ఇక్కడ కేసీఆర్.. అక్కడ మోదీ

  తెలంగాణలో ముందస్తు వేడి మొదలవడంతో రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఇప్పటికే భైంసాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్.. కేసీఆర్, మోదీ మీద విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అదే ఊపులో కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన రాహుల్.. అదే స్థాయిలో మళ్ళీ కేసీఆర్, మోదీపై విరుచుకుపడ్డారు. రాహుల్ మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంపై రాష్ట్ర ఉద్యమం కొనసాగిందని, ప్రజా ఉద్యమం తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కేసీఆర్‌ మాటలు నమ్మి ఆయనను గెలిపించారని, తెలంగాణలో కొత్త శకాన్ని తీసుకొస్తారని ప్రజలు ఆశించారని అయితే కేసీఆర్‌ పాలనలో ప్రజల ఆశలు అడియాసలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలోనే కేసీఆర్‌ నిజస్వరూపాన్ని ప్రజలు గ్రహించారని అన్నారు. తెలంగాణలో 4500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, మద్దతుధర అడిగినందుకు రైతుల చేతులకు బేడీలు వేశారని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కానీ, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని.. కుటుంబ పాలన తీసుకువచ్చారని విమర్శించారు. తెలంగాణలో ప్రతి ఒక్కరిపైన రూ. 2.60 లక్షల అప్పు ఉందని అన్నారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు డబ్బు లేవు కానీ, కేసీఆర్‌ తన ఇంటి నిర్మాణానికి రూ.300 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో కేసీఆర్‌ అవినీతికి పాల్పడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, దళితులకు మూడు ఎకరాలు ఇస్తామన్నారు. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు. ఇంటింటికి నల్లా ఇస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. ఇక్కడ కేసీఆర్, అక్కడ మోదీ అవినీతికి పాల్పడుతున్నారు రాహుల్ అని అన్నారు. నోట్ల రద్దుపై మోదీ నిర్ణయం తీసుకోగానే దేశమంతా వ్యతిరేకించినప్పటికీ కేసీఆర్ బేషరతుగా మద్దతిచ్చారని రాహుల్ గుర్తు చేశారు. మోదీ, కేసీఆర్‌ ఒక్కటేనని, వారి పాలనలో ఒకేరకమైన పోలికలు ఉన్నాయని అన్నారు. పార్లమెంట్‌లో బీజేపీకి కేసీఆర్‌ అండగా నిలుస్తున్నారని, కేసీఆర్‌తో పాటు ఎంఐఎం కూడా మోదీకి మద్దతు ఇస్తోందని ఆరోపించారు. కేసీఆర్ గల్ఫ్‌ బాధితుల కోసం రూ.500 కోట్లు కేటాయిస్తామని, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గల్ఫ్‌ బాధితులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుంది. చెప్పిన మాటలను వచ్చే కాంగ్రెస్‌ ప్రభుత్వం తూచా తప్పకుండా పాటిస్తుంది. అబద్దపు మాటలు విని మోసపోవాలనుకుంటే మోదీ, కేసీఆర్‌ వైపు వెళ్లండి అన్నారు. నాలుగు విడతలు కాదు, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోంది

  నిజామాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ తొమ్మిది స్థానాల్లో గెలుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. కామారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్‌ ప్రజాగర్జన సభలో ఆయన ప్రసంగిస్తూ కేసీఆర్‌ పాలనపై విమర్శలు గుప్పించారు. " కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోంది. ఆ డబ్బు ప్రభావంతో ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్‌ కోసం ఎదురు చూస్తోంది. డిసెంబర్‌ 12న ఏర్పాటయ్యేది కాంగ్రెస్‌నేతృత్వంలో ప్రభుత్వమే. యావత్‌ తెలంగాణ రైతాంగానికి 2లక్షల రుణ మాఫీ చేస్తాం. నిజామాబాద్‌ జిల్లాలో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీకి ఎంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉన్నా.. మా ప్రభుత్వం ఆ ఫ్యాక్టరీని తెరిపిస్తుందని కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట ఇస్తున్నా. బీడీ కార్మికుల దుస్థితికి కారణం కేసీఆర్‌, మోదీ ఘన కార్యమే. జీఎస్టీ 28శాతం పెట్టి కార్మికులకు ఉపాధి లేకుండా చేశారు. బీడీలపై 28శాతం పన్ను విధించి వారి పొట్ట గొట్టారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రూ.500 కోట్లతో గల్ఫ్‌ బాధితుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే ప్రభుత్వరంగంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఉద్యోగాలు దక్కనివారికి నెలకు రూ.3వేలుచొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తాం. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఇచ్చే పింఛను రెట్టింపు చేస్తాం" అని అన్నారు. "రేషన్‌ పద్ధతిలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం. కుటుంబంలో ప్రతిమనిషికి 7కిలోల సన్నబియ్యం ఇస్తాం. వాటితో పాటు తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను ఇస్తాం. తెలంగాణలో దళితులు, గిరిజనులకు మేలు చేసే విధంగా తెల్లకార్డు ఉన్నవారందరికీ సన్నబియ్యంతో సహా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా ఇస్తాం. వారి ఇళ్ల అవసరాలకు వాడే 200 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా ఇస్తాం. కాంగ్రెస్‌ పాలనలో ఒక వ్యక్తి, కుటుంబ పాలనకు అవకాశం ఉండదు.. సామాజిక న్యాయం ఉంటుంది. రైతులకు మద్దతు ధరతో పాటు రాష్ట్ర బడ్జెట్‌ నుంచి బోనస్‌ కేటాయించి రైతులు పండించిన పంటలను మంచి ధరలకు కొనుగోలు చేస్తాం’’ అని ఉత్తమ్‌ ప్రకటించారు.

తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే

  తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.భైంసాలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ..తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల కేసీఆర్‌ పాలనలో 4500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.ఆ కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ ఒక్కరోజు కూడా పరామర్శించలేదన్నారు.కానీ రాహుల్‌ దిల్లీ నుంచి వచ్చి 15 కి.మీల పాదయాత్ర చేసి రైతులకు సంఘీభావం తెలిపారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్‌ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు.డిసెంబర్‌ 12న రాష్ట్రంలో ఏర్పడేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు. ప్రత్యేక రాష్ట్రంతో తమ జీవితాలు బాగుపడతాయని ప్రజలు ఆశించినప్పటికీ.. తెరాస పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెరాసను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే రైతులకు ఏకకాలంలో రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు.తెలంగాణ నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు ఇస్తామని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు. అనంతరం మాట్లాడిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి 'తెలుగువారిని రాష్ట్రపతి, ప్రధానిగా చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదే' అన్నారు.కాంగ్రెస్‌ కుటుంబ పార్టీ కాదని, కాంగ్రెస్‌ చరిత్రను కేసీఆర్‌ తెలుసుకోవాలని సూచించారు. మాజీ ప్రధాని నెహ్రూ మరణం తర్వాతే ఇందిర మంత్రి అయ్యారని, దేశం కోసం రాజీవ్‌ గాంధీ ప్రాణాలు ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశం కోసమే సోనియా పార్టీ పగ్గాలు తీసుకున్నారని, మన్మోహన్‌ లాంటి మేధావిని ఆమె ప్రధానిని చేశారని చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం సోనియా కుటుంబం పదవులకు దూరంగా ఉందని, దేశ ప్రజలంతా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల బతుకులు మారాలంటే కేసీఆర్‌ను ఓడించాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

భాజపా వల్ల ప్రజాస్వామ్యానికే ముప్పు

  కడప స్టీల్ ప్లాంట్ గురించి తామిచ్చిన రిప్రజెంటేషన్‌పై కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేందర్‌సింగ్‌ ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు.ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ఏపీకి నష్టం కలగించేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించిన వివరాలను ఏపీ ప్రభుత్వం మెకాన్‌ సంస్థకు ఇవ్వలేదంటూ మంత్రి బీరేందర్‌సింగ్‌ ప్రకటించటం దారుణమని ఆయన మండిపడ్డారు.ఇప్పటికి ఏడు పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వం మెకాన్‌కు సమగ్ర సమాచారం ఇచ్చిందన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కావాలనే కేంద్రం ఆటంకాలు సృష్టిస్తూ కాలయాపన చేస్తోందన్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక కేంద్రం ఏపీ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులకు తామేమీ భయపడడం లేదని ఆయన స్పష్టం చేశారు. భాజపా చర్యల వల్ల ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లేలా ఉందని అన్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చేతిలో కూడా ఏమీలేదని,కడప స్టీల్ ప్లాంట్ పై కేంద్రప్రభుత్వం వెంటనే హామీ ఇవ్వాలని సుజనా చౌదరి డిమాండ్ చేశారు.ఎన్ని రోజుల్లో కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తారో కేంద్రం లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.3 మిలియన్ టన్నుల కెపాసిటీ ప్లాంట్ ఏర్పాటుకు సమాచారం ఇచ్చామని సుజనా చౌదరి అన్నారు.దీనిపై మరోసారి కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలుస్తామని సుజనా చౌదరి స్పష్టం చేశారు.

కేసీఆర్, మోదీ చెప్పేవన్నీ అబద్దాలే

  నిర్మల్‌ జిల్లా భైంసాలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ కేసీఆర్, మోదీపై విమర్శలు గుప్పించారు. పంటలకు మద్దతు ధర రాక, వ్యవసాయ కష్టాలతో తెలంగాణలో వేల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతుల కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, పంటలకు మద్దతు ధర పెంచుతామని ప్రకటించారు. ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు.. రాష్ట్రం మొత్తం మీద ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? అని రాహుల్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు మూడు ఎకరాలు ఇస్తామన్నారు ఇచ్చారా?.. డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టిస్తామన్నారు, కట్టించారా?.. ముస్లింలకు 12 శాతం రిజర్వేష్లు ఇస్తామన్నారు, ఇచ్చారా?.. ఇంటింటికి నల్లా వచ్చిందా?.. అంటూ రాహుల్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆదివాసీల కోసం పోరాడిన కొమరం భీం స్ఫూర్తిని, దళితుల కోసం నిలబడిన అంబేద్కర్ స్ఫూర్తిని గుర్తుచేసుకుందామని రాహుల్ అన్నారు. దేశమంతా అంబేద్కర్ ను స్మరిస్తుంటే ఇక్కడి సీఎం అవమానిస్తారని కేసీఆర్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్ పేరుతో ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్ట్ కు కాళేశ్వరమంటూ పేరు మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ప్రాజెక్టు వ్యయాన్ని లక్ష కోట్లకు పెంచి రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ చేశారని రాహుల్‌ మండిపడ్డారు. నీరు, భూమి, అడవిపై ఆదివాసీల హక్కులు రక్షించాలని యూపీఏ చట్టం తెచ్చిందని, దీని ప్రకారం మార్కెట్‌ రేటు కంటే నాలుగురెట్ల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్‌ చెప్పిందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. అయితే తెలంగాణలో ఆ భూసేకరణ చట్టాన్ని కేసీఆర్‌ తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేసీఆర్‌కు మోదీ అండగా నిలిచారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. వాటి ప్రసావనేది?.. పంటకు కనీసం మద్దతు ధర దక్కుతోందా?.. అని రాహుల్ మండిపడ్డారు. కేసీఆర్, మోదీ చెప్పేవన్నీ అబద్దాలేనని, జనం సమస్యలతో రాజకీయం చేయాలని చూస్తున్నారని రాహుల్ అన్నారు.

