జగన్ పై దాడి.. గవర్నర్ ఫోన్.. ఇక మేమెందుకు?
posted on Oct 26, 2018 @ 11:40AM
అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు రెండో రోజు ప్రారంభమైంది. ఈ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షనేత జగన్‌కు కావాలని ప్రాణహాని లేని దాడి చేసి.. రాష్ట్రమంతా అల్లర్లు సృష్టించి, ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనుకున్నారని ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల గూండాలను తీసుకొచ్చి అరాచకం సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆపరేషన్ గరుడ స్క్రిప్టులో రాసింది రాసినట్టుగా ఇప్పుడు జరుగుతోందని అన్నారు. నేరాలు చేసే వ్యక్తులు రాజకీయ ముసుగులో ఉంటే ప్రమాదమని అన్నారు. ఏదైనా నేరాలు జరిగినప్పుడు పోలీసులు ధైర్యంగా వ్యవహరించాలని.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన తిత్లీ తుపానుపై స్పందించని కేసీఆర్, కేటీఆర్, కవిత లాంటి వారు జగన్‌పై చిన్న దాడి జరిగిన వెంటనే స్పందించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు. గవర్నర్ వ్యవహార శైలి కూడా సరిగా లేదని.. జగన్‌పై దాడి విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నేరుగా డీజీపీనే నివేదిక అడగడం ఏంటని ప్రశ్నించారు. గవర్నర్ నేరుగా అధికారులనే సంప్రదిస్తే ఇక తామెందుకుని అన్నారు. ఎన్నడూ లేని విధంగా ఐటీ సామూహిక దాడులు చేస్తోందని, ప్రత్యేక హోదా అడిగినందుకు ఇన్ని దాడులు చేస్తారా అని నిలదీశారు. సీబీఐ విషయంలో అర్ధరాత్రి డ్రామా చేశారని వ్యాఖ్యానించారు. కేంద్రం రాష్ట్రానికి చేయాల్సిన పనులను అడిగితే అణచివేసే ధోరణి అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం సాయం చేయదు.. చేయనివ్వదని విమర్శించారు. పద్ధతిగా రాజకీయాలు చేశానని, ఎవరికీ భయపడాల్సిన అవసరంలేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ ఘటనపై చంద్రబాబు నిన్న కూడా స్పందిస్తూ పలు అనుమానాలు వ్యక్తం చేసారు. తనపై దాడి జరిగిన వెంటనే జగన్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకుండా, వారికి సమాచారం తెలపకుండా తన మానాన తాను హైదరాబాద్ ఎలా వెళ్లిపోతారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ‘దాడి సంఘటన మధ్యాహ్నం 12. 40 నిమిషాలకు జరిగింది. ఒంటి గంట విమానానికి ఆయన హైదరాబాద్ విమానం ఎక్కి వెళ్లి పోయారు. దాడి చేసిన నిందితుడిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకొని సాయంత్రం 4.30 గంటలకు రాష్ట్ర పోలీసులకు అప్పగించారు. నిబంధనల ప్రకారం బాధితుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించాలి. ఆయన నుంచి ఫిర్యాదు తీసుకోవాలి. సంఘటన ఎలా జరిగిందో స్టేట్‌మెంట్ తీసుకోవాలి. జగన్ తనపై దాడి చేసిన నిందితుడిని క్షమిస్తే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ, నిబంధనలు పాటించరా? ఆయన విమానం ఎక్కి వెళ్లిపోతుంటే సీఐఎస్ఎఫ్ అధికారులు ఎలా అనుమతించారు. గాయపడిన మనిషిని విమానంలోకి సిబ్బంది ఎలా అనుమతించారు?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.