హైదరాబాదులో బాంబు పేలుళ్లు: 15 మృతి
posted on Feb 21, 2013 @ 9:47PM
ఈ రోజు (గురువారం) సాయంత్రం సుమారు 7గంటలకి హైదరాబాదులో అత్యంత రద్దీ ప్రాంతమయిన దిల్ షుక్ నగర్ వద్ద గల కోణార్క్ మరియు వేంకటాద్రి సినిమాహాళ్ళ వద్ద ఒకే నిమిషం వ్యవధిలో రెండు శక్తివంతమయిన వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం 22మంది చనిపోయినట్లు సమాచారం. మరో 50 మంది తీవ్ర గాయాలతో ఉస్మానియా, కమల, యశోద, ఒమ్నీఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం, రెండు సైకిళ్ళపై ఉంచిన టిఫిన్ బాక్సులలో బాంబులు ఒక దాని తరువాత మరొకటి కేవలం నిమిషం వ్యవధిలో ప్రేలడంతో వెంకటాద్రి సినిమా హాలు వద్ద 10 మంది, కోణార్క్ సినిమా హాలు వద్ద 12 మంది అక్కడిక్కడే చనిపోయారని తెలిపారు. బాంబు ప్రేలుళ్ళతో భయబ్రాంతులయిన జనం ఒక్కసారిగా చల్లాచదురయి నలువైపులా పరుగులు తీయడంతో ఆ తొక్కిసలాటలో అనేకమంది గాయపడ్డారు. విచారకరమయిన విషయం ఏమిటంటే, రెండు రోజుల క్రితమే ఇటువంటి సంఘటన ఏదో ఒకటి జరగబోతోందని కేంద్ర నిఘా వర్గాలు ఆంధ్రప్రదేశ్ తో సహా మరికొన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసాయి.మరి మన రాష్ట్రం ఆ హెచ్చరికలను పట్టించుకోలేదో లేక తగినంత అప్రమత్తత ప్రదర్శించలేకపోయిందో తెలియదు కానీ, మొత్తం మీద అమాయకులయిన ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ యధావిధిగా ‘ఇది పిరికి పందల చర్య’ అంటూ ఖండిచేసి, ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించడంతో తన కర్తవ్యం పూర్తిచేసుకొన్నారు. హోం శాఖా సహాయ మంత్రి ఆర్.కే.సింగ్ ప్రత్యెక విమానంలో హైదరాబాదు బయలు దేరారు. హోం మంత్రి షిండే ఇది ఇండియన్ ముజాహిద్ సంస్థ చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
డీ.జీ.పీ. దినేష్ రెడ్డి, బాంబ్ డిస్పోస్ స్క్వాడ్, పోలీసులు, ఇంటలిజెన్స్ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కొందరు మంత్రులు, స్థానిక శాసన సభ్యులు, నగర మేయర్ తదితరులు హుటాహుటిన ఘటనా స్థలానికి జేరుకొని స్వయంగా సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్రంలో, దేశంలో అంతటా హై-ఎలర్ట్ ప్రకటించి, రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు, విమానాశ్రయాలు వంటి ప్రాంతాలలో భద్రత కట్టుదిట్టం చేసి తనికీలు నిర్వహిస్తున్నారు. ఘటన జరిగి ఇప్పటికి 3గంటలు గడిచినా, ఇంతవరకు ఏ సంస్థ కూడా ప్రేలుళ్ళకు బాధ్యతా వహిస్తూ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.