జగన్, పవన్ రహస్య సమావేశం.. 40 సీట్లు ఆఫర్‌

  వైసీపీ అధినేత జగన్‌, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ మధ్య రహస్య పొత్తు ఉంది.. వీరిద్దరిని బీజేపీ వెనుక నుంచి నడిపిస్తుందని గత కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.  అయితే తాజాగా ఏపీ ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్‌ కారెం శివాజీ.. జగన్, పవన్ ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే విశాఖలోని వట్టి రవి ఇంట్లో జగన్, పవన్ కలిసారని శివాజీ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తాజాగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 'జగన్ విశాఖలో పాదయాత్ర కొనసాగిస్తున్న సమయంలో.. వట్టి రవి నివాసంలో పవన్‌ను జగన్ కలిసి 40 సీట్లు ఆఫర్‌ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ అప్పటికే సీఎం సీటుపై దృష్టి పెట్టి ఉండటంతో ఆ సీట్లకు ఆయన ఒప్పుకోలేదు. అలా ఆ చర్చల్లో సీట్లు సర్దుబాటు కాక వీరి పొత్తు పొడవలేదు' అని శివాజీ అన్నారు. జగన్,పవన్ వీరిద్దరూ ప్రధాని మోదీ చెప్పినట్లుగా ఆడుతూ ఏపీ ప్రజలను మోసగించేందుకు ప్రజల్లోకి వెళ్తున్నారని శివాజీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏపీని నమ్మించి దగా చేసిందన్నారు. అధికారంలోకి వస్తే విభజన హామీలను నెరవేర్చి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పడం వల్లే రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారని అన్నారు. బీజేపీతో సహా ప్రతిపక్షాలు ఆ కూటమిని చూసి భయంతో, ఓర్వలేనితనంతో కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని కారెం శివాజీ ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఎన్టీఆర్ పై చెప్పులు వేయించింది కేసీఆరే

  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌, ప్రజకూటమి నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంటుంది. తాజాగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి ఓ వైపు కేటీఆర్ కి సవాల్ విసురుతూనే.. మరోవైపు కేటీఆర్ మీద, ఇతర టీఆర్‌ఎస్‌ నేతల మీద విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ వారసుడిగా హరీష్ రావును ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించే దమ్ము కేటీఆర్‌కు ఉందా? అని సవాల్‌ చేశారు. ఒకవేళ కేటీఆర్‌ ప్రకటిస్తే ఇంతకు ముందు తాను హరీష్ రావు విషయంలో చేసిన వ్యాఖ్యలను బేషరతుగా విరమించుకుంటానని ప్రకటించారు. చంద్రబాబును వెన్నుపోటు దారుడు అనడాన్ని ఖండించారు. ఇది కేటీఆర్‌ దిగజారుడు తనానికి నిదర్శనంగా పేర్కొన్నారు. కేటీఆర్‌ను పిల్లకాకిగా అభివర్ణించారు. చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. 1200మంది అమాయకుల బలిదానంవల్ల వచ్చిన తెలంగాణను కేసీఆర్‌ కుటుంబంలోని నలుగురే అనుభవిస్తున్నారన్నారు. నాలుగు కోట్ల ప్రజలను వెన్నుపోటు పొడిచింది ఈ నలుగురేనన్నారు. చంద్రబాబును కార్నర్‌ చేసి లబ్దిపొందాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని  హెచ్చరించారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు తమ వైఖరిని మార్చుకోకపోతే ప్రజలే వారిని రాజకీయంగా సమాధి చేస్తారన్నారు. 1995లో డీసీసీబీ ఎన్నికలకు సంబంధించి వరంగల్‌, ఆదిలాబాద్‌, నల్లగొండ, మెదక్‌ జిల్లాల్లో కేసీఆర్‌, నగేశ్‌, కడియం శ్రీహరి, దయాకర్‌రావు, మాధవరెడ్డి అన్నగారి ఆదేశాలకు వ్యతిరేకంగా పని చేశారన్నారు. వీరంతా ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ తమను సస్పెండ్‌ చేయకుండా చూడాలని చంద్రబాబును వైస్రాయి హోటల్‌కు తీసుకువెళ్లారని, బాబు తన వంతు ప్రయత్నం చేస్తుండగానే ఎన్టీఆర్ పై చెప్పులు వేయించింది కేసీఆరేనని అన్నారు. చరిత్రను వక్రీకరిస్తే చరిత్ర హీనులవుతారని ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు.

