తెలంగాణలో రిపీట్ అయ్యేది కర్ణాటక ఫలితాలే

  కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం అవుతాయని తెదేపా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి జోస్యం చెప్పారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.ప్రధాని నరేంద్రమోదీ ఫ్యాక్షనిస్టుగా మారి ఏపీ ప్రజలను వేధిస్తున్నారని జేసీ మండిపడ్డారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులను సైతం వెనక్కు తీసుకుని.. ఏపీపై కక్షసాధింపు చర్యలను ప్రధాని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. మోదీ గొంతు బలంగా ఉందేమో గానీ..వ్యక్తిగా మాత్రం ఆయన బలహీనంగా కనిపిస్తున్నారని విమర్శించారు. కర్ణాటక మాదిరిగానే తెలంగాణలోనూ ఫలితాలు ఉంటాయన్నారు.ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే సీఎం చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారన్నారు. ఏపీలో గెలుపు కోసం తెదేపా ఎవరితోనూ పొత్తు పెట్టుకునే అవసరం లేదని స్పష్టం చేశారు. దేశంలో రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్థంగా ఉన్నందునే జాతీయ కూటమి ఆవిర్భావం జరిగిందని వివరించారు.

పవన్ కి వ్యతిరేకంగా బాబు కాంట్రవర్సీ ఫ్లెక్సీ

  టీడీపీ, జనసేన పార్టీల మధ్య మాటల యుద్ధం కాస్తా ఫ్లెక్సీల యుద్ధంగా మారింది. విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఫ్లెక్సీలు వేయించారు. ఆ ఫ్లెక్సీల్లో ఉన్న మేటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 'పవన్ కళ్యాణ్ గారూ.. నేను కూయందే తెల్లవారదనుకుందట ఓ అమాయకపు కోడి.. అలా ఉంది మీరన్నమాట. మీరు మద్దతు ఇవ్వకపోతే చంద్రబాబు 2014లోనే రిటైర్ అయ్యేవారా?.. ఎందుకీ అహంకారపు ప్రగల్భాలు?. మీ అన్నదమ్ములంతా కలిసి 2009లో బరిలోకి దిగితే.. మీకు వచ్చింది కేవలం 18 సీట్లే. ఇప్పుడు తలకిందులుగా తపస్సు చేసినా.. మీరు ఒకటో రెండో సీట్లు గెలిస్తే గొప్ప. అంతకు మించి మీకు సీనూ లేదు.. సినిమా లేదంటూ. 5కోట్ల ఆంధ్రుల ఆశీస్సులతో మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారు. ఇది తథ్యం' అంటూ ఫ్లెక్సీ పెట్టారు. కాట్రగడ్డ బాబుకు ఇలా ఫ్లెక్సీలు పెట్టడం కొత్తేమీ కాదు. దేశంలో లేదా రాష్ట్రంలో ఏదైనా ఘటనలు చోటు చేసుకున్నా, ప్రతిపక్ష పార్టీలను విమర్శించాలన్నా ఆయన ఫ్లెక్సీల వేదికగానే విమర్శించడం ఓ అలవాటు.  

జగన్ పై దాడి..విచారణకు వైసీపీ నేత హాజరు

  జగన్‌పై దాడి ఘటనకు సంబంధించిన శ్రీనివాసరావు పేరుతో నకిలీ కార్డు తయారు చేశారంటూ టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ ప్రారంభించనున్నారు.గత నెలలో విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్షనేత జగన్ పై శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన సంగతి విదితమే.అయితే ఘటన అనంతరం దాడి చేయించింది చంద్రబాబు నాయుడేనని దాడి చేసింది టీడీపీ కార్యకర్తేనని జోగి రమేష్ ఆరోపించారు.తన దగ్గర ఆధారాలున్నాయంటూ నిందితుడు శ్రీనివాస్ టీడీపీ సభ్యత్వనమోదు కార్డును మీడియాకు విడుదల చేశారు.అయితే ఆ కార్డు నకిలీదని, దాన్ని తయారుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ సీనియర్ నేత, ఏపీఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య జోగి రమేష్ పై గుంటూరు జిల్లా ఆరండల్ పేట పీఎస్ లో ఫిర్యాదు చేశారు.దీంతో  పోలీసులు విచారణకు హాజరుకావాల్సిందిగా జోగిరమేష్ కు నోటీసులు జారీచేశారు.ఆ కార్డు ఎలా వచ్చింది, ఎవరు తయారు చేశారు అన్న అంశంపై పోలీసులు ఆయన్ని విచారించేందుకు సిద్ధమయ్యారు.విచారణకు సిద్ధమైన జోగిరమేష్ తన అనుచరులతో కలిసి విజయవాడ నుంచి గుంటూరుకు చేరుకున్నారు.మరికాసేపట్లో జోగి రమేశ్‌  పోలీస్‌స్టేషన్‌లో హాజరుకానున్నారు.

