీఐ ప్రధాన కార్యాలయాల వద్ద కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరసన ప్రదర్శనలు చేపడుతోంది. దేశ రాజధానిలోని సీజీఓ కాంప్లెక్‌లోని సీబీఐ ప్రధాన కార్యాలయం వెలుపల జరగనున్న నిరసన ప్రదర్శనకు రాహుల్ గాంధీ నాయకత్వం వహించనున్నారు. ఇదే విషయాన్ని రాహుల్ ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించారు.రాహుల్ ట్వీట్ తో దేశరాజధానిలో సీజేఓ కాంప్లెక్స్‌లోని సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద టెన్షన్ నెలకొంది.కార్యాలయం వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.కార్యాలయం ప్రధాన ద్వారం భారీగా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించారు.బారికేడ్లు ఏర్పాటు చేశారు.వాటర్‍‌కేనన్లు, అంబులెన్స్‌లను కూడా సిద్ధం చేశారు.  

తెరాస అభ్యర్థికి అవమానం.. అమ్ముడుపోయావంటూ నిలదీశారు

  తెరాస అధినేత కేసీఆర్ తమ పార్టీకి 100 కి పైగా సీట్లు ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.కానీ ప్రచారానికి వెళ్లిన పార్టీ అభ్యర్థులకు అవమానాలే మిగులుతున్నాయి.ఇప్పటికే పలువురు అభ్యర్థులకు నిరసన గళం వినిపించగా తాజాగా అశ్వారావుపేట తాజా మాజీ ఎమ్మెల్యే  తాటి వెంకటేశ్వర్లుకు ఘోర అవమానం జరిగింది.పార్టీ మారి అమ్ముడుపోయావంటూ నిలదీశారు. తాటి వెంకటేశ్వర్లు ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లాయిగూడెం వెళ్లారు.గ్రామంలో తమకే ఓట్లు వేయాలని ప్రచారం చేస్తున్న తాటి వెంకటేశ్వర్లును గ్రామానికి చెందిన స్థానికులు, వామపక్ష పార్టీకి చెందిన కార్యకర్తలు ‘తమకు పోడు భూములకు పట్టాలివ్వలేదని, వైఎస్సాఆర్‌సీపీ నుంచి పోటీ చేసి గెలిచి అమ్ముడుపోయి పార్టీ మారావని, నీవు మాకేమి చేశావంటూ’ నిలదీశారు. వీరిలో మహిళలు సైతం ఉన్నారు. అయితే... తాటి వెంకటేశ్వర్లు ఓపిగ్గా సమాధానం చెప్పబోయినప్పటికీ ఆయన మాట వినకుండా నిగ్గదీశారు. ఈ సందర్భంగా తెరాస కార్యకర్తలు, గ్రామానికి చెందిన వామపక్ష కార్యకర్తల మద్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.