రాహుల్ కి రేవంత్ కోచింగ్

  టీడీపీ, కాంగ్రెస్ నేతలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..సీఎం రమేష్‌ హీరోలా బిల్డప్‌ ఇస్తున్నారని, ఉత్తమ్‌‌కుమార్‌రెడ్డి ఉత్తముడేమీ కాదని విమర్శించారు.ఐటీ సోదాలతో రేవంత్‌‌రెడ్డి అసలు స్వరూపం బయటపడిందని, రేవంత్‌రెడ్డి భూదందాలు, అక్రమాలకు పాల్పడ్డారని జీవీఎల్‌ ఆరోపించారు రాహుల్ పర్యటనపై కూడా జీవీఎల్ విమర్శలు చేశారు.రాహుల్‌గాంధీ తెలంగాణలో అడుగుపెట్టే ముందు.. కాంగ్రెస్‌ పార్టీ పీవీ నరసింహారావు పట్ల వ్యవహరించిన తీరుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.క్షమాపణ చెప్పాకే ఓట్లడగాలన్నారు.'ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు ఇమ్మోరల్ నేషనల్ కరెప్ట్ కాంగ్రెస్' అని జీవీఎల్ ఎద్దేవా చేశారు.కాంగ్రెస్‌ పార్టీలో దందాలు చేసేవారికి మంచి గుర్తింపు ఉందన్నారు.రాహుల్‌ గాంధీపై భూ కబ్జాల కేసులు ఉన్నాయని, ఆయన రేవంత్‌రెడ్డి దగ్గర కోచింగ్‌ క్లాసులు తీసుకుంటారేమోనని అభిప్రాయపడ్డారు. నేషనల్‌ హెరాల్డ్‌ సంస్థకు ఇచ్చిన భూముల్లో అక్రమాలు జరిగాయని జీవీఎల్ ఆరోపించారు.దక్షిణాది ప్రజలంటే కాంగ్రెస్‌కు చులకనని ఆరోపించారు.రాహుల్‌కు పాకిస్తాన్‌ మీద ప్రేముంటే అక్కడే వెళ్లొచ్చని.. తమకే అభ్యంతరం లేదన్నారు.రాహుల్ గాంధీ ఎంత ఎక్కువగా తెలంగాణలో ప్రచారం చేస్తే తమకు అంత లాభమన్న జీవీఎల్‌.. గుజరాత్‌, కర్ణాటకల్లో అదే జరిగిందన్నారు.  

పవన్ కళ్యాణ్ ఇది కరెక్ట్ సమయమేనా?

  తిత్లీ తుఫాను శ్రీకాకుళంలో విషాదాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం వారికి అండగా నిలబడింది. సీఎం చంద్రబాబుతో సహా ప్రజాప్రతినిధులు, అధికారులు అక్కడే ఉండి బాధితులకు దైర్యం చెప్పారు. సహాయ సహకారాలు అందించారు. అయితే వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ మాత్రం తిత్లీ బాధితులను కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళలేదంటూ విమర్శలు వచ్చాయి. జగన్ అయితే ఇంకా వెళ్ళలేదు కానీ.. పవన్ మాత్రం వెళ్లి పరామర్శించారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ పవన్ మీద ఒక విషయంపై మళ్ళీ విమర్శలు మొదలయ్యాయి. పవన్ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. వారిని పరామర్శించి వారి కష్టాలు తెల్సుకున్నారు. వారికి అండగా ఉంటానని మాట ఇచ్చారు. ప్రభుత్వం కూడా అండగా ఉండాలని కోరారు. బాధలో ఉన్న వారికి ఓదార్పునివ్వడం వరకు ఓకే కానీ.. అలాంటి సమయంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడమే పవన్ పై విమర్శలకు కారణమయ్యాయి. ఒకవైపు పరామర్శించడానికి వెళ్లిన పవన్ మరోవైపు పార్టీలో చేరిక కార్యక్రమాలు కూడా చేపట్టారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే , టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిని పార్టీలో చేర్చుకున్నారు. అదే ఊపులో మరికొందరు చోటా నేతల్ని కూడా పార్టీలో చేర్చుకున్నారు. ఒకవైపు అక్కడి వారు బాధలో ఉన్నారు. మీరు వారిని పరామర్శించడానికి వెళ్లారు. మరి ఇలాంటి సమయంలో పార్టీలో చేరిక కార్యక్రమాలు చేపట్టడం కరెక్టేనా పవన్ అంటూ విమర్శలు తలెత్తుతున్నాయి.