కాంగ్రెస్ పై చంద్రబాబుకు ఎందుకంత ప్రేమ

  బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా దేశంలోనే బీజేపీకి ప్రధాన ప్రతి పక్షం అయిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపారు.అయితే ఈ మైత్రి బంధంపై పలువురు నేతలు విమర్శలు చేయగా తాజాగా వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.ఆయన ట్విట్టర్ లో  ‘ఎంత డబ్బు అయినా పంపిస్తా, టీఆర్‌ఎస్‌ మాత్రం గెలవొద్దంటూ తెలంగాణ కాంగ్రెస్‌ పెద్దలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నాడట. ఇంత ప్రేమ ఎందుకంటే కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే ఓటుకు నోటు కేసు విచారణ స్పీడప్‌ చేసి ఎక్కడ లోపల వేస్తాడోనని' అని ట్వీట్ చేశారు.  

ఎన్నికల్లో పోటీ చేయనంటున్న కోమటిరెడ్డి

  తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్,టీడీపీ,టీజేఎస్,సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.అయితే పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ అయితే పూర్తి కాలేదుగాని పొత్తు ధర్మం ప్రకారం గెలిచే వారికే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఒకే కుటుంబం ఒకే టిక్కెట్ అనే సిద్ధాంతాన్ని అమలు చేయాలని నిశ్చయించుకుంది.ఈ నేపథ్యంలో అసలు ఒకే కుటుంబంలో టిక్కెట్ రావటమే కష్టం అనుకుంటే ఓ కాంగ్రెస్ నేత మాత్రం తాను చెప్పిన నేతకి కూడా టిక్కెట్ ఇవ్వాలి అంటున్నాడు.లేదంటే తాను పోటీ నుంచి తప్పుకుంటా అంటున్నాడు.ఇంతకీ ఆ నేత ఎవరంటే ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. చిరుమర్తి లింగయ్యకు నకిరేకల్‌ నుంచి, తాను మునుగోడు నుంచి, తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ నుంచి పోటీ చేస్తామని ఆయన తెలిపారు.ఒకవేళ నకిరేకల్‌ నియోజకవర్గంలో ప్రజాదరణ ఉన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పార్టీ అధిష్ఠానం టికెట్‌ ఇవ్వకపోతే తాను కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.

రమణ అందుకే పోటీ నుంచి తప్పుకున్నారా

  తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్నది విదితమే.అయితే తెరాస ప్రభుత్వాన్ని గద్దె దింపటానికి కాంగ్రెస్,టీడీపీ,టీజేఎస్,సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పరిపాలనా బాధ్యతలలో నిమగ్నమవ్వటంతో తెలంగాణలో ఆ పార్టీ బాధ్యతలను టీడీపీ-టీఎస్‌ అధ్యక్షుడు ఎల్‌.రమణకు అప్పగించారు.మహాకూటమిలో సీట్ల సర్దుబాటు సహా పార్టీ గెలుపు కొరకు అన్ని భాద్యతలను రమణ తన భుజస్కందాలపై మోస్తున్నారు.అయితే  రానున్న ఎన్నికల్లో రమణ మాత్రం పోటీ నుంచి తప్పుకొన్నారు. రాష్ట్రంలో మహాకూటమిని ఏర్పాటుచేయడంలో కీలకపాత్ర పోషించిన ఆయన.. ఇకనుంచి కూటమిభ్యర్థుల తరఫున ప్రచారం చేయబోతున్నారు. జగిత్యాల కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డికి అండగా నిలిచారు.1994లో తొలిసారిగా జగిత్యాల నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగి గెలిచిన రమణ మంత్రిగా పనిచేశారు. అక్కడి నుంచి ఐదుసార్లు పోటీ చేసినా కేవలం రెండు సార్లు మాత్రమే శాసన సభలో కి అడుగు పెట్టారు.అయితే పొత్తు ధర్మం ప్రకారం గెలిచేవారికే సీటు ఇవ్వనుండటం అంతే కాకుండా జీవన్ రెడ్డి రమణకు రాజకీయంగా గురువు కావటంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు.పోటీ నుంచి రమణ తప్పుకున్నా మహాకూటమి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ని మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

