కెవిపి కి మళ్ళీ పూర్వ వైభవం ?

      దివంగత వైఎస్ హయాంలో చక్రం తిప్పిన కేవిపి రామచంద్రరావు కు మళ్ళీ పాత రోజులు రానున్నాయా ? దీనికి సమాధానం అవుననే అనిపిస్తోంది. పార్టీలో రాహుల్ గాంధీ బాధ్యతలు మరింతగా పెరగడంతో, కెవిపి రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి పూర్వ వైభవం పొందనున్నారని సీనియర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దిగ్విజయ్ సింగ్ తిరిగి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గా బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో కెవిపి పార్టీలో ముఖ్య పాత్ర పోషించడానికి ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారు. వైఎస్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా కెవిపి ప్రముఖ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అయన పునరాగమనానికి అనువుగా ఉన్నాయి. ఒక వేళ రాష్ట్రంలో నాయకత్వ మార్పు అంటూ జరిగితే, సి ఎం పదవి రేసులో ఉన్న మర్రి శశిధర్రెడ్డి, డి శ్రీనివాస్ లు ఆయనతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కెవిపి సన్నిహితుడుగా ముద్ర పడ్డ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ ఇటీవల సోనియా గాంధీ ని కలిసిన అనంతరం తిరిగి కెవిపి తో చర్చలు జరిపారు. వీరితోపాటు, లగడపాటి రాజ గోపాల్, కోమటిరెడ్డి, తెలంగాణా ప్రాంతానికి చెందిన మంత్రులు కూడా కెవిపి తో చర్చలు జరుపుతుండటం చూస్తుంటే, ఆయనకు పూర్వ వైభవం వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో తన పునరాగమనానికి కావలసిన అన్ని ఏర్పాట్లు కెవిపి ఇప్పటికే చేసుకున్నారని, ఇక చక్రం తిప్పడమే తరువాయి అని వార్తలు వస్తున్నాయి. కెవిపి లాంటి సీనియర్ లు పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తే, పార్టీని వదలి వెళ్లాలనుకునే వాళ్ళకు ఆత్మ విశ్వాసం కలుగుతుందని కొంత మంది నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వై ఎస్ అనుయాయులు పార్టీని వదలి వెళ్ళకుండా చూసి, గోడ దూకుడు కార్యక్రమాలు ఆగాలనుకొంటే కెవిపి రామచంద్ర రావు కు పార్టీలో ముఖ్య పాత్ర ఇవ్వడం అవసరమని కోమటిరెడ్డి వంటి నేతలు దిగ్విజయ్ సింగ్ కు సూచించినట్లు తెలుస్తోంది.

విజయమ్మ తీరుఫై క్రిస్టియన్ల ఆగ్రహం

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదినేత్రి వై ఎస్ విజయమ్మ క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిందని ఈ మతానికి చెందిన వివిధ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.   సాధారణంగా క్రిస్టియన్ లు విగ్రహారాధన, హారతులు వంటి వాటికి దూరంగా ఉంటారని, విజయమ్మ మాత్రం బైబిల్ చేతులో పట్టుకుని ఇలాంటి పనులు చేస్తోందని ఈ మత నాయకులు బిషప్ ఆర్ హర్రీ సెబాస్టియన్, జెరుసలెం ముత్తయ్య, సి ఎ డానిఎల్ లు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయమ్మ ఆసలైన క్రిస్టియన్ అయితే నుదుటన బొట్టు ఎందుకు పెట్టుకుంటారని వారు ప్రశ్నించారు. వై ఎస్ కుటుంబం తమకు ఇబ్బందిగా మారిందని వారు అన్నారు. దివంగత వై ఎస్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో కూడా క్రిస్టియన్ లకు ఒరిగిందేమీ లేదని ఈ నాయకులు అన్నారు. తమ మతస్తులు ఇబ్బంది పడే ఉత్తర్వులను వై ఎస్ జారీ చేసారని వారన్నారు. వై ఎస్ జారీ చేసిన కొన్ని జీవోల వల్ల సుమారు 600 మంది క్రిస్టియన్లు జైలు పాలయ్యారని వారు వెల్లడించారు. జగన్ కూడా క్రిస్టియన్ లకు చేసిందేమీ లేదనీ, భవిష్యత్తులో చేసే అవకాశం కూడా లేదని వారన్నారు. రాజకీయనాయకులు తమ పబ్బం గడుపుకోవడం కోసం ఇతర మతస్తుల మనోభావాలు గాయపడేలా ప్రకటనలు చేయడం మానుకోవాలని వారు సూచించారు. లేని పక్షంలో తీవ్రంగా ప్రతిఘటిస్తామని వారు హెచ్చరించారు.

