పవన్ కళ్యాణ్ సినిమాలో కమెడియన్ గా సునీల్

  మంచి హాస్య నటుడిగా పేరు సంపాదించుకొన్నసునీల్, రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మర్యాద రామన్న’ సినిమాలో నటించిన తరువాత దశ తిరిగింది. అంతకు ముందు అతను ‘అందాల రాముడు’ సినిమాలో హీరోగా చేసినప్పటికీ, మర్యాద రామన్న సినిమాతో వచ్చినంత పేరు రాలేదు. మర్యాద రామన్న తరువాత హీరో స్థాయికెదిగిపోయిన సునీల్, తన స్వంత సినిమాలతోనే బిజీ అయిపోవడం చేత ఇతర హీరోల సినిమాలలో కమెడియన్ గా కనిపించడం లేదు. త్వరలో విడుదల కానున్న ‘మిష్టర్ పెళ్ళికొడుకు’ సినిమాలో సునీల్ హీరో గా నటిస్తున్నారు. అయితే, త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయబోతున్న కొత్త సినిమాలో సునీల్ మళ్ళీ కమెడియన్ గా చేయబోతున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో ప్రణీత, సమంతా హీరోయిన్లు గా జత కట్టబోతున్నారు. ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్ టైనర్ సంస్థతో కలిసి బీ.వీ.యస్.యన్. ప్రసాద్ తన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మించనున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తునారు.

హైదరాబాద్ కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం

        హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కూకట్ పల్లి మెట్రో దుకాణం వెనుక ఉన్న అపార్ట్ మెంట్లోని కెమికల్ ల్యాబ్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ లీక్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. మంటల ధాటికి కారు పేలిపోవడంతో స్థానికులు భయంతో బాంబు అనుకొని పరుగులు తీశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఒక కారు 8 ద్విచక్రవాహనాలు కాలిపోయాయి. మంటలు చెలరేగిన ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలాడంతో పెద్ద శబ్దాలు వచ్చాయి. పేలుళ్ళ ధాటికి అపార్ట్ మెంట్ కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. పక్కనే ఉన్న ఇళ్ళకి కూడా మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది మ౦టలను అదుపుచేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  

సీసీ కెమెరాలు పై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి

      హైదరాబాద్ లో జరిగిన వరుస బాంబు పేలుళ్లను ఉగ్రవాదుల పిరికిపంద చర్యగా బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అభివర్ణించారు. వ్యవస్థను కూల్చడానికి ఉగ్రవాదులు ఆటవిక చర్యలకు దిగుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాంబు పేలుళ్ల ఘటనపై వెంకయ్యనాయుడు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పేలుళ్లు జరిగిన ప్రదేశాల్లో వెంకయ్యనాయుడు సందర్శించారు. కేంద్రం స్పష్టమైన హెచ్చరికలు చేసినా, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. వైఫల్యంపై, సీసీ కెమెరాలు పనిచేయకపోవటంపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం కమల, యశోదా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వెంకయ్యనాయుడు పరామర్శించారు.  

ప్రభుత్వ వైఫల్యానికి రెండు కారణాలు

  బాంబు ప్రేళ్ళుల తరువాత ప్రతిపక్షాలు ప్రభుత్వంపై రెండు ప్రధాన ఆరోపణలు చేస్తున్నాయి. మొదటిది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిఘా వర్గాల హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం. రెండోది పోలీసులను, నిఘా సంస్థలను తమపైకి ఉసిగొల్పి వాటిని దుర్వినియోగం చేయడం. రెండూ కూడా తీవ్రమయిన ఆరోపణలే. కేంద్ర నిఘా హెచ్చరికలకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సరిగ్గా స్పందించి ఉంటే, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఈ ఘోర దుర్ఘటన జరిగిఉండేది కాదన్నమాట నిజం. దానిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికానీ, అతని మంత్రి వర్గ సహచరులు గానీ నోరు మెదపట్లేదు. తమ నిర్లక్ష్యానికి, దాని ఫలితానికి నైతిక బాధ్యత వహించవలసినవారు, ఈ సంఘటనకు తాము బాధ్యులము కామన్నట్లు వ్యవహరించడం చాల ఘోరం. పైగా నిన్నఅత్యవసరంగా సమావేశమయిన మంత్రి వర్గం, పరిస్థితులను సమీక్షించకపోగా, తమ పనితీరుకు తామే శభాషీలు చెప్పుకొంటూ అభినందన తీర్మానాలు చేసుకొని, సిగ్గుపడకుండా తమ భుజాలు తామే చరుచుకొన్నారు.   ఉగ్రవాదుల దాడి జరుగబోతోందని తెలిసినప్పటికీ కిరణ్ ప్రభుత్వం అంత నిర్లక్ష్యం ఎందుకు వహించిందో ఆలోచిస్తే, దానికి ప్రతిపక్షాలు చెపుతున్న రెండో కారణం సహేతుకంగా కనబడుతుంది.   ఎంతసేపు, ప్రతిపక్షాలవారు ఏమి చేయబోతున్నారు? సహకార ఎన్నికలలో తిమ్మిని బమ్మిని చేసి ఎలా గెలవాలి?తమ ఈ అఖండ విజయాన్ని ప్రదర్శించి కేంద్రం వద్ద ఏవిధంగా మెప్పుపొందాలి? అధిష్టానాన్ని ఏవిధంగా ప్రసన్నం చేసుకోవాలి? వంటి విషయాల పైన కనబరిచిన శ్రద్ధ, చేతిలో ఉన్న నిఘావేదికపై లేకపోవడం వల్లనే ఈ ఘోర దుర్ఘటన జరిగింది.   ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు నిఘా సంస్థలను దుర్వినియోగం చేయడం కూడా ఈ ఘటనకు మరో ప్రధాన కారణం కావడం దురదృష్టకరం. ప్రభుత్వం తమ ఉద్యమలను ఆపేందుకు వినియోగిస్తున్న పోలీసు బలగాలలో కేవలం 10శాతం బలగాలను ప్రజల రక్షణకు ఉపయోగించి ఉండిఉంటే బహుశః ఈ ఘోరకలి జరిగి ఉండేదికాదని తెరాస నేతలు కొదండరాం, హరీష్ రావు, కవిత వంటి వారు చేస్తున్న విమర్శలలో నిజం లేకపోలేదు.   ఉగ్రవాదులను, సంఘవ్యతిరేఖ శక్తులపై నిఘాపెట్టవలసిన మన నిఘా సంస్థలు, అధికారంలో ఉన్నవారి చేతుల్లో ఆయుదాలుగా మారిపోయి, ప్రతిపక్షాల కదలికలను, వారి రాజకీయ ఎత్తుగడలను కనిపెట్టే దుస్థితికి దిగజారిపోయాయి గనుకనే, అవి తమ కర్తవ్య నిర్వహణలో విఫలం అవుతున్నాయి. అందువల్లనే మన నిఘా సంస్థలు మొన్న జరిగిన బాంబు ప్రేలుళ్ళవంటి సంఘటనలను పునరావృతం కాకుండా నివారించలేకపోతున్నాము.   కీలకమయినా బాధ్యతలు నిర్వర్తించవలసిన నిఘా సంస్థల పరిస్థితే ఈవిదంగా ఉన్నపుడు, అధికారులకి ప్రత్యక్షంగా సలాములు అర్పిస్తూ పనిచేయవలసిన పోలీసులనుండి ఏమి ఆశించగలము? ఏ రంగంలో నయినా రాజకీయ నాయకులు తమ వేలు, ముక్కు దూర్చినప్పుడు దాని పరిస్థితి ఈవిధంగానే అఘోరిస్తుంది అని చెప్పక తప్పదు.