పోలీసులపై లగడపాటి ఫైర్.. వారెంట్‌ లేకుండా సోదాలు ఎలా చేస్తారు?

  జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లో ఐపీఎస్‌ అధికారికి చెందిన భూమికి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారని బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ప్రముఖ వ్యాపారవేత్త జీపీ రెడ్డిపై గతంలో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 10 గంటల సమయం దాటాక జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నంబర్‌ 65లో నివాసముంటున్న జీపీ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేసేందుకు వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పోలీసులు వచ్చారు. సమాచారం అందుకున్న లగడపాటి వెంటనే అక్కడికి చేరుకుని ఏ ఆధారాలతో వచ్చారని పోలీసులను నిలదీశారు. ఎటువంటి వారెంట్‌ లేకుండా సోదాలు ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లోకి వచ్చేందుకు వీలు లేదంటూ వారిని అడ్డుకున్నారు. తనిఖీలకు వచ్చిన ఎస్‌ఐలు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎస్‌ఐ ఫోన్‌లో మాట్లాడుతుండగానే ఆ ఫోన్ తీసుకున్న లగడపాటి ఉన్నతాధికారితో ఆవేశంగా మాట్లాడారు. ‘ఈ కేసు సివిల్‌ వ్యవహారం, ఐజీ నాగిరెడ్డి ఒత్తిడితో అర్థరాత్రి ఇంటిపైకి ఎలా వస్తారు. జీపీ రెడ్డి నాలుగేళ్ల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు వచ్చిన కారణంగా మిమ్మల్ని ఎవరూ బదిలీ చేయలేరన్న ధీమాతో ఏమైనా చేయొచ్చని అనుకుంటున్నారా? జీపీ రెడ్డి పోలీస్‌స్టేషన్‌కు ఎన్ని సార్లు వచ్చారో మీకు తెలీదా? పోలీసులకు, జైళ్లకు, అరెస్టులకు భయపడి జీవించే అవసరం మాకు లేదు. నాకు చట్టాలు బాగా తెలుసు. పోలీసులకు ఎవరిపైన అయినా కేసులు పెట్టే అధికారం ఉంది. కానీ మీకున్న విస్తృత అధికారాలు ఉపయోగించి ఎవరినైనా అరెస్ట్‌ చేయాలనుకుంటే కుదరదు’ అంటూ లగడపాటి తీవ్రంగా హెచ్చరించారు. ఈ కేసు విషయమై జీపీ రెడ్డి ఇప్పటికే 20సార్లు పోలీసు విచారణకు వెళ్లారని.. అయినా ఆయన్ని వేధిస్తూనే ఉన్నారని లగడపాటి మీడియాతో అన్నారు. ఈ వ్యవహారాన్ని ఐజీ నాగిరెడ్డితో సెటిల్‌ చేసుకోవాలని పోలీసులు తన స్నేహితుడిని వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ సోదాల వెనుక ఐజీ నాగిరెడ్డి, వెస్ట్‌జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌ ప్రమేయం ఉందని ఆరోపించారు. దీనిపై గవర్నర్‌, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు.

గజ్వేల్ బరిలో గద్దర్.. కేసీఆర్ కి లాభమా? నష్టమా?

