ప్రభుత్వ వైఫల్యానికి రెండు కారణాలు
posted on Feb 23, 2013 @ 1:21PM
బాంబు ప్రేళ్ళుల తరువాత ప్రతిపక్షాలు ప్రభుత్వంపై రెండు ప్రధాన ఆరోపణలు చేస్తున్నాయి. మొదటిది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిఘా వర్గాల హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం. రెండోది పోలీసులను, నిఘా సంస్థలను తమపైకి ఉసిగొల్పి వాటిని దుర్వినియోగం చేయడం. రెండూ కూడా తీవ్రమయిన ఆరోపణలే. కేంద్ర నిఘా హెచ్చరికలకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సరిగ్గా స్పందించి ఉంటే, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఈ ఘోర దుర్ఘటన జరిగిఉండేది కాదన్నమాట నిజం. దానిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికానీ, అతని మంత్రి వర్గ సహచరులు గానీ నోరు మెదపట్లేదు. తమ నిర్లక్ష్యానికి, దాని ఫలితానికి నైతిక బాధ్యత వహించవలసినవారు, ఈ సంఘటనకు తాము బాధ్యులము కామన్నట్లు వ్యవహరించడం చాల ఘోరం. పైగా నిన్నఅత్యవసరంగా సమావేశమయిన మంత్రి వర్గం, పరిస్థితులను సమీక్షించకపోగా, తమ పనితీరుకు తామే శభాషీలు చెప్పుకొంటూ అభినందన తీర్మానాలు చేసుకొని, సిగ్గుపడకుండా తమ భుజాలు తామే చరుచుకొన్నారు.
ఉగ్రవాదుల దాడి జరుగబోతోందని తెలిసినప్పటికీ కిరణ్ ప్రభుత్వం అంత నిర్లక్ష్యం ఎందుకు వహించిందో ఆలోచిస్తే, దానికి ప్రతిపక్షాలు చెపుతున్న రెండో కారణం సహేతుకంగా కనబడుతుంది.
ఎంతసేపు, ప్రతిపక్షాలవారు ఏమి చేయబోతున్నారు? సహకార ఎన్నికలలో తిమ్మిని బమ్మిని చేసి ఎలా గెలవాలి?తమ ఈ అఖండ విజయాన్ని ప్రదర్శించి కేంద్రం వద్ద ఏవిధంగా మెప్పుపొందాలి? అధిష్టానాన్ని ఏవిధంగా ప్రసన్నం చేసుకోవాలి? వంటి విషయాల పైన కనబరిచిన శ్రద్ధ, చేతిలో ఉన్న నిఘావేదికపై లేకపోవడం వల్లనే ఈ ఘోర దుర్ఘటన జరిగింది.
ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు నిఘా సంస్థలను దుర్వినియోగం చేయడం కూడా ఈ ఘటనకు మరో ప్రధాన కారణం కావడం దురదృష్టకరం. ప్రభుత్వం తమ ఉద్యమలను ఆపేందుకు వినియోగిస్తున్న పోలీసు బలగాలలో కేవలం 10శాతం బలగాలను ప్రజల రక్షణకు ఉపయోగించి ఉండిఉంటే బహుశః ఈ ఘోరకలి జరిగి ఉండేదికాదని తెరాస నేతలు కొదండరాం, హరీష్ రావు, కవిత వంటి వారు చేస్తున్న విమర్శలలో నిజం లేకపోలేదు.
ఉగ్రవాదులను, సంఘవ్యతిరేఖ శక్తులపై నిఘాపెట్టవలసిన మన నిఘా సంస్థలు, అధికారంలో ఉన్నవారి చేతుల్లో ఆయుదాలుగా మారిపోయి, ప్రతిపక్షాల కదలికలను, వారి రాజకీయ ఎత్తుగడలను కనిపెట్టే దుస్థితికి దిగజారిపోయాయి గనుకనే, అవి తమ కర్తవ్య నిర్వహణలో విఫలం అవుతున్నాయి. అందువల్లనే మన నిఘా సంస్థలు మొన్న జరిగిన బాంబు ప్రేలుళ్ళవంటి సంఘటనలను పునరావృతం కాకుండా నివారించలేకపోతున్నాము.
కీలకమయినా బాధ్యతలు నిర్వర్తించవలసిన నిఘా సంస్థల పరిస్థితే ఈవిదంగా ఉన్నపుడు, అధికారులకి ప్రత్యక్షంగా సలాములు అర్పిస్తూ పనిచేయవలసిన పోలీసులనుండి ఏమి ఆశించగలము? ఏ రంగంలో నయినా రాజకీయ నాయకులు తమ వేలు, ముక్కు దూర్చినప్పుడు దాని పరిస్థితి ఈవిధంగానే అఘోరిస్తుంది అని చెప్పక తప్పదు.