దమ్ముంటే నాపై చేసిన ఆరోపణలు నిరూపించండి

  వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌పై కేసులు పెట్టుకుని టీడీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి లోకేష్ మండిపడ్డారు.ఆటోనగర్‌లో నిర్మించనున్న తెదేపా జిల్లా కార్యాలయానికి లోకేశ్‌ భూమిపూజ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని కార్యకర్తలు తెదేపాకు ఉన్నారని,రాజకీయ ప్రత్యర్థులు ఎన్నో విధాలుగా హింసించినా.. నమ్ముకున్న జెండాను విడిచిపెట్టని కార్యకర్తలే తెదేపా బలమని వ్యాఖ్యానించారు.'పదేళ్లపాటు పాలకులు 672 మంది కార్యకర్తలను చంపారు. పరిటాల రవీంద్రను కుడా పార్టీ కార్యాలయంలో హత్య చేశారు. కార్యకర్తలను హింసించి.. లొంగకపోతే అంతం చేశారు' అని ఆవేదన వ్యక్తం చేశారు.కార్యకర్తల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇస్తూ.. కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా 3వేల మంది కార్యకర్తల కుటుంబాలకు రూ.23కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. లక్ష కోట్లు దోచేసి జైలుకెళ్లిన వ్యక్తి జగన్ అని, అలాంటి వ్యక్తి తమపై ఆరోపణలు చేస్తున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు.దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని జగన్‌కు సవాలు విసిరారు. పొరుగు జిల్లాలోనే పాదయాత్ర చేస్తూ.. కనీసం శ్రీకాకుళం జిల్లాలో తుఫానుతో అతలాకుతలమైన ప్రాంతాలవైపు జగన్‌ కన్నెత్తి చూడలేదని గుర్తు చేశారు. తుఫాను వచ్చిన ఏడు రోజులకు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన పవన్‌.. ఏవో విమర్శలు చేసి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. ఈ ఇద్దరు నేతలు ప్రజలకు సేవ చేయకపోవడమే కాక.. చేస్తున్న వారిని విమర్శిస్తారని దుయ్యబట్టారు.  .

రావణ దహనం.. పెను విషాదం.. 60 మంది దుర్మరణం

  ఏ రోజు చివరిదో.. ఏ నిమిషం చివరిదో చెప్పలేం. మృత్యువు మన పక్కనే వచ్చి క్షణాల్లో మనల్ని గెలిచేసి మన ప్రాణాలు తీసుకెళ్తుంది. పంజాబ్ లో అలాంటి విషాద సంఘటనే జరిగింది. మృత్యువు రైలు రూపంలో వచ్చి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 60 మంది ప్రాణాలు బలితీసుకుంది. అమృత్‌సర్‌ సమీపంలోని జోడా ఫాఠక్‌ రైల్వే క్రాసింగ్‌ వద్ద దసరాను పురస్కరించుకొని నిర్వహించిన రావణ దహనాన్ని చూసేందుకు వచ్చిన స్థానిక ప్రజలపైకి రైలు దూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో 60 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 70 మంది గాయపడ్డారు. రైల్వే ట్రాక్‌కు కేవలం 70-80 మీటర్ల దూరంలో ఖాళీ మైదానంలో స్థానికులు రావణ దహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని దాదాపు 300 మంది వీక్షిస్తున్నారు. రావణుడి బొమ్మను వెలిగించగానే.. బాణసంచా పేలుళ్లతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఇదే సమయంలో కొందరు పట్టాలపైకి వెళ్లడం మొదలుపెట్టారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. ఇదే ప్రమాదానికి కారణమైంది. వారు రావణ దహనాన్ని వీక్షించే సందడిలో ఉండగానే.. వేగంగా వచ్చిన రైలు వారిని ఢీకొంటూ వెళ్లిపోయింది. ఒక వైపు బాణసంచా తాలూకూ మోతలో రైలు కూత వినిపించలేదు. మరోవైపు  రావణుడి బొమ్మ దహనం వల్ల వెలువడ్డ పొగ, వెలుగులతో జనానికి సరిగా కనిపించలేదు. అదీగాక రైలు వచ్చినప్పుడు పక్క ట్రాకు మీదకు వెళ్దామంటే దాని మీద మరో రైలు వచ్చింది. ఈ అయోమయంలో జలంధర్‌ నుంచి అమృత్‌సర్‌ వైపు వేగంగా దూసుకెళుతున్న రైలు కిందపడి నలిగిపోయారు. 60 మృతిచెందగా.. 70 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య 100 దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల్లో చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.

కాంగ్రెస్ లోకి టీడీపీ సీఎం అభ్యర్థి

  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నికల్లో తెరాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.దీంతో టీడీపీ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆర్‌.కృష్ణయ్య ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది.ఆ పార్టీ తరపున ఎల్‌బీ నగర్‌ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.ఎన్నికల అనంతరం తెరాస గెలిచినప్పటికీ  కేసీఆర్ నే ముఖ్య మంత్రి పదవి చేపట్టినది విదితమే. గత కొంత కాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం కార్యక్రమాల్లోనే గడుపుతున్నారు.బీసీ పార్టీ పెట్టాలన్నచర్చా ఆ సంఘాల్లో జరుగుతోంది.50 రోజుల వ్యవధిలో బీసీ పార్టీని ప్రకటించి, రిజిస్ట్రేషన్‌, గుర్తు కేటాయింపు సాధించుకోవడం సాధ్యం కాకపోవటంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తుంది.ఎన్నికల్లో సెటిలర్లతో పాటుగా బీసీ ఓటు బ్యాంకుపైనా దృష్టి పెట్టిన కాంగ్రెస్‌ పార్టీ టీడీపీకి దూరంగా ఉన్న కృష్ణయ్యను చేర్చుకోవాలన్న ఆలోచన చేసింది. అందులో భాగంగానే కృష్ణయ్యతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా ఒకటి, రెండు సార్లు చర్చలు జరిపినట్లు తెలుస్తుంది.తాజాగా కృష్ణయ్య మరోమారు జానారెడ్డితో సమావేశమయ్యారు.     సిట్టింగ్ సీటైన ఎల్‌బీ నగర్‌ నుంచి తాను పోటీ చేస్తానని, బీసీ సంఘాలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాననీ జానారెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది.కానీ  ఎల్‌బీ నగర్లో కాంగ్రెస్‌ తరపున సుధీర్‌రెడ్డి ఇప్పటికే ప్రచారంలో పాల్గొంటున్నారు.దీంతో జానారెడ్డి ఎల్‌బీ నగర్‌ స్థానం కేటాయించే పరిస్థితి లేదని, ఇంకేదైనా నియోజకవర్గం కోరాలని కృష్ణయ్యకు సూచించినట్లు సమాచారం. లేని పక్షంలో ఎమ్మెల్సీ పదవి.. అధికారంలోకి వచ్చాక మంత్రి స్థాయి పదవినీ ఇస్తామనీ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. బీసీ సంఘాల్లో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ఒకటి, రెండు రోజులు సమయం కృష్ణయ్య కోరినట్లు తెలిసింది. అంతా కుదిరితే కృష్ణయ్య త్వరలోనే కాంగ్రెస్‌ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