  తెలంగాణలో డిసెంబర్ 7 న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ఇంకా నెలరోజులు కూడా సమయం లేకపోవడంతో అన్ని పార్టీలు ఎన్నికల హడావుడిలో మునిగిపోయాయి. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఒక నియోజకవర్గం మీద ఉంది. అదే గజ్వేల్ నియోజకవర్గం. 2014 లో కేసీఆర్ ఇక్కడి నుంచే పోటీచేసి గెలుపొందారు. ఇప్పుడు కూడా కేసీఆర్ గజ్వేల్ నుంచే బరిలోకి దిగనున్నారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్.. టీడీపీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి మీద సాధారణ మెజారిటీతోనే గెలిచారు. ప్రస్తుతం వంటేరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మహాకూటమి తరుపున మళ్ళీ ఆయనే బరిలోకి దిగనున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగితేనే వంటేరు, కేసీఆర్ కి గట్టిపోటీ ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేస్తుండడంతో ఈసారి నువ్వా నేనా అన్నట్టు పోటీ సాగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఇప్పుడు గజ్వేల్ పోరులోకి ప్రజా గాయకుడు గద్దర్ కూడా ఎంట్రీ ఇచ్చారు. నిజానికి గద్దర్.. కేసీఆర్ మీద పోటీ చేస్తానని ఇంతకుముందే సంకేతాలు ఇచ్చారు. అదీగాక గద్దర్ ఆ మధ్య ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశం కూడా అయ్యారు. దీంతో గద్దర్ మహాకూటమి తరుపున బరిలోకి దిగుతారని అనుకున్నారంతా. అయితే తాజాగా గద్దర్ ఆ ఊహలు అన్నింటికీ బ్రేకులేశారు. తాను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కానని.. గజ్వేల్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే గజ్వేల్ నుంచి గద్దర్ బరిలోకి దిగితే కేసీఆర్ కి లాభం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గద్దర్ పోటీ వల్ల కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలే అవకాశముందని విశ్లేషకులు భావిస్తోన్నారు. చూద్దాం మరి గద్దర్ ఏం చేస్తారో. మహాకూటమికి షాక్ ఇస్తారో లేక కేసీఆర్ కి షాక్ ఇస్తారో. లేదా అనూహ్యంగా ఇద్దరికీ షాక్ ఇస్తారో.

హరీష్ రావుని నమ్మని కేసీఆర్.. హరీష్ వల్లే నర్సారెడ్డి కాంగ్రెస్ లోకి

  తెరాస నేత హరీష్ రావుని మహాకూటమి నేతలు బాగా టార్గెట్ చేసినట్టున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి.. హరీష్ రావు తనకి ప్రైవేట్ నంబర్ నుంచి కాల్ చేసి కేసీఆర్ ని ఓడించమని చెప్పాడని.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో హరీష్ రావు టచ్ లో ఉన్నారని.. త్వరలో కాంగ్రెస్ లో చేరతారని సంచలన వ్యాఖ్యలు చేసిన చేసిన విషయం తెలిసిందే. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా.. హరీష్ రావు తెరాసలో ఇమడలేకపోతున్నారని, అసలు వైఎస్ఆర్ బ్రతికి ఉంటే హరీష్ రావు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో చేరి ఉండేవారని అన్నారు. తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..  హరీష్ రావు తలకాయ కోసుకుని కేసీఆర్ ముందు పెడితే ఇది తలకాయ కాదు పుచ్చకాయ అని అంటారని అన్నారు. ఎందుకంటే ‘నువ్వు ఎట్లాంటివాడివో.. నువ్వు నమ్మినవాళ్లను ఎలా మోసం చేశావో మీ మామ కేసీఆర్‌కు స్పష్టంగా తెలుసు' అని అన్నారు. నీ పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో మేనమామకు చెప్పాల్సిన అవసరం లేదని, నీ జాతకం అంతా మీ మామ వద్ద ఉన్నదని, నువ్వు ఏమేమి చేశావో కేసీఆర్‌కు తెలుసునని రేవంత్ అన్నారు. కేసీఆర్‌ను నమ్మించడానికి హరీశ్ పదే పదే మహాకూటమిపై విమర్శలు చేస్తున్నారని, ఇవాళ చంద్రబాబుకు లేఖ కూడా రాశారని రేవంత్ విమర్శించారు. గత నెల 25వ తేదీ సాయంత్రం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గజ్వేల్లో ఉండే నర్సారెడ్డిని తీసుకుని హరీష్ క్వార్టర్‌కు వచ్చి 3 గంటలపాటు రహస్య చర్చలు జరిపిన తర్వాత, మరుసటి రోజు ఉదయం ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారంటే.. హరీష్-కేసీఆర్ మధ్య ఉప్పు, నిప్పులా ఉందా? లేదా? అన్నది ప్రజలకు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కారు డ్రైవర్‌ను మార్చవద్దని, ఇప్పుడు కారు వేగంగా పోతుందని కేటీఆర్ ప్రజలకు చెబుతున్నారని, ఇవాళ కారు డ్రైవర్‌ను మార్చాలని హరీష్ రావు చూస్తున్నారని అన్నారు. గజ్వేల్‌లో ఉండే తెరాస నేత హారీష్ ను కలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారని, దానికి హారీష్ ప్రజలకు సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉన్న సీసీ పుటేజీలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. 25న సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి వంటిగంట వరకు హరీశ్‌రావు ఇంటికి వచ్చిన కార్లు, వెళ్లిన కార్లు, ఎవరెవరు వచ్చి వెళ్లింది వివరాలను బయటపెడితే కేసీఆర్‌, కేటీఆర్‌కు స్పష్టత వస్తుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యాఖ్యలపై హరీష్ రావు ఎలా స్పందిస్తారో చూడాలి.