వీళ్లకు విషయం నిల్లా..?

  యువజన కాంగ్రెస్ కేంద్ర విభాగం రాష్ట్రానికి చెందిన ఇద్దరు నేతలను పనితీరు సరిగా లేని కారణంగా పార్టీ నుండి సస్పెండ్ చేసింది. అయితే వీరు సాదాసీదా నాయకులు కాకపోవడం విశేషం.   మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి శంకర్, వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజక వర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీమాన్ లను పార్టీ సస్పెండ్ చేసింది. వీరిలో, సాయి శంకర్ కేంద్ర మంత్రి బలరాం నాయక్ కుమారుడు కాగా, శ్రీ మాన్ రాష్ట్ర బి సి సంక్షేమ శాఖ మంత్రి బసవరాజు సారయ్య కుమారుడు. ఈ ఇద్దరు నాయకులు గత జూలై నెలలోనే ఈ పదవులకు ఎన్నికయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ యువజన కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ లిజు ఈ ఆదేశాలు జారీ చేసారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక కార్యక్రమాలను సరిగా నిర్వహించక పోవడం వల్లే వీరిఫై ఈ చర్య తీసుకున్నట్లు ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

కాంగ్రెస్ కిరణ్ జాగిరా...?

    రాష్ట్ర ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫై పెద్దపల్లి ఎంపి వివేక్ విమర్శలు గుప్పించారు. ఆయన కాంగ్రెస్ పార్టీని తన సొంత పార్టీలాగా భావిస్తున్నారని ఎంపి వివేక్ వ్యాఖ్యానించారు. పార్టీలో ఉంటే ఉండండి లేక పొతే లేదు అని ముఖ్యమంత్రి అనడం సరి కాదని వివేక్ అన్నారు. సోనియా గాంధీ కూడా ఎప్పుడూ ఇలా అనలేదని ఎంపి అన్నారు. కాంగ్రెస్ ప్రజల పార్టీ అని, తమ నాయకురాలు సోనియా గాంధీ అని, ఆమె చెప్పినట్లే తాము వ్యవహరిస్తాం తప్ప కిరణ్ చెప్పినట్లు కాదని ఆయన అన్నారు. కిరణ్ వల్ల రాష్ట్రంలో పార్టీ నష్టపోతోందని వివేక్ అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా సమయంలో 52 స్థానాల్లో ఎన్నికలు జరిగితే 50 చోట్ల పార్టీ ఓడిపోయిందని ఆయన అన్నారు. ముఖ్య మంత్రి పార్టీలో గ్రూపులను నడుపుతున్నారని, గతంలో ఈ పదవిలో ఉన్న ఏ నాయకుడు ఇన్ని గ్రూపులను నడపలేదని వివేక్ ఆరోపించారు. రాష్ట్రంలో పార్టీని అభివృద్ధి చేసే పనులు ముఖ్యమంత్రి చేయడం లేదని, జిల్లా స్థాయి సమావేశాలు అయన ఏనాడు నిర్వహించలేదని ఎం పి అన్నారు. కార్యకర్తల్లో మనో ధైర్యం నింపే పనులు కిరణ్ చేస్తే అంతా సంతోషిస్తారని వివేక్ హితవు పలికారు.

రేవంత్ వ్యాఖ్యలకు గవర్నర్ మనస్తాపం

రాజ్ భవన్ ను గాంధీ భవన్ గా మార్చారని తెలుగు దేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గవర్నర్ మనస్తాపం చెందారు. నరసింహన్ కాంగ్రెస్ అదినేత్రి సోనియా గాంధీ ప్రతినిధిగా మారారని కూడా అయన వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు ఇంతకు ముందెన్నడూ నరసింహన్ పై ఎవరూ చేయలేదు. వివిధ పార్టీల రాజకీయ ప్రాధాన్యతలు ఎలా ఉన్నా, గవర్నర్ ఫై చేసిన ఈ వ్యాఖ్యలు సరైనవి కావు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, పరిస్తితులను చక్కదిద్దేందుకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో రేవంత్ వ్యాఖ్యలు ఆహ్వానించ దగినవి కావు. రాష్ట్రంలో అయోమయ పరిస్థితి నెలకొని ఉన్నా , తన వంతు పాత్రను నరసింహన్ సమర్ధవంతంగా నిర్వహిస్తున్నరనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్రమ మార్గంలో పయనించడానికి గవర్నర్ కు సొంత వ్యాపారలేమీ లేవు. అలాంటి వ్యక్తి ఫై వ్యాఖ్యలు చేసే ముందు ప్రజా ప్రతినిధులు ఓ సారి ఆలోచిస్తారని ఆశిద్దాం.  

