ఆగదూ...ఈ పాదయాత్ర ఆగదూ...
posted on Feb 23, 2013 @ 10:59AM
ఒకవైపు చంద్రబాబు మరో వైపు షర్మిల ఇద్దరూ ఎండనక వాననక ఎంతో కష్టపడుతూ చేస్తున్న పాదయాత్రలకి మద్యమద్యలో ఆటంకాలు తప్పడం లేదు. కొద్ది రోజుల క్రితం ఇద్దరూ కూడా తమ పాదయాత్రలకి ఆరోగ్య సమస్యలతో బ్రేక్ ఈయవలసి వస్తే, మళ్ళీ మొన్న శాసనమండలి ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో రెండు రోజులు విరామం తీసుకోవలసి వచ్చింది. ఆ మరునాడే హైదరాబాదులో బాంబు ప్రేలుళ్ళు జరగడంతో ఇద్దరూ కూడా తమ పాదయత్రలకి మరోరోజు శలవు ప్రకటించేరు. షర్మిల నల్గొండలోనే నిలిచిపోగా, చంద్రబాబు మాత్రం హైదరాబాద్ వచ్చి బాంబు ప్రేలిన దిల్ షుక్ నగర్ ప్రాంతాన్ని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాదితులను పరామర్శించి, హైదరాబాదులో ఉన్న తన ఇంటికి కూడా వెళ్ళకుండా నేరుగా గుంటూరు తిరిగి వచ్చేసి మళ్ళీ తన పాదయాత్ర మొదలుపెట్టేసారు.
చంద్రబాబు గుంటూరు జిల్లాలో వేమూరు మండలం నుండి ఈ రోజు తన పాదయాత్రను మొదలు పెట్టగా, షర్మిల నల్గొండ జిల్లాలో దామచర్ల మండలలో గల వాడపల్లి గ్రామం నుండి తన పాదయాత్రను మొదలుపెట్టారు. ఆమె ఈరోజు సాయంత్రంలోగా గుంటూరు లో ప్రవేశించే అవకాశం ఉంది.
ఇద్దరూ కూడా కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలను పట్టించుకోని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ఈ దుర్ఘటన కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్లనే జరిగిందని ఆరోపించారు. భాదితులకి ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియాను మరింత పెంచాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. ఇంతవరకు వారి విమర్శలు సహేతుకమయినప్పటికీ, ఇక ఈ విషయంలో వారు అత్యుత్సాహం ప్రదర్శించకపోవడమే మేలని చెప్పవచ్చును.
ఇద్దరికీ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు మరో కొత్త అస్త్రం దొరికింది గనుక, ఇక ఇద్దరూ తమ పాదయాత్రల్లో ఇదే విషయాన్నీపదే పదే ప్రస్తావిస్తూ, ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మరింత విముఖత పెరిగేందుకు కష్టపడవచ్చును. అయితే, ఇటువంటి విషయాలలో అత్యుత్సాహం ప్రదర్శించడం వలన, బాంబు ప్రేలుళ్ళపై జరుగుతున్న దర్యాప్తుకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది గనుక, ఈ అంశాన్ని తమ రాజకీయ లబ్ధికి వాడుకొనే ప్రయత్నం చేయకుండా తమని తాము నిగ్రహించుకొంటే మంచిది.
అంతగా కిరణ్ ప్రభుత్వంతో చెలగాటం ఆడుకోవాలనే కోరిక వారిలో బలంగా ఉంటే, త్వరలో జరుగనున్న శాసనసభ సమావేశాల్లో ఆపని చేసినట్లయితే, ప్రభుత్వాన్ని అధికారికంగా ప్రశ్నించినట్లు ఉంటుంది. బాధ్యతగల ప్రతిపక్ష నేతలుగా ఇద్దరూ కూడా ఈ ప్రేలుళ్ళ అంశాన్ని రాజకీయం చేయకుండా సంయమనం పాటించగలిగితే మంచిది. లేదంటే ప్రజల్లో వారే పలుచన అవుతారని తెలుసుకొంటారు.