2019 లో జనసేనదే అధికారం

  జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ కి సీఎం అవుతాననే కాన్ఫిడెన్స్ రోజురోజుకి పెరిగిపోతున్నట్టుంది. తాజాగా ప్రజాపోరాటయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న పవన్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తానే సీఎం అవుతానని స్పష్టం చేశారు. ఈ సభలో పవన్ ప్రసంగిస్తూ.. ‘ధవళేశ్వరం కవాతుకు పది లక్షల మంది వచ్చారు. మిగతా పార్టీల్లా డబ్బు, సారా, బిర్యానీ ఇవ్వలేదు. ఏమిస్తే మీ రుణం తీర్చుకోగలను? జనసేన పెట్టి మీకు ఇలా సేవ చేసుకునే భాగ్యం కలిగింది. మనకు ఇప్పుడు మహాత్మాగాంధీ, అంబేద్కర్, నెహ్రూ లాంటి వారెవరూ లేరు.. మనకున్నదల్లా జగన్‌, చంద్రబాబు, లోకేష్ లే. జగన్‌ను చూద్దామంటే ఆయన మీద కేసులున్నాయి. చంద్రబాబును చూస్తే అవినీతి పెరిగిపోయింది’ అని వ్యాఖ్యానించారు. 2014లో చంద్రబాబుకు సపోర్టు చేయడం అప్పటి ధర్మం. 2019లో టీడీపీని రానివ్వకపోవడం ఇప్పటి ధర్మం. ఎన్టీఆర్‌ పెద్దాపురం వద్ద సూరంపాలెంలో 470 ఎకరాల భూముల్ని దళితులకు ఇచ్చారు. ఆ భూముల్ని లాక్కుని టీడీపీ వాళ్లు రెండు వేల కోట్లు దోచుకున్నారు. 'లోకేష్ గారూ.. మీ తాతగారిచ్చిన భూముల్లో మట్టి తవ్వేసి అమ్మేసుకుంటున్నారు. మట్టి అవినీతిని సాక్ష్యాధారాలతో నిరూపిస్తా వస్తారా’ అంటూ సవాల్‌ విసిరారు. ఇలాంటి వాటి గురించి వైఎస్‌ జగన్‌ మాట్లాడరని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో 40 సీట్ల కంటే తక్కువ వచ్చిన వాళ్లు సీఎం కాగలిగారు, ఢిల్లీలో కేజ్రీవాల్‌ గెలిచారు.. ఇవన్నీ బలమైన మార్పునకు సంకేతాలని పవన్ అన్నారు. పవన్ ప్రసంగిస్తున్న సమయంలో అభిమానులు ‘సీఎం పవర్‌స్టార్‌.. సీఎం పవర్‌స్టార్‌..’ అని అరిచారు. దీనికి పవన్‌ స్పందిస్తూ.. సీఎం పవర్‌స్టార్‌ అంటే అదొక మంత్రం. ఇది ఖచ్చితంగా 2019లో జరిగి తీరుతుంది. సరికొత్త సమీకరణలవల్ల జనసేన అధికారంలోకి వస్తుంది. టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో రాదు. జగన్‌ కూడా ప్రభుత్వాన్ని స్థాపించలేరు అని పవన్ స్పష్టం చేశారు.