2019 ఎన్నికల కురుక్షేత్రం..జమ్మిచెట్టుపై ఆయుధాలు

  తిత్లీ తుఫాను శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.జన సేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్నారు.శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస నియోజకవర్గాల్లో పర్యటించారు. కూలిన తోటలను పరిశీలించి, బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ..మరో కోనసీమ అయిన ఉద్దానం తుపానుతో నాశనమైందని.. 25 సంవత్సరాలు వెనక్కి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వాన్ని విమర్శించేందుకు తాను రాలేదని, బాధితులకు అందుతున్న సహాయం పర్యవేక్షించేందుకు సామాన్యుడిగా వచ్చానని తెలిపారు. కేరళలో తుపాను బాధితులకు కోట్ల రూపాయల సహాయం అందించారని, వెనుకబడిన ప్రాంతం ఉద్దానానికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదన్నారు. జిల్లాలో జరిగిన విపత్తు వల్ల వలసలు పెరిగే అవకాశం ఉందని, జిల్లావాసులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజల కన్నీళ్లు, కష్టాలు ప్రభుత్వానికి అర్థం కావాలన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఎవరితోనైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. జనసేన పార్టీ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి రాలేదని పవన్‌కల్యాణ్‌ అన్నారు.'2009లో కొందరి వల్ల మోసపోయాం. ఓటమి లోతుల్లో నుంచి జనసేన ఆవిర్భవించింది. ప్రజలు మార్పును బలంగా కోరుకుంటున్నారు. 2019 ఎన్నికల కురుక్షేత్రం సమీపిస్తోంది. యుద్ధం చేసేందుకు జమ్మిచెట్టుపై నుంచి ఆయుధాలు తీశా. ధర్మం గెలిచేవరకు పోరాడతా’ అని పవన్‌ స్పష్టం చేశారు.యువత భృతిని కోరడంలేదని, తమ జీవితం తాము నిర్మించుకునే అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారన్నారు.యువతలో ఎంతో ఆవేదన ఉందన్న పవన్..యువతకు 25 సంవత్సరాల భవిష్యత్తు నిర్మించేందుకు జనసేన పోరాటం చేస్తుందని హామీనిచ్చారు తాను రాజకీయం చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు అండగా ఉండేందుకే వచ్చానన్నారు. 

తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి పరిపూర్ణానంద..!!

  శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద భాజపాలో చేరారు.భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌లతో భేటీ అనంతరం ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు. తమ పార్టీలోకి వచ్చిన పరిపూర్ణానందకు అమిత్‌ షా తన నివాసంలోనే పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయనకు ప్రాథమిక సభ్యత్వ రసీదును అందజేశారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద మాట్లాడుతూ రాంమాధవ్‌తో గతంలోనే చర్చించాను. అనంతరం అమిత్‌ షాతోనూ 45 నిమిషాల పాటు చర్చించా. ధర్మాన్ని నిలుపుకోకపోతే దేశానికి ఉనికి లేదు. ఈ దేశ ఉనికే ధర్మం. దాన్ని నిలబెట్టుకోవాలనేది మహత్తరమైన ఆలోచన అని గతంలో జరిగిన భేటీలో అమిత్‌ షా నాతో అన్నారు. తొమ్మిది రోజుల దీక్ష తీసుకొని విజయదశమి నాడు వస్తానని ఆయనతో చెప్పాను. పూర్తిగా ఆత్మపరిశీలన చేసుకున్నాకే  భాజపాలో చేరాను.మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందన్నారు. భాజపా సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. ఏదీ ఆశించి తాను భాజపాలో చేరడంలేదని స్పష్టంచేశారు. మోదీ, అమిత్‌షా, రామ్‌మాధవ్‌ మార్గదర్శకత్వంలోనే పనిచేస్తాను.తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశంలో ఏమూలకు పంపినా చిత్త శుద్ధితో పనిచేస్తానన్నారు.ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి ఆయనేనని.. జూబ్లీహిల్స్ నుంచి పోటీ కూడా చేస్తున్నారని.. ఏపీకి చెందిన వారి ఓట్లు అక్కడ ఉండటం ఓ కారణమన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.అమిత్ షా, రామ్ మాధవ్‌లతో జరిపిన చర్చల సారాంశం ఇదేనంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.