పూరీ జగన్నాథ్ భార్యకి వైకాపా టిక్కెట్టు

  వైఎస్సాఆర్ సీపీ పార్టీ గెలుపు గుర్రాల వేటలో పడింది. ముందస్తుగా అభ్యర్ధుల్ని నిర్ణయించుకోవడంవల్ల ఆఖరి నిముషంలో అనవసరమైన హడావుడిని నివారించొచ్చన్నది జగన్ వర్గం వ్యూహంగా కనిపిస్తోంది. ముందుగా అనుకున్నట్టుగానే కెమెరా మెన్ గంగతో రాంబాబు సినిమా ద్వారా వైకాపా అధ్యక్షుడికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించిన దర్శకుడు పూరీ జగన్నాథ్ కి ఆశించిన లాభం చాలా దగ్గర్లో ఉన్నట్టే కనిపిస్తోంది.   రాబోయే ఎన్నికల్లో వైకాపా తరఫున పూరీ భార్య అనకాపల్లి నుంచి గానీ లేదా నర్సీపట్నం నుంచి గానీ పార్లమెంటరీ స్థానానికి పోటీచేయబోతున్నారన్న వార్తలు నిజమయ్యే సూచనలు గట్టిగానే కనిపిస్తున్నాయ్. ఈ రెండు స్థానాల్లో ఏదో ఒకదాన్నుంచి పూరీ భార్య బరిలోకి దిగడం ఖాయమన్న ప్రచారం వైకాపాలోకూడా బాగా జరుగుతోంది.   టిడిపిలో కొన్నేళ్లపాటు పనిచేసిన పూరీ సోదరుడు ఉమాశంకర్ గణేష్ ప్రస్తుతం వైఎస్సాఆర్ సీపీ నేత అవతారమెత్తాడు. కాపు ఓట్లని మొత్తంగా గంపగుత్తగా చేజిక్కించుకునేందుకే పూరీ భార్యని బరిలోకి దించాలని పార్టీ అధిష్ఠానం యోచిస్తోంది. కొణతాలకు అనకాపల్లి ఎమ్మెల్యే టిక్కెట్టిచ్చేస్తే పార్లమెంట్ కి పార్లమెంట్ టిక్కెట్టివ్వొచ్చని జగన్ వర్గం భావిస్తున్నట్టు సమాచారం.

నడిరోడ్డుమీద కాంగ్రెస్ నేత హత్య

  గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఓ కాంగ్రెస్ నేతని రాజకీయ ప్రత్యర్ధులు నడిరోడ్డుమీద నరికి చంపారు. చాలాకాలంపాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఈ మధ్యే కాంగ్రెస్ పార్టీలో చేరిన నరేంద్రని హెల్మెట్లు ధరించిన కొందరు దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు.   చనిపోయిన నరేంద్ర స్వగ్రామం జానపాడు. జానపాడు రోడ్డులో నుంచున్నప్పుడే దాడి జరిగింది. ప్రాణభయంతో పారిపోయే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న ఓ హోటల్లోకి పారిపోయే ప్రయత్నం చేశాడు. చుట్టూ కమ్మిన దుండగులు అతి దారుణంగా వేటకొడవళ్లతో మెడ నరికి చంపేశారు.   తీవ్రగాయాలపాలైన నరేంద్రని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఎమ్మెల్సీ జి.వి.కృష్ణారెడ్డి అనుచరుడిగా నరేంద్రకి మంచి గుర్తింపుంది. ఆయన సహకారంతోనే గ్రామంలో అభివృద్ధి పనులుకూడా చేస్తున్నారు. ఎదుగుదలని చూసి ఓర్వలేని కొందరు నరేంద్రని మట్టుపెట్టారని కొందరు ఆరోపిస్తున్నారు.

ఎమర్జెన్సీ అలారం ఎందుకు మోగినట్టు..?