తెరాస అభ్యర్థిపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన మహిళ

  తెలంగాణలో ఎన్నికల నేపధ్యంలో తెరాస పార్టీ ప్రచారాల్లో ముందంజలో ఉంది.ఆ పార్టీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారాల్లో నిమగ్నమయ్యారు.కానీ ప్రచారానికి వెళ్లిన అభ్యర్థులను మాకు ఏం చేసారని ఓట్లు అడగటానికి వస్తున్నారంటూ గ్రామస్తులు నిలదీయడంతో అనుకోని చేదు అనుభవాలు మిగులుతున్నాయి.ఇంకొందరు నాయకులైతే సహనం కోల్పోయి అడ్డుకున్నవారిపై దుర్భాషలాడుతున్నారు.తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. తాజాగా మానకొండూర్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెరాస అభ్యర్థి రసమయి బాలకిషన్‌ ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూర్‌లో తెరాస ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అయితే ఆ సమయంలో మహిళలు హామీలపై నిలదీయగా అసభ్య పదజాలంతో దూషించారని జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డేకు మానకొండూర్‌ మాజీ శాసనసభ్యుడు ఆరెపల్లి మోహన్‌, కందికట్కూర్‌ గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళ ఫిర్యాదు చేశారు.మహిళల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడటంతో పాటు కొందరి భుజాలపై చేయి వేసి చెప్పరాని విధంగా దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించిన రసమయిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్పింగ్‌లను జతపరిచినట్లు వారు తెలిపారు.

మహాకూటమికి మద్దతుగా మరో పార్టీ

  తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని మట్టికరిపించడమే ధ్యేయంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐతో ఏర్పాటైన మహాకూటమిలో తాజాగా మరో పార్టీ చేరింది.కూటమికి నిస్సంకోచంగా తమ మద్దతు ఇస్తున్నట్టు ఆల్‌ ఇండియా ముస్లిం నేషనల్‌ లీగ్‌ పార్టీ ప్రకటించింది. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య అంతర్గత ఒప్పందం ఉందని ముస్లి నేషనల్‌ లీగ్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ ఘని ఆరోపించారు. గాంధీ భవన్‌లో ఆర్‌సీ కుంతియాతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని.. ఇచ్చిన హామీలకు తగిన నిధులు కేటాయించలేదని విమర్శించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ విషయంలో కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు. అందుకే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వకూడదని తమ పార్టీ నిర్ణయించుకుందన్నారు. టీఆర్ఎస్ అన్ని అంశాల్లో భాజపాకు మద్దతిస్తోందని, అందుకే తాము కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటైన మహాకూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

వంటేరు, పరిపూర్ణానందపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్

  కాంగ్రెస్‌ నేత వంటేరు ప్రతాప్‌ రెడ్డి, బీజేపీ నేత, శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందపై టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. వంటేరు ప్రతాప్ రెడ్డి రీసెంట్ గా టీఆర్ఎస్ నేత హరీష్ రావు మీద సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ నెంబర్ నుంచి హరీష్ రావు తనకి కాల్ చేసి.. కేసీఆర్ ని ఓడించాలని చెప్పినట్టు తెలిపారు. అంతేకాదు హరీష్ రావు రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారని.. త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా నల్గొండలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరిపూర్ణానంద ఒక్కొక్కరికి రూ.200 ఇస్తే వేల ఓట్లు పడుతాయని ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. హరీశ్‌రావుపై ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు. ఫిర్యాదుతో పాటు ప్రతాప్‌రెడ్డి వ్యాఖ్యల వీడియోనూ రజత్‌కుమార్‌కు అందజేసినట్టు తెలిపారు. అలాగే, స్వామి పరిపూర్ణానంద తమపై చేసిన వ్యాఖ్యలపైనా చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు.

తాగుబోతుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలి

  ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు.నర్సాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ రోడ్‌ షోలో మాజీ మంత్రి సునితారెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ..నర్సాపూర్‌ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్‌ ఏ సమస్యలను తీర్చలేదని ఆరోపించారు. ఆయనకు ఏ సమస్యలు పట్టవని, ఫామ్‌ హౌజ్‌లో కూర్చొని తాగడం ఒక్కటే తెలుసని ఎద్దేవా చేశారు.తాగుబోతుల చేతుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలన్నారు.మైనార్టీల రిజర్వేషన్లు పెంచుతానని కేసీఆర్ పంగ నామాలు పెట్టారంటూ మండిపడ్డారు. ఏ హామీ నెరవేర్చని కేసీఆర్ ఓట్లు అడిగే అర్హత లేని సన్నాసి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నుండి ఐదుగురు మహిళలను మంత్రులను చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని... కానీ, కేసీఆర్ చేసింది ఏమిటని ప్రశ్నించారు. మంత్రి వర్గంలో కేసీఆర్ తో మాట్లాడే దమ్ము ఏ మంత్రికీ లేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం చేసిన త్యాగం ఏంటి? అని ప్రశ్నించిన రేవంత్... తెలంగాణ దినోత్సవం రోజు కేసీఆర్ ఎప్పుడైనా అమరుల కుటుంబాలను శాలువాతో సన్మానించారా? ఉద్యమ కారులకు గౌరవం లేదు. అమరులకు గుర్తింపు లేదు అంటూ విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ దగ్గర గూలాం గిరి చేసే మదన్‌ రెడ్డి కావాలో.. అసెంబ్లీలో నర్సాపూర్‌ సమస్యల కోసం కొట్లాడే సునీతా రెడ్డి కావాలో ఆలోచించడంటూ రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. కర్రు కాల్చి కారు గుర్తుకు వాత పెట్టాల్సిన సందర్భం వచ్చిందన్నారు. ప్రజాశీర్వాదంతో నర్సాపూర్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.అనంతరం సునీతా రెడ్డి మాట్లాడుతూ..బంగారు తెలగాంణలో మెడలో పుస్తెల తాడు అమ్ముకోవాల్సి వచ్చిందన్నారు. జనం చచ్చారో, బతికారో పట్టించుకోని కేసీఆర్‌కు ఓటు వేయవద్దు అంటూ కాంగ్రెస్‌  విజ్ఞప్తి చేశారు. తన భర్త మరణం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉందామనుకున్నాను.. కానీ ప్రజల కోసం తిరిగి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. రీజనల్‌ రింగ్‌ రోడ్‌ ఆలోచన కాంగ్రెస్‌ హయాంలోదేనని వెల్లడించారు. ఎన్నికల ప్రచార ర్యాలీ విజయోత్సవ ర్యాలీగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణలో మెడలో పుస్తెలు అమ్ముకోవాల్సి వచ్చిందన ఆరోపించారు. నర్సాపూర్‌ పౌరుషాల పోరుగ్డడ అని గుర్తు చేశారు.

మహాకూటమిని చూసి టీఆర్ఎస్‌కు భయం పట్టుకుంది

  టీఆర్ఎస్‌ ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఒకవైపు టీఆర్ఎస్‌, బీజేపీ లాంటి పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తుంటే.. మహాకూటమి మాత్రం సీట్ల సర్దుబాటుపై చర్చల దగ్గరే ఆగిపోయింది. త్వరగా ఈ చర్చలు ముగించి కూటమిలోని పార్టీలు సంతృప్తిపడేలా సీట్లు కేటాయించి అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ చూస్తోంది. అయితే తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ నేత, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి స్పందించారు. మహాకూటమి సీట్లన్నీ ఉమ్మడిగా ఒకేసారి ప్రకటించాలని చూస్తున్నామని ఆయన తెలిపారు. మిత్రపక్ష పార్టీలు తమకు ఎన్ని సీట్లు కావాలో నివేదిక ఇచ్చాయన్నారు. దీపావళి రోజున కానీ, ఆ తరువాత కానీ సీట్ల ప్రకటన ఉండే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు ఒక్క అభ్యర్థి పేరును కూడా ప్రకటించలేదన్నారు. కూటమిలో సామాజిక ప్రాధాన్యత ఉండాలని అనుకుంటున్నామని, దాని ప్రకారమే మిత్రపక్షాలు కూడా సీట్లు అడగాలని కోరామన్నారు. అదే విధంగా టీఆర్ఎస్‌ పైనా మధుయాష్కి మండిపడ్డారు. మహాకూటమిని చూసి టీఆర్ఎస్‌కు భయం పట్టుకుందన్నారు. నాలుగేళ్ల పాలనలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు.