అభ్యర్థులతో పార్టీ అధ్యక్షుని భేటీ

  అసెంబ్లీని రద్దు చేసిన తెరాస ప్రభుత్వం అందరికన్నా ముందే తొలి విడతగా పార్టీ తరుపున పోటీ చేసే 105 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా ప్రజా ఆశీర్వాద సభల పేరుతో ప్రచారం కూడా ప్రారంభించిన కేసీఆర్ ప్రచారానికి స్వల్ప విరామం ప్రకటించారు.అనంతరం పార్టీ మానిఫెస్టోపై ద్రుష్టి సారించారు.తెరాస పాక్షిక మేనిఫెస్టో కూడా ప్రకటించింది.దీంతో మళ్ళీ ప్రచార పర్వం ప్రారంభించేందుకు అధినేత సిద్ధమవుతున్నారు.ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కేసీఆర్ పార్టీ అభ్యర్థులతో సమావేశం కానున్నారు. అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటి నుంచే అభ్యర్థులు తమ తమ నియోజక వర్గాల్లో ప్రచారం ప్రారంభించారు.పార్టీలో అసమ్మతులు, అసంతృప్తులు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది గనక వారందిరనీ సర్దుబాటు ధోరణితో పద్ధతి ప్రకారం వ్యవహరించాలని సూచించారు. అలాగే, ప్రచార సామగ్రిని సైతం పంపిణీ చేశారు.అనంతరం ప్రచారం జరుగుతున్నతీరుపై ఫోన్ల ద్వారా కేసీఆర్ ఎప్పటికప్పుడు అభ్యర్థులతో చర్చలు జరుపుతూ వస్తున్నారు. కొన్నినియోజక వర్గాల్లో ప్రచారానికి వెళ్లిన అభ్యర్థులకు చేదు అనుభవాలు ఎదురవటంతో నియోజకవర్గాల్లో ప్రచారం జరుగుతున్న తీరు, పార్టీ విధి విధానాలపై ప్రజల స్పందన,ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రజలేమనుకుంటున్నారు? ప్రజలు ఇంకా ఏం కోరుకుంటున్నారు? ప్రజలనుంచి వస్తున్న అభ్యర్థనలేంటి తదితర అంశాలపై చర్చించేందుకు పార్టీ అభ్యర్థులతో మరోసారి సమావేశం కావాలని కేసీఆర్‌ నిర్ణయించారు.ప్రతిపక్షాల తీరు, వారి ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలి? సోషల్‌ మీడియాలో ప్రచారం ఎలా నిర్వహించాలి? పోలింగ్‌ తేదీ వరకు అభ్యర్థులు ఎలా వ్యవహరించాలనే అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం.

మా పార్టీ తరపునే పోటీ చేస్తాం--కోదండరాం

  తెరాసను గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో తెదేపా, సీపీఐ, తెజస మహా కూటమిగా ఏర్పాటైన విషయం తెలిసిందే.ఇప్పటికే పలుమార్లు భేటీలు జరిగినప్పటికీ సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి రాలేదు. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపైన ప్రధానంగా దృష్టిపెట్టిన కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల జాబితాపై కసరత్తు ముమ్మరం చేశారు.తెరాస అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా.. కాంగ్రెస్‌ సీట్ల సర్దుబాటుపై ఇంకా ఎటూ తేల్చకపోవడంతో కూటమికి నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఇటీవల కోదండరాం కూడా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా మరో మారు కాంగ్రెస్‌, తెజస నేతల మధ్య కీలక భేటీ జరిగింది. లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో మహాకూటమి సీట్ల సర్దుబాటుపై తెజస, కాంగ్రెస్‌ ముఖ్య నేతలు భేటీ అయ్యారు.ఈ భేటీలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్  కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సహా తెజస అధ్యక్షుడు కోదండరాం, దిలీప్‌ కుమార్‌ పాల్గొన్నారు.కూటమిలోని ఏయే పార్టీలకు ఎన్నిసీట్లు ఇవ్వాలనే అంశంపై చర్చించారు. భేటీ అనంతరం కోదండరాం మాట్లాడుతూ తాము కాంగ్రెస్‌ గుర్తుపై పోటీచేయబోమని స్పష్టంచేశారు.పొత్తులపై రెండు రోజుల్లో పూర్తి అవగాహన వస్తుందని చెప్పారు.ఎన్నికల సంఘం నుంచి తమ పార్టీకి గుర్తింపు వచ్చిందని, త్వరలోనే తమ పార్టీకి గుర్తు కూడా వస్తుందని వివరించారు.తమ పార్టీ గుర్తుమీదే తమ అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టంచేశారు.చర్చలు జరుగుతున్న దశలో వివరాలు బయటకు వెల్లడించడం సరికాదన్నారు. అయితే 16 సీట్లకు తెజస పట్టుబట్టగా..తొమ్మిది సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది.

సీఎం రమేష్ చంద్రబాబుకు బినామీ..!!