  జగన్ ఉంటున్న చంచల్ గూడ జైలుకి విజిటర్ల తాకిడి పెరుగుతోంది. చాలామంది విజిటర్లు అనఫిషియల్ గా జైలుకెళ్లి జగన్ ని కలుస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. జైలు అధికారులు ఇందుకు పూర్తిగా సహకరిస్తున్నారని, జైల్లో జగన్ దగ్గర ఓ సెల్ ఫోన్ కూడా ఉందని టిడిపి నేత యనమల తారా స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. చంచల్ గూడా జైల్లో జగన్ ని ఎవరెవరు ఎప్పుడెప్పుడు కలుసుకున్నారు అనే అధికారికి సమాచారాన్ని యనమల సంపాదించారు.   ఉన్నట్టుండి చంచల్ గూడ ఎమర్జెన్సీ సైరన్ ఎందుకు మోగిందో తెలుసుకునేందుకు అధికారులు హడావుడిగా పరిగెత్తారు. జైల్లో అంగుళం అంగుళం గాలించి కారణాన్ని వెతికి పట్టుకున్నారు. కానీ.. అది బైటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఇంతకీ .. ఎమర్జెన్సీ అలారం ఎందుకు మోగినట్టు అన్న అనుమానం మాత్రం ఇప్పటికీ జనానికి అలాగే ఉంది.   ఈ మధ్యకాలంలో చంచల్ గూడ జైలుకి విఐపిల రాక బాగా పెరిగింది. సెక్యూరిటీని టైట్ చేశారు. అన్ని వైపులా సీసీ కెమెరాలతో కవర్ చేశారు. జైలు చుట్టుపక్కల ప్రాంతాల్లోకూడా భద్రతని కట్టుదిట్టం చేశారు. సెంట్రీలు కళ్లలో ఒత్తులేసుకుని కాపలా కాస్తున్నారు.. అయినా ఎమర్జెన్సీ అలారం మోగింది..   చంచల్ గూడ జైలు జగన్ పార్టీ కార్యాలయంగా మారిందని టిడిపి నేతలు గట్టిగా ఆరోపణలు చేస్తున్నారు. వైకాపాలో చేరదామనుకున్నవాళ్లంతా నేరుగా జైలుకెళ్లి జగన్ ని కలిసి మాట్లాడొస్తున్నారంటున్నారు. వైఎస్సాఆర్ సీపీ నేతలు మాత్రం జైల్లో జగన్ కి భద్రత లేదని ఆరోపిస్తున్నారు. వేళకాని వేళలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఎమర్జెన్సీ అలారం మోగడం దీనికి తార్కాణాలని ఆరోపిస్తున్నారు.  

రాజీనామాలో మెలిక పెట్టిన కావూరి

    మంత్రి వర్గంలో చోటు దక్కలేదని ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు రాజీనామా చేశారు. పార్టీలో సీనియర్ లకు అన్యాయం జరుగుతుందని, పార్టీని నమ్ముకుని పనిచేసినా ప్రయోజనం లేదని, అందుకే తాను సీనియర్ల కోసం రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. చివరకు ప్రధాని పిలిచి మాట్లాడిన తాను బెట్టు వీడేది లేదని బీరాలు పోయారు. అమ్మ పిలిచి మాట్లాడితే గాని ఆలోచించను పొమ్మన్నారు. రాజీనామాపై వెనక్కు తగ్గనన్నారు. అయితే రాజీనామా లేఖలోనే కావూరి లాజిక్కు ఉందని తెలిస్తే మాత్రం మన ఆశ్చర్యపోక తప్పదు. ఇంతవరకు పార్లమెంటు చరిత్రలో ఎవరూ రాజీనామా లేఖ ఇవ్వని విధంగా కావూరి రాజీనామా లేఖ ఇచ్చారు. అవును లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన జనవరి ఒకటవ తేదీ నుండి రాజీనామా ను ఆమోదించాలని పేర్కొనడం విడ్డూరం. అధిష్టానానికి అంతర్గతంగా చెప్పిన కావూరి ఆ మేరకు జనవరి ఒకటి తుదిగడువు ఇచ్చారేమో. అసలు ఎలాంటి షరతులు లేకుండా రాజీనామా చేస్తేనే అప్పుడు స్పీకర్ సంబంధిత సభ్యుడిని పిలిచి ఓ సారి మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటి రాజీనామాలు చెల్లవు. గతంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు ఇలాగే వరసకట్టి రాజీనామాలు చేశారు. ఇప్పుడు రాజీనామా ఆమోదించాలంటే కావూరి మరో సారి రాజీనామా చేయక తప్పదు.