హరీష్ రావు సీఎం అవుతారు

  వంటేరు ప్రతాప్ రెడ్డి రీసెంట్ గా టీఆర్ఎస్ నేత హరీష్ రావు మీద సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ నెంబర్ నుంచి హరీష్ రావు తనకి కాల్ చేసి.. కేసీఆర్ ని ఓడించాలని చెప్పినట్టు తెలిపారు. అంతేకాదు హరీష్ రావు రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారని.. త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని అన్నారు. వంటేరు ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యలు మరువక ముందే మరో నేత హరీష్ రావు గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీలో అంతర్యుద్ధం సాగుతోందని, ఎప్పటికైనా ఆ పార్టీ చీలిపోవడం ఖాయం అని అన్నారు. హరీష్ రావు అసలు సిసలైన నాయకుడు అని పేర్కొన్నారు. ఆయన టీఆర్ఎస్‌లో ఇమడలేకపోతున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి, ప్రజాకూటమికి సమానంగా సీట్లు వస్తే.. అందులో కొంతమందిని తీసుకువచ్చి హరీష్ రావు సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌లో హరీష్ రావు పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే.. హరీష్ రావు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో చేరి ఉండేవారని వ్యాఖ్యానించారు. హరీష్‌ను కేసీఆర్ నమ్మడం లేదని, ఈ కారణంగానే కేసీఆర్ పూర్తి అభద్రతాభావంతో ఉన్నాడని అన్నారు. పార్టీలో సీనియర్ నాయకుడైన హరీష్ రావుని అవమానిస్తున్నా.. విధి లేక ఆ పార్టీలో కొనసాగుతున్నారని అన్నారు. కొడుకు, కూతురుకే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. సరైన సమయం కోసం హరీష్ ఎదురు చూస్తున్నారని అన్నారు. హరీష్ తన నిజాయితీ, సిన్సియారిటీని నిరూపించుకునేందుకు టీడీపీపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

ఈస్ట్ ఇండియా కంపెనీ 2018

  తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే కూటమిపై పలు పార్టీలు విమర్శలు చేస్తుండగా తాజాగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూటమిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తును 'ఈస్ట్ ఇండియా కంపెనీ 2018'గా పోల్చారు.'తెలంగాణ మిశ్రమ సంస్కృతిని నాయుడు (చంద్రబాబు) కాపాడతారా? పోనీ కాంగ్రెస్ కాపాడుతుందా? ఇది మహాకూటమి కాదు...2018 ఈస్ట్ ఇండియా కంపెనీ' అని ఒవైసీ అన్నారు. తెలంగాణ ప్రజలే రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించుకుంటారని, ఎక్కడో నివసించే వ్యక్తులు కాదని అన్నారు. 'నాయుడు విజయవాడలో ఉంటారు. ఆర్ఎస్ఎస్ నాగపూర్‌లో ఉంటుంది. కాంగ్రెస్ ఢిల్లీలో ఉంటుంది. వీళ్లా తెలంగాణ, తెలంగాణ ప్రజల తలరాతను నిర్ణయించేది?' అని ఒవైసీ ప్రశ్నించారు. ఈ మోడ్రన్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కడ్నించి వచ్చిందో అక్కడికి పంపించేలా డిసెంబర్ 7న ప్రజలు తీర్పునివ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