జగన్ పిటీషన్ విచారణకు అర్హత ఉందా?.. రేపు తేలనుంది

  వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిటీషన్ పై విచారణను హైకోర్టు శుక్రవారం నాటికి వాయిదా వేసింది. జగన్ పిటీషన్ విచారణకు అర్హత ఉందా? లేదా? అనేది రేపు నిర్ణయిస్తామని హైకోర్టు ప్రకటించింది. విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన కత్తి దాడి ఘటనపై జగన్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కత్తి దాడి ఘటనపై స్వతంత్ర్య దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలంటూ జగన్ పిటీషన్ లో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై నమ్మకం లేదని, అది పూర్తిగా రాజకీయ కోణంలో జరుగుతోందన్నారు. ఈ పిటీషన్ లో సీఎం చంద్రబాబుతో సహా ఎనిమిది మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటీషన్ పై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. హత్యాయత్నం కేసు వివరాలను తమ ముందుంచాలని ఏపీ అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. విశాఖ పోలీసులకు వైఎస్ జగన్ సహకరించలేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. కేసును తప్పుదోవ పట్టించేలా ఏపీ డీజీపీ వ్యవహరించారని పిటిషనర్ తరపు న్యాయవాది ఆరోపించారు. కాగా జగన్ పిటీషన్ విచారణార్హతపై కోర్టు శుక్రవారం విచారించనుంది.

సీట్లు కాదు.. గెలుపే ముఖ్యమంటున్న టీడీపీ

  తెలంగాణలో టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. సీట్ల సర్దుబాటు విషయంలో ఇన్నిరోజులు కూటమిలో చర్చల మీద చర్చలు జరిగాయి. అయితే ఇప్పటికి సీట్ల సర్దుబాటు విషయం ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతిలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు ఈరోజు సమావేశమయ్యారు. మహాకూటమి సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినందున టీడీపీ అభ్యర్థులపై నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని నేతలు చంద్రబాబుకు వివరించారు. ఎన్నికల కోసం ఆరుగురు సీనియర్లతో పార్టీ ఓ కమిటీ వేసింది. అభ్యర్థుల సమర్ధత, సామాజిక వర్గాల ప్రాతిపదికన ఇప్పటికే ఓ జాబితా రూపొందించిన నేతలు ఆ వివరాలను చంద్రబాబు ఎదుట ఉంచారు. అనంతరం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీ సీట్ల కంటే గెలుపుకే ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థులను ఇవాళ, రేపటిలోగా ఖరారు చేస్తామన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు వేదికగా అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణలో ఏర్పడే రెండో శాసనసభలో టీడీపీ డబుల్‌ డిజిట్‌ సాధించి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రమణ ఆశాభావం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ తాళాలు పగులగొట్టి తనిఖీలు.. ఉద్రిక్తత

  కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ తాళాలు, తలుపులను ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్వ్కాడ్ పగులగొట్టిన విషయం సంచలనం కలిగించింది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలోగల కాంగ్రెస్ కార్యాలయాన్ని ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారులు గురువారం ఉదయం పరిశీలించారు. అయితే.. ఆ సమయంలో కార్యాలయానికి తాళాలు వేసి ఉండడంతో వాటిని పగులగొట్టి లోపలికి ప్రవేశించి తనిఖీలు నిర్వహించారు. ఈ సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురై ఒక అధికారిని నిర్బంధించారు. అతన్ని విడిపించడానికి పోలీసులు రంగంలోకి దిగారు. కాగా.. టీఆర్ఎస్ పార్టీ కుట్రలో భాగంగానే అధికారులు తాళాలు పగులగొట్టారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.