"కళాభినేత్రి" వాణిశ్రీ కి అభినయ భారతి పురస్కారం

    హైదరాబాద్, ప్రఖ్యాత చలనచిత్ర నటి కళాభినేత్రి శ్రీమతి వాణిశ్రీ ని "అభినయ భారతి" పురస్కారంతో సత్కరించనున్నట్లు డా. గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళా పరిషత్ వ్యవస్థాపకులు శ్రీ మేడికొండ శ్రీనివాస్ చౌదరి. శ్రీ మానాపురం సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలియచేసారు. డా.గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళా పరిషత్ 6వ అఖిల భారత స్థాయి నాటికల పోటీలు ఫిబ్రవరి 24,25,26 తేదీలలో పాలకొల్లులో జరగనున్నాయని తెలిపారు. 24వ తారీఖున శ్రీమతి వాణిశ్రీ గారికి, "అభినయ భారతి" బిరుదు ప్రధానం. యువకళావాహిని వ్యవస్థాపకులు శ్రీ Y.K. నాగేశ్వరరావు గారిని బళ్ళారి రాఘవ రంగస్థల పురస్కారం. యువ నటీమణి, కూచిపూడి నాట్య కళాకారిణి కుమారి మధుశాలిని గారిని నాట్యమయూరి పురస్కారాలతో సత్కరించనున్నట్లు తెలిపారు.   ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక శాఖా మాత్యులు శ్రీ M.మహీధర్ రెడ్డి గారు, మైనర్ ఇరిగేషన్ శాఖా మాత్య్లులు శ్రీ T.G. వెంకటేష్ గారు, సాంఘీక సంక్షేమ శాఖా మాత్యులు శ్రీ పితాని సత్యనారాయణ గారు, పాలకొల్లు శాసనసభ్యురాలు శ్రీమతి బంగారు ఉషారాణి గారు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ కనుమూరి బాపిరాజు గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ లగడపాటి రాజగోపాల్ గారు, ప్రఖ్యాత తెలుగు గజల్ గాయకులూ డా. గజల్ శ్రీనివాస్ పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.   ఫిబ్రవరి 24,25,26 తేదీలలో ఏడు (7) నాటికలు ప్రదర్శించబడతాయని తెలిపారు.

ఆగదూ...ఈ పాదయాత్ర ఆగదూ...

  ఒకవైపు చంద్రబాబు మరో వైపు షర్మిల ఇద్దరూ ఎండనక వాననక ఎంతో కష్టపడుతూ చేస్తున్న పాదయాత్రలకి మద్యమద్యలో ఆటంకాలు తప్పడం లేదు. కొద్ది రోజుల క్రితం ఇద్దరూ కూడా తమ పాదయాత్రలకి ఆరోగ్య సమస్యలతో బ్రేక్ ఈయవలసి వస్తే, మళ్ళీ మొన్న శాసనమండలి ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో రెండు రోజులు విరామం తీసుకోవలసి వచ్చింది. ఆ మరునాడే హైదరాబాదులో బాంబు ప్రేలుళ్ళు జరగడంతో ఇద్దరూ కూడా తమ పాదయత్రలకి మరోరోజు శలవు ప్రకటించేరు. షర్మిల నల్గొండలోనే నిలిచిపోగా, చంద్రబాబు మాత్రం హైదరాబాద్ వచ్చి బాంబు ప్రేలిన దిల్ షుక్ నగర్ ప్రాంతాన్ని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాదితులను పరామర్శించి, హైదరాబాదులో ఉన్న తన ఇంటికి కూడా వెళ్ళకుండా నేరుగా గుంటూరు తిరిగి వచ్చేసి మళ్ళీ తన పాదయాత్ర మొదలుపెట్టేసారు.   చంద్రబాబు గుంటూరు జిల్లాలో వేమూరు మండలం నుండి ఈ రోజు తన పాదయాత్రను మొదలు పెట్టగా, షర్మిల నల్గొండ జిల్లాలో దామచర్ల మండలలో గల వాడపల్లి గ్రామం నుండి తన పాదయాత్రను మొదలుపెట్టారు. ఆమె ఈరోజు సాయంత్రంలోగా గుంటూరు లో ప్రవేశించే అవకాశం ఉంది.   ఇద్దరూ కూడా కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలను పట్టించుకోని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ఈ దుర్ఘటన కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్లనే జరిగిందని ఆరోపించారు. భాదితులకి ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియాను మరింత పెంచాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. ఇంతవరకు వారి విమర్శలు సహేతుకమయినప్పటికీ, ఇక ఈ విషయంలో వారు అత్యుత్సాహం ప్రదర్శించకపోవడమే మేలని చెప్పవచ్చును.   ఇద్దరికీ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు మరో కొత్త అస్త్రం దొరికింది గనుక, ఇక ఇద్దరూ తమ పాదయాత్రల్లో ఇదే విషయాన్నీపదే పదే ప్రస్తావిస్తూ, ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మరింత విముఖత పెరిగేందుకు కష్టపడవచ్చును. అయితే, ఇటువంటి విషయాలలో అత్యుత్సాహం ప్రదర్శించడం వలన, బాంబు ప్రేలుళ్ళపై జరుగుతున్న దర్యాప్తుకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది గనుక, ఈ అంశాన్ని తమ రాజకీయ లబ్ధికి వాడుకొనే ప్రయత్నం చేయకుండా తమని తాము నిగ్రహించుకొంటే మంచిది.   అంతగా కిరణ్ ప్రభుత్వంతో చెలగాటం ఆడుకోవాలనే కోరిక వారిలో బలంగా ఉంటే, త్వరలో జరుగనున్న శాసనసభ సమావేశాల్లో ఆపని చేసినట్లయితే, ప్రభుత్వాన్ని అధికారికంగా ప్రశ్నించినట్లు ఉంటుంది. బాధ్యతగల ప్రతిపక్ష నేతలుగా ఇద్దరూ కూడా ఈ ప్రేలుళ్ళ అంశాన్ని రాజకీయం చేయకుండా సంయమనం పాటించగలిగితే మంచిది. లేదంటే ప్రజల్లో వారే పలుచన అవుతారని తెలుసుకొంటారు.

షారుక్ తో సమానంగా డబ్బు కూడా ఇస్తే బాగుంటుంది: నాని

  ఇటీవల కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్ననటుడు నాని కూడా ఒకరు. అష్ట చెమ్మా సినిమాతో చిన్న సినిమాల హీరోగా తన సినీ ప్రస్థానం మొదలు పెట్టిన నాని ఒకవైపు చిన్న సిన్న సినిమాలు చేస్తూనే, క్రమంగా పెద్ద సినిమాల హీరోగా ఎదుగుతున్నాడు. పిల్ల జమీందార్, ఈగ వంటి సినిమాలలో చక్కటి నటన ప్రదర్శించిన నాని, ప్రస్తుతం ‘జెండాపై కపిరాజు’, ‘పైసా’అనే రెండు సినిమాలలో నటిస్తున్నాడు.   ఇటీవలే విదేశాలలో ఆ సినిమా షూటింగ్ పూర్తీ చేసుకొని వచ్చిన నానికి మరో బంపర్ ఆఫర్ దొరికింది. ప్రఖ్యాత బాలివుడ్ సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ వారు తెలుగులో నిర్మించనున్నవారి తొలి చిత్రంలో నానికి ఆఫర్ ఇచ్చారు. ముంబాయిలో ఉన్న ఆ సంస్థ స్టుడియోలో ప్రస్తుతం ఫోటో షూట్ లో పాల్గొనడానికి వెళ్ళిన నాని ఆ సంస్థ అధినేత మరియు సినిమా దర్శకుడు అయిన ఆదిత్య చోప్రాను కలిసాడు. హిందీలో సూపర్ హిట్ అయిన ‘బ్యాండ్ బాజా బారత్’ సినిమాకు రిమేక్ అయిన ఈ తెలుగు సినిమా షూటింగు త్వరలో మొదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఆదిత్య చోప్రాతో జరిగిన సరదా సంభాషణను నాని ట్వీటర్ లో పెట్టాడు. ‘నాదీ, షారుక్ ఖాన్ ది బట్టల కొలతలు ఒకటేనని వారు అన్నారు. అప్పుడు, నాకు వారివ్వబోయే డబ్బుకూడా ఆయనతో సరిసమానంగా ఉంటుందా? అని జోక్ చేసాను. ఏమయినప్పటికీ, ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను,’ అన్నాడు నాని.