జగన్‌కు తెలంగాణలో 50 సీట్లు వస్తాయా..?

    ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చినా, ఎప్పటికొచ్చినా అన్ని విధాలా లాభం మా పార్టీకే తప్ప మరోపార్టీకి ఏమీ కలిసిరాదంటూ జగన్ పార్టీ వర్గాలు తెగ డబ్బా కొట్టుకుంటున్నాయ్. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఆఖరికి తెలంగాణలోకూడా అరవై సీట్లు రావడం ఖాయమని కొండా సురేఖ అనడం దీనికి సరైన ఉదాహరణ.   షర్మిల పాదయాత్రలో పాల్గొన్న సురేఖ చేసిన వ్యాఖ్యలు కాస్తంత గట్టిగానే జనం గుండెల్లోకి నాటుకుపోవచ్చన్న భయం ప్రత్యర్దుల్లో కనపడుతూనే ఉందికూడా.. పనిలోపనిగా చంద్రబాబు పాదయాత్రమీద విరుచుకుపడ్డ సురేఖ,, వీలైనంతగా బాబు యాత్రని ఏకే ప్రయత్నం కూడా చేశారు. నిజానికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు తెలంగాణ లో అరవై సీట్లు వస్తే రాష్ట్రంలో ఆ పార్టీకి అదికారం వచ్చినట్లే లెక్క. రెండువేల తొమ్మిదిలో కాంగ్రెస్ కు తెలంగాణలో ఏబై సీట్లు వస్తే తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది స్థానాలు దక్కాయి. టీఆర్ ఎస్ ఖాతాలో పడ్డవి మాత్రం కేవలం పది స్థానాలే.. రెండువేల నాలుగులో కాంగ్రెస్ టిఆర్ఎస్ లకు కలిపి సుమారు ఎనబై వరకు వచ్చాయి. అందులో టిఆర్ఎస్ కే ఇరవై ఆరొచ్చాయి. టిడిపికి అప్పట్లో కేవలం పదకొండు స్థానాలు మాత్రమే దక్కాయ్. 1999 లో కాంగ్రెస్,తెలుగుదేశం లు పోటాపోటీగా సీట్లు సంపాదించుకున్నట్టే లెక్క. అప్పట్లో.. కోస్తా, రాయలసీమలలో టిడిపి అత్యదికంగా సీట్లు సంపాదించుకుని అదికారంలోకొచ్చింది. 1994లో కాంగ్రెస్ కు తెలంగాణలో కేవలం ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి. హైదరాబాద్ లో నాలుగు, నిజామాబాద్ జిల్లాలో ఒకటి, వరంగల్ జిల్లాలో మరొకటి. ఇండిపెండెంట్లు, మజ్లిస్ పార్టీకి చెందిన అరడజను మంది  అభ్యర్ధులు మినహా టిడిపి, వామపక్షాలు క్లీన్ స్వీప్ చేశాయి. తెలంగాణలో టిడిపికి 1983లో నలభైమూడు స్థానాలు మాత్రమే రాగా, 1985 లో మాత్రం ఏబై కి పైగా వచ్చాయి. 1989లో టిడిపికి కూడా గణనీయంగానే తెలంగాణ లో సీట్లు వచ్చినా, మెజార్టీ స్థానాలు మాత్రం కాంగ్రెస్ పరమయ్యాయి.  ఈ లెక్కల్నిబట్ట చూస్తే తెలంగాణలో యాభై సీట్లు తెచ్చుకుంటే మిగతా రెండు ప్రాంతాల్లో కచ్చితంగా వంద సీట్లొచ్చినట్టే లెక్క. కొండా సురేఖ చెప్పిన జోస్యం నిజమైతే.. వైకాపా పూర్తి మెజారిటీతో అధికార పీఠమెక్కినట్టే లెక్క.. సురేఖ చెబుతున్నవి కాకి లెక్కలో లేక, నిజమైన లెక్కలో తెలుసుకునే రోజు దగ్గర్లోనే ఉందని అటు అధికార పక్ష నేతలూ, ఇటు ప్రతిపక్షనేతలూ విమర్శిస్తున్నారు. జగన్ పార్టీ నేతలు పెద్దఎత్తున అంచనాలు పెంచుకుంటూ తమని తాము ఎక్కువగా ఊహించుకోవడం పరిపాటైపోయిందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనం విలక్షణమైన తీర్పు చెబుతారన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నామా పై మండిపడ్డ కెటిఆర్