మహేష్ తో సెల్ఫీ కావాలంటున్న 106 ఏళ్ల బామ్మ

  'మహేష్.. ఆ పేరులోనే ఏదో మత్తుంది' అని అష్టాచమ్మా సినిమాలో కలర్స్ స్వాతి అంటుంది. ఆ సినిమాలో స్వాతి అనే కాదు.. బయటకూడా చాలామంది అమ్మాయిలు మహేష్ ని అమితంగా ఇష్టపడుతుంటారు. మహేష్ కి పెళ్ళై పిల్లలున్నా కూడా మహేష్ ని కలల రాజకుమారుడిగా ఊహించుకునే అమ్మాయిలు చాలామంది ఉంటారు. అయితే అమ్మాయిలలో మహేష్ కి ఫాలోయింగ్ ఉండటం సహజం. కానీ వెరైటీగా 106 ఏళ్ల బామ్మ మహేష్ కి పెద్ద ఫ్యాన్ అట. అంతేకాదు మహేష్ తో ఓ సెల్ఫీ దిగాలని ఆ బామ్మ కోరికట. రాజమండ్రి కు చెందిన రేలంగి సత్యవతి అనే 106 ఏళ్ల బామ్మగారికి మహేష్ అంటే అభిమానం. ఆవిడ మహేష్ తో సెల్ఫీ దిగాలని ఎదురుచూస్తోంది. ఆ విషయం కాస్తా మీడియా ద్వారా మహేష్ కి తెలిసినట్టు సమాచారం. మహేష్ బామ్మతో సెల్ఫీ దిగడానికి ఓకే చేసినట్లు తెలుస్తోంది. మరి ఆ బామ్మ మహేష్ తో ఎప్పుడు సెల్ఫీ దిగుతారో చూడాలి. ఆ బామ్మ ఆనందం కోసం మహేష్ త్వరగా సెల్ఫీ దిగితే బాగుండని అభిమానులు ఎదురుచూస్తున్నారు.  

మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

  అమీర్‌పేట్‌ మైత్రీవనం మెట్రో స్టేషన్‌‌ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈరోజు ఉదయం అమీర్‌పేట్‌ మెట్రోస్టేషన్‌ కు వచ్చిన ఓ వ్యక్తి మొదటి అంతస్తు ఎక్కి.. సారథి స్టుడియో ప్రహారీ గోడ వైపు ఒక్కసారిగా దూకేశాడు. దీంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ వ్యక్తి వివరాలు తెలియరాలేదు. సమాచారమందుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అలాగే ఆ వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి తరలించారు.  

కూటమి సీట్లు.. మాజీ ప్రధానితో భేటీ.. చంద్రబాబు బిజీ బిజీ

  బీజేపీయేతర శక్తులను ఏకం చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే ఢిల్లీ వెళ్లి రాహుల్‌గాంధీ, కేజ్రీవాల్, మాయావతి, ములాయం, అఖిలేష్‌, ఫ‌రూఖ్ అబ్దుల్లా వంటి నేతలను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు బెంగుళూరు వెళ్లనున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన తనయుడు, కర్ణాటక సీఎం కుమారస్వామితో ఈ మేరకు కీలక భేటి నిర్వహించనున్నారు. మరోవైపు ఈరోజు చంద్రబాబుతో టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కూడా సమావేశంకానున్నారు. మహాకూటమిలో టీటీడీపీ కేటాయించిన సీట్ల వివరాలను సీఎంకు వెల్లడించనున్నారు. టీడీపీ పోటీ చేయనున్న సీట్లు, అభ్యర్థులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం చంద్రబాబు మధాహ్నం మూడు గంటలకు బెంగూళురు పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. బీజేపీ వ్యతిరేక పక్షాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు ఈ వారంలోనే డీఎంకే అధినేత స్టాలిన్‌తో పాటు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో వరుస సమావేశాలు నిర్వహించేలా కార్యచరణను సిద్దంచేసుకున్నారు. అదేవిధంగా ఇంకా ఎవ‌రెవ‌ర‌ని క‌ల‌వాలి అనేదానిపైన చంద్రబాబు ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు జాతీయ స్థాయి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

నేను రెడీ.. హరీష్ రావు రెడీనా?

