షారుక్ తో సమానంగా డబ్బు కూడా ఇస్తే బాగుంటుంది: నాని
posted on Feb 23, 2013 9:28AM
ఇటీవల కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్ననటుడు నాని కూడా ఒకరు. అష్ట చెమ్మా సినిమాతో చిన్న సినిమాల హీరోగా తన సినీ ప్రస్థానం మొదలు పెట్టిన నాని ఒకవైపు చిన్న సిన్న సినిమాలు చేస్తూనే, క్రమంగా పెద్ద సినిమాల హీరోగా ఎదుగుతున్నాడు. పిల్ల జమీందార్, ఈగ వంటి సినిమాలలో చక్కటి నటన ప్రదర్శించిన నాని, ప్రస్తుతం ‘జెండాపై కపిరాజు’, ‘పైసా’అనే రెండు సినిమాలలో నటిస్తున్నాడు.
ఇటీవలే విదేశాలలో ఆ సినిమా షూటింగ్ పూర్తీ చేసుకొని వచ్చిన నానికి మరో బంపర్ ఆఫర్ దొరికింది. ప్రఖ్యాత బాలివుడ్ సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ వారు తెలుగులో నిర్మించనున్నవారి తొలి చిత్రంలో నానికి ఆఫర్ ఇచ్చారు. ముంబాయిలో ఉన్న ఆ సంస్థ స్టుడియోలో ప్రస్తుతం ఫోటో షూట్ లో పాల్గొనడానికి వెళ్ళిన నాని ఆ సంస్థ అధినేత మరియు సినిమా దర్శకుడు అయిన ఆదిత్య చోప్రాను కలిసాడు. హిందీలో సూపర్ హిట్ అయిన ‘బ్యాండ్ బాజా బారత్’ సినిమాకు రిమేక్ అయిన ఈ తెలుగు సినిమా షూటింగు త్వరలో మొదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఆదిత్య చోప్రాతో జరిగిన సరదా సంభాషణను నాని ట్వీటర్ లో పెట్టాడు. ‘నాదీ, షారుక్ ఖాన్ ది బట్టల కొలతలు ఒకటేనని వారు అన్నారు. అప్పుడు, నాకు వారివ్వబోయే డబ్బుకూడా ఆయనతో సరిసమానంగా ఉంటుందా? అని జోక్ చేసాను. ఏమయినప్పటికీ, ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను,’ అన్నాడు నాని.