    తెరాస, టిడిపి మధ్య మాటల యుద్ధం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ దమ్ముంటే ఖమ్మం లోక్ సభ స్థానంలో పోటీ చేసి గెలిచి చూపించాలని టీడీపీ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సవాల్ కు కెసిఆర్ కుమారుడు తారక రామారావు స్పదించారు. నామా నాగేశ్వరరావు ముసుగులో ఉన్న సమైక్యవాది అని ఆరోపించారు. ఖమ్మం నుంచి తాము పోటిచేస్తామని చెప్పకుండా, తెలంగాణ వాదం ఖమ్మంలో బలంగా ఉందని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ప్రసన్నం చేసుకోవడానికి ఎంపీ నామా నాగేశ్వరరావు కేసీఆర్ మీద అనవసర విమర్శలకు దిగుతున్నారని అన్నారు. రెండువేల తొమ్మిదిలో కెసిఆర్ ను జైల్లో పెడితే ఆ జిల్లాకు చెందిన యువత సత్తా చూపారని కూడా ఆయన అన్నారు.

రాం జెత్మలానీకి బిజెపి రామ్ రామ్

    మొదట్నుంచీ రామ్ జెత్మలానీకి యాంగ్రీ యంగ్ మ్యాన్ పాపులారిటీ అంటే కాస్త మక్కువ ఎక్కువే. పదునైన పదాలతో చురకత్తుల్ని విసిరేయడం, అవి దీపావళి టపాసుల్లా మారి తెగపేలుతుంటే సంబరపడిపోవడం జెత్మలానీకి ఆనందం కలిగించే విషయం. తనని మాట అనగలిగినవాళ్లు ఇంటాబైటా లేరన్న ధీమా కూడా జెత్మలానీ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మొదట్నుంచీ దుందుడుక మాటలకు పెట్టింది పేరుగా ఉన్న ఈ సీనియర్ లాయర్ గారు బిజెపి నేతగా మారిన దగ్గర్నుంచీ నోటికొచ్చినట్టల్లా మాట్లాడి పార్టీని తెగ ఇరుకున పెడుతున్నారు. జెత్మలానీ వ్యాఖ్యలతో తలబొప్పికట్టించుకున్న బిజెపి పార్టీ ఇకపై ఆయన్ని ఉపేక్షించే ప్రశ్నే లేదని నిర్ణయించుకుని అవకాశంకోసం కాచుక్కూర్చున్న తరుణంలో రామ్ మరోసారి వాడివాడి మాటలనే తూటాల్ని ప్రయోగించారు. సిబిఐ డైరెక్టర్ గా రంజిత్ సిన్హా నియామకంపై తీవ్రస్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాక, దమ్ముంటే నాపై చర్య తీసుకోండంటూ బిజెపి అధిష్ఠానానికి సవాల్ కూడా విసిరారు. అడ్డగోలుగా మాట్లాడ్డం ఒక ఎత్తైతే, నాకంటే మొనగాడెవరూ పార్టీలో లేరన్నట్టుగా అర్ధం వచ్చేలా దమ్ముంటే నా మీద చర్య తీసుకోండి ఛాలెంజ్ అంటూ జెత్మలానీ విసిరిన సవాల్ నేరుగా గడ్కరీ గుండెల్లో గుచ్చుకుంది. చాలా రోజులుగా తనని ఏకి పారేస్తున్న జెత్మలానీమీద గుర్రుగా ఉన్న బిజెపి అధ్యక్షుడు గడ్కరీ.. ఘనత వహించిన లాయర్ గారిపై వేటు వేశారు. మొదట్నుంచీ జెత్మలానీని వెనకేసుకొస్తున్న శత్రుఘ్న సిన్హా, యశ్వంత్ సిన్హా వంటి నేతలకుకూడా ఇండైరెక్ట్ గా వార్నింగిచ్చేందుకే బిజెపి అధిష్ఠానం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అన్నీ బాగానే ఉన్నాయ్.. కానీ.. తనపై పార్టీ వేటువేసిన తర్వాత ఇంతవరకూ జెత్మలానీ నోరు విప్పనే లేదు. ఆయన సైలెన్స్ బ్రేక్ చేస్తే ఎలాంటి మాటాలు దూసుకొస్తాయోనన్న ఉత్కంఠ జనంలో విపరీతంగా పెరిగిపోతోంది.