సి.సి కెమెరాల వైర్లు ముందే కత్తిరించిన టెర్రరిస్టులు?

  ఈ రోజు మీడియాలో వచ్చిన తాజా సమాచారం, దర్యాప్తు సంస్థలు దిల్ షుక్ నగర్ కూడలిలో మరియు సమీపంలో గల షిరిడి సాయిబాబా మందిరం వద్ద అమర్చబడిన సి.సి.కెమెరాల రికార్డులు పరిశీలిదామని ప్రయత్నించినప్పుడు, కూడలిలో ఉన్న కెమెరాల వైర్లు కత్తిరించబడి ఉన్నట్లు కనుగొన్నారు. సమాచారం ప్రకారం ఉగ్రవాదులు తమని ఎవరూ గుర్తు పట్టకుండా ముందుగానే కెమెరాల వైర్లు కత్తిరింఛి వేసి ఉండవచ్చని పోలీసులు అభిప్రాయ పడుతున్నారు. అయితే, ఈ వార్తను పోలీసులు ఇంకా దృవీకరించలేదు. తాము ఇంతవరకు కొన్ని ఆధారాలు సంపాదించామని చెప్పారు. త్వరలోనే ఈ పని చేసిన వారిని పట్టుకోగాలమనే నమ్మకం వ్యక్తం చేసారు.

హైదరాబాదు పేలుళ్లపై రామ్ గోపాల్ వర్మ స్పందన

  ముంబయిపై జరిగిన ఉగ్రవాదుల దాడిని ‘26/11 దాడులు’ అనే సినిమాగా మలిచిన రామ్ గోపాల్ వర్మ, ఆ ప్రయత్నంలో అనేక మంది బాధితులను, హతుల కుటుంబాలను కలిసి వారి హృదయ విదారక గాధలు విని కదిలిపోయానని ఇటీవల ఒక టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు. ఆ అనుభవం తన ఆలోచనలో చాలా మార్పులు కూడా తెచ్చిందని, ఆయన పేర్కొన్నారు. భాదితుల కుటుంబాలను అందరికంటే దగ్గరగా చూసిన ఆయనకి, నిన్న హైదరాబాదులో జరిగిన బాంబు దాడులలో భాదితుల గోడు అర్ధం చేసునందునేమో, కొంచెం ఆవేశంగా ప్రభుత్వ అసమర్ధతను ఎండగడుతూ ట్వీటర్ లో తీవ్ర విమర్శలు చేసారు.   ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తూ ‘బాంబు ప్రేలుళ్ళను ఖండిస్తున్నాను’ అనే ఆయన చెప్పిన డైలాగు 1965 లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు మొదలయినప్పటి నుండి వింటున్నదే. అరగదీసిన డైలాగు అది.   ‘తక్షణమే పట్టుకొంటాము’ అని అంటున్నారు, మరి అలా చేయగలిగే కెపాసిటీ ఉంటే ముందే ఎందుకు పట్టుకోలేదని నేనడుగుతున్నాను.’   హోం మంత్రి షిండే నిన్న ‘ప్రేలుళ్ళపై విచారణ జరిపిస్తాను’ అన్న డైలాగు ఈ దశాబ్దానికే గొప్ప హై లయిట్ అనదగ్గ డైలాగు.’   ‘డిల్లీ నుండి స్పెషల్ టీములు విచారణ చేయడానికి రప్పిస్తున్నాం’ అనే మాటకి అర్ధం స్థానిక టీములు వెధవలనా?’ ప్రధానమంత్రి గారు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారుట. అంటే, ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేయకుండా సంతోషం వ్యక్తం చేస్తారని అనుకొంటామా మనము? మన రాజకీయనాయకులకి కోన వెంకట్ వంటి మంచి డైలాగులు వ్రాసే రచయితలూ అవసరం ఉంది.’   ‘వీరు (రాజకీయ నాయకులూ)మాట్లాడే మాటలు వినవలసిన వాళ్ళు ఎవరూ వినరు, ఎందుకంటే ఆ వినవలససిన వాళ్ళు బాంబులు పేల్చే ప్రిపరేషన్ లో బిజీ గా ఉంది ఉంటారు. అందువల్ల వారి మాటలు ప్రజలే వినక తప్పట్లేదు.”   రచయిత కోన వెంకట్ కూడా రామ్ గోపాల్ వర్మ ట్వీటర్ మెసేజ్ కు వెంటనే స్పందిస్తూ, వర్మ గారు మీరు చెప్పింది బాగానే ఉంది గానీ, ఈ రాజకీయ నాయకులకు కావలసింది మా వంటి రచయితలూ కారు, దర్శకుల అవసరం ఉంది.” అని జవాబు ఇచ్చారు.  

పేలుళ్ళ పై అమెరికా హెచ్చరించింది: బాబు

      నగరంలో ఉగ్రవాదులు పక్కా పథకం ప్రకారమే పేలుళ్లకు పాల్పడ్డారని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. అమెరికా ప్రభుత్వం ముందే హెచ్చరించింది, కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవడం దారుణమని అన్నారు. పేలుళ్లకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన ఆరోపించారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని బాంబు పేలుళ్ల ఘటనాస్థలిని చంద్రబాబు నాయుడు పరిశీలించారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్లు జరిగిన విషయం తెలియగానే చంద్రబాబు తమ పాదయాత్రను వాయిదా వేసి, శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనా స్థలిని సందర్శించిన అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బాబు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా అందచేయాలని ఆయన డిమాండ్ చేశారు.  

సమంత, సిద్దార్థ్ ల 'జబర్‌దస్త్' స్టోరీ ఇదే

        'అలా మొదలైంది' చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన నందిని రెడ్డి, టాలీవుడ్ లక్కీ గర్ల్ సమంత, లవర్ బాయ్ సిద్దార్థ్ వీరి కాంబినేషన్లో సినిమా వస్తోంది అంటే అంచనాలు భారీగా ఉంటాయి. మొదటి సినిమాతో మ్యాజిక్ క్రియేట్ చేసిన నందిని నుంచి రెండో సినిమాలో కూడా సమ్ థింగ్ స్పెషల్ ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. వీరికి తోడు అన్ కా౦ప్రమైజింగ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తోడవడంతో 'జబర్‌దస్త్' సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ రిపోర్ట్ స్టోరీ మీ కోసం: పెట్టిన ప్రతీ బిజినెస్ ఫెయిల్యూర్ అవుతూ..మరో బిజినెస్ కోసం అప్పులు చేసి జనాల్ని మోసం చేస్తూ బతికే షోకిల్లా రాయుడు బైర్రాజు (సిద్దార్థ్), సొంతంగా బిజినెస్ చేసి పైకి రావాలనుకునే శ్రేయ (సమంత) అనుకోకుండా కలిసి ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఆరంభిస్తారు. కంపెనీ బాగా అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడిపోయి వేర్వేరుగా బిజినెస్ చేస్తారు. అలా విడిపోయిన వీరి జీవితాల్లోకి సరస్వతి (నిత్యా మీనన్), ఫేమస్ డాన్ జావేద్ భాయ్ (శ్రీహరి) ఎందుకు వచ్చారు?చివరికి బైర్రాజు, శ్రేయ ఎలా కలిశారన్నది మిగిలిన కథ.  