ఏవోబీలో తుపాకుల మోత

  ఏవోబీ సరిహద్దు ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లిపోయింది.పోలీసులకు, మావోయిస్టులకు మధ్య  ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.కిడారి, సోమ హత్యలంనంతరం ఒడిషా, ఏపీ పోలీసులు రెండు రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో నిఘా పెంచారు.కూంబింగ్ చేస్తూ మావోల ఆచూకీ కొరకు మన్యాన్ని జల్లెడ పడుతున్నారు.తాజాగా మల్కన్‌గిరి జిల్లా బెజ్జంగివాడ, పప్పులూరు అడవుల్లో మావోయిస్టులు క్యాంపు ఏర్పాటుచేసుకున్నారన్న సమాచారం మేరకు భద్రతాబలగాలు కూంబింగ్‌ చేపట్టాయి.కూంబింగ్‌ చేస్తుండగా మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలిలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను మల్కన్‌గిరి జిల్లా కేంద్రానికి తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

జనవరి 1 నుంచి అమరావతిలో హైకోర్టు

  ఉమ్మడి హైకోర్టు విభజనకు మార్గం సుగమమైంది.ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 1 నుంచి అమరావతిలో హైకోర్టు కార్యకలాపాలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. జనవరి 1లోగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది.ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణం డిసెంబర్‌ 15 నాటికి పూర్తవుతుందని ఏపీ ప్రభుత్వం చెప్పినట్లు కోర్టు తెలిపింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై హైకోర్టు న్యాయమూర్తులు కూడా సంతృప్తి చెందారని, జనవరి 1న కొత్త రాజధానిలో హైకోర్టు ప్రారంభమవుతుందని ఆశిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. అతిత్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హైకోర్టు కార్యకలాపాలు కొనసాగిస్తాయని సుప్రీంకోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది.అమరావతిలో జస్టిస్‌ సిటీ నిర్మాణం కొనసాగుతున్నందున జడ్జిల నివాసం అద్దె భవనాల్లో ఏర్పాటు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి సూచించింది. మౌలిక సదుపాయాల కల్పన పూర్తయ్యాక హైకోర్టు విభజన పూర్తిస్థాయిలో జరుగుతుందని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

'జనతా గ్యారేజ్' అంటూ కత్తి పట్టుకొని తిరుగుతున్న యువకుడు

  సినిమాల్లో హీరోలు ఫైట్స్ చేస్తారు.. డైలాగ్స్ చెప్తారు.. బయట చూడని, చేయలేని విన్యాశాలు కూడా చేస్తారు. ఇదంతా సినిమాల్లోనే. బయట హీరోలు అందరిలాగే నార్మల్ గా ఉంటారు. ఇది తెలియక కొందరు సినిమాల్లో హీరోలు చేసినట్టు చేస్తే మనం కూడా హీరోలు అవుతాం అన్నట్టుగా.. సినిమాల్లో హీరోలు చేసినట్టు చేస్తారు. లేని తలనొప్పులు తెచ్చుకుంటారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ‘జనతాగ్యారేజ్.. ఇచ్చట అన్ని రిపేర్లూ చేయబడును’ అంటూ  ఎన్టీఆర్ 'జనతాగ్యారేజ్' సినిమాతో హిట్ కొట్టిన విషయం తెలిసిందే. సామాన్యులకు ఏ సమస్యలు వచ్చినా ‘జనతాగ్యారేజ్’కు వెళ్లి చెప్పుకుంటే పరిష్కారం అవుతాయన్నట్లు ఆ సినిమాలో చూపించారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో మొక్కలు నాటండి అని చెప్తే ఎంతమంది విన్నారో తెలీదు కానీ.. 'సమస్య ఉందనే తెలిస్తే చాలు ఎగబడి వెళ్ళిపోతాం' అనే మాట ఒక యువకుడి బుర్రకి బాగా ఎక్కింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన ప్రదీప్ అనే యువకుడు జనతా గ్యారేజ్ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి.. ఎవరికైనా సమస్య ఉంటే జనతా గ్యారేజ్‌లో సెటిల్ చేస్తానని మెసేజ్‌లు పంపేవాడు. అలా పలువురి మీద దాడి కూడా చేసినట్టు తెలుస్తోంది. ఈరోజు ఉండవల్లి సెంటర్‌లో నడిరోడ్డుపై కత్తి పట్టుకొని ప్రదీప్‌ హల్‌చల్ చేశాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రదీప్ పలుసార్లు అరాచకాలకు పాల్పడినా పోలీసులు పట్టించుకోలేదని, అందుకే మరింత రెచ్చిపోయి రోడ్డు మీదే కత్తితో తిరుగుతున్నాడని స్థానికులు అంటున్నారు. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలోనే ప్రదీప్ అరాచకాలకు పాల్పడడం ఆందోళన రేకెత్తిస్తోంది.