కేసిఆర్ తో విభేధాలు లేవు : రాములమ్మ

    సూర్యపేటలో జరిగిన తెరాస సమరభేరికి విజయశాంతి హాజరుకాలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ సభకు తెరాస ఎంపిగా ఉన్న విజయశాంతి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కేసిఆర్ కు విజయశాంతికి విభేదాలు వచ్చాయని ప్రచారం ఆరంభమైంది. దీనిపై విజయశాంతి వివరణ ఇచ్చారు. కేసిఆర్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, తీవ్ర అస్వస్థతతో బాధ పడుతుండటంతో సమరభేరి సభకు హాజరుకలేకపోయానని చెప్పారు. అంతేకాని తనకు కేసిఆర్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. గతంలో రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రి ఉన్నపుడు విజయశాంతి తెరాసకు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. కాని రాజశేఖరరెడ్డి మరణించడంతో ఆ ప్రచారానికి తెరపడింది.

కేసీఆర్ కి దడపుడుతోందా..?

    తెలంగాణ రాష్ట్రం రావడం అసలు కేసీఆర్ కే ఇష్టంలేదని వాదించేవాళ్ల సంఖ్య రోజురోజుకీ రాష్ట్రంలో పెరిగిపోతోంది. కావాలనే తెలంగాణ అంశాన్ని కేసీఆర్ బంగారు గుడ్లుపెట్టే బాతులా చూస్తున్నారని, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ్.   చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వని కారణంగా టిఆర్ ఎస్ అనే సొంత కుంపటిపెట్టుకుని రాష్ట్రంలో వేర్పాటువాదమనే నిప్పుని రాజేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్న భావన తెలంగాణవాదుల్లో కూడా విపరీతంగా పెరిగిపోతోందని కొందరు పొలిటీషియన్లు ఆరోపిస్తున్నారు.   వై.ఎస్ బతికున్న రోజుల్లో కేసీఆర్ కి తెలంగాణ విషయంలో మాట్లాడ్డానికేం పెద్దగా మిగల్లేదు. అడపాదడపా ఏవో దీక్షలు చేసినా అవి చప్పగా చల్లారిపోయాయేతప్ప నిప్పులు కక్కిన దాఖలాల్లేవన్నది కొందరు కాంగ్రెస్ తెలంగాణ నేతల మాట. కాకపోతే.. కేసీఆర్ వల్లే ఎప్పుడో మూలనపడ్డ ఉద్యమం మళ్లీ తారా స్థాయికి చేరిందని నమ్మేవాళ్లూ చాలామందే ఉన్నారు.   ఉద్యమం పూర్తిగా పొలిటికల్ జెఎసి అధ్యక్షుడు కోదండరామ్ చేతుల్లోకి పోతోందని భయపడిన కేసీఆర్ హుటాహుటిన లాబీయింగ్ కోసం ఢిల్లీకి పరిగెత్తారు. ఢిల్లీ పెద్దల బందుల దొడ్లో కట్టేసినా, ఛీ.. అన్నా.. ఛా.. అన్నా ఓరిమితో అన్నీ భరించారు. టిఆర్ఎస్ ని కాంగ్రెస్ లో కలిపేస్తానని బేరం పెట్టినా సోనియా మాత అనుగ్రహం దక్కనేలేదు   ఢిల్లీలో పడిగాపులు పడీ.. పడీ.. విసుగెత్తిన కేసీఆర్ చివరికి రాష్ట్రానికి ఉత్తచేతులు ఊపుకుంటూ వచ్చారు. అందర్నీ కలుపుకుపోతేనే తనని జనం చీదరించుకోవడం తగ్గుతుంది తప్ప మరో మార్గం లేదని గ్రహించి కోదండకి స్నేహహస్తం చాచారు. ఆయన కాస్తంత మెత్తబడడంతో పాతస్నేహం కొత్త పుంతలు తొక్కింది. నల్గొండజిల్లాలో ఏర్పాటు చేసిన భారీ గర్జనలో కేసీఆర్ పులిలా ఎంతగా గర్జించాలని ప్రయత్నించినా డొల్లతనం పైకి బాగా కనిపించింది. చేసేదేం లేక తనుకూడా కాంగ్రెస్, టిడిపిల బాటలోనే నడుస్తూ వరాల్ని గుప్పించారు. తెలంగాణ రాజ్యం గురించి ఆయన కంటున్న కలలు పెద్దగా జనాన్ని కదిలించలేకపోయాయనే చాలామంది అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లు చివరాఖరికి జనానిక్కూడా బాగానే తెలుస్తున్నాయని చాలామంది గట్టిగానే అనుకుంటున్నారుకూడా..