తెలంగాణ సడక్ బంద్ వాయిదా

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న తలపెట్టిన “సడక్ బంద్” కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రకటించింది. ఈ నెల 24న హైదరాబాద్ – బెంగుళూరు హైవేను దిగ్బంధించాలని కార్యాచరణ రూపొందించారు. అలంపూర్ నుండి హైదరాబాద్ వరకు దాదాపు 12 చోట్ల సడక్ బంద్ పాయింట్లను జేఏసీ నిర్ణయించింది. దీనికి సన్నాహకంగా ఇప్పటికే జేఏసీ రెండు రోజులు బస్సు యాత్ర నిర్వహించింది.   ఇక దీనికితోడుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుకూడా ఒక రోజు బస్సుయాత్ర నిర్వహించారు. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాలోని టీఆర్ఎస్, జేఏసీ నేతలను పోలీసులు బైండోవర్ కింద అరెస్టు చేశారు. అనూహ్యంగా హైదరాబాద్ లో బాంబు పేలుడు ఘటన జరగడంతో దానిని వాయిదా వేశారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది తరువాత వెల్లడిస్తామని తెలిపారు.  

త్వరలో గాలిలో ఎగురనున్న టాటా విమానాలు

  భారతదేశంలో తొలిసారిగా విమానాలను నడిపింది టాటాలే అయినా, ఆ తరువాత వారెన్నడు ఆ వ్యాపారంవైపు తొంగి చూడలేదు. స్టీలు, వాహనాలు, గృహోపకరణాలు, తదితర రంగాలలో అద్వితీయమయిన ప్రతిభ చూపిన టాటాలు ఇప్పుడు దేశీయ విమానయాన రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధం అవుతున్నారు.   ఇప్పటికే, కేరళ, తమిళనాడు రాష్ట్రాలనుండి విదేశాలకు విమానాలు నడుపుతున్న మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా అనే సంస్థతో కలిసి, టాటాలు తక్కువధర-టికెట్-విమానయానం సేవలు అందించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకొంటున్నారు. ఇందులో టాటాలు, ఎయిర్ ఏషియా సంస్థలతో బాటు అరుణ్ భాటియా, హిందూస్తాన్ ఏరో సిస్టమ్స్ అనే మరో ఇద్దరు భాగస్వాములుగా ఉంటారు. ఎయిర్ ఏషియా సంస్థ 49%, టాటాలు30%, మిగిలిన ఇద్దరూ కలిసి 21% పెట్టుబడులు పెడతారు.   ఎయిర్ ఏషియా సంస్థ యొక్క ముఖ్య కార్యనిర్వాహకుడు (సి.ఈ.ఓ.) టోనీ ఫెర్నందేజ్ మీడియాతో మాట్లాడుతూ తొలుత తాము చెన్నై కేంద్రంగా చేసుకొని సేవలు మొదలుపెట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు. రూ.275 కోట్ల పెట్టుబడితో మొదట నాలుగు లేదా ఐదు విమానాలతో మొదలుపెట్టి క్రమంగా తమ సేవలు దేశమంతా విస్తరిస్తామని ఆన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవిఏషన్ వారు అనుమతినీయగానే, తమ సేవలు మొదలుపెట్టగలమని అన్నారు. బహుశః ఈ ఏడాది చివరిలోగా ‘టాటా విమానాలు’ గాలిలో ఎగిరే అవకాశం ఉంది.   అయితే, ప్రస్తుతం దేశీయ విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో, మరి టాటాలు ఎందుకు ఆ రంగంపై ఆసక్తి కనబరిచారో అర్ధంకాదు. ఒకవైపు కింగ్ ఫిషర్, ఎయిర్ ఇండియా వంటి అనేక విమానయాన సంస్థలు, తమ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించడానికి అవస్థలు పడుతున్న ఈ తరుణంలో టాటాలు ఈ రంగంలోకి ప్రవేశించడం, సాహసోపేతమయిన నిర్ణయమే కాక, చాల రిస్కుతో కూడకున్నదని భావించవచ్చును.   అయితే, అడుగుపెట్టిన ప్రతీ రంగంలో విజయకేతనాలు ఎగురవేయడం తమ సంప్రదాయంగా మార్చుకొన్న టాటాలు, దేశ వ్యాప్తంగా ఉన్న తమ పటిష్టమయిన నెట్వర్క్ సహాయ సహకారాలతో బహుశః ఈ రంగంలో కూడా కొత్త పుంతలు తొక్కి వినువీదుల్లో భారతీయులను విహరింపజేయవచ్చును.

పేలుళ్లు: హోం మంత్రి పర్యటన ముగిసిందలా..

  నిన్న హైదరాబాదులో బాంబు ప్రేలుళ్ళు జరిగిన వెంటనే, ఇదివరకెన్నడు చూడని విధంగా, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, అయన అనుచర మంత్రి ఆర్.కె.సింగ్, కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు చాల మంది వచ్చి హైదరాబాదులో వాలిపోయారు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నపటికీ, కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే రావడం విశేషమే అని చెప్పాలి.   ఇదివరకు కూడా హైదరాబాదులో అనేక సంఘటనలు జరిగినప్పటికీ, డిల్లీ నుండే ఖండనలు, సంతాపాలు ప్రకటించే ఆ ఆనవాయితీని కాదని, ఇంత హడావుడిగా రాత్రికి రాత్రి కేంద్ర హోం మంత్రి షిండే హైదరాబాద్ చేరుకోవడమే కాక, దుర్ఘటన జరిగిన ప్రాంతానికి స్వయంగా వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షించిన తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాదితులను కూడా ఆయన పరామర్శించారు.   అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘ప్రస్తుతం విచారణ జరుగుతున్నందున తన వద్ద ప్రత్యేక సమాచారం ఏమి లేదని, ఏ సంగతయినా ప్రాధమిక విచారణ ముగిసిన తరువాతనే చెప్పగలనని అన్నారు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న వివరాలను, తానూ స్వయంగా చూసి తెలుసుకొన్న విషయాలను, ఈ రోజు పార్లమెంటులో సభ్యులకు తెలియజేస్తానని ఆయన అన్నారు.   డిల్లీ నుండి హైదరాబాదుకి బయలుదేరేముందు “ఇటువంటి ఘటనలు జరుగవచ్చునని కేంద్ర ఇంటలిజెన్స్ నివేదికలను రాష్ట్రానికి రెండు రోజుల ముందే అందజేశామని” చెప్పిన ఆయన, ఇక్కడకి వచ్చాక మాట మార్చుతూ “ఇంటలిజెన్స్ నివేదికలను ప్రత్యేకంగా మన రాష్ట్రానికే కాక మరికొన్నిఇతర రాష్ట్రాలకు కూడా పంపామని, అందులో హైదరాబాదులో ఇటువంటి ఘటన చోటు చేసుకోవచ్చునని తామేమి ప్రత్యేకంగా హెచ్చరించలేదని అన్నారు. పత్రిక సమావేశం ముగియగానే, ఆయన మళ్ళీ డిల్లీ వెళ్ళిపోయారు.   ఆయన మాటలను బట్టి అర్ధం అవుతున్న విషయం ఏమిటంటే, ఈ రోజు నుండి మొదలు కానున్న పార్లమెంటు సమావేశాలలో ఎలాగు ఈ సంఘటనపై ప్రతిపక్షాలు నిలదీస్తాయి కనుక, తానూ స్వయంగా హైదరాబాద్ వెళ్లి రావడం ద్వారా, తాము ఈ సంఘటనను ఉదాసీనంగా తీసుకోలేదని నిరూపించుకోవడం కోసమే ఆయన వచ్చినట్లున్నారు. ఇప్పటికే ‘అగస్టా హెలికాప్టర్ల కుంభకోణాలను' నిలదీసేందుకు సిద్దంగా ఉన్న ప్రతిపక్షాలకు, ఇప్పుడు ఈ బాంబు ఘటన కూడా మరో కొత్త ఆయుధం అందించడంతో, వారి దాడినుండి తమ యు.పీ.యే. ప్రభుత్వాన్ని రక్షించుకోవాలంటే, సభలో వారికి దీటుగా జవాబు చెప్పే అర్హత ముందు సంపాదించుకోవాలి, కనుక, తానూ వచ్చి చేసేదేమీ లేకపోయినా ఆయన హైదరాబాదులో వాలిపోయి విషయ సేకరణ చేసారు. కేంద్ర హోం మంత్రిగా ఆయన స్వయంగా ఈ సంఘటనను పరిశీలించేందుకు హైదరాబాదు వచ్చారు గనుక, కేంద్రం ఈ విషయంలో చాల సీరియస్ గా ఉన్నట్లు ఉభయ సభలలో సభ్యుల ముందు దైర్యంగా నిలబడి మాట్లడవచ్చును. ఇక, ఈ  కేసు విషయం రాష్ట్ర పోలీసులు, ఇంటలిజెన్స్ వర్గాలు ఎలాగు చూసుకొంటాయి గనుక, ఆ సంఘటన గురించి ప్రత్యేకంగా ఆయన ఆలోచించవలసింది ఏమి లేదు.