రక్తమోడిన జగన్..కత్తికేది రక్తం

  విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జగన్ పై అతని అభిమానే కత్తితో దాడి చేసిన సంఘటన తెలిసిందే.దాడిలో జగన్‌ ఎడమ భుజానికి గాయం అవ్వగా ప్రధమ చికిత్స అందించారు. ఎయిర్ పోర్ట్ లోని అపోలో వైద్యులు.'0.5 సెంటీమీటరు పొడవు, 0.5 సెం.మీ లోతుతో గాయమైంది.ఆయింట్‌మెంట్‌ పూసి రక్తం కారకుండా డ్రసింగ్‌ చేశాం.. నొప్పి తగ్గడానికి యాంటి బయోటిక్స్‌ వాడమని సలహా ఇచ్చాం’ అని విమానాశ్రయంలో చికిత్స  చేసిన అపోలో డాక్టరు లలితకుమారి రిపోర్టు ఇచ్చారు.అయితే... హైదరాబాద్‌లో జగన్‌కు చికిత్స చేసిన సిటీ న్యూరో సెంటర్‌ వైద్యులేమో దాదాపు 3.5 సెంటీమీటర్ల మేర కండరం లోపలికి కత్తి దిగిందని వెల్లడించారు.ఆపరేషన్‌ చేసి తొమ్మిది వరకు కుట్లు వేశామని చెప్పారు.దీంతో విశాఖలో అర సెంటీమీటరు ఉన్న గాయపు లోతు... హైదరాబాద్‌ చేరుకునే సరికి మూడు సెంటీమీటర్లు ఎలా అయ్యిందంటూ చర్చ మొదలైంది.అయితే... కత్తికి విష రసాయనాలు పూశారేమో అని నిర్ధారణ చేసుకునేందుకు వీలుగా శాంపిల్స్‌ను లోతు నుంచి సేకరించాల్సి వచ్చిందని, అందుకే గాయం పెద్దదైందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.     ‘విమానాశ్రయంలో కేంద్ర ప్రభుత్వ బలగాల భద్రత ఉంటుంది.. దాడి జరిగిన వెంటనే వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి.. ఇక్కడ మాత్రం సాయంత్రం 4.30 గంటలకు ఫిర్యాదు ఇచ్చారు.. అప్పటికీ దాడికి ఉపయోగించిన చిన్న కత్తిని స్వాధీనం చేయలేదు. కొంత సమయం దగ్గర పెట్టుకుని తర్వాత తెచ్చి ఇచ్చారు. దీనికి ఫొరెన్సిక్‌ పరీక్ష ఎలా సాధ్యమవుతుంది?’ అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ‘జరిగిన దాడి మెడికో లీగల్‌ కేసు. కేసున్నా, లేకున్నా సంఘటన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలి. జగన్‌ మాత్రం బాధ్యతా రాహిత్యంగా విమానంలో హైదరాబాద్‌కు వెళ్లిపోయారు’ అని చంద్రబాబు తెలిపారు.ఈ నాటకీయ పరిణామాలు చూస్తుంటే అసలు ఏం జరుగుతుందో అర్ధం కానీ పరిస్థితి.పోలీసులకు పిర్యాదులో కనపడుతున్న జాప్యం,కత్తిని స్వాధీనం చేయటంలో నిర్లక్ష్యం అంతేకాకుండా కత్తితో దాడి చేశాడు సరే.. మరి కత్తికి రక్తమెక్కడ అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.వీరి అనుమానానికి తగ్గట్టుగానే కత్తి అయితే పదునుగానే ఉంది కానీ కత్తికి మాత్రం రక్తమెక్కడా కనపడట్లేదు.మీరు కూడా ఈ కత్తిని గమనిస్తే మీకూ అలాంటి సందేహమే కలగొచ్చు.  

కత్తి పోటుకు మూడు కుట్లు.. క్షేమమే కానీ విశ్రాంతి అవసరం

  విశాఖ విమానాశ్రయంలో వైకాపా అధినేత జగన్‌పై దాడి తీవ్ర కలకలం రేపింది. విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో ఉండగా.. ఆయనతో సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చిన ఓ యువకుడు కత్తితో దాడి చేయడంతో జగన్‌ భుజానికి గాయమైంది. దీంతో తొలుత విశాఖలోనే ప్రథమ చికిత్స చేయించుకున్నజగన్‌ అనంతరం హైదరాబాద్‌ చేరుకున్నారు.ప్రస్తుతం జగన్ కు సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.ఆయన ఎడమ భుజానికి వైద్యులు మూడు కుట్లు వేశారు. 24 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాలని జగన్‌కు వైద్యులు సూచించారు. జగన్‌ వెంట ఆయన సతీమణి భారతి, బంధువులు ఉన్నారు. ఆస్పత్రి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.తన ఆరోగ్య సమాచారంపై జగన్ ట్వీట్‌ చేశారు."తాను దేవుడి దయవల్ల క్షేమంగానే ఉన్నానని, ప్రజల ఆశీర్వాదమే తనను రక్షిస్తోందన్నారు. ఇలాంటి చర్యలను తనను భయపెట్టలేవని, రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు మరింత శక్తిమంతుడిని చేస్తాయంటూ" ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.