కెసిఆర్ ను కసబ్ లా ఉరితీయాలి: మోత్కుపల్లి

    తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశాడని, ఉగ్రవాది కసబ్ లా ఉరి తీయాలని కేసీఆర్ ను ఉరితీయాలని టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు ద్వజమెత్తారు. సూర్యాపేటలో టిఆర్ఎస్ సమరబేరి జరుగుతున్న సందర్భంగా కెసిఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడంటూ నరసింహులు గన్ పార్కు వద్ద నిరశన దీక్షకు దిగారు.   తెలంగాణ అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది అని చెప్పి ప్రజలను ఇంతకాలం మోసం చేసిన కెసిఆర్ ఇప్పుడు రెండువేల పద్నాలుగు వరకు రాదని, వంద సీట్లే వస్తుందని చెబుతూ మళ్లీ తెలంగాణ వాసుల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

వైఎస్ తెలంగాణ పాలిట రాక్షసుడు

    కేసిఆర్ తనయుడు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటిఆర్ వైఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారం చేతికి అందాక తెలంగాణ పాలిట యముడిలా..సైంధవుడిలా మారాడు. టీఆర్ఎస్ అండతో అధికారం చేజిక్కించుకుని ఆ తరువాత మిత్ర ద్రోహం చేశాడు. 2009 ఎన్నికల్లో తెలంగాణలో ఓటింగ్ ముగిశాక తెలంగాణకు వెళ్లాలంటే పాస్ పోర్ట్ కావాలి..వీసా కావాలి అని సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టాడు’’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. జగన్ పార్టీ నేతలు వైఎస్ దేవుడు అని వేదాలు వల్లిస్తున్నారని, వైఎస్ తెలంగాణకు అంతా చేసింది ద్రోహమేనని విమర్శించారు. రాజకీయ పార్టీలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వారి కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని, అంతేకాని తెలంగాణ ప్రజలపై దండయాత్ర చేస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయని హెచ్చరించారు.

టీఆర్ఎస్ ‘సమరభేరి’

    తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉదృతం చేసేందుకు టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఆదివారం ‘సమరభేరి’ సభ నిర్వహిస్తోంది. దక్షిణ తెలంగాణ జిల్లాలలో ప్రజలను సమాయాత్తం చేసేందుకు ఈ సభను నిర్వహిస్తున్నారు. దానికితోడు టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల వైపు నాయకులు వెళ్లకుండా వాళ్లకు ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ అని చాటి చెప్పేలా కేసీఆర్ ఈ సభను నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్ని రోజులుగా పార్టీ శ్రేణులన్నీ సభ కోసం భారీ ప్రచారం చేశాయి. 10 జిల్లాల నుండి భారీ జన సమీకరణకు ఏర్పాట్లు చేశారు. 40 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 5 లక్షలమంది హాజరవుతారని అంచనా. ఈ సభకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాంల తో పాటు పార్టీకి చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3.30నిషాలకు తెలంగాణ సమరభేరి సభ ప్రారంభం కానుంది. నేడు సమరభేరి సభ జరగనున్న నేపధ్యంలో సూర్యాపేట గులాబిమయమైంది. తెలంగాణ జిల్లాల నుంచి సభకు వచ్చే వాహనాలను పార్కింగ్‌ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠి ఆధ్వర్యంలో భారీ పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు.

షర్మిలకు తెలంగాణ సెగ, వైకాపా దాడి

    షర్మిల పాదయాత్రకు తెలంగాణ సెగ తగిలింది. మహబూబ్ నగర్ జిల్ల వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో షర్మిల పాదయాత్రను తెలంగాణ వాదులను అడ్డుకున్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాలని, జైతెలంగాణ అనాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యకర్తలు తెలంగాణవాదులపై విరుచుకుపడి విపరీతంగా చితకబాదారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి తెలంగాణ వాదులపై లాఠీ ఝళిపించారు. పలువురు తెలంగాణ వాదులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణవాదులపై వైఎస్‌ఆర్‌సీపీ నేతల దాడికి నిరసనగా ఐజాలో టీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలు ఐజా చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు.  భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణపై వైఎస్‌ఆర్‌సీపీ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో తెలంగాణవాదులు షర్మిల పాదయాత్రను అడ్డుకుంటే వైఎస్‌ఆర్‌సీపీ నేతలు దాడి చేశారు. దీనికి నిరసనగా ఈ రాస్తారోకో జరుగుతుంది.