తెలంగాణ పై మళ్ళీ అదే వాదన !

తెలంగాణా "మిగులు ఆదాయా''న్ని (సర్ ప్లస్) తెలుగు సోదరులు మింగారా? మళ్ళీ అదే వాదన ! - డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]   పాడిందే పాడటం కొందరికి వదిలించుకోడానికి వీలుకాని అలవాటు. అలాగే, తెలంగాణా "మిగులు'' ["సర్ ప్లస్'']ను రాష్ట్రంలోని మిగతా రెండు ప్రాంతాలవారూ మింగేసి తెలంగాణాకు తొంటిచెయ్యి చూపుయాన్నారన్న అపవాదును మరోసారి కొందరు తెరపైకి తెస్తున్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణా రైతాంగసాయుధ పోరాటం ఫలితంగానే తెలంగాణాలోని తెలుగుప్రాంతాలూ, ఆంధ్రలోని తెలుగుప్రాంతాలూ కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడి తెలుగుజాతంతా సమైక్యం కావడం సాధ్యమయింది. ఇది చారిత్రిక సత్యం. ఈ రెండు తెలుగుప్రాంతాల విలీనీకరణ సందర్భంగా, అప్పటికి మొగలాయిల (ముస్లీం) పరాయిపాలనలో విద్యకు, ఆరోగ్యానికి, సామాజికాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికీ మాతృభాషగా తెలుగు వాడకానికి నోచుకోని ఫలితంగా బ్రిటిషాంధ్రటో పోల్చినప్పుడు తెలంగాణా వెనుకబడి ఉన్నందున దానికి రక్షణలు కల్పిస్తూ విశాలాంధ్ర ఏర్పాటుకు ముందు "పెద్దమనుషుల ఒప్పందం'' కుదిరింది. దానికి తగినట్టుగా నూతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉభయప్రాంతాల నాయకుల మధ్య "మాట'' ప్రకారం ఆ రక్షణలు క్రమంగా అమలులోకి వచ్చాయి; ఒప్పందం అమలులో క్షేత్రస్థాయిలో కొన్ని ఒడిదుడుకులూ జరిగి ఉండవచ్చు. కాని అవి క్రమంగా తొలగిపోతూ వస్తున్నాయి. అయితే "పెద్దమనుషుల ఒప్పందం'' పైన సంతకాలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇరుప్రాంతాలకు చెందిన మంత్రులూ, కడచిన 56 ఏళ్ళుగానూ ఉన్నందున, ఒకవేళ "ఒప్పందం' అమలులో ఒడిదుడుకులు జరుగుతున్నప్పుడు, వాటిని పసికట్టి తొలగించవలసిన బాధ్యత ఉభయప్రాంతాల మంత్రులకూ ఉండాలి.   దేశానికి స్వాతంత్ర్య (1947 ఆగస్టు) ప్రకటన జరిగిన తరువాత రెండేళ్ళ దాకా [1950 జూన్ వరకు] తెలుగువారి తెలంగాణా ప్రాంతం నిజాం పాలకుల నిరంకుశ రాజ్యంలో భాగంగానే ఉంటూ వచ్చింది. ఎటుతిరిగీ రైతాంగ సాయుధ పోరాటం సాధించిన విజయాల చాటున ప్రవేశించిన యూనియన్ సైన్యాల రాకతో ఈ ప్రాంతానికి పూర్తిగా నిజాం పాలననుంచి రాజకీయ విమోచనం లభించింది. 1952 జనవరిలో దేశపు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ రాష్ట్రంలో కూడా మొదటిసారిగా ఎన్నికల కోలాహలం చెలరేగింది.అందులో కాంగ్రెస్ ఒక పక్షంగాను, జయసూర్య నాయకత్వంలో కమ్యూనిస్టులు "ప్రజాతంత్ర ప్రజాస్వామ్య ఐక్యసంఘటన'' (పి.డి.ఎఫ్.)గా ఏర్పడి సంయుక్త ప్రతిపక్షంగా ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకోవడంతో 1952 మార్చిలో హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రజలు ఎన్నికున్న ప్రభుత్వం ఏర్పడింది. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఏర్పడిన ఈ ప్రభుత్వం 1956 అక్టోబర్ ఆఖరిదాకా కొనసాగింది. కాగా 1955లో ఒకే భాషాసంస్కృతులు గల జాతి ప్రాతిపదికగా ఐక్య రాష్ట్రం ఏర్పడాలని తెలుగుప్రాంతాలన్నిటా ఆందోళన సాగింది. ఫలితంగా కేంద్రం ఈ సమస్యపైన ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఫజల్ ఆలీ కమీషన్ ను ఏర్పరచింది. ఈ కమీషన్ అభిప్రాయ సేకరణ తర్వాత నివేదిక సమర్పిస్తూ "భట్టిప్రోలు పంచాయితీ'' ధోరణిలో రెండు పరిష్కారాలు పరస్పరవిరుద్ధంగా సూచించింది. (1) తెలుగుప్రాంతాలన్నింటి ప్రగతికోసం, భవిష్యత్తులో వాటి భద్రతకోసం అవి విశాలాంధ్రగా ఏర్పడడం అన్నివిధాలా మంచి పరిష్కారమవుతుంది. (2) కాని, తెలంగాణా ప్రాంతంలో కొందరి అభిప్రాయం ప్రకారం "తెలంగాణా ప్రాంతం వెనుకబడినదిగా ఉండుటచే'' [మందుముల నరసింగరావు: "50 సంవత్సరాల హైదరాబా''దు] ప్రత్యేక రాష్ట్రంగా ఉండవచ్చునని కోరుకుంటున్నారు, అని కమీషన్ తెల్పింది. అలా కొందరు నాయకులు [వారిలో ప్రముఖులు బడా భూస్వాములయిన కొండా వెంకటరెడ్డి, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి] వెలిబుచ్చిన కోరిక నెరవేరనప్పుడు 1956లో "తెలంగాణా ప్రత్యేక రక్షణలు'' ఆధారంగా ఏర్పడిందే "ఆంధ్రప్రదేశ్''. నిజానికి అప్పటికి, అంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆరేళ్ళ నాటికి విశాలాంధ్రలో అంతర్భాగమైన ఒక్క తెలంగాణా ప్రాంతమేగాక యావత్తు దేశంలోనూ అంతవరకూ భూస్వామ్యవ్యవస్థ కారణంగానూ, బ్రిటిష్ వాడి పరాయి పాలనవల్లనూ అనేక వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో మన ఇరుగుపొరుగైన మైసూర్, మహారాష్ట్రలు కూడా ఉన్నాయి. కాని హైదరాబాద్ (స్టేట్) రాష్ట్ర శాసనసభలో కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడే ప్రాంతాలకు చెందిన శాసనసభ్యులు ఐక్య కర్నాటక, సంయుక్త మహారాష్ట్రల ఏర్పాటుకు పూర్తీ మద్ధతు పలుకగా [అప్పటికి ఆ ప్రాంతాలూ బాగా వెనుకబడి ఉన్నవే] తెలుగు మాట్లాడే తెలుగు ప్రజాప్రతినిధులయిన సభ్యులు కొందరిలో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఈ భిన్నాభిప్రాయానికి నాయకత్వం అనేక దశాబ్దాల తరబడిగా తెలంగాణా ప్రజాబాహుళ్యాన్ని పీల్చి పిప్పి చేసిన నిజాం, అతనికి తోడుగా భూస్వామ్య, బడాజాగీర్ధారీ, 'దోర'లకు సంబంధించిన ప్రతినిధులే కావడంవల్ల స్వార్థ ప్రయోజనాల కోసం విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకించారు. ఈ పరిస్థితి కర్నాటక, సంయుక్త మహారాష్ట్రలకు లేదు. అందుకే, ఈ భూస్వామ్యవర్గ నాయకులే [తెలంగాణా సాయుధ పోరాట అగ్రగాములలో ఒకరైన భీమిరెడ్డి నరసింహారెడ్డి అన్నట్టుగా] "తెలుగుజాతి ఐక్యతకు వ్యతిరేకులుగాని తెలంగాణా ప్రజలు మాత్రం కార''నీ అప్పటికీ, ఇప్పటికీ రుజువవుతున్న సత్యం! అందుకే ఆలోచనాపరుడైన ఆనాటి శాసనసభ్యుడు ఎల్.