  గజ్వేల్ కాంగ్రెస్ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి తెరాస నేత హరీష్ రావుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వంటేరు.. ప్రైవేట్ నంబర్ నుంచి హరీష్ రావు తనకి కాల్ చేసి కేసీఆర్ ని ఓడించమని చెప్పాడని.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో హరీష్ రావు టచ్ లో ఉన్నారని.. త్వరలో కాంగ్రెస్ లో చేరతారని సంచలన వ్యాఖ్యలు చేసిన చేసిన విషయం తెలిసిందే. అయితే వంటేరు మరోసారి హరీష్ రావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వంటేరు మాట్లాడుతూ.. హరీష్ రావు తనను చూసి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో తానూ, హరీష్ రావు రెండు సార్లు కలిసి కూర్చొని మాట్లాడుకున్నామంటూ మరో సంచలన వ్యాఖ్య చేశారు. ప్రైవేట్ నంబర్ నుంచి కాల్ చేసి మాట్లాడిన దానితో సహా అన్నింటికీ ఆధారాలున్నాయన్నారు. హైదరాబాద్‌లోనే తమ భేటీ జరిగిందని.. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆధారాలు చూపిస్తానని వంటేరు అన్నారు. ఆధారాలు కచ్చితంగా అందిస్తానన్నారు. ఏ దేవుడి ముందైనా ఒట్టు వేయడానికి తాను రెడీ.. హరీష్ రావు సిద్ధమా? అని వంటేరు ప్రశ్నించారు. నిజానిజాలు నిలకడమీద బయటపడతాయన్నారు.

సీఎం కావాలనే ఆలోచన లేదు..రాజకీయ సన్యాసం తీసుకుంటా

  గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతలు హరీష్ రావు తెరాసని వీడటం ఖాయమంటూ ఆరోపణలు చేస్తున్నారు.అంతే కాకుండా పార్టీలో కేటీఆర్ కి ఇచ్చిన ప్రాధాన్యం హరీష్ రావు కి ఇవ్వట్లేదని,కేసీఆర్ తన తర్వాత సీఎంగా కేటీఆర్ ని చేసేందుకే హరీష్ రావు ని పక్కన పెడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు.తనకు సీఎం కావాలనే ఆలోచన లేదన్నారు.మరో పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని‌ స్పష్టం చేశారు. మంత్రి హరీశ్‌తోనూ, పార్టీలోని ఇతర నేతలతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తామంతా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాజకీయాలు, అధికారం కంటే కుటుంబసభ్యుల మధ్య ఉన్న అనుబంధం చాలా గొప్పదని, దాన్ని ఎప్పుడూ వీడబోమని కేటీఆర్‌ అన్నారు.మహాకూటమి పుంజుకునే పరిస్థితే లేదని, తెలంగాణలో సెటిలర్స్‌ తమ వైపే ఉన్నారని తెలిపారు.105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడం సాహసోపేతమైన నిర్ణయమని.. తెరాసలో అసమ్మతి పూర్తిగా చల్లారిందన్నారు.త్వరలో జరగనున్న ఎన్నికల్లో వందసీట్లతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెరాస సొంతంగా అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు.కాంగ్రెస్‌ రూపంలో తెలంగాణలో ప్రవేశించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.చంద్రబాబు పొత్తు పెట్టుకోని పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ మాత్రమేనని ఆయన అన్నారు. కాంట్రాక్టర్లపై ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు కేబినెట్‌లో చర్చించడం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. సోనియాగాంధీని అమ్మనా బొమ్మనా అని ఆవేశంతో అంటే దానిని కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేశారని, చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై ఎందుకు మాట్లాడరని కేటీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఎంఐఎం మమ్మల్ని మేల్కొలిపిందని, అందుకే తాము ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. భాజపా ఐదు సిట్టింగ్‌ స్థానాల్లోనూ ఈసారి తెరాసయే విజయం సాధిస్తుందని కేటీఆర్‌ జోస్యం చెప్పారు.