జగన్‌పై దాడి..నిందితునికి రెండు, మూడు రోజుల్లో బెయిల్‌

  విశాఖ ఎయిర్‌పోర్టులో వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు తరపున వాదించేందుకు లాయర్ ముందుకొచ్చారు.శ్రీనివాసరావు తరపున వాదిస్తానని, అతనికి బెయిల్ ఇవ్వాలని కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తానని సలీం అనే న్యాయవాది పేర్కొన్నారు.రెండు, మూడు రోజుల్లో బెయిల్‌ మంజూరు అవుతుందని ఆశిస్తున్నానన్నారు. శ్రీనివాస్‌ మానసిక స్థితి బాగాలేదని, మొదట్లో శ్రీనివాస్‌ తనను కూడా నమ్మలేదని న్యాయవాది సలీం పేర్కొన్నారు. మరోవైపు శ్రీనివాసరావును మరోసారి కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్‌ వేయాలని భావిస్తున్నారు.గత నెల 25న జగన్ పై దాడికి పాల్పడిన తర్వాత శ్రీనివాసరావుని విచారించిన పోలీసులు 26న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.కేసులో మరింత సమాచారం సేకరించాల్సి ఉన్నందున శ్రీనివాసరావుని తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు పిటిషన్‌ వేయడంతో ఆరు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో శ్రీనివాసరావుతోపాటు ఇతరుల నుంచి సేకరించిన సమాచారంలో కొన్ని అంశాలు విరుద్ధంగా ఉండడంతో స్పష్టత కోసం పోలీసులు శ్రీనివాసరావుని మరోసారి విచారించనున్నారు. ఈ నెల రెండున కోర్టులో కస్టడీ కొరకు పిటిషన్‌ వేయగా కోర్టు దానిని తిరస్కరించిన విషయం తెలిసిందే.దీంతో మరోసారి కోర్టులో కస్టడీ పిటిషన్‌ వేయాలని భావిస్తున్నారు.

జగన్ పై నా తమ్ముడితో కావాలనే దాడి చేయించారు

  వైసీపీ అధినేత జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ సోదరి రత్నకుమారి.. తన తమ్ముడిని చంపేస్తారేమో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పై జరిగిన దాడి గురించి ఆమె మాట్లాడుతూ...‘జగన్ పై నా తమ్ముడితో ఎవరో కావాలనే దాడి చేయించారు. ఎవరు చేయించారో చెబితే.. వాళ్లు నా తమ్ముడిని చంపేస్తామని బెదిరించి ఉంటారు. అందుకే వాడు చెప్పడం లేదేమో. డబ్బులు ఇస్తామని ఆశపెట్టి ఈ పని చేయించి ఉంటారు. ఆ డబ్బుతో భూమి కొందామని అనుకొని ఉంటాడు. అందుకే వాళ్లు చెప్పినట్లు చేశాడేమో’ అని తెలిపారు. ‘నా తమ్ముడి ఇంతటి దారుణానికి ఒడిగడతాడని మేము ఊహించలేదు. ఈ పనికి పురమాయించిన వారు ఇప్పుడు వాడిని చంపేస్తారేమోననే భయం మా అందర్నీ వెంటాడుతోంది. ఎవరో చేయించిన పనికి నా తమ్ముడు ఇలా బలైపోయాడు. నేను కళ్లారా చూసే దానిని. వాడు చిన్న ఫోన్‌ వాడే వాడు. మరి తొమ్మిది ఫోన్‌లు మార్చాడంటే నమ్మలేకపోతున్నాను. ప్రాణహాని ఉందని పోలీసులు తీసుకు వెళుతున్నప్పుడు చెబుతుంటే.. టీవీల్లో చూసి మాకు గుండె ఆగినంత పనైంది' ఆవేదన వ్యక్తం చేశారు.