ఎన్. రెడ్డి ఫజల్ ఆలీ కమీషన్ నివేదికను ప్రస్తావిస్తూ "ఈ కమీషన్ కూడా అటు పూర్తిగా విశాలాంధ్రకు మద్ధతు తెల్పకుండాను, ఇటు ప్రత్యేక తెలంగాణాకు వందశాతం అనుకూలంగా సిఫారసు చేయకపోవటం కూడా పరిస్థితిని క్లిష్టం చేసిందని చెప్పాలి'' అని వ్యాఖ్యానించవలసి వచ్చింది [02-04-1956] సరిగ్గా ఈ అస్తుబిస్తు పరిస్థితులలోనే, తెలంగాణా గతంలో ఎప్పుడూ 'సర్ ప్లస్'' (మిగులు బడ్జెట్ తో) ప్రాంతం ఉండేదనీ, కాని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఈ 'సర్ ప్లస్' కాస్తా తెలంగాణాకు దక్కనివ్వకుండా కోస్తాలో ఖర్చుపెట్టారన్న అపవాదును కొందరు సోదర తెలంగాణా మిత్రులు ముందుకు నెడుతూ వచ్చారు. ఇంతకూ ఆ "కొందరు'' మాత్రమే పదేపదే పేర్కొంటున్న "తెలంగాణాకు ఉంటూ వచ్చిన సర్ ప్లస్ ఆదాయం'' ఎలా పేరుకుంది? ఎందుకు పేరుకుంది? అందుకు కారకులెవరు? ఒకవైపున తెలంగాణా ప్రాంతం నిజాంపాలన మూలంగా "దారుణమైన వెనుకబాటు తనా''న్ని అనుభవిస్తూ వచ్చిందని చెబుతున్నవారు, ఆ వెనుకబాటుతనాన్ని తొలగించడానికి నిధులు ఉపయోగించి ఉన్న పక్షంలో "సర్ ప్లస్'' బడ్జెట్ మిగిలేది కాదుగదా! ఆంధ్రప్రదేశ్ ఏర్పడేనాటికి "ఆంధ్రప్రాంతం ఆదాయం తరుగులో'' ఉంది కాబట్టి, తెలంగాణాకి జమకూడుతూ వచ్చిన మిగులు ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దరిమిలా కోస్తావాళ్ళు మింగేశారన్న ఆరోపణ సరైనది కాదు! ఎందుకంటే వెనుకబాటుతనానికి రెండు ముఖాలుంటాయి : (1) ఉన్న మిగులును ఎలాంటి ప్రజాసంక్షేమ పథకాలకు ఖర్చు చేయకుండా ఉన్నందువల్ల, లేదా (2) సంబంధిత ప్రాంతంలో ప్రజాహిత పథకాలను అమలు జరగకుండా స్వార్థప్రయోజనాలను ఆశించే పాలకుల వల్లనూ. నిజానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత, అంటే, 1956 నుంచి 2008 వరకూ కడచిన గత 56 సంవత్సరాలలోనూ విశాలాంధ్ర ఏర్పడిన తరువాత సోదర తెలంగాణా ప్రాంతంలో దాదాపు అన్నిరంగాలలోనూ [విద్య, వైద్య, పాఠశాలల, కళాశాలల, విశ్వవిద్యాలయాల, వాహనాల పెరుగుదలలో, పారిశ్రామిక, వ్యవసాయక వగైరా రంగాలలో] సుమారు 130 శాతంనుంచి 300 శాతం దాకా అభివృద్ధి నమోదైనదని సాధికారిక గణాంకాలు నిరూపిస్తున్నాయి! వాటిని కాదని ప్రత్యామ్నాయ వాదనలతో వాస్తవాలతో వేర్పాటువాదులు ఇంతవరకూ ముందుకు రాలేదు. రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న కొందరు వేర్పాటువాదులు "మాకు లెక్కలువద్దు, ప్రత్యేక రాష్ట్రం'' మాత్రమే కావాలన్న మొండివాదనకు గజ్జెకట్టారు! ఏ ప్రజాహితమైన పనులమీదా ఖర్చు చేయనప్పుడు, "రూపాయి ఖర్చుకాకూడదు, బిద్దమాత్రం దుత్తల్లే ఉండాలి'' అన్నట్టుగా "మిగులు బడ్జెట్'' మిగులుగానే ఉండక తప్పదుకదా! స్కూళ్ళు, కాలేజీలు, ఆస్పత్రులు, తదితర ప్రజాహిత పథకాలను నిజాం ప్రభువులు గ్రామసీమల అభివృద్ధికోసం ఖర్చుపెట్టకుండా ఉన్నందుననే ఆ మిగులు తేలింది; కాని తన భోగవిలాసాలకు మాత్రం కొదవలేదు!ఖర్చు చేయనప్పుడు ఒక చోట మిగులు మరొక చోట కొరతకు కారణమవుతుంది! 1956 నుంచి 2008 వరకూ తేలిన "అభివృద్ధి'' గణాంకాల ప్రకారం చూసినప్పుడు, తెలంగాణా "మిగులును'' కోస్తాఆంధ్రలో వాడేసుకున్న మాటే నిజమయితే, సోదర తెలంగాణలో 130 శాతంనుంచి సుమారు 300 శాతం దాకా అభివృద్ధి ఎలా సాధ్యమో "సర్ ప్లస్'' వాదులు వివరించగలగాలి! తెలంగాణా నాయకులలో ఒకరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మందుముల నరసింగరావు హైదరాబాద్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను రెండవ ప్రపంచయుద్ధానికి ముందూ, ఆ తరువాతా (1939 నుంచి 1948 దాకా) పరిస్థితిని చర్చిస్తూ హైదరాబాద్ రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులు క్రమంగా ఎలాంటి సంకతంలోకి వెళ్ళాయో వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు "తారుమారైపోయిన హైదరాబాద్ స్థితిగతుల''ను తన "50 సంవత్సరాల హైదరాబాదు'' గ్రంథంలో [''ఎమెస్కో'' ప్రచురణ : 2012] యిలా వివరించారు: యుద్ధానికి ముందు "గడిచిన ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వ బడ్జెట్ మిగులుగానే ఉండేది. రాష్ట్రప్రభుత్వ ఆదాయపు పద్దులలో అంతవరకూ ఎలాంటి మార్పూ లేదు కూడా. కాని - దిగుమతి, ఎగుమతి వ్యాపారం సన్నగిల్లడం, రాకపోకల సౌకర్యాలు తగ్గటం వలన పరిస్థితులు కూడా చాలా తారుమారైనవి. (తెలంగాణాకు) బర్మానుంచి బియ్యం రావటంలేదు. కొన్ని జిల్లాల్లో క్షామపరిస్థితులు ఏర్పడటం వలన, రాష్ట్రంలో పంటలు దెబ్బతిన్నవి. తిండిగింజలలోటు ఏర్పడింది. ధరలు రోజుకు రోజు పెరుగుచుండెను. వస్తువులు మాయం కావటం ఆరంభమైనవి. దొంగబజారు, నిలవపెట్టడం, అక్రమ లాభాలు సంపాదించడమనే పరిభాష మొదటి పర్యాయం హైదరాబాద్ రాష్ట్రంలో వాడుకలోకి వచ్చేసినది. ఆ పరిభాష అలాగే ఇప్పటివరకూ (యుద్ధానంతరం వరకూ) నిలిచిపోయినది''! అంతేగాదు, అంతవరకూ హైదరాబాద్ రాష్ట్రంలో "ఆదాయంపైన పన్ను అనే విధానేమే లేద''నీ, బ్రిటిష్ పరిపాలిత సికింద్రాబాద్ భాగంలో మాత్రం మొట్టమొదటిసారిగా బ్రిటిష్ రెసిడెంట్, ఆదాయంపైన పన్ను వేశాడనీ, కాని హైదరాబాదులో మాత్రం ఆ పని చేయడం సులభం కాలేదనీ కూడా మందుముల రాశారు. ఈ సందర్భంలోనే ఆయన మన దేశీయ పాలకులను గురించి ఒక 'చెణుకు' విసిరారు " "మన దేశీయ  పాలకులు 20వ శతాబ్దంలో జీవిస్తూ 18వ శతాబ్దపు పరిభాషలో ఆలోచిస్తూ ఉంటార''ని! అక్షరసత్యం మరోమాటలో చెప్పాలంటే ఆదాయపుపన్ను లేని సమయంలో సమకూడిన "రెవెన్యూ మిగులు''ను చూసారు. ఇటీవల మరొక గమ్మత్తు రాజకీయాన్ని కొందరు వేర్పాటువాద రాజకీయ నిరుద్యోగులు ఆశ్రయించారు! ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రుల వద్ద ఆర్ధిక, ప్రణాళికా శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సమర్ధుడైన అధికారి బి.పి.ఆర్. విఠల్ కూడా తెలంగాణా "సర్ ప్లస్'' ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఖర్చుచేసిన పధ్ధతి గురించి తప్పుపట్టారని వేర్పాటువాదులు కొందరు ఉదాహరిస్తున్నారు. ఇందుకోసం, రాష్ట్ర సమైక్యతను సమర్థిస్తున్న విఠల్ కుమారుడైన ఆచార్య సంజయ్ బారును విమర్శించడం కోసం తండ్రీ-కొడుకుల వాదనల మధ్య తగాదా పెట్టాలని వేర్పాటువాదులు చూశారు. కాని బి.పి.ఆర్.. విఠల్ ఒకనాటి తెలంగాణా మిగులు (సర్ ప్లస్) ఆదాయం గురించి దఫదఫాలుగా "సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్'' అని ప్రచురించిన ["A state in periodic crisises : Andhra Pradesh''] గ్రంథంలో చర్చించన తీరువేరు, వేర్పాటువాదులు ఆ పేరిట చేస్తున్న వాదన వేరు! తెలంగాణా ప్రాంతంలోని సొంత ఆదాయవనరులకు సంబంధించిన "మిగులు''ను ఆ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేకంగా వినియోగించలేదన్న ఫిర్యాదును ప్రస్తావిస్తూ విఠల్ చేసిన వ్యాఖ్య ఇక్కడ పరిశీలిచదగినది: "ఈ మిగులు రెవెన్యూలను అంచనా కట్టె పద్ధతీ, సదరు మిగుళ్ళను ప్రభుత్వం ఉపయోగించిన పద్ధతీ ఈ రాష్ట్రంలోని ప్రాంతీయ రాజకీయాలలో దఫదఫాలుగా తలెత్తుతూ వస్తున్న సమస్యలు. అయితే, ఈ ప్రాంతీయ రాజకీయాలను అలావుంచి ఈ మొత్తం రెవెన్యూ మిగులు సమస్యను బడ్జెట్ రూపకల్పనకూ, రాజకీయాలకూ మధ్య ఒక సంబంధిత సమస్యగా అధ్యయనం చేయడానికి తగిన కేస్ స్టడీ'' కాగలదు! ఇంకా స్పష్టం చేయాలంటే - ఆర్ధిక సంబంధితమైన పాలనా వ్యవహారాలపైన శాసనవేదిక (లెజిస్లేచర్) అడుపాజ్ఞాలకు సంబంధించిన సమస్యగా దానిని అధ్యయనం చేయదగిన అంశం'' అని కూడా విఠల్ పేర్కొన్నారు! అంతేగాదు, ప్రాంతీయ రాజకీయాలనుంచి వివాదాలు తలెత్తి ఉండవచ్చు, కాని అంతమాత్రాన ద్రవ్య (ఆర్ధిక) పాలనకు చెందిన సమస్యల ప్రాధాన్యతనుంచి దృష్టి మళ్ళరాదనీ, ఇంతకూ మౌలికమైన సమస్యకు పునాది రాజకీయ ఒప్పందమనీ, ఇది రాజకీయ ఉద్యమం వల్ల మరింత జటిలమవుతుందనీ విఠల్ పేర్కొన్నాడు. అధికారిగా ఆయన అంతకుమించి రాజకీయ నిరుద్యోగుల మాదిరిగా ముందుకు వెళ్ళలేడు! ఈ సమస్య చిలికి చిలికి గాలివానలాగా కేంద్రానికి, రాష్ట్రానికీ మధ్య సమస్యగా తలెత్తుతుందనీ, చివరికి దీనికి పరిష్కారమల్లా రాజ్యాంగ సవరణ మాత్రమేనానీ విఠల్ చెప్పారు. అందుకే ఒక రాజ్యంగబద్ధ సంస్థగా ఆంధ్రప్రదేశ్ శాసనసభే తెలంగాణా ప్రాంతీయ కమిటీని నాడు సాధికారికంగానే ఏర్పాటు చేసిందనీ, ఈ కమిటీ ఉన్నతకాలం, చట్టరీత్యా తనకు సంక్రమించిన అధికారాల పరిథిలో, ప్రభుత్వం చేసే ఖర్చుపైన చాలా శక్తిమంతంగా అర్థవంతంగా ఆజమాయిషీ చేస్తూ వచ్చిందని కూడా విఠల్ అన్నారు! ఈ కమిటీ ప్రస్తావించే సమస్యల వెనక రాజకీయ పూర్వరంగం ఉన్నప్పటికీ తెలంగాణా ప్రాంతీయ కమిటీ మాత్రం తన విశ్లేషణలో గాని, సమస్యను వివరించడంలో గానీ పక్కా వృత్తి సంస్థగానే వ్యవహరిస్తుందని విఠల్ అన్నారు! ఈ సమస్యను వివరిస్తూ విఠల్ గారు ఆరోపణలు చేసేవారినందరినీ ఒకగాటున కట్టకుండా ఏకీకరణ మూలంగా తెలంగాణా "రెవెన్యూ మిగులు''ను కోస్తాఆంధ్రులు వాడుకుంటారన్న ఆందోళనను "కొంతమంది తెలంగాణా నాయకులు'' వ్యక్తం చేశారని స్పష్టం చేయడం గమనార్హం. ఆ "కొందరు'' నాయకులు "అందరి నాయకుల''నీ కాదు, వారు మొత్తం తెలంగాణా ప్రజాబాహుళ్యం అభిప్రాయాలను ప్రతిబిందిస్తున్నారనీ అర్థం కాదు! ఇంతకూ ఆ 'సర్ ప్లస్'' ఆదాయం ఏది? తెలంగాణలో వసూలయ్యే భావిస్తూ, ఎక్సైజ్ (ఆబ్కారీ) ఆదాయమూ. ఇది ఏడాదికి రూ.5 కోట్లు, ఆనాటికి రాష్ట్రాల పునర్వవస్థీకరణ (ఫజల్ ఆలీ) కమిటీ రాష్ట్రంగా ఏర్పడిన "ఆంధ్రరాష్ట్రం కొంతమేర ఆర్ధిక సమస్యను ఎదుర్కొంటూ వచ్చింద''నీ చెప్పిందేకాని ఆ "కొంత'' ఎంతో స్పష్టం చేయకుండా వదిలేసి కూర్చుంది! అలాగే మద్రాసునుంచి విడిపోయి ఏర్పడిన ప్రత్యేక ఆంధ్రరాష్ట్రంలో "తలసరి ఆదాయం తక్కువ''ని చెప్పిందేగాని, ఆ "తక్కువ'' ఎంతో గణాంకంలో తెలపకుండా చల్లగా జారుకుంది! కాని అనుమానాలు మిగిల్చి రెండు ప్రాంతాల మధ్య మనస్సులను చెడగొట్టడానికి ప్రయత్నించింది, ఇక "పెద్దమనుషుల ఒప్పందా''న్ని అమలు జరిపించుకునే బాధ్యతనుంచి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోని తెలంగాణా మంత్రులు తప్పుకుని పదవులను మాత్రం అనుభవిస్తూ వచ్చారు! - [ మరిన్ని వివరాలు వచ్చే వ్యాసంలో]