  టీడీపీ, చంద్రబాబు నాయుడు ఈ పేర్లు వింటే బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కి విమర్శలు తన్నుకొస్తాయి.తాజాగా జీవీఎల్ మరోసారి టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.ఐటీ కంపెనీల పేరుతో చంద్రబాబు భూకుంభకోణం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకూ భూ కేటాయింపుల్లో కనిపించిన కంపెనీలు రాష్ట్రానికి వచ్చిన దాఖలాలే లేవని చెప్పారు. ప్రభుత్వం కేటాయించిన కంపెనీలన్నీ లోకేష్‌ బినామీలేనని విమర్శించారు. 24 గంటల్లో కంపెనీలకు కేటాయించిన భూముల వివరాలు, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో వారి వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీ కంపెనీల పేరుతో కోట్ల రూపాయలు లూటీ చేశారని ధ్వజమెత్తారు.నారా లోకేష్‌ అర్హతలపై పవన్‌ కళ్యాణ్‌ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ బాధితుల దగ్గరకు వెళ్తున్నారని, సహాయక చర్యలు తక్కువ ప్రచారం ఎక్కువ అని ఎద్దేవా చేశారు.కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.కానీ కర్మాగారం విషయంలో కేంద్రం అడిగిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆరోపించారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కడప జిల్లాలో టీడీపీ తలపెట్టింది దొంగదీక్షని ఎద్దేవాచేశారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పై జీవీఎల్ కూడా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.సీఎం రమేశ్‌ బినామీ కంపెనీలతో రూ.వందల కోట్లు దారి మళ్లించారని జీవీఎల్ ఆరోపించారు.సొంత కంపెనీ అకౌంట్స్‌లోనే దొంగ లెక్కలు చూపించే వ్యక్తిని చంద్రబాబు పబ్లిక్ అకౌంట్స్ నెంబర్‌గా చేశారని విమర్శించారు. సీఎం రమేష్ లాంటి వ్యక్తుల వల్ల పార్లమెంట్ పరువుపోతుందని ధ్వజమెత్తారు.తక్షణమే రమేష్‌ను పెద్దల సభ నుంచి చంద్రబాబు వెనక్కి తీసుకోవాలన్నారు.లేదంటే చంద్రబాబుకు రమేష్‌ బినామీ అనే ముద్ర వస్తుందని తెలిపారు.టీడీపీలో విలువలు లేవని చెప్పడానికి సీఎం రమేషే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.రమేష్‌తో రాజీనామా చేయించకపోతే ఎతిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

తెలంగాణలో రాహుల్ సభలకు గద్దర్ సపోర్ట్

  తెరాస భహిరంగ సభలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించినది విదితమే.కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కూడా  ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేసేందుకు సిద్ధమైంది.ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. భైంసా, కామారెడ్డిలలో జరిగే రెండు బహిరంగ సభల్లో రాహుల్‌ ప్రసగించనున్నారు.అనంతరం హైదరాబాద్‌లో జరిగే రాజీవ్‌ సద్భావనా యాత్రలోనూ పాల్గొననున్నారు.సోనియా గాంధీ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. రాహుల్‌ పర్యటన ముగిసిన వెంటనే పీసీసీ ప్రచార కమిటీ ప్రచారాన్ని కొనసాగించనుంది.ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ పర్యటనను స్వాగతిస్తున్నట్లు గద్దర్ తెలిపారు. 'దేశ ప్రజలను ఏకం చేసే నినాదంతో మరో జాతీయ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన రాహుల్‌ గాంధీకి స్వాగతం.భైంసా, కామారెడ్డి, హైదరాబాద్‌లలో రాహుల్‌ సభలను విజయవంతం చేయండని విజ్ఞప్తి చేస్తున్నా' అంటూ ఆయన ప్రకటన విడుదల చేశారు.ఇటీవల గద్దర్ ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఏ పార్టీలోనూ చేరబోననని స్పష్టం చేశారు.త్యాగాలు చేసిన వారికి తెలంగాణ ఫలాలు చేరలేదని, ఫ్యూడల్‌ వ్యవస్థ నుంచి తెలంగాణను విముక్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ పార్టీపైనే ఉందని గద్దర్‌ ఆ సందర్భంలో వ్యాఖ్యానించారు.  

నాలుగు పార్టీలు ఒకవైపు.. టీడీపీ ఒకవైపు

  అటు తెలంగాణలో తెరాస,బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ పై విమర్శలు చేస్తుంటే ఇటు ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ అధినేత జగన్,జనసేన అధినేత పవన్,బీజేపీ నేతలు టీడీపీపై విమర్శలు చేస్తున్నారు.మొదటి నుంచి టీడీపీ నాయకులు జగన్,పవన్,బీజేపీ,తెరాస కుమ్మక్కయ్యాయని ఆరోపిస్తున్నది తెలిసిందే.తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆ నాలుగు పార్టీలు ఒక్కటై టీడీపీ ని టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ఓటర్ల నమోదు, కౌన్సిల్ ఎన్నికలు, బూత్ కన్వీనర్ల శిక్షణ, గ్రామ వికాసం పురోగతిపై చర్చించారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ  శ్రీకాకుళం జిల్లాలో తుపాను బీభత్సం సృష్టించినా.. కేంద్రం నుంచి ఒక్క బీజేపీ నేత కూడా రాలేదని, ఎలాంటి సాయం అందించలేదన్నారు. రాజమహేంద్రవరంలో పవన్‌ కవాతును ప్రశంసించిన కేటీఆర్‌.. తిత్లీ తుపాను బాధితులపై కనీసం సానుభూతి కూడా ప్రకటించకపోవటం బాధాకరమన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పాదయాత్రకు ప్రజల్లో స్పందన లేదని, ఆయన ఫ్యాక్షన్‌ మనస్తత్వమే దానికి కారణమన్నారు. జగన్‌ చిత్తశుద్ధితో పాదయాత్ర చేయట్లేదనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, మరో నాలుగేళ్లు ఆయన పాదయాత్ర చేసిన ఫలితం రాదని చంద్రబాబు ఎద్దేవా చేశారు.రాష్ట్ర ప్రజలు టీడీపీపై చూపుతున్న అభిమానాన్ని ఓర్వలేక నాలుగు పార్టీలు ఏకమై అక్కసు పెంచుకున్నాయని సీఎం ఆరోపించారు.బీజేపీ, వైసీపీ, తెరాస, జనసేన పార్టీలు టీడీపీనే టార్గెట్ చేస్తున్నాయని.. అదంతా మనకే లాభమని,వాళ్ళు తిట్టే తిట్లే మనకు ప్రజా దీవెనలన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాభిమానం తమపై ఉందని, అదే తమ నైతిక బలమని పేర్కొన్నారు.తాను ఒక్కడినే కష్టపడితే చాలదని,పార్టీ సభ్యులంతా కష్టించి పనిచేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు.  

