త్వరలో గాలిలో ఎగురనున్న టాటా విమానాలు
posted on Feb 22, 2013 @ 2:16PM
భారతదేశంలో తొలిసారిగా విమానాలను నడిపింది టాటాలే అయినా, ఆ తరువాత వారెన్నడు ఆ వ్యాపారంవైపు తొంగి చూడలేదు. స్టీలు, వాహనాలు, గృహోపకరణాలు, తదితర రంగాలలో అద్వితీయమయిన ప్రతిభ చూపిన టాటాలు ఇప్పుడు దేశీయ విమానయాన రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధం అవుతున్నారు.
ఇప్పటికే, కేరళ, తమిళనాడు రాష్ట్రాలనుండి విదేశాలకు విమానాలు నడుపుతున్న మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా అనే సంస్థతో కలిసి, టాటాలు తక్కువధర-టికెట్-విమానయానం సేవలు అందించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకొంటున్నారు. ఇందులో టాటాలు, ఎయిర్ ఏషియా సంస్థలతో బాటు అరుణ్ భాటియా, హిందూస్తాన్ ఏరో సిస్టమ్స్ అనే మరో ఇద్దరు భాగస్వాములుగా ఉంటారు. ఎయిర్ ఏషియా సంస్థ 49%, టాటాలు30%, మిగిలిన ఇద్దరూ కలిసి 21% పెట్టుబడులు పెడతారు.
ఎయిర్ ఏషియా సంస్థ యొక్క ముఖ్య కార్యనిర్వాహకుడు (సి.ఈ.ఓ.) టోనీ ఫెర్నందేజ్ మీడియాతో మాట్లాడుతూ తొలుత తాము చెన్నై కేంద్రంగా చేసుకొని సేవలు మొదలుపెట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు. రూ.275 కోట్ల పెట్టుబడితో మొదట నాలుగు లేదా ఐదు విమానాలతో మొదలుపెట్టి క్రమంగా తమ సేవలు దేశమంతా విస్తరిస్తామని ఆన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవిఏషన్ వారు అనుమతినీయగానే, తమ సేవలు మొదలుపెట్టగలమని అన్నారు. బహుశః ఈ ఏడాది చివరిలోగా ‘టాటా విమానాలు’ గాలిలో ఎగిరే అవకాశం ఉంది.
అయితే, ప్రస్తుతం దేశీయ విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో, మరి టాటాలు ఎందుకు ఆ రంగంపై ఆసక్తి కనబరిచారో అర్ధంకాదు. ఒకవైపు కింగ్ ఫిషర్, ఎయిర్ ఇండియా వంటి అనేక విమానయాన సంస్థలు, తమ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించడానికి అవస్థలు పడుతున్న ఈ తరుణంలో టాటాలు ఈ రంగంలోకి ప్రవేశించడం, సాహసోపేతమయిన నిర్ణయమే కాక, చాల రిస్కుతో కూడకున్నదని భావించవచ్చును.
అయితే, అడుగుపెట్టిన ప్రతీ రంగంలో విజయకేతనాలు ఎగురవేయడం తమ సంప్రదాయంగా మార్చుకొన్న టాటాలు, దేశ వ్యాప్తంగా ఉన్న తమ పటిష్టమయిన నెట్వర్క్ సహాయ సహకారాలతో బహుశః ఈ రంగంలో కూడా కొత్త పుంతలు తొక్కి వినువీదుల్లో భారతీయులను విహరింపజేయవచ్చును.