హైదరాబాదులో బాంబు పేలుళ్లు: 15 మృతి

    ఈ రోజు (గురువారం) సాయంత్రం సుమారు 7గంటలకి హైదరాబాదులో అత్యంత రద్దీ ప్రాంతమయిన దిల్ షుక్ నగర్ వద్ద గల కోణార్క్ మరియు వేంకటాద్రి సినిమాహాళ్ళ వద్ద ఒకే నిమిషం వ్యవధిలో రెండు శక్తివంతమయిన వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం 22మంది చనిపోయినట్లు సమాచారం. మరో 50 మంది తీవ్ర గాయాలతో ఉస్మానియా, కమల, యశోద, ఒమ్నీఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం, రెండు సైకిళ్ళపై ఉంచిన టిఫిన్ బాక్సులలో బాంబులు ఒక దాని తరువాత మరొకటి కేవలం నిమిషం వ్యవధిలో ప్రేలడంతో వెంకటాద్రి సినిమా హాలు వద్ద 10 మంది, కోణార్క్ సినిమా హాలు వద్ద 12 మంది అక్కడిక్కడే చనిపోయారని తెలిపారు. బాంబు ప్రేలుళ్ళతో భయబ్రాంతులయిన జనం ఒక్కసారిగా చల్లాచదురయి నలువైపులా పరుగులు తీయడంతో ఆ తొక్కిసలాటలో అనేకమంది గాయపడ్డారు. విచారకరమయిన విషయం ఏమిటంటే, రెండు రోజుల క్రితమే ఇటువంటి సంఘటన ఏదో ఒకటి జరగబోతోందని కేంద్ర నిఘా వర్గాలు ఆంధ్రప్రదేశ్ తో సహా మరికొన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసాయి.మరి మన రాష్ట్రం ఆ హెచ్చరికలను పట్టించుకోలేదో లేక తగినంత అప్రమత్తత ప్రదర్శించలేకపోయిందో తెలియదు కానీ, మొత్తం మీద అమాయకులయిన ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.   ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ యధావిధిగా ‘ఇది పిరికి పందల చర్య’ అంటూ ఖండిచేసి, ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించడంతో తన కర్తవ్యం పూర్తిచేసుకొన్నారు. హోం శాఖా సహాయ మంత్రి ఆర్.కే.సింగ్ ప్రత్యెక విమానంలో హైదరాబాదు బయలు దేరారు. హోం మంత్రి షిండే ఇది ఇండియన్ ముజాహిద్ సంస్థ చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.   డీ.జీ.పీ. దినేష్ రెడ్డి, బాంబ్ డిస్పోస్ స్క్వాడ్, పోలీసులు, ఇంటలిజెన్స్ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కొందరు మంత్రులు, స్థానిక శాసన సభ్యులు, నగర మేయర్ తదితరులు హుటాహుటిన ఘటనా స్థలానికి జేరుకొని స్వయంగా సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.   రాష్ట్రంలో, దేశంలో అంతటా హై-ఎలర్ట్ ప్రకటించి, రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు, విమానాశ్రయాలు వంటి ప్రాంతాలలో భద్రత కట్టుదిట్టం చేసి తనికీలు నిర్వహిస్తున్నారు. ఘటన జరిగి ఇప్పటికి 3గంటలు గడిచినా, ఇంతవరకు ఏ సంస్థ కూడా ప్రేలుళ్ళకు బాధ్యతా వహిస్తూ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.

ధర్మాన కూడా కావూరి రూటే

  సాధారణ ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలియదు కానీ, వాటి ప్రభావం మాత్రం రాజకీయ నాయకుల మీద బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంత కాలం దిక్కార స్వరం వినిపిస్తూ, పార్టీని విమర్శిస్తున్న నేతల గొంతుల్లోంచి, ఇప్పుడు పార్టీకి అనుకూలమయిన మాటలు వినిపిస్తున్నాయి. తమకు పదవులు వెంట్రుక ముక్కతో సమానం అంటూ, రాజీనామాలు విసిరికొట్టిన వారే ఇప్పుడు వాటిని ఆమోదించవద్దని పార్టీ కాళ్ళు పట్టుకొని మరీ వేడుకొంటున్నారు. ఇంత కాలం రాజీనామాల పేరుతో, తమ బాధ్యతల నుండి తప్పించుకు తిరుగుతూ జీత భత్యాలు మాత్రం బహు చక్కగా స్వీకరించిన వారు మళ్ళీ సచివాలయాన్ని వెతుకొనివస్తున్నారు.   ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు ఈ రోజు తన రాజీనామాను ఉపసంహరించుకొని, పార్లమెంటు సమావేశాలకు హాజరు కాగ, ఇక్కడ రాష్ట్రంలో రెవెన్యు మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు కూడా ఈరోజే సచివాలయంలో తన విధులకు హాజరవడం కాకతాళీయంగా జరిగింది.   బహుశః రాహుల్ గాంధీ యువమంత్రమే వారిని భయపెట్టి విధులకు హాజరయ్యేలా చేసింది అని చెప్పవచ్చును. క్రిందటి నెలలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణాపై తీవ్రంగా కసరత్తు చేస్తున్న తరుణంలో, రాజీనామాలు చేస్తామని బెదిరించిన కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలకి “పార్టీలో ఉంటే ఉండండి పోతే పొండి, మీరు పోతే కొత్తవారితో పార్టీని ముందుకు తీసుకుపోతాము,” అని గట్టిగా చెప్పడం కూడా అనేక మంది నేతలకు కనువిప్పు కలిగించిందని చెప్పవచ్చును. కాంగ్రెస్ సంస్కృతికి అలవాటుపడిన ప్రాణాలు వేరే చోట ఇమడలేవనే సంగతి, సదరు నేతలే కాక, పార్టీ అధిష్టానానికి కూడా అర్ధం అయినందువల్లే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల్లో క్రమంగా మార్పులు కనబడుతున్నాయి.