విశాఖ భూకుంభకోణంలో మాజీ మంత్రి

  విశాఖ భూకుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నివేదికలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరుంది. గత పదిహేనేళ్ల భూలావాదేవీలపై విచారణ జరిపిన సిట్‌.. 300 పేజీలతో ఇవాళ నివేదినకు ప్రభుత్వానికి ఇచ్చింది.  గతంలో విశాఖ జిల్లాలో పనిచేసిన ముగ్గురు కలెక్టర్లు, నలుగురు జాయింట్‌ కలెక్టర్లు, 10 మంది డీఆర్వోలు, 14 మంది ఆర్డీవోల పేర్లు ఈ నివేదికలో ఉండడం సంచలనంగా మారింది. మొత్తం 49 మంది ప్రభుత్వ అధికారులు, 50 మంది ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు తేల్చిన సిట్‌.. 1229 ఎకరాల ప్రభుత్వ భూమి, 751 ఎకరాల అసైన్డ్ భూమి, 109 ఎకరాల మాజీ సైనికులు భూ లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్టు తెలిపింది.

లోకేష్ కి కౌంటర్ ఇవ్వబోయి పప్పులో కాలేసిన పవన్

  తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం వంతాడలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, దీన్ని అడ్డుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. అయితే దీనిపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. ‘మోడీ దత్త పుత్రుడి అబద్ధపు ప్రచారం. అవినీతి అని గగ్గోలు పెట్టారు. నిరూపించమంటే ప్యాకప్ అన్నారు. ఇప్పుడు మరో సారి బాక్సైట్ మసి పూసే ప్రయత్నం చేస్తున్నారు. పదవి కోసం తప్పుడు ప్రచారం మాని ఆధారాలు ఉంటే బయటపెట్టమని సవాల్ చేస్తున్నా.’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. దీనికి కౌంటరివ్వాలన్న ఆవేశంలో పవన్ పప్పులో కాలేశారు. 'శ్రీ లోకేష్ గారు, శ్రీ చంద్రబాబునాయుడు గారికి ఆధారాలు కావాలట. అందుకే వంతాడకు సంబంధించి ఆంధ్ర మైనింగ్ కంపెనీపై జాయింట్ కలెక్టర్ ఇచ్చిన నివేదికను నేను ఇక్కడ ఉంచుతున్నాను. దీంతో మీకు ఎలాంటి సంబంధం లేకపోతే దయచేసి దీనిపై విచారణ జరిపించి, బాధ్యులను శిక్షించండి’ అంటూ పవన్ ఆ రిపోర్ట్ ని జత చేసి ట్వీట్ చేసారు. ఇదే పవన్ కి పెద్ద తలనొప్పిగా మారింది. పవన్ సాక్ష్యం గా పోస్ట్ చేసిన సదరు ఆర్డర్ 2010లో ఇచ్చింది. అంటే ఎనిమిదేళ్ల క్రితం నాటిది. అప్పుడు అధికారంలో ఉన్నది వైఎస్ హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. వాస్తవానికి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015లో ఆ లీజును రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఇది తెలియక పవన్ పాత రిపోర్ట్ ని పోస్ట్ చేసి విమర్శలు మూట గట్టుకుంటున్నారు.

కేటీఆర్‌, హరీశ్‌పై తెదేపా ఫిర్యాదు

  తెలంగాణలో ముందస్తు ఎన్నికలు సమీపిస్తున్నండగా.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కాస్తా ఫిర్యాదుల వరకు వెళ్ళింది.మంత్రులు కేటీఆర్, హరీశ్‌ రావుతో పాటు పలువురు తెరాస నేతలపై తెదేపా ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారం సందర్భంలో వారు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్‌ను తెదేపా నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డితో పాటు పలువురు నేతలు కలిశారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడుపై మంత్రి కేటీఆర్ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని.. తమ పార్టీ నేత రేవూరి ప్రకాశ్‌ రెడ్డిని మంత్రి హరీశ్‌రావు బెదిరించేలా మాట్లాడుతున్నారని నేతలు సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. తెరాస అభ్యర్థులు గంగుల కమలాకర్, భూపాల్ రెడ్డి, రాజేందర్ రెడ్డి కూడా వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని... వారిపైనా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.మరి ఈ మాటల యుద్ధం ఎంతవరకు వెళ్తుందో..?