ఎన్నికల్లో పోటీకి కూడా నిలబడరేమో: కడియం శ్రీహరి

  తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడటంతో పార్టీలు అభ్యర్థుల ప్రకటన, ప్రచారం, మేనిఫెస్టోలతో బిజీ బిజీ అయిపోయాయి. కాంగ్రెస్ ఓవైపు మహాకూటమిలో సీట్ల సర్దుబాటు గురించి చర్చిస్తూనే.. మరోవైపు ప్రచారం మొదలు పెట్టింది. అలాగే పలు హామీలను ప్రకటించింది. ఇక తెరాస విషయానికొస్తే.. అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే 105 మంది అభ్యర్థులను ప్రకటించింది. ప్రచారంలో దూసుకుపోతుంది. తాజాగా పాక్షిక మేనిఫెస్టోను కూడా ప్రకటించింది. అయితే ఈ మేనిఫెస్టోపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ హామీలను తెరాస కాపీ కొట్టిందంటూ ఆరోపించారు. దీనికి తెరాస నేతలు కూడా కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఇలా తెరాస పాక్షిక మేనిఫెస్టో గురించి కాంగ్రెస్, తెరాసల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అయితే తాజాగా ఈ విషయంపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పందించారు. తెరాస ప్రభుత్వం ఎవరూ ఊహించని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు దేశంలోనే మంచి పేరుందని అన్నారు. తెరాస హామీ ఇస్తే అమలు చేస్తుందనే అభిప్రాయం ప్రజల్లో ఉందని.. అందుకే తమ పార్టీ పాక్షిక మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజల్లో తమకు మంచి స్పందన రావడాన్ని ఓర్వలేక ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలకు దిగుతున్నాయని కడియం ఆరోపించారు. ఇప్పటి వరకు తాము ప్రకటించింది పాక్షిక మేనిఫెస్టో మాత్రమేనని.. పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తే ఎన్నికల్లో పోటీకి కూడా నిలబడరేమోనని కడియం ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని పలు సంస్థలు, వ్యక్తుల నుంచి వచ్చే సలహాలు, సూచనలతో నవంబర్‌ మొదటి వారంలో పూర్తి స్థాయి మేనిఫెస్టోను ప్రకటించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలకు రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే తమ మేనిఫెస్టోను చూసి ప్రజలు మెచ్చుకునేలా వాళ్లూ ప్రకటించవచ్చన్నారు. అంతేకానీ దివాలాకోరు మాటలతో ప్రయోజం లేదని ప్రతిపక్షాలకు ఆయన హితవు పలికారు. మేనిఫెస్టో ప్రకటించుకునేందుకు సమయం ఉన్నప్పుడు తమ మేనిఫెస్టోను చూసి ఎందుకు భయపడుతున్నారని కడియం ప్రశ్నించారు.

టీడీపీ లో చేరనున్నమాజీ ఎమ్మెల్యే

  రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో  తెరాస ప్రభుత్వం అధికారం లో కి వచ్చింది.ఆ ఎన్నికలతో కాంగ్రెస్,టీడీపీ పార్టీలు తమ ఉనికిని కోల్పోయాయి.దీంతో ఆయా పార్టీలకు చెందిన కొందరు నేతలు ఇతర పార్టీల  కండువాలు కప్పుకున్నారు.కానీ తెలంగాణలో తాజాగా ఎన్నికలు జరగనుండటంతో అందరి ఊహలకు అతీతంగా పరస్పర వ్యతిరేక పార్టీలు అయిన కాంగ్రెస్,టీడీపీ మహా కూటమితో దగ్గరవటంతో పార్టీల బలం పెరిగింది.నాయకులకు భవిష్యత్తు మీద ఆశకలిగింది.దీంతో ఆయా పార్టీలకు వలసల తాకిడి తగిలింది.తాజాగా పఠాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ టీడీపీ లో చేరనున్నారు.ఆయనతోపాటు పలువురు బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. పీసీసీ మాజీ చీఫ్‌ డి.శ్రీనివాస్‌కు శిష్యుడిగా నందీశ్వర్‌గౌడ్ గుర్తింపు పొందారు.అప్పట్లో డీఎస్ టీఆర్ఎస్ పార్టీలో చేరటంతో నందీశ్వర్‌గౌడ్ బీజేపీలో చేరారు. గత కొంత కాలంగా డీఎస్‌తో పాటు నందీశ్వర్‌ గౌడ్ కూడా కాంగ్రెస్ గూటికి చేరతారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.కానీ ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఈయన అమరావతిలో కలవటంతో టీడీపీలో చేరటం ఖాయమైంది.హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ ‌భవన్‌లో తెలంగాణ టీడీపీ నేతల సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు.నందీశ్వర్‌గౌడ్ పఠాన్‌చెరు టిక్కెట్‌ ఆశిస్తున్నారు.