కడప స్టీల్‌ ప్లాంట్‌ కి గ్రీన్ సిగ్నల్.. త్వరలో శంకుస్థాపన

  కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.18వేల కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టాలని మంత్రి వర్గం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నెల రోజుల్లోపు ఓ మంచి రోజు చూసుకుని స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం నెరవేర్చని హామీలను రాష్ట్రమే చేపట్టేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దొనకొండ మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌కు ఆమోదం తెలిపారు. పోర్టు ఏర్పాటుకు రామాయపట్నం అన్ని విధాలుగా అనుకూలమనే దిశగా కీలక చర్చలు చేస్తున్నట్టు సమాచారం. రూ. 8,300 కోట్లతో 42 కిలోమీటర్ల మేర వైజాగ్ మెట్రో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణకు ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మున్సిపల్‌ ప్రాంతాల్లో 125, గ్రామీణ ప్రాంతాల్లో 152 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 44 క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. జనవరి 31 నాటికి అన్న క్యాంటీన్ల నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 124 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రం పట్ల కేంద్రం చూపుతున్న వివక్షపై కీలకంగా చర్చించినట్టు సమాచారం. కడప స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుపై కేంద్రానికి లేఖరాయాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలేదంటూ సీఎం చంద్రబాబు కేంద్రానికి రెండోసారి లేఖ రాయాలని నిర్ణయించారు. తిత్లీ తుపానుకు రూ.3,600 కోట్ల పైచిలుకు నష్టం వాటిల్లినట్లు అంచనాలు పంపడంతోపాటు తక్షణ సాయంగా రూ.1200 కోట్లు విడుదల చేయాలని కోరగా.. కేవలం రూ.229 కోట్లు మాత్రమే ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. దీనిపైకేంద్ర హోంమంత్రికి మరోసారి లేఖ రాయనున్నారు.

మరచి ప్రశ్నించిన బాబు..ధీటైన సమాధానమిచ్చిన పవన్

  తిత్లీ తుఫానుతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షించారు.తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో తిత్లీ బాధితులకు పరిహారం పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘పవన్‌ ఉద్దానానికి వచ్చి చాలా అన్యాయం జరిగిపోయిందని మొసలి కన్నీరు కార్చారు. మరి కేంద్రానికి లేఖ రాశారా? కేంద్రాన్ని నిలదీశారా..? ఒక్కసారైనా గట్టిగా హెచ్చరించారా..?’ అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ప్రధానికి రాసిన లేఖను పవన్ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘సీఎం గారూ.. తిత్లీ బాధితులను ఆదుకోవాలని నేను ప్రధానికి లేఖ కూడా రాయలేదని మీరు నాపై విమర్శలు చేశారు. ఇదిగో సాక్ష్యం’’ అంటూ ఆ లేఖను జత చేశారు. ఏపీలో అధిక శాతం ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రభుత్వం వైపే ఉందని, దాన్ని నియంత్రిస్తూ తమ పార్టీని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పవన్‌ మండిపడ్డారు.గతంలో పవన్ కళ్యాణ్ తిత్లీ తుఫాను ప్రభావంపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే.తిత్లీ తుఫానును జాతీయ విపత్తుగా పరిగణించవలసిందిగా కేంద్రానికి లేఖ కూడా రాసినట్లు తెలియజేసారు.మరి చంద్రబాబు దాన్ని మరిచారో ఏమో పవన్ ను ప్రశ్నించారు.దానికి అంతే ధీటుగా పవన్ ట్విట్టర్ వేదికగా సమాధానం చెప్పారు.  

మావోయిస్టు పార్టీ నాయకత్వంలో మార్పులు

  మావోయిస్టు పార్టీలో కీలకమార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి పదవీ బాధ్యతలు నిర్వహించిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతిని ఆ పదవి నుంచి తొలగాలని పోలిట్‌ బ్యూరో సభ్యులు అడిగినట్లు సమాచారం. ఐదు రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గడంపై బాధ్యత వహిస్తున్నానని, తన పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్లు కూడా గణపతి ప్రకటించినట్లు వెల్లడైంది. గణపతి స్థానంలో నంబాలా కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌ మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. నంబాలా కేశరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియోనిపేట. వరంగల్‌ ఆర్‌ఈసీలో కేశవరావు ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. 28 సంవత్సరాలుగా కేశవరావు అజ్ఞాతంలో ఉన్నారు. ప్రస్తుతం సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌కు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.1980 జనవరి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. 2005లోనే కేశవరావుపై రూ.50 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించింది. వయోభారంతోనే పార్టీ బాధ్యతలను, తన వద్ద ఉన్న ఏకే-47 తుపాకీని కూడా గణపతి, పార్టీకి అప్పగించినట్లు సమాచారం.